koodali

Wednesday, July 12, 2017

శ్రీ అమర్ నాధ్ యాత్ర..కొన్ని విషయములు..


భక్తులు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదుల జరిపిన దాడిలో కొందరు భక్తులు మృతి చెందటం ఎంతో బాధాకరమైన విషయం. 

అప్పుడు డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి పేరు ..షేక్ సలీం గపూర్ భాయ్..అని తెలుస్తోంది.


ఆయన తన ప్రాణాలకు తెగించి చాకచక్యంగా వ్యవహరించటం వల్ల మిగతా వారి ప్రాణాలు రక్షించబడ్డాయంటున్నారు. 

మతం ఏదైతేనేమి ..మానవత్వం ముఖ్యం.. అని గపూర్ భాయ్ నిరూపించారు. 

మతం వల్ల గొడవలు జరగవు. ఏ మతమైనా, ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా మనుషులలో చాలామంది మంచివారే. 

అయితే, కొందరు స్వార్ధపరుల వల్లే గొడవలు వస్తాయి, ఎందరికో కష్టాలు వస్తున్నాయి.

ఉగ్రవాదుల దాడి జరిగినా కూడా భయపడకుండా యాత్రను కొనసాగిస్తున్న అందరూ ఎంతో గొప్పవారు. 

భక్తులు, భద్రతాదళాలు, యాత్రికులను గుహ వద్దకు చేరటానికి సహాయపడే స్థానికులైన ముస్లింలూ, యాత్రికులకు భోజనాది సౌకర్యాలను కల్పిస్తున్న అనేకమంది, మొత్తానికి ఈ యాత్రకు అవసరమైన సహాయసహకారాలను అందించటంలో భాగస్వామ్యులైన ప్రతి ఒక్కరూ గొప్పవారే.  

***************

 కొన్ని సంవత్సరాల క్రితం మా కుటుంబీకులం.. బాబా అమర్‌నాధ్ ,మాతా వైష్ణవీ దేవి యాత్రకు వెళ్ళి వచ్చాము.అక్కడ ఎంతో అద్భుతంగా ఉంది.

 భగవంతుని దయవలన మావంటి సామాన్యులకు కూడా ఇంత అదృష్టము దక్కింది.

అక్కడ ఒక ఆర్మీ అతను మా తెలుగు మాటలువిని, మీరు తెలుగు వాళ్ళా..  అని ఆప్యాయంగా అడిగారు. 

ఏ రాష్ట్రం వాళ్ళయినా సరే, భద్రతాదళాలు  శ్రమకోర్చి పనిచేస్తున్నందువల్ల  మనలాంటి వాళ్ళం  చక్కగా ఉన్నాము.

అక్కడ ముస్లిం సోదరుల సహాయము కూడా మేము మరిచిపోలేము. వారు మాకు చక్కగా సహాయం చేసారు.

మతమేదయినా,  భగవంతుడనే మహాశక్తిని అందరు ఆరాధించొచ్చు. 

మతములు ఎన్ని ఉన్నా కూడా, అందరికి దైవశక్తి  ఒక్కరే. ప్రతి మనిషికి ఒక్కొక్క దైవం అని ఉండరు కదా.  

 కారణాలు  ఏమైనా, ఎందరో హిందువులకు లభించని  శ్రీరామలక్ష్మణుల దర్శనం.. ఒక మహమ్మదీయ రాజుకు లభించిందని భక్త రామదాసు కధ ద్వారా తెలుస్తుంది. 

అయ్యప్పస్వామికి వావర్ అనే పేరున్న ముస్లిం మిత్రుడు ఉన్నట్లు, వారి యొక్క గుడి కూడా శబరిమల వద్ద ఉందంటారు.

 ఏసుప్రభువుకు , హిమాలయములలోని మహావతార్ బాబాజీకు స్నేహం ఉందని కొన్నిపుస్తకముల ద్వారా తెలుస్తుంది.

 షిర్డి సాయిబాబా వివిధ మతముల వారి మధ్య సయోధ్య గురించి తెలియజేసారు.

పెద్దవాళ్ళు ఇలాచెప్తుంటే మనం ఎందుకు కొట్టుకోవాలి ? 

అన్ని మతముల వాళ్ళు  ఇతర మతముల వాళ్ళతో గొడవలు పడకుండా చక్కగా ఉంటే బాగుంటుంది. 

ఆశ్చర్యమేమిటంటే, ఒకే మతములో వాళ్ళు కూడా గొడవలు పడతారు.

 ఈ ప్రపంచములో అంతా  ఒకే మతము  ఉండటము అనేది  ప్రస్తుతానికి  జరగని  పని.

 మతము  అనేది అసలు  లేకుండా పోవటము అనేది  ఎప్పటికీ  జరగనిపని.

అందువల్ల,  అందరము చక్కగా  ఉండాలంటే ఒకరినొకరు గౌరవించుకోవటం  ఒకటే మార్గము. 


No comments:

Post a Comment