koodali

Monday, June 3, 2013

హనుమజ్జయంతి శుభాకాంక్షలు మరియు గోవుల గురించి కొన్ని విషయాలు........

అందరికి  హనుమజ్జయంతి  శుభాకాంక్షలండి . 
.......................................

 ఈ  మధ్య   మేము  ఊరు  వెళ్ళినప్పుడు  దైవదర్శనం  కోసం  ఒక  దేవాలయానికి  వెళ్ళాము. 

 అది   గొప్ప పుణ్యక్షేత్రం.  అక్కడ   గోవులు  ఉండే  ప్రదేశానికి  వెళ్ళాము.   గోశాల  వద్ద  చాలా  గోవులున్నాయి.

 ఇప్పుడు  వాతావరణం  కొంచెం  చల్లబడింది.  కానీ   మేము  వెళ్ళినరోజున   రోజు  ఎండగా   ఉంది.


  కొన్ని  గోవులకు  షెల్టర్  సదుపాయం  ఉంది.  కానీ ,  చాలా  గోవులు  ఎండలోనే  ఉన్నాయి.  వాటికి  షెల్టర్  సదుపాయం  లేదు. 


మధ్యాహ్నానికి  ఎండ  బాగా  వస్తే  ఆ  గోవుల  పరిస్థితి  ఏమిటో  పాపం ? అనిపించింది.  


 మనం   కొద్దిసేపు  కూడా  ఎండలో  ఉండలేక  పోతున్నాము  కదా  !  నోరులేని  మూగజీవులను   ఇలా  బాధించటం  మంచిది  కాదు. 

షెల్టర్  లేకుండా  తొట్టెలో  నీళ్ళు  పెట్టినా  ఎండవేడికి  తొట్టెలో  నీళ్ళు  వేడెక్కిపోతాయి. అందువల్ల  షెల్టర్   ఎంతో అవసరము. . 


భక్తులు  సమర్పించిన   గోవులకు  చక్కటి  సౌకర్యాలు  కల్పించితే  దైవం  యొక్క  అనుగ్రహం  లభిస్తుంది. 


*   భక్తులు  సమర్పించే  గోవులకు   సరైన   సౌకర్యాలను  కల్పించకుండా  బాధపెడుతూ ......    దైవపూజలను  అట్టహాసంగా    నిర్వహించినంత  మాత్రాన  దైవం  యొక్క  అనుగ్రహం  లభిస్తుందా  ?


 ఏమిటో  లోకం  పోకడ  చిత్రవిచిత్రంగా  ఉంది.


    కానుకల  రూపంలో  ఎంతో  ఆదాయం  వస్తున్నా  కూడా   గోవులకు  సరైన  సదుపాయాలను  కల్పించటంలో  నిర్లక్ష్యం  ఎందుకు  జరుగుతోందో ?  అనిపించి  బాధనిపించింది. 


 దేవాలయాలకు    సమర్పించిన  గోవులను  నిర్లక్ష్యం   చేయటం  మహాపరాధం .

 గోవుల  పట్ల  సరైన  శ్రద్ధ  తీసుకోని  పరిస్థితులున్నప్పుడు   దేవాలయాలకు  గోవులను  సమర్పించే  విషయంలో  భక్తులు  పునరాలోచించుకోవటం  మంచిదనిపిస్తుంది.  మన  కోరికల కోసం  వాటినెందుకు  బాధపెట్టటం  ?

..............................

పూర్వం  దేవాలయాలలో  యజ్ఞయాగాదిక్రతువులు  చేయటానికి  మరియు  ప్రసాదాల  తయారీలో  ఆవునేతిని  విరివిగా  వినియోగించేవారు..  ఈ  కార్యక్రమాల  కోసం  దేవాలయాల  గోశాలలలో  పెంచే    ఆవు పాలను,  నేతిని  ఉపయోగించేవారనిపిస్తుంది.

 ఈ  రోజుల్లో  అయితే  ఆవు  నెయ్యి  మార్కెట్లో  అమ్ముతున్నారు. ఆ విధంగా  ఆవునేతిని  బయట  కొనుగోలు  చేసి  దేవాలయాల  కార్యక్రమాలలో  ఉపయోగించే  అవకాశం  కూడా  కలిగింది.


 అయితే  మార్కెట్లో  కొనే  వస్తువులలో  కొన్నిసార్లు  కల్తీ  జరిగే  అవకాశం  కూడా  ఉంది.  పవిత్ర  ప్రదేశాలైన   దేవాలయాల  గోశాల
లో  పెంచే  గోవుల  ద్వారా  లభించే   పాలను,  నేతిని  దైవకార్యక్రమాలకు  వినియోగిస్తే  మరింత  శ్రేష్టంగా  ఉంటుందనిపిస్తుంది.


వ్రాసిన  విషయాలలో  ఏమైనా  పొరపాట్లు  ఉంటే  దయచేసి  క్షమించాలని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.



No comments:

Post a Comment