koodali

Monday, December 17, 2012

కొన్ని యాత్రా విశేషాలు....నాలుగవ భాగం...మరియు...


ఇప్పుడు ధనుర్మాసం  ప్రవేశించింది. 
 నెలరోజులు  తమిళనాడులోని  శ్రీరంగం శ్రీవిల్లిపుత్తూర్  మరియు  కొన్ని  దేవాలయాలలో ఆండాళ్  అమ్మవారు  రచించిన  తిరుప్పావైని  వినిపిస్తారు.
..................................

కొన్ని  యాత్రా  విశేషాలు....నాలుగవ భాగం.

 మేము  అమర్ నాధ్  నుంచి  తిరిగి  పహల్గాం  వచ్చాము. అక్కడ  నుంచి  వైష్ణవీ  దేవి  యాత్రకు  బయలుదేరాము. ఈ  సారి  టాక్సీలో వెళ్ళకుండా బస్సులో  వెళ్ళాము. అమరనాధ్  యాత్రికులు  ప్రయాణించే  బస్సులకు  రక్షణగా  మిలటరీ  వాళ్ళు  తమ  వాహనాలలో  వస్తారు.



తరువాత,  వైష్ణవీదేవి  యాత్రకు  కట్రా  అనే  ఊరు  వెళ్ళి  అక్కడ  రూం  తీసుకున్నాము. కట్రా  తిరుపతి లాగా  జనంతో  బాగా రద్దీగా ఉంది.


 వైష్ణవీదేవి  త్రికూట  పర్వతంపై  కొలువై ఉన్నారు.  ముగ్గురమ్మలైన మహాకాళి(మహా గౌరి), మహాలక్ష్మి,  మహాసరస్వతి  కొలువైన  అద్భుతమైన ప్రదేశం. 


   కట్రా  నుంచి  చూస్తే   కొండపైని  దేవాలయ  పరిసరాలు  రాత్రిసమయంలో  లైట్లతో  ధగధగా  వెలుగుతూ కనిపిస్తాయి.  కట్రా  నుంచి  ఎప్పుడైనా  బయలుదేరి  దేవాలయానికి  వెళ్ళవచ్చట. అంటే  రాత్రి  సమయంలో కూడా యాత్రికులు 
వెళ్తూనే ఉంటారని అక్కడి  వాళ్ళు  చెప్పారు.

కత్రా నుంచి వైష్ణవీదేవి  గుడికి  వెళ్ళటానికి  కొద్దిదూరం  ఆటోలో వెళ్ళాము. అక్కడ ఆటో  దిగిన తరువాత,  కొద్ది  దూరంలో బన   గంగాప్రవాహం ఉంటుంది. అక్కడ   కొందరు  యాత్రికులు  స్నానం  చేస్తారట.


 దేవాలయానికి వెళ్ళే  దారిలో  కొన్ని ఉపాలయాలు   ఉన్నాయి.  పూజాసామాను  అమ్మే  షాప్స్   కూడా   ఉన్నాయి. వైష్ణవీదేవి  దేవాలయానికి  వెళ్ళాలంటే  సుమారు   12  కిలోమీటర్లు  దూరం  ఉంటుందంటారు. నడిచి  లేక  గుర్రాలమీద కానీ, డోలీలలో గానీ  వెళ్ళవచ్చు. హెలికాప్టర్  సదుపాయం  కూడా  ఉంది.  


అమరనాధ్  వద్దకు   కూడా  హెలికాప్టర్  సౌకర్యం   ఉంది,   హెలికాప్టర్స్ వాళ్ళు అమరనాధ్  గుహకు  దగ్గరలోనే  యాత్రికులను  దింపుతారు..అయితే, కొందరు  ఏమంటున్నారంటే, ఈ హెలికాప్టర్స్ రాకపోకల వల్ల  గుహవద్ద  వేడి పెరుగుతోంది అని  అంటున్నారు.  



 అమరనాధ్ గుహకు నడవలేకపోయాము  కదా!  వైష్ణవీదేవి వద్దకు  అయినా నడిచి వెళ్దామని  బయలుదేరాము. అక్కడకు  ఒకటి కన్నా ఎక్కువదారులే ఉన్నట్లున్నాయి.

  మేము  వెళ్ళినప్పుడు( జులైలో) వైష్ణవీదేవి వద్ద  మంచు లేదు  కానీ,  చలికాలంలో  దేవాలయం  వద్ద  చాలా  మంచు  ఉంటుందట.

కొండను  ఎక్కేటప్పుడు  అక్కడక్కడా   దారికి  ఇరువైపులా  షాప్స్  ఉన్నాయి.  అక్కడ పళ్ళరసాలు, కూల్ డ్రింక్స్  , సమోసాలు..వంటివి  కూడా  అమ్ముతున్నారు. 


 అమరనాధ్ లో లానే , వైష్ణవీదేవి పరిసరాలలో కూడా  వర్షాలు  వచ్చినప్పుడు అప్పుడప్పుడు  కొండచరియలు  విరిగి  పడతాయట. 


 ( విజయవాడ  దుర్గమ్మ  గుడి సమీపంలో  కూడా  కొన్నిసార్లు   కొండచరియలు  విరిగిపడటం జరిగిందని వార్తలలో  విన్నాను ..) 

వైష్ణవీదేవి  యాత్రకు  మేము  వెళ్ళినప్పుడు , ముందు రోజు  పడిన  వర్షానికి  కొన్ని చోట్ల  కొండలమీది నుంచి  మట్టిపెళ్ళలు పడితే వాటిని  తొలగిస్తున్నారు. 

వైష్ణవీ  దేవి  దేవాలయానికి  వెళ్ళే మధ్య  దారిలో  అదుక్ వరి అని  ఒక  గుహ  ఉంటుందట. ఆ గుహలో  అమ్మవారు  తొమ్మిదినెలలు  తపస్సు  చేసారట.  భక్తులు  ఈ గుహలోకి  వెళ్ళటానికి, ఒకవ్యక్తి  మాత్రమే  వెళ్ళగలిగే  విధంగా  సన్నటి  దారి ఉంటుందట. అయితే, ఆశ్చర్యమేమిటంటే, లావుగా  ఉన్న  వ్యక్తి  కూడా  ఆ దారినుంచి  వెళ్ళగలరంట.


 ఆర్ధ్కువరిని  గర్భ్ ఝూన్  అని  కూడా  అంటారట.  వైష్ణవీదేవి మెయిన్  టెంపుల్ కు  వెళ్ళే  మధ్య  దారిలో  ఈ గుహ  ఉంటుంది.. అయితే,  మేము ఈ  గుహను  దర్శించుకోలేదు. ఈ  గుహను  దర్శించుకుంటే  ఎంతో మంచిదంటారు.

వైష్ణవీదేవి    దేవాలయానికి  వెళ్ళే  దారికి  ఇరువైపులా  కొండలు,  గుట్టలు,  లోయలు,  చెట్లతో   అక్కడ  ప్రకృతి  చాలా  బాగుంది. వెళ్ళేటప్పుడు  అక్కడక్కడా  ఆగుతూ , కొద్దిసేపు  కూర్చుని  విశ్రాంతి  తీసుకుని,  నిదానంగా  వెళ్ళాము. తిరుమల  చాలామంది  నడిచి  వెళ్తారు కదా  !  అలాగే ..


  మొత్తానికి   భగవంతుని  దయవల్ల   వైష్ణవీదేవి దేవాలయం  వద్దకు  చేరుకున్నాము.


 వైష్ణవీదేవి  గుహ వద్ద  దేవాలయ  పరిసరాలను  భవన్  అంటారు. అక్కడ  రిజిస్ట్రేషన్  కౌంటర్    వద్ద   రిజిస్ట్రేషన్   పేపర్స్ తీసుకుని  భద్రపరచుకోవాలి. దైవదర్శనానికి  ఈ  రిజిస్ట్రేషన్  పత్రాలు  ఎంతో  అవసరం.


ఇక్కడ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.సెక్యురిటి వాళ్ళు  అందరినీ  పరీక్షించి దేవాలయం లోపలికి  పంపుతారు. వైద్య  సదుపాయాలు,  వసతికి  గదులు,  చక్కటి  ఆహారం,..ఇలా  ఎన్నో  సదుపాయాలున్నాయి. బాంక్, ఫోన్  సౌకర్యం..కూడా  అందుబాటులో  ఉన్నాయి.  అక్కడంతా   ఒక  ఊరిలాగే  ఉన్నది....(  ఇంకా ఉంది..)



6 comments:

  1. వైష్ణోదేవి ఆలయ విశేషాలు చక్కగా వివరించారు.:)

    ReplyDelete
    Replies
    1. Chinni గారు, మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      Delete
  2. యాత్రా విశేషాలు చెప్పి మమ్మల్ని కూడా యాత్ర చేసిన అనుభూతికి లోను చేసి దైవ కార్యం నెరవేర్చారు. మాకూ పుణ్యమ్ పంచిపెట్టేరు. ధన్యవాదాలు

    ReplyDelete
  3. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    ReplyDelete
  4. చాలా మంచి విషయాలు చెప్పారు.అక్కడకు వెళితే గుర్తు ఉంచుకున్టాము

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      Delete