koodali

Thursday, July 10, 2014

కాశీ , ప్రయాగ.. దర్శించుకుని వచ్చాము..అంతా దైవం దయ.. రెండవ భాగము....


ప్రయాగవద్ద  గంగా  యమున అంతర్వాహిని సరస్వతి  నదులు   కలిసి   త్రివేణీసంగమముగా  పిలుస్తారు.  పడవలో  వెళ్ళి  స్నానం  చేశాము.

 ఇంకా  ప్రయాగలోని  కొన్ని  దేవాలయాలను   దర్శించుకున్నాము.  ప్రయాగలో    అమ్మవారి  శక్తిపీఠం  కూడా  ఉంది.  హనుమాన్  దేవాలయం,  లలితాదేవి  దేవాలయం,  ఇంకా  మరికొన్ని  దేవాలయాలను, అమ్మవారి   శక్తిపీఠాన్ని   దర్శించుకున్నాము.

..................................


  మేము  కాశీలో  విశ్వనాధుని విశాలాక్షీదేవిని అన్నపూర్ణాదేవిని గంగాదేవిని డుంఢి గణపతిని సాక్షి  గణపతిని సుబ్రహ్మణ్యస్వామిని అమ్మవారిని కాలబైరవుని ..ఇంకా  మరికొందరిని  దర్శించుకున్నాము.   దుర్గాదేవినిస్వామిని  కూడా  దర్శించుకున్నాము.  గవ్వలమ్మను ( కౌడీబాయ్ ) దర్శించుకున్నాము.
.............................................


కాశీ  యాత్ర  గురించి,  అక్కడి  విశేషాల  గురించి  ఎందరో  ఎన్నో  విశేషాలను  మనకు  అందించారు.  నేను , సరసభారతి  ఉయ్యూరు  వారి   బ్లాగులో  వ్రాసిన  కాశీ  యాత్ర  గురించి  చదివాను. అందులో  వారు  ఎన్నో  విశేషాలను వివరంగా   అందించారు. 



కాశీలో  కౌడీబాయ్  దేవాలయం  ఉంది  ఈ  గుడి  గురించి  మాత్రం  సరసభారతి  వారి  బ్లాగ్  ద్వారా  నాకు  తెలిసింది.  ఈ  గుడికి  వెళ్ళి , అక్కడ  కొన్ని  గవ్వలు  కొని  పూజారికి  ఇస్తే ,  గవ్వలను  అమ్మవారికి  సమర్పించి  ... గవ్వలు  నీకు  కాశీ  ఫలం  నాకు ... అన్నట్లు  అనిపిస్తారు. కాశీ వెళ్లినవాళ్ళు  ఈ  గుడిని  తప్పక  దర్శించుకోవాలట.  అప్పుడు  కాశీఫలం  దక్కుతుందని  అంటున్నారు. 



ఇంతకుముందే  కాశీకి   వెళ్ళి  కౌడీ  అమ్మవారి  గుడికి  వెళ్ళని  వాళ్ళు  ఎవరైనా  ఉంటే,  కొత్త  సంశయాన్ని  కలిగించానని  నన్ను  తిట్టుకోవద్దు.   భవిష్యత్తులో  కాశీ  వెళ్ళబోయే  వారికి  ఉపయోగపడుతుందని  ఈ  విషయాన్ని  తెలియజేసాను  అంతేనండి.  

..................................


కాశీలో  విశ్వేశ్వరుడు అన్నపూర్ణాదేవి విశాలాక్షీదేవి ...మొదలగు  వారి  దర్శనాలను  చక్కగా  చేసుకున్నాము.  కాశీఅన్నపూర్ణ  అన్నక్షేత్ర ట్రస్ట్  వారు  అందించిన  అన్నపూర్ణాదేవి  భోజనాన్ని  తృప్తిగా  ఆరగించాము.
....................................

కాశీలో  దుర్గాదేవి  దేవాలయం  కూడా   ఉంది.  మేము  తులసీమానసమందిరం  వద్ద  ఉన్న  దుర్గా దేవి  ఆలయాన్ని  దర్శించుకున్నాము.

 శ్రీ  దేవీ  భాగవతములో  సుదర్శనుడనే  అయోధ్య  రాజును  గురించి   కధ  ఉంది.  సుదర్శనుడు  అమ్మవారి  భక్తుడు.  అతని  భక్తికి  మెచ్చి  అమ్మవారు  ప్రత్యక్షమౌతుంది.  ఆ  సందర్భంగా  సుదర్శనుడికి  ఇంకా  అతని  మామగారైన  సుబాహువుకి  కూడా  అమ్మవారు  వరములను  అనుగ్రహిస్తుంది. 

అంతకుముందు  సుబాహువు  అమ్మవారిని  ప్రార్ధిస్తూ.....  తల్లీ  ! కాశీ  పట్టణం  ఉన్నంతకాలమూ  నీ  రక్షణ  ఉండాలి. నువ్వు  కాపురం  ఉండాలి....అంటూ  ప్రార్ధిస్తారు...

సుబాహుడి  అభ్యర్ధనకు  జగన్మాత  సరే  అంది.  భూమండలం  ఉన్నంతవరకూ  ముక్తిపట్టణం  కాశీలో  తాను  స్థిరనివాసం  ఉంటానంది..

....................................
 కొంతకాలం  క్రిందట  అమరనాధ్ ,  వైష్ణవీదేవి  యాత్రలను ,  ఇప్పుడు  కాశీ,  ప్రయాగ  యాత్రలను  చేసిరావటం  తలుచుకుంటే  ఎంతో  ఆశ్చర్యంగా, ఆనందంగా  ఉంది.

అంతా  దైవం  దయ .


No comments:

Post a Comment