koodali

Friday, June 14, 2013

యంత్రాల వాడకం, నిరుద్యోగం, పనివత్తిడి, పెరిగిన ధరలు....

 
ఈ  రోజుల్లో  నిరుద్యోగ  సమస్య  బాగా  పెరిగింది.  ఎందరో  యువత  ఉపాధి  లేక  మానసికంగా  కుమిలిపోతున్నారు.  నిరుద్యోగ  సమస్య  పెరగటానికి   అనేక  కారణాలున్నాయి.  యంత్ర  వినియోగం  మితిమీరి   పెరిగటం  కూడా  నిరుద్యోగ  సమస్య  పెరగటానికి  ఒక  ముఖ్యమైన  కారణం.    

అయితే  కొందరు  ఏమంటారంటే ,  ఈ  రోజుల్లో  పని  చేయటానికి  మనుషులు  దొరకటంలేదు. అందుకే  యంత్రాలను  ఎక్కువగా  వాడవలసి  వస్తోంది   అంటున్నారు. .  పనిచేయటానికి  మనుషులు  దొరకటం  లేదన్నది  నిజం  కాదు. 


 అందుకు  ఉదాహరణ ..  ప్రపంచమంతటా  నిరుద్యోగ  సమస్య  పెరిగిందని  సర్వేల  ద్వారా  తెలుస్తోంది  కదా  !  ఉపాధి  కోసం  ఎందరో  నిరుద్యోగులు  ఎదురుచూస్తున్నారు.  ఇక  పనిచేయటానికి   మనుషులు  దొరకకపోవటమేమిటి  ?

 ఉదయం  బయటకు  వెళ్ళి  చూస్తే  ఎందరో   దినసరి  కూలీలు  పనికోసం  ఎదురుచూస్తూ   కనిపిస్తారు.  వీళ్ళందరూ  రోజుకూలీలు.  ఆ రోజుకు  పని  దొరికితే  కుటుంబాన్ని  పోషించుకుంటారు.  పని  దొరకకపోతే  కుటుంబం  అంతా  పస్తులుండవలసి  వస్తుంది.  నిత్యావసర  వస్తువుల  రేట్లు  విపరీతంగా  పెరిగిన  ఈ  రోజుల్లో  ఇలాంటి  వారి  జీవితం  దినదినగండమే.

ఉన్న చోట  ఉపాధి  లభించక   పొట్టచేత  పట్టుకుని  విదేశాలకు  వెళ్ళి  అష్టకష్టాలు  పడుతున్న  వారెందరో  ఉన్నారు. 


 వాస్తవాలు  ఇలా  ఉండగా  పనులు  చేయటానికి  మనుషులు  దొరకటం  లేదంటూ  యంత్రవినియోగాన్ని  పెంచాలని  చూడటం  సబబు   కాదు.
.........................


కొందరు  యజమానులు  మనుషులను  ఉద్యోగంలోకి  తీసుకోవటం  కన్నా  యంత్రాలతో  పనులు  చేయించుకోవటానికి  ఇష్టపడుతున్నారు.  మనుషులకైతే  ఎక్కువగా  జీతాలు  ఇవ్వాలి  కదా  ! 


మరి కొందరు  ఏం  చేస్తున్నారంటే  ఎక్కువ  యంత్రాలు  తక్కువ  మంది  మనుషులతో   పనులను  జరిపిస్తున్నారు.

చిన్న,  మధ్యతరహాపరిశ్రమల  వారిలో  చాలామందికి   ఎక్కువ   లాభాలు  రాకపోవచ్చు.   వీరు   కూడా   ఎక్కువ  యంత్రాలు ,  తక్కువమంది  ఉద్యోగస్తులతో  పరిశ్రమలను  నడిపించటానికి  ఇష్టపడుతుంటారు.

పెద్ద పరిశ్రమల  వారిలో   కొంతమంది  తమకు  ఎక్కువ  లాభాలు  వచ్చినా  కూడా    ఎక్కువ  యంత్రాలు  తక్కువమంది  ఉద్యోగస్తులతో  పరిశ్రమలను  నడిపించటానికి  ఇష్టపడుతుంటారు.  


( ఎక్కువమందిని  ఉద్యోగాల్లోకి  తీసుకుంటే  తమకు  వచ్చిన  లాభాలలో   ఎక్కువ  సొమ్మును   జీతాల  కోసం  ఖర్చుపెట్టవలసి  వస్తుంది  కాబట్టి ..)

ఖర్చులు  పెరిగితే  వ్యాపారస్తులు  వస్తువుల  ధరలను  పెంచుతారు.   

...................

వ్యాపారస్తులు  ఎక్కువ  ధరలు  పెంచితే  ఎక్కువ  లాభం  వస్తుందనుకుంటారు. 
 అయితే ,  ధరలు   పెంచటం  కన్నా  ధరలను  తగ్గించటం   వల్ల  కూడా   ఎక్కువ  లాభాలు   వచ్చే  అవకాశం  ఉంది. 
ఉదా..  ధరలు   ఎక్కువ   ఉన్నప్పుడు   10 మంది సరుకులు   కొంటే,    ధరలను  తగ్గిస్తే   20 మంది వస్తువులను  కొనే   అవకాశం  ఉంది  కదా  !  

 అయితే  ధరలు  బాగా  తగ్గాయి  కదా !  అని  వినియోగదారులు  వస్తువులను  కొని  పడేస్తుంటే  సహజవనరులు  వేగంగా  తరిగిపోవటం,  చెత్త  పెరిగి  పర్యావరణ  సమస్యలు  వచ్చే  అవకాశాలూ  ఉన్నాయి.

...............................................


రైతుల  వంటి  వారు  యంత్రాలను  వాడటానికి  ఇష్టపడుతున్నారు. అయితే  రైతుల  విషయంలో ఏం  జరుగుతోందంటే,   తాము   పండించిన  పంటకు  ధరను  నిర్ణయించుకునే  హక్కు  రైతులకు  లేదు. 

 అతివృష్టి ,  అనావృష్టి,  పెరిగిన  విత్తనాల  ధరలు  , ఎరువుల  ధరలు , పురుగుమందుల  ధరలు,  వంటి  సమస్యలతో  ఎంతో ఖర్చుతో వ్యవసాయాన్ని  కొనసాగించినా  కూడా  వారు    పండించిన  పంటలకు  తగిన  గిట్టుబాటు  ధరలు  లభించక  నష్టాలపాలవుతున్నారు.  

అందువల్ల  ఎక్కువమంది  కూలీలను  పెట్టుకుని  వారికి  తగినంత   జీతాలను  ఇవ్వలేక   యంత్ర  వినియోగానికి  సిద్ధపడుతున్నారు.

 (  పూర్వకాలంలో రైతులకు  విత్తనాలను  కొనే  అవసరం  ఉండేది  కాదు. సేంద్రియ  ఎరువును కూడా  తామే  తయారుచేసుకునేవారు .)

.............................................


1975 నాటి  కాలంలో  జీతాలు    తక్కువగా  ఉండేవి.  ధర
లూ    తక్కువగా  ఉండేవి. ఇప్పుడు  జీతాలు  బాగా  పెరిగాయి. ధరలూ  బాగా  పెరిగాయి. 

అప్పట్లో  5 రూపాయలకే  హోటల్స్  లో మంచి  భోజనం  లభించేది. ఈ  రోజుల్లో  అన్ని  రేట్లు  బాగా  పెరిగిపోయాయి.

  ఎక్కువ  జీతం,  తక్కువ  జీతం  అనేది  సమస్య  కాదు. 
  ధరలు  పెరగటానికి    మనుషుల్లో  పెరిగిన  స్వార్ధం,  విపరీత  లాభాపేక్ష  కూడా  కారణం.

 మనుషులు  తమ  సొంత  స్వార్ధాన్ని  కొంత  తగ్గించుకుని,  వస్తువుల  ఉత్పత్తి  వ్యవస్థ ,  వినియోగ  వ్యవస్థ ,  పంపిణీ  వ్యవస్థ    మధ్య  సరైన  అవగాహనను  కలిగి  ,  చిత్తశుద్ధితో  చర్యలను  చేపడితే     తక్కువ  ధరలకే    సమాజంలోని  అందరూ  చక్కగా  జీవించవచ్చు. 

 ఒక  పద్ధతి  ప్రకారం  చర్యలు  చేపడితే  ఈ  రోజుల్లో  కూడా   తక్కువ  ధరకే   చక్కటి  ఆహారాన్ని అందించవచ్చు.
 
.................................

ఎక్కువ  జీతాన్ని  ఆశించేవారు  పెరుగుతున్న  రేట్ల  వల్లే  తాము  ఎక్కువ  జీతాన్ని  కోరుతున్నామని  అంటుంటారు.  అయితే,   జీతాలు  పెరిగాయనే  వంకతో  వర్తకులు  రేట్లను   పెంచేస్తారు.  రేట్లు  పెరిగాయని  మళ్ళీ  జీతాలు  పెరగటం,   మళ్ళీ  రేట్లు  పెరగటం,  ...... 

 ఈ  అంతులేని  చక్రభ్రమణం  కధలో  దిక్కుతోచక  నలిగిపోతున్నది  సామాన్యులైన  ప్రజలు  , కూలీలు,  కార్మికులు,  కర్షకులు,  వీధుల   ప్రక్కన వ్యాపారం  చేసుకునే  చిన్న  వ్యాపారులు.....మొదలైనవారు.

విచ్చలవిడిగా  ధరలు  పెరగటాన్ని  నియంత్రించటానికి  గట్టి   చర్యలు  తీసుకోవాలి. అప్పుడు  ఎక్కువ  జీతాల  కోసం  డిమాండ్  తగ్గవచ్చు. 

..............................

1
.  ఎక్కువ  సంపదను  పోగేయాలని   కోరుకొనే  వ్యక్తుల  సంఖ్య  ఈ  రోజుల్లో  బాగా  పెరిగిపోయింది.  ఇలాంటి  కోరికల   వల్లనే  సమాజంలో  పేదరికం  ఇంకా  తగ్గటం  లేదు.    ప్రజలు   అవసరానికి  మించి  డబ్బును  ఖర్చుపెడుతున్నారు. 

2.. పెద్దమొత్తంలో  జీతాలను  ఇవ్వవలసి  వచ్చినప్పుడు  కొంతమంది  యజమానులు  ఏం  చేస్తారంటే,   ఉద్యోగస్తుల సంఖ్యను   తగ్గించి,  ఉన్న వాళ్ళతోనే   మొత్తం  పని చేయిస్తారు.


 అంటే   ఒకే వ్యక్తి   ఇద్దరు  చేసేటంత  పనిని   చేయవలసి వస్తుంది.  అందువల్ల   ఉద్యోగస్తులు   విపరీతంగా అలసిపోయి జబ్బులు కొని తెచ్చుకొంటారు.

నాకు ఏమనిపిస్తుందంటే, యాజమాన్యాలు  ఒకే వ్యక్తికి   నెలకు  50 వేలు జీతం ఇవ్వటం కన్నా ....... 60 వేలు చొప్పున, ఒక్కొక్కరికి 30 వేలు జీతం ఇచ్చేటట్లు , ఇద్దరు ఉద్యోగస్తులను నియమించితే బాగుంటుంది.

అప్పుడు నిరుద్యోగుల సంఖ్యా తగ్గుతుంది.   ఉద్యోగస్తులకు  పని వత్తిడి   తగ్గి   అనారోగ్యాలు   లేకుండా   ఉత్సాహంగా  పని   చేస్తారు.   అందువల్ల  పనిలో నాణ్యత బాగుంటుంది. నాణ్యత  పెరిగితే   పరిశ్రమకు  ఎక్కువ  లాభాలు  వస్తాయి.

యాజమాన్యాలు   సమాజంలోని  నిరుద్యోగ  సమస్యను   తగ్గించిన  పుణ్యాన్ని  మూటకట్టుకుంటారు.

3..  ఈ రోజుల్లో   ఎక్కువమంది   నెలకు 50 వేలు ,  అంతకన్నా ఎక్కువ జీతం రావాలని కోరుకుంటున్నారు. ఎక్కువ  జీతం  వస్తే  మొదట్లో  సంతోషంగానే  ఉంటుంది. 


 క్రమంగా   ఉత్సాహం  తగ్గిపోతుంది.  ఎందుకంటే    అంత  పెద్ద మొత్తం  జీతాలు  ఇస్తున్న  యాజమాన్యం  జీతానికి   తగ్గ పనిని   చేయించుకుంటారు కదా ! 

ఎక్కువ  జీతం  కోసం  ఆశపడేవాళ్ళు   కొన్ని  విషయాలను  ఆలోచించాలి.

 విపరీతమైన పనివత్తిడి వల్ల   ఆరోగ్యం  పాడయ్యే  అవకాశం  ఉంది.  ఇంకా,  కోపం, అసహనం, చిరాకులు, జబ్బులు తప్పవు.   వీటివల్ల   కుటుంబంలో కలతలు మొదలవుతాయి.

పనివత్తిడి  వల్ల  ఆరోగ్య  సమస్యలు  వస్తే  ఉద్యోగం    కోల్పోయే  అవకాశాలు  కూడా  ఉన్నాయి.


............................................


ఈ  రోజుల్లో  పెద్దవాళ్ళకు .పనివత్తిడి,  పిల్లలకు  విపరీతమైన  చదువు  వత్తిడి  పెరిగిపోయింది.   పెద్దవాళ్ళు .పనులు చేయవద్దని, పిల్లలు చదువుకోవద్దని ఎవరూ అనరు.


 అయితే శరీరం తట్టుకోలేనంతగా వత్తిడి వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ.  

ఈ  రోజుల్లో ఉపాధి  లభించి   ఎక్కువ  ఆదాయం  ఉన్న  కొందరు  యువత  విపరీతంగా  ఖర్చు  చేస్తుంటే ,  ఉపాధి  లభించక  చుట్టుపక్కల  వారు  అడిగే  ప్రశ్నలకు  జవాబులు  చెప్పలేక  క్రుంగి  పోతున్న  యువత  చాలామంది   ఉన్నారు.

 యంత్రాల  వాడకం  కొంతవరకూ  అవసరమే.  అయితే  యంత్రాల  వాడకం  మితిమీరితే  సమాజంలో  నిరుద్యోగం   బాగా  పెరుగుతుంది.  తద్వారా  పేదరికం  పెరుగుతుంది.


   నిరుద్యోగం,  పేదరికం  వల్ల  యువతలో  నిరాశానిస్పృహలు  పెరిగితే  సమాజంలో  ఎన్నో  సమస్యలు  వస్తాయి.

 యంత్రాల  అతి  వినియోగం  వల్ల  సహజవనరులు  కూడా  వేగంగా  తరిగిపోతాయి.

పూర్వకాలంలో  చేతివృత్తులు  బాగా  నడిచిన  రోజుల్లో   నిరుద్యోగం  ఉండేది  కాదు.  ఎవరిపనులు  వారు  చేసుకునేవారు. 

 చదువు  కోసం,  ఉపాధికోసం  ఇతరుల  మీద  ఆధారపడే  అవసరం  ఉండేది  కాదు. 

ఈ  రోజుల్లో   విద్య,  ఉపాధి  రంగాలు,  మరియు   సంపద  కొందరి  పెట్టుబడిదారుల  వద్దనే  కేంద్రీకృతమవటం  ఎక్కువగా  జరుగుతోంది.

 అన్నింటికీ  కారణం  మనుషులలో  కోరికలు  పెరగటం,  స్వార్ధం  పెరగటం,  నైతికవిలువలు  తగ్గటం. 


 మనుషులలో  కోరికలు  తగ్గి,  స్వార్ధం తగ్గి ,  నైతికవిలువలు  పెరిగితే   సమాజంలోని  అందరూ  చక్కగా  జీవించవచ్చు.

ఇవన్నీ  అమలు  కావాలంటే  చిన్నతనం  నుంచి  నైతికవిలువలతో  కూడిన  విద్య  అవసరం.


రెండు, మూడు   టపాలలో  వ్రాసే విషయాలను  ఒకసారే  వ్రాయటం  వల్ల   చదవటానికి   కొంచెం   ఇబ్బందిగా  ఉంటుంది  ఏమో ..

  

2 comments:

  1. "రెండు, మూడు టపాలలో వ్రాసే విషయాలను ఒకసారే వ్రాయటం వల్ల చదవటానికి కొంచెం ఇబ్బందిగా"

    ఈ మాట నిజం.
    రాజకీయాలు ఓట్ల చుట్టూ తిరుగుతున్నంత కాలం ఇలాగే ఉంటుందండి. ఇదో విషవలయం.

    ReplyDelete
  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
    నిజమేనండి,రాజకీయాలు ఓట్ల చుట్టూ తిరుగుతున్నంత కాలం ఇలాగే ఉంటుంది.

    ఎన్నికలలో గెలవటమే ధ్యేయంగా కాకుండా, సమాజంలోని సమస్యల పరిష్కారం ధ్యేయంగా రాజకీయాలు ఉండాలి. అలాంటి వారికే ప్రజలు ఓట్లు వేయాలి.

    ReplyDelete