koodali

Wednesday, December 5, 2012

కొన్ని యాత్రా విశేషాలు మరియు...


మేము  కొంతకాలం  క్రిందట  అమరనాద్,  వైష్ణవి  దేవి  యాత్రలు  చేసి  వచ్చాము.  అంతా  దైవం  దయ.  

 మేము  అంతర్జాలంలో  ఈ  యాత్రల  గురించి  వివరాలను  సేకరించాము. 


  వైష్ణవి దేవి  యాత్ర  సంవత్సరంలో  ఎప్పుడైనా  చేయవచ్చు.  కానీ,  అమర్నాధ్  యాత్ర    ఆషాఢ ,  శ్రావణ  మాసాల్లో  ఉంటుంది.  అంటే,   అప్పుడు  అక్కడ  యాత్రకు  అనుకూలంగా  ఉంటుంది.


 అమర్నాధ్  వెళ్ళటానికి  పెహల్గావ్  రూట్ ,  బాల్టాల్  రూట్ అని  రెండు  దారులు  ఉన్నాయి.  పెహల్గావ్  రూట్  ఎక్కువదూరం,  బాల్టాల్  రూట్   చాలా   దగ్గరదారి. ఎక్కువమంది  బాల్టాల్  దారి  నుండే  యాత్ర  చేస్తారు.

 మేము  పెహల్గావ్ నుంచి   యాత్ర  చేసాము. యాత్ర  మొదలయ్యే  తేదీ  నిర్ణయం  అయిన  తరువాత  ,  వాళ్ళు  నిర్ణయించిన  తేదీలలో   అప్లికేషన్స్  పూర్తిచేసి  యాత్రీకులు  యాత్రను  బుక్  చేసుకోవాలి. 
 (  అంతర్జాలంలో  కూడా  బుక్  చేసుకోవచ్చు.  ) ఆ  పేపర్స్  జాగ్రత్తగా  దగ్గరుంచుకోవాలి.

 మేము  ఉన్న  ఊరు  నుంచి  హైదరాబాద్ కు  వెళ్ళి ,  అక్కడనుంచి  డిల్లీ  ,   డిల్లీ  నుంచి  జమ్ము    చేరుకున్నాము.  జమ్మూలో   రైల్వే   స్టేషన్ లోనే  అమర్నాధ్  యాత్రికులకు  కావలసిన   ఎన్నో  వివరాలను  తెలియజేస్తారు.  


మేము  జమ్మూలో  ఒక  రూం  తీసుకుని,   జమ్మూలో  ప్రముఖమైన  రఘునాధ్  దేవాలయం  దర్శించుకున్నాము. మేము  తీసుకున్న  రూం  రఘునాధ్  దేవాలయానికి  దగ్గరలోనే  ఉంది. తరువాత   శక్తి అమ్మవారి  దేవాలయాన్ని  దర్శించుకున్నాము.

జమ్మూలో  షాప్స్ లో  బాదాం,  అక్రూట్  వంటి  డ్రై  ఫ్రూట్స్  చాలా  చవక.   కొందరు  యాత్రీకులు  కొన్నికిలోల  చొప్పున  కొనుక్కువెళ్తున్నారు.  



జమ్మూలో  అమర్నాధ్  యాత్రికుల  బేస్  కాప్  ఉంది.  అక్కడ  నుంచి  ప్రతి  రోజు  ఉదయం  అమర్నాధ్  యాత్రికుల  కోసం  బస్సులు  ఉంటాయి.  ప్రభుత్వం  వారే  ఆ  బస్సులను  మిలటరీ  రక్షణతో  పంపిస్తారు.   అయితే  ప్రతిరోజు  బస్సులు  వెళ్తాయో  లేదో  చెప్పలేము.  అమర్నాధ్ లో   వాతావరణ  పరిస్థితిని  బట్టి  యాత్రికులను  అనుమతిస్తారు.  


అమర్నాధ్ లో   వాతావరణం  ఎప్పుడెలా  మారుతుందో  చెప్పలేమట. అంతలోనే  వాన,  అంతలోనే  చలి  అలా  మారుతుందట. కొన్నిసార్లు  కొండచరియలు  విరిగిపడటం  కూడా  జరుగుతుంది.  అలాంటప్పుడు  యాత్రికులను  బేస్  కాంప్  లో   ఆపి,   వాతావరణం  బాగయ్యాక  పంపిస్తారు. 


యాత్రీకులు  బేస్  కాంప్  లో   ఉండవచ్చు.  లేక   జమ్మూలోని  హోటల్స్ లో  ఉండవచ్చు. మేము  రూం  తీసుకున్నాము  కానీ,  బేస్  కాంప్  దగ్గర  కూడా  సౌకర్యాలు   చాలా   బాగున్నాయి.  మేము  ఉన్న  రూం కు  బేస్  కేంప్ కు  చాలా  దూరం. 



 బేస్ కేంప్  వద్ద   కొన్ని  గదులున్న   పెద్ద   బిల్డింగ్  , కొన్ని  టెంట్స్    ఉన్నాయి.  అక్కడే  యాత్రికుల  కోసం  మెడికల్ షాప్స్   కూడా  ఉన్నాయి.  యాత్రకోసం  అవసరం  అయిన  స్వెట్టర్స్, రెయిన్   కోట్స్,  షూస్  అమ్మే  షాప్స్  ఉన్నాయి.  పోలీస్ ,  మిలటరీ  రక్షణ  ఉంది. 
జమ్మూలో   కూడా  ప్రజలు    రాత్రయినా   రోడ్లపై  సంచరిస్తున్నారు.  అక్కడ  త్వరగా  చీకటి  పడలేదు.


మరునాడు , మేము  ఒక  టాక్సీ  మాట్లాడుకుని  పెహల్గాం  బయలుదేరి  వెళ్ళాము. దారిలో  యాపిల్  తోటలు  కనిపించాయి.  యాపిల్స్  పిందెలు  అప్పుడే  మొదలయ్యాయి.  రోడ్డుకు  ఇరువైపులా  దానిమ్మ  చెట్లు  ఎక్కువ  కనిపించాయి. 



జమ్మూలో  ఫ్రూట్  జ్యూస్  అమ్మే  షాప్ లో  జ్యూస్  త్రాగితే  కొంచెం  పుల్లగా  ఉంది.  మేము  పంచదార  వెయ్యలేదు  కాబోలు , అని  అడిగితే  అతను  నవ్వి,  అక్కడి  వాళ్ళు  ఫ్రూట్  జ్యూస్ లో  సుగర్  కలపకుండా  అలాగే  త్రాగుతారని  చెప్పారు.   మన రాష్ట్రంలో  షాప్స్ లో   అయితే    చాల  షుగర్   కలుపుతారు.  

  జమ్మూలో  అయితే  అప్పుడు  వాతావరణం  మనకులానే  ఉంది.  నేను  ఏమనుకున్నానంటే,  అక్కడంతా  ఐసే   ఉంటుంది  కాబోలు  అనుకున్నాను.  అయితే  చలికాలంలో    మంచు  కురుస్తుందట.  

గత  కొన్నేళ్ళ  నుంచి  అక్కడ  ఎండ  పెరుగుతోందని    స్థానికులు  చెప్పారు. గ్లోబల్  వార్మింగ్   సమస్యను    మనం  సీరియస్  గా  పట్టించుకోవటం  లేదు  గానీ,    ప్రపంచవ్యాప్తంగా  వాతావరణం 
నిదానంగా మారుతోంది.
 
జమ్మూ  నుంచి  కశ్మీర్  వెళ్ళేసరికి  వాతావరణం  మారిపోయింది.  కింది  తిరుపతి  నుంచి  తిరుమలకు  వెళ్ళేసరికి  వాతావరణంలో  తేడా   ఉంటుంది  కదా  !  అలాగే  కశ్మీర్ ప్రాంతంలోకి  వెళ్ళేసరికి  చలి  మొదలయ్యింది.  జలజలపారే  సెలయేళ్ళు,  ఎత్తుగా  పెరిగిన  వృక్షాలు,  యాపిల్  తోటలు  ఇవన్నీ చూస్తే,  ఊటీ  వాతావరణం , అక్కడి  చెట్లు  గుర్తొచ్చాయి.   ( అయితే,
ఊటీలో నేను  యాపిల్  తోటలు  చూడలేదు. )

  చాలాదూరం  ప్రయాణించిన  తరువాత,   అల్లంత  దూరంలో  మంచు  కప్పుకున్న  హిమాలయశిఖరాలు  కనిపిస్తుంటే .. ఆ  అనుభూతి   వర్ణణాతీతం.  మొత్తానికి  పెహల్గాం  చేరుకున్నాము.  మా  టాక్సీని  నడిపిన  అతను  పంజాబీ  అతను  అనుకుంటా,  అతను   చుట్టుపక్కల విశేషాలను   తెలియజేసాడు.


పెహల్గాం  కూడా  చాలా  శుభ్రంగా  కనిపించింది.  అక్కడి  ఇళ్ళు  కూడా  బాగున్నాయి. పెహల్గావ్ లో  కూడా  అమర్నాధ్  యాత్రికుల  బేస్  కాంప్  ఉంది.  బేస్  కాంప్ లోనే  భోజన  సదుపాయం  కూడా   ఉంటుంది.  ఉత్తరభారతదేశానికి  చెందిన  కొందరు , 
 ఈ  భండారాలను  ఏర్పాటు  చేస్తారు.ఇక్కడ  భోజనం ఫ్రీ.  అయితే ,  ఎక్కువ  ఆహారాన్ని  తీసుకుంటే  యాత్రలో  అనారోగ్యం  కలుగుతుంది  కాబట్టి,  సరిపడా  ఆహారాన్ని  తీసుకోవాలి. 


పెహల్గావ్ లో   ప్రభుత్వం  నిర్వహించే   గెస్ట్  హౌస్   కూడా   ఉంది. ఇంకా  ప్రైవేట్  హోటల్స్  ఉన్నాయి.  మరుసటి  ఉదయాన్నే   యాత్ర  మొదలయ్యింది. .........

 (  ఇంకా  ఉంది.  ) 
....................................

  మన  రాష్ట్రం  నుంచి  అమరనాధ్ ,  వైష్ణవీదేవి  యాత్రలకు  తీసుకువెళ్ళటానికి  ఎన్నో  టూర్స్...  ట్రావెల్స్  సంస్థలు  ఉన్నాయి.  యాత్రికులు   తమకు  తామే  అన్నీ  వెతుక్కోకుండా,  ఈ  సంస్థల  ద్వారా  వెళ్తే,  అన్నీ  వాళ్ళే  ఏర్పాటు  చేసి,  యాత్ర  చేయించి  తీసుకొస్తారు.



* ఈ  యాత్రల   గురించి  కొన్ని  వివరాలు  ఈ  లింక్  లో   ఉన్నాయి.

   * bhole bhandari charitable trust provides and ... - Amarnath Yatra

...

  *  SHRI MATA VAISHNO DEVI SHRINE BOARD | Official Website

...........................................

ఇప్పుడు  దేశంలో  వర్తకం  గురించి   ముఖ్యమైన  నిర్ణయాలు  తీసుకుంటున్నారు  కదా  ! కొందరి  అభిప్రాయాలు  వింటుంటే  ఆశ్చర్యంగా  ఉంది.  


మనదేశంలో   గిడ్డంగులు  కట్టడానికీ,  వ్యాపారం  చేయటానికీ  ,  తగినంత  సామర్ధ్యం  ఉన్నవారు   ఈ  దేశంలో  లేరన్నట్లు ,  కొందరు  భావిస్తున్నట్లుంది. 

 ఇతరదేశాల  వాళ్ళు  వచ్చి  ఈ  దేశాన్ని  బాగుచేయాలి  తప్ప ,  మనవల్ల  కాదన్నట్లు   ఇక్కడి మేధావులు  ?  కొందరు  నిర్ణయించేస్తుంటే ...  గొర్రెల్లాంటి   ప్రజలు   ఏం  చేయ్యగలరు  లెండి.

  ఇప్పుడు  చాలా  ఇతరదేశాల్లో  ఆర్ధికమాంద్యం,  నిరుద్యోగం  వంటి  సమస్యలు  ఉన్నాయి.  వాళ్ళ  దేశాల్లోని  సమస్యలను  పరిష్కరించుకోకుండా, పాపం ,   వాళ్ళంతా  ఇక్కడికొచ్చి  ఈ  దేశాన్ని  ఉద్ధరించాలనుకోవటం  ఆశ్చర్యకరం..


జరిగేదంతా  చూస్తుంటే,   పూర్వం  కొన్ని  వందల  సంవత్సరాల  క్రిందట  మన  పూర్వీకులు  విదేశీయుల్ని  వర్తకానికి   ఆహ్వానించటం     గుర్తొస్తోంది.  

అయితే  అప్పటి  వాళ్ళకీ,  ఇప్పటి  వాళ్ళకీ    చాలా  తేడా  ఉంది.  అప్పటి  వాళ్ళు  పర్యవసానాలను  ఊహించలేదు. ఒకసారి  దెబ్బతినీ  కూడా,  ఇప్పటి  వాళ్ళు  మళ్ళీ   ..........?


4 comments:

  1. యాత్రా విశేషాలు బాగున్నాయి

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      Delete
  2. చక్కటి వివరణతో యాత్రా విశేషాలను చక్కగా తెలిపారు.
    ధన్యవాదాలు.

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      Delete