koodali

Wednesday, December 19, 2012

కొన్ని యాత్రా విశేషాలు ...ఐదవ భాగము.



*  వైష్ణవీదేవి యాత్రకు  వెళ్ళే  మార్గంలో   జై మాతా  దీ  ! అంటూ  వెళ్ళే   భక్తుల   నినాదాలు  వినిపిస్తాయి.  దైవ దర్శనానికి  చాలా  క్యూ  ఉంటుంది.

* వైష్ణవీదేవి  దర్శనానికి   వెళ్ళటానికి   సన్నటి  గుహ  మార్గం  నుండి  వెళ్ళాలేమో  అనిపించి,   నాకు  భయం  వేసింది. ( దైవదర్శనానికి  వెళ్ళటానికి  కూడా  భయమేమిటి ? అని  మీకనిపించవచ్చు.   భక్తిలో  పరిపూర్ణత్వం  రాని  నాలాంటి  భక్తుల  పరిస్థితి  ఇలాగే  ఉంటుంది.  పరిపూర్ణమైన  భక్తులకు  భయం  వంటివి  ఉండవు.  వారు  దైవం  మీద  పూర్తి  భారం  వేసి ,  నిష్కామంగా  తమ  స్వధర్మాన్ని  నిర్వర్తిస్తూ  జీవితాన్ని  గడుపుతారు.   అలాంటి  స్థితప్రజ్ఞత  రావాలన్నా  దైవకృప  ఉండాలి.  దైవకృపను  పొందాలంటే  సత్కర్మలను  చేస్తూ  భక్తితో   జీవితాన్ని  గడపాలి. )


* పూర్వపురోజుల్లో  వైష్ణవీదేవి  దర్శనానికి  వెళ్ళటానికి  సన్నటి  మార్గం  ద్వారా  గుహలోకి  వెళ్ళి  దర్శనం  చేసుకునేవారట. ఇప్పుడు  కూడా  అదంతా  ఉంది  కానీ,  అలా  వెళ్ళాలంటే  ఒక్కొక్కరే  వెళ్ళాలంట.    భక్తుల  రష్  వల్ల  సమయం  సరిపోదు  కాబట్టి,   కొంతకాలం  క్రిందట  దేవస్థానం  వారు  వేరే  దారిని  నిర్మించారు.  


* ఈ నూతన  మార్గం  ద్వారా  సులభంగా  వెళ్ళి  దైవదర్శనం  చేసుకోవచ్చు.  ఈ  నూతన  మార్గానికి  దగ్గరలోనే  పూర్వపు  మార్గం  కూడా  ఉంటుందట . అయితే,  ముఖ్యమైన  పండుగలప్పుడు,  కొన్ని  ప్రత్యేకమైన  సందర్భాలలో  మాత్రం  ఈ  ట్రెడిషనల్ మార్గం  ద్వారా  వెళ్ళి  దర్శించుకోవటానికి   భక్తులను  అనుమతిస్తారట.


  ( ఈ  ట్రెడిషనల్  మార్గం  ద్వారా  గుహలోకి  వెళ్ళి  దైవదర్శనం  చేసుకుంటే,  ఆ  మార్గంలో  మరెన్నో  దైవమూర్తులు  దర్శనమిస్తారట.  నూతనంగా  ఏర్పరిచిన  మార్గం  ద్వారా  వెళ్ళిన  వారికి  అవన్నీ కనిపించవు.  ) 

* వైష్ణవీదేవి  దర్శనానికి  మొదటిసారి  వెళ్ళిన  వారు  మరింత  శ్రద్ధగా   చూడాలి.   అమ్మవారు  పెద్ద  విగ్రహ మూర్తిగా  కాకుండా ,  మూడు  చిన్న  పిండీల రూపాలలో  ఉంటారు.  పిండీలంటే  చిన్న  శివలింగాల  మాదిరిగా అనిపిస్తాయి. వైష్ణవీదేవి .....సరస్వతీ  దేవి,  లక్ష్మీదేవి,  కాళికాదేవి(  గౌరీదేవి  ) గా  దర్శనమిస్తారు. 


* భక్తుల  రద్దీ  ఎక్కువగా  ఉండి,  వారిని   త్వరత్వరగా  క్యూలో  పంపించినప్పుడు  ఎక్కువసేపు  దైవాన్ని  దర్శించటం   కుదరదు  కాబట్టి,  ఆ  కొద్దిసేపులోనే  జాగ్రత్తగా  చూడాలి. 


* అమరనాధ్ లో  అయితే, క్యూలైన్లో  వెళ్తూ  ఎక్కువసేపు   దైవాన్ని  దర్శించుకోలేకపోయినా , పక్కకు  వచ్చి  నిలుచుని  దైవదర్శనం  చేసుకోవచ్చు. 

 (  గుహ  లోపల  కూడా  విశాలంగా  ఉంటుంది   కాబట్టి  చాలా  స్థలం  ఉంటుంది. ) 

* వైష్ణవీదేవి  గుహ  లోపల  భక్తులను  త్వరత్వరగా  పంపించారు. ( రద్దీవల్ల ). నేను  సరిగ్గా  చూడలేకపోయాను  అనిపించింది.  భక్తులు  దర్శనానికి  వెళ్ళటానికి  ముందే , బయట  టీవీ స్క్రీన్లలో, అమ్మవార్లను  స్పష్టంగా  చూపిస్తూ,   దర్శనం   చేసుకునేటప్పుడు  సరిగ్గా  చూడమని  తెలియజేస్తుంటారు.  


* క్యూలైన్  లో త్వరపెడుతుంటే,  గుహలో  ఉన్న ఆ   కొద్దిసమయంలో ,  కనిపించే  అలంకరణ  మధ్య  దేవతామూర్తులను సరిగ్గా  దర్శించుకోవాలి. ( లేకపోతే  సరిగ్గా  చూడలేము. ) 


* ముగ్గురు దేవతామూర్తులపైన  మూడు  పెద్ద   కిరీటాలు  ఉంటాయి.  ఆ  కిరీటాలను,  పుష్పాలంకరణను  మాత్రమే  కాకుండా,  కిరీటాల క్రింద  ఉన్న పిండీలను  
 (  దేవతా మూర్తులను  ) స్పష్టంగా  దర్శించుకోవాలి.  వెళ్ళేముందే  ఇవన్నీ  చక్కగా  తెలుసుకుని  వెళ్తే  ,  ప్రాప్తాన్ని  బట్టి  దర్శనం  ఉంటుంది. 

* దర్శనం  చేసుకుని  బయటకు  వచ్చిన  తరువాత , ప్రక్కనే  చరణామృతం  స్వీకరించాలి. (  పాద  తీర్ధం  ). ఈ  చరణామృతం  మూడు  ధారలుగా  పంపులనుంచి  వస్తూంటుంది. ఒక్క  ధారనుమాత్రమే  కాకుండా,   మూడు  ధారలలోని  నీటినీ  ముగ్గురు మూర్తుల  పాదతీర్ధంగా  స్వీకరించాలి. భక్తులు  కొంత  నీటిని  త్రాగి,  మరికొంత  నీటిని  తాము  తీసుకువెళ్ళిన  బాటిల్లో  పట్టుకుని , ఇంటికి  తీసుకువెళ్ళవచ్చు. 


* వైష్ణవీదేవి అమ్మవారి   దర్శనం  తరువాత  , అమ్మవారి  చేతిలో  సంహరించబడ్డ  రాక్షసుడైన  భైరన్  ఆలయానికి  కూడా  వెళ్ళి  దర్శించుకుంటేనే  యాత్ర  సంపూర్ణమైనట్లని  అంటారు.  


* అయితే,  భైరన్  దర్శనం  గురించి  తెలియనివాళ్ళు,  సమయం  సరిపోని  వాళ్ళు   కొందరు   భైరన్  దర్శనం  చేసుకోకుండానే  తిరిగివస్తారట. . భైరన్ అనే  రాక్షసుడు ,  అమ్మవారికి  హాని  కలిగించే  ఉద్దేశంతో  అమ్మవారిని  వెంబడించగా,    అమ్మవారు  అతనిని సంహరించారు.  అప్పుడు  అతని  తల  దూరంగా  ఎగిరిపడింది.  ఆ  శిరస్సు  పడిన  ప్రదేశమే భైరన్   ఆలయం  ఉన్న  ప్రదేశం  అంటారు.  మరణించే  ముందు  ఆ  రాక్షసుడు  మంచిగా  మారి,   అమ్మను  వరం  అడిగాడట.  అమ్మను  దర్శించుకున్న  వారు  తనను  కూడా  దర్శించుకోవాలని   అడగగా  ,  దయామయి  అయిన  అమ్మ  వరమిచ్చారట.  


* ఈ  భైరన్  ఆలయం  సుమారు  రెండు  కిలోమీటర్ల  దూరం  ఉంటుంది.  మేము  వెళ్ళేటప్పటికి  చీకటి  పడవస్తోంది.  అయితే, అక్కడ  లైట్స్  బాగా  ఉన్నాయి.  భైరన్  దర్శనం  చేసుకున్నాము. 


 * మేము  తిరిగి  కట్రాకు  వచ్చి,  మరునాడు  బయలుదేరి  మళ్ళీ  డిల్లీ,...  హైదరాబాద్,....తరువాత  మేము  ఉంటున్నఊరు..ఇంటికి  తిరిగివచ్చాము.  అంతా  దైవం  దయ.


 *  వైష్ణవీదేవి  యాత్రకు  సంబంధించిన   వివరాలన్నీ   వైష్ణవీదేవి  దేవస్థాన్  వారి  వెబ్సైట్  లో  స్పష్టంగా  ఉన్నాయి. యాత్రకు   వెళ్ళేముందు   ఇవన్నీ  తెలుసుకుని  వెళ్తే  బాగుంటుంది.  లేకపోతే  ఇంతకు  ముందు  వెళ్ళివచ్చిన  వారిని  తోడు  తీసుకువెళ్ళినా   బాగుంటుంది. లేక  ట్రావెల్స్  వాళ్ళ  ద్వారా  కూడా   వెళ్ళిరావచ్చు.

........................................... 

 *  వైష్ణవీదేవి  యాత్రకు  సంబంధించిన   వివరాలను  ఈ  లింక్  ద్వారా  చూడవచ్చు.

SHRI MATA VAISHNO DEVI SHRINE BOARD | Official Website


* వ్రాసిన  విషయాలలో  ఏమైనా  పొరపాట్లు  ఉంటే  దైవం  దయచేసి  క్షమించాలని  కోరుకుంటున్నాను.



6 comments:

  1. నిజంగా ఆ దేవీకృప ఉండటం వల్ల మీరు అన్నీ దర్శించుకున్నారు. వైష్ణోదేవి ఆలయం గురించి ఇంత వివరంగా ఇక్కడే నేను చదవడం.

    ReplyDelete
  2. Chinni గారు, మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    ReplyDelete
  3. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    ReplyDelete
  4. చాలా బాగుంది మీ వివరణ అనూరాధ గారూ...
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      Delete