koodali

Monday, October 16, 2017

విద్యార్ధుల ఆత్మహత్యలు...


ఈ మధ్య వరుసగా కొందరు విద్యార్ధుల ఆత్మహత్యలు జరగటం అత్యంత బాధాకరం. 

వీటిని ఆత్మహత్యలు అనేకంటే సమాజం చేసిన హత్యలు అన్నా తప్పులేదు. 

ఇలా జరగటానికి ఎన్నో కారణాలున్నాయి. 

కొందరు తల్లితండ్రులు  తాము పొందలేని వాటిని పిల్లల నెత్తిమీద రుద్దుతున్నారు. 

ఉదా..నేను డాక్టర్ చదవలేకపోయాను కాబట్టి నువ్వు చదవాలి అంటుంటారు కొందరు తల్లితండ్రులు. 

ఇరుగుపొరుగు పిల్లలు పైచదువులు చదివారు కాబట్టి, తామూ గొప్పలు చెప్పుకోవాలంటే తమ పిల్లలూ పై చదువులు చదివి తీరాల్సిందే..అనే మంకుపట్టు కొందరికి . 

ఇరుగుపొరుగు పిల్లలు విదేశాలకు వెళ్లారు కాబట్టి తమ పిల్లలూ వెళ్ళాలి, 

అక్కడ పరిస్థితి ఎలా ఉన్నా కూడా సర్దుకుపోయి చదివి, ఉద్యోగం సంపాదించాలి, అక్కడ నుండి డబ్బు పంపిస్తే ఇక్కడ ఆస్తులు , ఆభరణాలు కొని గొప్పలు చెప్పుకుంటారు.

 పిల్లలు విదేశాల్లో ఎన్ని కష్టాలు పడుతున్నారో? అనేది అంత ముఖ్యమైన విషయం కాదన్నట్లు ఉంది.. కొందరి పెద్దవాళ్ళ ప్రవర్తన.

 ఇలా రకరకాల మనస్తత్వాలు. 

ఇదంతా పిల్లల మంచి కోసమే అంటారు కొందరు. 

అయితే, వారి శక్తిని బట్టి, పరిస్థితిని బట్టి ప్రవర్తించాలి కానీ , మొండిగా ఒకరి అభిప్రాయాలను ఇంకొకరిపై రుద్దటం  మంచిది కాదు.

*****************
 మా ఇంటి దగ్గరలో ఒక ట్యూషన్ ఉంది. అక్కడకు ట్యూషన్ కొరకు బోలెడు మంది చిన్నపిల్లలు వస్తారు.

ఉదయమూ ట్యూషన్, తరువాత స్కూల్,  మళ్ళీ ట్యూషన్..రాత్రికి ఇంటికి తిరిగివెళ్తారు చిన్నపిల్లలు. 

ఆదివారం కూడా ట్యూషన్ చెప్పమని తల్లితండ్రులు వత్తిడి చేస్తున్నారని టీచర్ చెప్పారు. 

 మార్కులు తక్కువ వస్తే పిల్లలను కొట్టయినా చదివించమని టీచర్లతో చెప్పే పేరెంట్స్ కూడా ఉంటారు.

కన్నతల్లితండ్రికే పిల్లలంటే జాలి లేనప్పుడు బయట వాళ్లయిన కాలేజీ వాళ్ళను అని ఏం లాభం.

*******************
ఈ రోజుల్లో డాక్టర్, ఇంజనీరు కాకుంటే, బతకడానికి ఇక వేరే మార్గమే లేదనట్లు భావిస్తున్నారు కొందరు. 

ఈ చదువులకు  సీట్లేమో వేలల్లో ఉంటాయి. పోటీ లక్షల మంది మధ్య ఉంటుంది. 

ఇలాంటప్పుడు పరిస్థితి..  లైఫ్ అండ్ డెత్..  సమస్యలా ఉంటుంది.  

పోటీచదువులంటూ చిన్నతనం నుంచే పిల్లల్ని హాస్టల్స్లో వేయటం జరుగుతోంది. 

హాస్టల్స్లో కొన్నిసార్లు ర్యాగింగ్ వంటివి కూడా ఉంటాయి. అక్కడ పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు ? 

హాస్టల్లో ఉండలేను.. అంటే కూడా కొందరు తల్లితండ్రి అర్ధంచేసుకోకుండా హాస్టల్ కు వెళ్లితీరాలి, సర్దుకుపోవాలి, లేకుంటే జీవితం వృధా అంటారు. 

అక్కడ సర్దుకుపోలేక పిల్లలు ఆత్మహత్య చేసుకుంటే అప్పుడు తల్లితండ్రి ఏడవటం మొదలెడతారు.

***********
కొందరు  పిల్లలు మత్తుమందులకు అలవాటు పడుతున్నారని ఈ మధ్య వార్తలు వచ్చాయి.  ఈ విషయాల గురించి  కొంతకాలం చర్చలు జరిగాయి. 

 ఇప్పుడు వరుసగా కొందరు ఆత్మహత్యలు జరిగాయి కాబట్టి చర్చలు జరుగుతున్నాయి. మళ్లీ సద్దుమణుగుతుందేమో .... 

ఇప్పుడు ఎవరికీ దేన్నీ పట్టించుకునే సమయం లేదు.

 చాలామంది తల్లితండ్రులకు తమ పిల్లల గురించి పట్టించుకునే సమయమే లేదు.
*******************
కాలేజీల వాళ్ళు తమకు ర్యాంకులే ముఖ్యం అన్నట్లు కాకుండా పిల్లల జీవితాలు కూడా ముఖ్యంగా పిల్లలను చూసుకోవాలి. 

తల్లితండ్రికి దూరంగా , తమను నమ్మి వచ్చిన పిల్లలను చక్కగా చూసుకోవాలి.

 ర్యాగింగ్ వంటివి జరగకుండా కఠినచర్యలు తీసుకోవటం, పిల్లలకు చదువు మధ్యలో ఆటవిడుపు ఇవ్వటం వంటి చర్యలు తీసుకోవాలి.  
**************

ఇక ప్రభుత్వాలు,   ర్యాగింగ్ వంటివి జరగకుండా కఠినచర్యలు తీసుకోవటం, చదువుకోవటానికి ప్రవేశసీట్ల కొరకు పెద్ద ఎత్తున పోటీ లేకుండా కాలేజీలలో సీట్ల సంఖ్య పెంచటం ..వంటి చర్యలు తీసుకోవాలి. 

ఎవరు  ఎన్ని చర్యలు తీసుకున్నా విషాద సంఘటనలు  జరగకుండా ఉండాలంటే   సమాజంలో నైతికవిలువలు పెరగాలి.

*******************
చక్కగా జీవించటానికి ఎన్నో వస్తువులు అవసరం లేదు. 

మన పాతకాలంలో ప్రజలు ఇన్ని వస్తువులు లేకపోయినా చక్కగానే జీవించారు. 

అయితే, ఇప్పుడు ప్రపంచం అనేక  భ్రమల్లో పయనిస్తోంది. 

పరిస్థితి చక్కబడాలంటే, భ్రమలనుండి బయటపడి సరైన దారిలోకి రావటం తప్ప వేరే దారిలేదు.  



1 comment:



  1. ఈ రోజుల్లో ఎన్నో కారణాల వల్ల స్వదేశంలోని కాలేజీల్లో సీట్లు లభించక బోలెడు డబ్బు కట్టి విదేశాల్లో కాలేజీల్లో చేరుతున్నారు కొందరు పిల్లలు.

    అలా బోలెడు డబ్బు ఇతరదేశాలకు మళ్ళుతోంది. పిల్లలు ఇక్కడే విద్యాభ్యాసం చేసేలా ప్రభుత్వాలు సదుపాయాలు కల్పించాలి.

    కాలేజ్ లు అధిక ఫీజులు వసూలు చేయకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.

    పిల్లలు ఒక కాలేజీలో చేరి కొంతకాలం తరువాత వేరే కాలేజీకి మారాలనుకుంటే చెల్లించిన ఫీజులో కొంతభాగం తిరిగి ఇచ్చేలా ఉండాలి.

    కాలేజీ నచ్చకపోయినా బోలెడు ఫీజు ముందే కట్టేసినందువల్ల కొందరు పిల్లలు ఆ కాలేజీలోనే కొనసాగుతున్నారు.

    కాలేజీలో పరిస్థితి బాగుండకపోతే ఫీజు గురించి ఆలోచించకుండా పిల్లలను వేరే కాలేజీకి మార్చటం మంచిది. పిల్లల బాగోగులు ముఖ్యం.

    ReplyDelete