koodali

Monday, April 22, 2013

అచ్చుతప్పులు....


దైవ స్తోత్రాలు , మంత్రాలు  వంటివాటిని   పుస్తకాల్లో  ముద్రించేటప్పుడు  కొన్నిసార్లు   అచ్చుతప్పులు  వస్తున్నాయి. 


 కొన్ని  పాత  పుస్తకాల్లో   అయితే   తప్పుగా  ముద్రించిన  అక్షరాలను  గుర్తించి  పుస్తకానికి  చివరిలో  సూచించేవారు. 

  ఇలా  సూచన  ద్వారా  తెలియజేస్తే  పాఠకులకు  తప్పులను  సరిదిద్దుకోవటానికి  అవకాశం  ఉంటుంది.  

ఒకే శ్లోకం ఒక పుస్తకంలో ఒక రకంగా ఉంటే , ఇంకో పుస్తకంలో ఇంకో రకంగా ఉంటోంది.


ఇలాంటప్పుడు  ఏ  పుస్తకంలోని  శ్లోకం   సరైనదో  సామాన్య పాఠకులకు   అర్ధం కాదు. అందువల్ల  భక్తులు  శ్లోకాలను  తప్పుగా  చదివే  అవకాశం  ఉంది. 


మంత్రములు  మొదలగునవి   తప్పులు  లేకుండా  చదవాలంటారు.   అందువల్ల  పుస్తకాలను  ముద్రించేటప్పుడు  తప్పులు  రాకుండా   జాగ్రత్తలు  తీసుకోవాలి. 


 ఎవరైనా  తప్పులను  వ్రాసినప్పుడు  తెలిసినవారు  సరైన  విషయాన్ని   సూచిస్తే    తప్పులను  సరిదిద్దుకోవచ్చు. 

చిన్న  అక్షరం  తప్పు  ఉంటే  ఏమవుతుందిలే  అనుకుంటారు  కొందరు. 

అంతర్జాలంలో  ఏదైనా  వెబ్ సైట్  సెర్చ్  చేయాలంటే   వెబ్ సైట్  పేరును  ఒక్క  అక్షరం  తప్పుగా  వ్రాసినా  సైట్  ఓపెన్  కాకపోవచ్చు.

 మంత్రములు,  మొదలగునవి  వీలైనంతవరకు  తప్పులు లేకుండా  నేర్చుకోవటం  వల్ల  చక్కటి  ఫలితాన్ని  పొందే  అవకాశం  ఉంటుంది.

అయితే  మనస్పూర్తిగా  దైవం  మీదే  భారం  వేసి  జీవించేవారికి  దైవమే  దారి  చూపిస్తారు.
 

ఒక  భక్తుడు  ఎంతో  భక్తితో  దైవపూజ  చేస్తూ  ఆ  భక్తిపారవశ్యంలో  పండ్లకు  బదులు  పండ్లతొక్కలను  నివేదించాడట. 


భగవంతుడు  ఆ  పండ్ల  తొక్కలను  స్వీకరించారట.

అయితే  భక్తుడు    తన  తప్పును  తెలుసుకుని  అయ్యో  !  పండ్ల  తొక్కలను  నివేదించానే .... అనుకుని    మళ్ళీ  పూజ  చేసి  పండ్లను  నివేదించాడట. 

 అయితే   భగవంతుడు  పండ్లను  స్వీకరించలేదట. 

ఎందుకంటే  ఈసారి  చేసిన  పూజలో  భక్తుడు  భక్తి  కన్నా  పూజ  యొక్క  విధివిధానాల  మీదే  ఎక్కువ  శ్రద్దను  చూపించాడట. 

  భగవంతుని  పట్ల  స్వచ్చమైన  ప్రేమ భక్తిని  కలిగి ఉండటం  ముఖ్యం. 

  భక్తిలేని   పూజ  ఎంత  గొప్ప  విధివిధానాలతో  చేసినా  భగవంతుని  అంతగా మెప్పించదేమో .... అనిపిస్తుంది.

 అంతగా  పాండిత్యం  లేనివారు  శ్లోకాలను  తప్పుగా  చదువుతున్నామేమోనని  భయపడనవసరం  లేదు.   ప్రేమభక్తితో   భగవంతుని  మీద  భారం  వేసి  ఆరాధిస్తే    దైవమే  సరైన  దారిని  చూపిస్తారు.



2 comments:

  1. విదుర విందే అది.

    ReplyDelete
  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    ReplyDelete