koodali

Monday, July 3, 2017

గిఫ్ట్ తెచ్చి బయట చెత్తలో పడేసాను...

ఈ మధ్యకాలంలో కొత్తకొత్త వస్తువులు గుట్టలుగా తయారుచేసి వదుల్తున్నారు. ఇవన్నీ చూసి జనం చాలామంది పిచ్చిగా కొనటం జరుగుతోంది.

ఆ వస్తువులను చూస్తే అన్నీ మనకు పనికి వచ్చేలానే అనిపిస్తాయి.

 ఏ ఒక్కటి లేకపోయినా జీవితం వ్యర్ధం అన్నట్లు అనిపిస్తుంది.ఇక కొనేసి పెట్టేస్తాం. 

వస్తువులను కొనిపారేయటం అనేది కూడా వ్యసనమే.

మా ఇంట్లో వస్తువులు కుప్పలుతెప్పలుగా పడున్నాయి. అవన్నీ సర్దలేక కొంతకాలం నుంచీ ఎంతో ముఖ్యమయితే తప్ప వస్తువులు కొనటం లేదు. షాపింగ్ వెళ్లినా చూసి వచ్చేస్తున్నాను. 

 వీటికి తోడు ఏదైనా ఫంక్షనుకు వెళ్తే అక్కడ గిఫ్ట్ పేరుతో మళ్ళీ కొత్తవస్తువులను ఇస్తారు. వాటిని తీసుకోకపోతే ఒక బాధ. తీసుకుంటే ఒక బాధ.

గిఫ్ట్ వద్దంటే అక్కడి వాళ్ళు వింతమనిషిని చూసినట్లు చూస్తారు.

ఈ మధ్య మా బంధువు ఇంట్లో ఫంక్షన్ అయితే వెళ్ళాము.వాళ్లు గిఫ్ట్ ఇచ్చారు. అక్కడ వాళ్ళను ఏమీ అనలేక ఇంటికి  తెచ్చి మాకు తెలిసిన ఆమెకు ఇచ్చేసాను. 

 ఇంకోసారి  బంధువుల ఫంక్షనుకు వెళ్తే  ఇంకో వస్తువు ఇచ్చారు. ఈ సారి బాగా విసుగొచ్చింది. గిఫ్ట్ తెచ్చి బయట చెత్తలో పడేసాను.

 మా బంధువుల ఆమె ఒకరు ఫంక్షన్స్కు వెళ్ళి తెచ్చే గిఫ్టులను వాళ్ళ పనమ్మాయికి ఇచ్చేస్తుందట. 

కొంత పెద్ద ఇల్లు ఉన్న వాళ్ళే సామాను ఎక్కడ పెట్టుకోవాలో తెలియక సతమతమవుతుంటే చిన్న చిన్న ఇళ్లు ఉండే వాళ్లు ఎక్కడ పెట్టుకుంటారు?

పాతరోజుల్లో ఫంక్షనుకు వెళ్తే ఇన్ని ఆర్భాటాలు ఉండేవికాదు. ఈ రోజుల్లో గిఫ్టుల గోల ఎక్కువయ్యింది. 

గిఫ్ట్ ఇవ్వకపోతే ఉండలేం అనుకుంటే...సామాన్లు కాకుండా ఫ్రెష్ పండ్లు కానీ లేక డ్రైఫ్రూట్స్ పాకెట్ కానీ ఇస్తే బాగుంటుంది. పండ్లు తినేస్తారు. పొల్యూషన్ ఉండదు. 

వస్తువులు విపరీతంగా వాడటం అంటే పర్యావరణాన్ని కలుషితం చేయటం, ఖనిజ సంపదకు హానిచేయటం.. అని అర్ధం. 

 ఖనిజసంపద ఎంతో విలువైనది. మనుషులు సృష్టించలేనిది ఖనిజసంపద.

డబ్బు ఉందికదా అని వస్తువులను విపరీతంగా వాడే హక్కు ఎవరికీ లేదు.

వస్తువులను తగినంత మాత్రమే వాడదాం, మనల్నీ, రాబోయే తరాలనూ కాపాడుకుందాము.

2 comments:

  1. మంచి టపా వ్రాసారు anrd గారు.
    చెత్తబుట్టలో పడెయ్యడం మంచి పని అనలేను గానీ ఆ గిఫ్ట్ ల్ని వేరే వాళ్ళకి ఏదో ఒక సందర్భంలో బదలాయించేయండి, సమస్య తీరిపోతుంది అని చెప్పగలను 🙂.
    ఈ "రిటర్న్ గిఫ్ట్" మొదలెట్టినవాళ్ళని అనాలండీ (పాశ్చాత్యదేశాల ఆనవాయితీ అనుకుంటాను. కోతుల్లా అనుకరించడం మనకి అలవాటేగా). అసలు ఈ "రిటర్న్ గిఫ్ట్" ఏమిటండీ, నాకర్థం కాదు ?. నన్నడిగితే అది ఇవ్వడం అంటే వచ్చిన అతిథులను అవమానించడమే అంటాను. చివరికి నాకు తోస్తున్నదేమిటంటే ఈ రిటర్న్ గిఫ్ట్ లు, అవసరంలేని షాపింగ్ (impulsive buying) అంతా వ్యాపారుల మాయాజాలం అనీ, చాలామంది జనాలు ఆ మాయలో పూర్తిగా పడిపోయారనీ, ఇలా "రిటర్న్ గిఫ్ట్ లు" పంచడం తమ గొప్ప చూపించుకోవాలనే తాపత్రయం అనీ / fashion statement అనీ అనిపిస్తుంది. ఇలా చేసే సంపన్నులను చూసి వాతలు పెట్టుకునే సామాన్య జనాలు ఎక్కువయిపోయారనిపిస్తుంది. ఫంక్షన్ కి వచ్చిన స్త్రీలకు ఏదో తాంబూలం / పసుపు-కుంకుమ ఇవ్వడం వేరు, ఇలా 'షో' చెయ్యడం వేరు. ప్రజలకు నరనరానా ఇంజెక్షను ఇచ్చినట్లున్న ఈ వ్యాపారసంస్కృతి నుంచి ఇప్పట్లో బయటపడే అవకాశాలు కూడా దాదాపు శూన్యం అనే చెప్పాలి. ఇటువంటి పరిస్ధితులలో మీరన్న పర్యావరణం గురించి ఎవరు ఆలోచిస్తారండీ?

    ReplyDelete
  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    కొన్నిసార్లు వేరే వాళ్ళకు ఇచ్చానండి.

    అయితే, నేను ఏం చేయవలసిందంటే,

    గిఫ్ట్ చెత్తలో వేయటం కన్నా, గిఫ్ట్ ఇచ్చినప్పుడు అందులోని తాంబూలం / పసుపు-కుంకుమ మాత్రం తీసుకుని, గిఫ్ట్ గా ఇచ్చిన వస్తువు మాత్రం వద్దని చెప్పి రావటమే మంచిది అనిపించిందండి.

    ReplyDelete