koodali

Friday, July 21, 2017

మనుషులు జీవించటం కోసం...

 
ఈ రోజుల్లో చాలామంది పిల్లలు చదువు పేరుతో చాలా కష్టపడుతున్నారు. 

 మా  ఇరుగుపొరుగున  ఒక స్కూల్ టీచర్ చిన్నపిల్లలకు ట్యూషన్ చెబుతారు. 


సాయంత్రం ఆమె స్కూల్ నుండి  వచ్చీ రాగానే ట్యూషన్ పిల్లలు వచ్చేస్తారు. రాత్రి  ఇళ్లకు వెళ్తుంటారు. 

సెలవు రోజుల్లో కూడా ట్యూషన్ చెప్పమని కొందరు తల్లితండ్రులు ఆమెను అడుగుతున్నారట. 


ఒకసారి  ఒక పాప.. అమ్మానాన్న కారులో వచ్చి  చిన్నపాపను టీచర్ ఇంటి ముందు దిగబెట్టారు.


 ఆ పాప లోపలికి వెళ్లి వచ్చి టీచర్ ఇంకా రాలేదమ్మా..అంటుంటే ఆమే వస్తుందిలే , బయట కూర్చో... అని సమాధానం చెప్పి తల్లితండ్రి వెళ్ళి పోయారు.  


పిల్లలకు 90 శాతం మార్కులు  వచ్చినా కూడా  ఇంకా ఎక్కువ మార్కులు రాలేదంటూ  పిల్లలను కొట్టే తల్లితండ్రులూ ఉన్నారు. 


 పిల్లలకు చదువు అవసరమే కానీ, ఈ రోజుల్లో చాలామంది తల్లితండ్రులు పిల్లల చదువు విషయాన్ని గురించి  మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నారనిపిస్తుంది.


  అయితే ఈ రోజుల్లో పోటీ ఎక్కువయ్యింది. కొన్ని సీట్ల కోసం ఎంతో మంది పోటీ పడుతున్నారు. 

 ఈ రోజుల్లో  చదువులు లైఫ్ అండ్ డెథ్ సమస్యంగా మారినట్లుంది.


 పాతకాలంలో ఇంతలా చదువులు లేకపోయినా ఉన్నంతలో హాయిగా బ్రతికేవారు. 


ఈ రోజుల్లో రకరకాల వస్తువులు మార్కెట్లో కనిపిస్తున్నాయి.


 వ్యాపారులు వస్తువుల ధరలు భారీగా పెంచి లాభాలు దండుకుంటున్నారు.

 ఒకప్పటి విలాసాలు ..ఇప్పుడు నిత్యావసరాలుగా మారిపోయాయి. 


సౌకర్యవంతమైన వస్తువులు ఉంటేనే జీవితం బాగుంటుందనే భ్రమలో పడి జనం తమ జీవితాల్నే పణంగా పెడుతున్నారు.


 చిన్నతనం క్లాసురూముల్లో గడవటం,  ఉద్యోగం వచ్చిన తరువాత ఆఫీసుల్లోనూ.. జీవితాలు గడిచిపోతున్నాయి.


 ఇలాంటి పరిస్థితిలో ఇక పెద్దవయస్సు వచ్చాక హాస్పిటల్ చుట్టూ తిరగటంతోనే కాలం గడచిపోతుంది. 


పాతకాలంలో  ఇంతటి వస్తువుల మోజు లేదు. అప్పటి వారు  చదువుకుంటూ కూడా  ప్రకృతి మధ్య ఆడుకుంటూ చిన్నతనాన్ని ఎంజాయ్ చేసేవారు. 


పెద్దయ్యాక కూడా నాలుగు గోడల మధ్య యంత్రాలతో జీవితం ఉండేది కాదు. 


ఈ రోజుల్లో కొందరు పెద్దవాళ్ళు తమ పిల్లలకు విదేశాలకు వెళ్ళటం ఇష్టం లేకపోయినా  పిల్లలకు సర్ది చెప్పి  అప్పు చేసి విదేశాలకు  పంపిస్తున్నారు. 


 ఆ అప్పు తీరటానికి పిల్లలు మళ్ళీ విపరీతంగా  కష్టపడి పనిచేయాలి. 


కొందరు పిల్లలే స్వదేశంలో ..పోటీ వల్ల అవకాశాలు రాక , విదేశాలకు వెళ్తున్నారు.


 ఏది ఏమైనా మొత్తానికి వ్యవస్థ  గందరగోళంగా తయారయ్యింది.


 మనుషులు జీవించటం కోసం ఎన్నో వస్తువులు.. వాటికోసం ఇంత ఆరాటం అవసరం లేదు.



No comments:

Post a Comment