koodali

Friday, October 5, 2012

మితిమీరిన స్వేచ్చ.....


ఈ  రోజుల్లో  కుటుంబసభ్యులకు  సరిగ్గా  మాట్లాడుకోవటానికే  సమయం  ఉండటం  లేదు.  కొందరు భార్యాభర్తలు  అయితే,  చెరొక  దగ్గర  ఉద్యోగాలు  చేస్తారు  ,  పిల్లలు  హాస్టల్సో  ఉంటారు .. అందరూ  అప్పుడప్పుడు   కలుసుకోవటం .. ఇలా  ఉన్నాయి  కుటుంబాలు...



అదేమిటంటే,    ఈ  రోజుల్లో  అందరూ  కష్టపడితేనే  కదా  !  అని  అంటుంటారు. అనుబంధాలు  లేకపోయాక  డబ్బుతో ఎన్ని వస్తువులు  కూడబెడితే  మాత్రం  ఏమిటి..?


కొంతకాలం  క్రిందట  మా  ఇంట్లో  ఒక  ఫంక్షన్  జరిగింది.    మా  మామగారి  ఆఫీసు  వాళ్ళు  కూడా  భోజనానికి  వచ్చారు.  ఈ  రోజుల్లో  ఆఫీసుల్లో  పనిచేసే  స్త్రీ  పురుషులు , తోటి  ఉద్యోగస్తుల  ఇళ్ళలో  జరిగే  ఫంక్షన్స్ కు  కలిసి వెళ్తుండటం  జరుగుతోంది    కదా  !  నాకు    వాళ్ళు  ఆఫీసు  వాళ్ళని  తెలియదు.



భోజనాలు  చేసి ,  వెళ్ళే  వారికి   గిఫ్ట్  ఇస్తున్నాము.  ఒక  స్త్రీ  పురుషుడు  వచ్చారు.  నేను  ఆమెకు  గిఫ్ట్  పాకెట్  ఇచ్చాను.  నా  భర్త   అతనికి  కూడా   ఇవ్వమన్నారు.  వాళ్ళు  వెళ్ళిన  తరువాత , అదేమిటి  ?  వాళ్ళిద్దరూ  భార్యాభర్తలు  కాదా? అన్నాను. అప్పుడు నా భర్త , వాళ్ళు  భార్యాభర్తలేంటి ?  వాళ్ళు  నాన్నగారి  ఆఫీసులో  వాళ్ళు.... అన్నారు.నేను  నోరు  తెరిచాను.  



 కొద్దిసేపటి  క్రితం  వాళ్ళిద్దరి   అతి  చనువు  ప్రవర్తన   చూసి ,  నేను  వాళ్ళిద్దరూ  భార్యాభర్తలనుకున్నాను. ఇంకా  నయం  ,  నేను    వాళ్ళతో  ఏమీ  అనలేదు. ఈ  రోజుల్లో ఎవరు  ఎవరో  చెప్పలేకపోతున్నాము.


  స్త్రీ  పురుషులు  మాట్లాడుకోవటంలో  తప్పూ  లేదు .. మాట్లాడుకోకుండా  కుదరదు  కూడా.  అయితే  ఏది,  ఎంతవరకు ?   అనేది  ఎవరికి  వారు   విచక్షణతో  ఆలోచించుకోవాలి.  ఇలాంటి  విషయాల్లో  గొడవలు  పడి,  అపార్ధాలతో  కొందరు    భార్యాభర్తలు  విడిపోవటం  కూడా   జరుగుతోంది.



కొన్ని    సిటీల్లో  అమ్మాయిలు,  అబ్బాయిలను  చూస్తే  ఇది  భారతదేశమేనా  ? ఎంత  మారిపోయిందో  ?  అని  నోరుతెరుచుకుని  చూడాల్సిందే. అయితే,  కొందరు   వివాహమైన  తల్లిదండ్రులైన  స్త్రీ  పురుషులే  తమకు   స్వేచ్చ  కావాలంటుంటే  ఇక   చెప్పేదేముంది   ?



 పూర్వం..చేనేత  పని,  కుండలు  చేయటం  వంటివి    ఇళ్ళల్లోనే  జరిగేవి.  వృత్తి  వ్యవహారాల్లో   భార్యాభర్తలు  ఒకరికొకరు  సాయంగా  పనులు  చేసుకునే  వారు.  భార్య   కమ్మగా  వండి  వడ్డిస్తే  కుటుంబసభ్యులు  భోజనం  చేసేవారు.  భర్త  ఇంటికి  కావలసిన  సరుకులు తేవటం వంటి ఇతర బాధ్యతలు  కూడా చూసుకునేవారు.  ఇంట్లో  పెద్దవాళ్ళు  ఉంటే    పిల్లలు  వారితో   కబుర్లు  చెప్పటం.. ఇలా  జరిగేది.   



 ఇప్పుడు  అయితే,  భర్త  సరుకులు  తేకపోయినా,  ఒక  ఫోన్  చేస్తే ,  షాప్  వాళ్ళు  సరుకులు  తెచ్చి  ఇంట్లో  పడేస్తారు.  భార్య  వంట  చేయకపోయినా,  ఒక  ఫోన్  చేస్తే   పిజ్జాహట్  వాళ్ళో  ,  కర్రీ  పాయింట్  వాళ్ళో   తినేవి  తెచ్చి  పడేస్తారు.    ఇలా  పనులు  జరిగిపోతున్నాయి.



 కుటుంబసభ్యుల  మధ్య  ఒకరి  అవసరం  ఒకరికి  లేకుండా  పనులు  జరిగిపోతున్నప్పుడు, ఒకరి  అవసరం  ఒకరికి  ఏముంటుంది  ?  ఒకరి  విలువ  ఒకరికి  ఎలా  తెలుస్తుంది  ? ఇక, అన్యోన్యత,అనుబంధాలు  ఎక్కడుంటాయి ?   కుటుంబసభ్యులు  అన్యోన్యంగా  ఉన్నప్పుడు  అనుబంధాలు  పెరుగుతాయి.



ఇప్పుడు  అందరూ  బిజీ  అయిపోయారు  కదా!  కొందరు  స్త్రీలైతే , చీ !  ఇంట్లో మొగుడికి, పిల్లలకు  వంట  చేస్తూ , సేవలు   చేస్తూ  పడి   ఉండటమేమిటి ? అసహ్యంగా .... అని  కూడా  భావిస్తున్నారు.



 చానల్స్ లో  వచ్చే కొన్ని  ప్రోగ్రామ్స్ లో, సినిమాల్లోని ద్వంద్వార్ధపు పాటలకు కూడా..బిడియపడకుండా  కొందరు ఆడవాళ్ళు చేసే  డాన్సులు  చూస్తుంటే , స్త్రీలు  ఇలా  మారిపోయారేమిటో ? అనిపిస్తుంది.
 

  ఇప్పుడు  స్త్రీపురుషుల  మధ్య  స్వేచ్చ బాగా   పెరిగింది.   ఈ  నేపధ్యంలో    సమాజంలో   వివాహేతర  సంబంధాల  సంఖ్య  పెరుగుతోంది.వాటి  వల్ల  కుటుంబాల్లో  గొడవలు  జరుగుతున్నాయి.  కొన్ని  సంఘటనల్లో  అయితే,   హత్యలు,  ఆత్మహత్యలు  జరగటం, తల్లిదండ్రులు  జైలు  కెళ్ళటం,   పిల్లలు  అనాధలవటం, వంటి  సంఘటనలను  వార్తాపత్రికల్లో  చూస్తున్నాము.



ఒకామె  తన  భర్తను   వదిలి  వస్తే ,   ఇంకొకాయన  భార్యను  వదిలి  వచ్చి,   వాళ్ళిద్దరూ  సహజీవనం  చేస్తుంటారు.   కొంతకాలం  క్రిందట  ఇలా  చేస్తే  ,  సమాజంలో  వారికి  గౌరవం  ఉండదని,  చెడ్ద  పేరు  వస్తుందని  భయపడేవారు.  అందువల్ల  ఇలాంటి  సంఘటనలు  తక్కువగా  జరిగేవి. 



 ఇప్పుడు   అయితే, ఇలాంటివి  తప్పు  కాదు... ఇవన్నీ  సామాన్యమే...అనే  విధంగా  సమాజం  తయారయ్యేటప్పటికి ,  ఇలాంటి  సంఘటనలు  ఎక్కువగా  జరుగుతున్నాయి.  

* కుటుంబంలో  ఇలాంటి  గొడవల  వల్ల  పిల్లలు  మానసికంగా కృంగి  పోతారు.   అప్పుడు   వారికి  వివాహవ్యవస్థ  అంటేనే  విరక్తి  పెరిగే  అవకాశం  ఉంది.  తద్వారా  సమాజానికి  జరిగే  నష్టానికి  తల్లిదండ్రులైన   ఇలాంటి    పెద్దవాళ్ళే  కారణమవుతారు.


.................
link
 
 

12 comments:

  1. ఇప్పుడు విచ్చలవిడితనమే గొప్పండీ, అదే పురోభివృద్ధి! మీరు మారరుగాక మారరు!! మమ్మల్ని మార్చడానికి ప్రయత్నం చేయకండి, మీ బూజు పట్టిన భావాలతో

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      నిజమేనండి , ఈ రోజుల్లో నాగరికత పేరుతో విపరీత చేష్టలు జరుగుతున్నాయి.


      Delete
  2. కుటుంబసభ్యుల మధ్య ఒకరి అవసరం ఒకరికి లేకుండా పనులు జరిగిపోతున్నప్పుడు, ఒకరి అవసరం ఒకరికి ఏముంటుంది ? ఒకరి విలువ ఒకరికి ఎలా తెలుస్తుంది ?
    ---------------------
    చాలా మంచి పాయింట్. అవసరం లేనిది ఏమీ చెయ్యని జీవితంలో ఒకరి అవసరం ఒకరు గుర్తించలేక పోతే ఒకరి ఉనికి ఇంకొకరికి అనవసర మనిపిస్తుంది. అనవసరమైన వాటికోసం ఎవరూ కష్టపడరు. అందుకే విడిపోటాలు,మనస్పర్ధలు.

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      నిజమేనండి...... అవసరం లేనిది ఏమీ చెయ్యని జీవితంలో ఒకరి అవసరం ఒకరు గుర్తించలేక పోతే ఒకరి ఉనికి ఇంకొకరికి అనవసర మనిపిస్తుంది. అనవసరమైన వాటికోసం ఎవరూ కష్టపడరు. అందుకే విడిపోటాలు,మనస్పర్ధలు.

      Delete
  3. నాగరికత పేరుతో మనుషులు విచక్షణ, వివేచనా కోల్పోతున్నారు బలమైన కుటుంబ వ్యవస్థ ఉన్న మన దేశంలో ఈ మార్పును మనలాంటివాళ్ళం జీర్ణించుకోలేక పోతున్నాం

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      నిజమేనండి మీరన్నట్లు, నాగరికత పేరుతో మనుషులు విచక్షణ, వివేచనా కోల్పోతున్నారు బలమైన కుటుంబ వ్యవస్థ ఉన్న మన దేశంలో ఈ మార్పును మనలాంటివాళ్ళం జీర్ణించుకోలేక పోతున్నాం

      Delete
  4. మీరు వ్రాసిన పోస్ట్
    ఈనాడు జరుగుతున్నవాటికి అద్దంలా ఉంది...
    మీ క్రిందటి పోస్ట్ కి వ్యాఖ్య పెట్టలేకపోయాను...
    వస్త్రధారణ విషయంలో తల్లిదండ్రులది బాధ్యత అంటాను నేను...
    సినిమా ప్రపంచం రంగులు చూసి దానిని అనుకరించడమే
    సరి అయినదని భావించే వాళ్ళే ఎక్కువ అయిపోయారు...
    అనూరాధ గారూ!
    చిన్న సూచన:మీ పోస్ట్ కి ఎవరి కామెంట్ అయినా మీ అప్రూవల్ లేకుండా పబ్లిష్ కాకుండా
    సెట్ చేసుకోండి...
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      నిజమేనండి మీరన్నట్లు , వస్త్రధారణ విషయంలో తల్లిదండ్రులది బాధ్యత ఎంతో ఉంది,
      సినిమా ప్రపంచం రంగులు చూసి దానిని అనుకరించడమే
      సరి అయినదని భావించే వాళ్ళే ఎక్కువ అయిపోయారు.
      .............

      కామెంట్స్ అప్రూవల్ గురించి, మీ సూచనకు కృతజ్ఞతలండి.

      కొంతకాలం క్రిందట ఒక అజ్ఞాత ఇష్టం వచ్చినట్లు కామెంట్ వ్రాసినప్పుడు , అజ్ఞాత ఆప్షన్ తీసివేసాను.

      అయితే, మళ్ళీ నాకు ఏమనిపించిందంటే , కొందరు చక్కటి వ్యాఖ్యలు వ్రాస్తూ కూడా, తమ పేరు బయటపడటాన్ని ఇష్టపడరు.

      అలాంటి వాళ్ళను దృష్టిలో ఉంచుకుని అజ్ఞాత అన్న ఆప్షన్ ను కూడా ఉంచేసాను.

      మీ సూచనను తప్పకుండా గుర్తుంచుకుంటానండి.
      ............

      వ్యాఖ్యలు రాయటం విషయంలో , ఫరవాలేదండి.....

      అందరికీ ఎన్నో పనులుంటాయి. అయినా తీరిక చేసుకుని ఈ టపాలను చదవటం నాకు ఎంతో ఆనందంగా ఉంది.

      చదివిన టపాలు ఎంత బాగున్నా, ప్రతిసారి వ్యాఖ్యానించాలంటే కష్టమేనండి.

      నేను కూడా ఇతరులు రాసిన టపాలు చాలా చదువుతాను. నాకు బాగా నచ్చిన టపాలకు కూడా అన్నిసార్లు వ్యాఖ్యానించలేను.

      వ్యాఖ్యలను రాసినా, రాయకపోయినా , టపాలను అందరూ తప్పక చదివితే బాగుండు.... అని మాత్రం నేను అనుకుంటూ ఉంటానండి.

      Delete
  5. బాగా వివరించారు.
    సినిమాలండీ సినిమాలు. సహజీవనాలు మొదలెట్టింది సినీమా జాతే. అడ(ఏరా), పోడ(పోరా), ఎన్నాడి(ఏందే?) అనే సంస్కృతి తమిళ సినిమాలదే. రవితేజ సినిమా భాష విన్నారా? ఈవేళ మరో అలాగా సినిమా చూశాను, ' దేవదాసు్' (కొత్త) అంట! సోఫాలో కూచున్నా ఫుట్‌పాత్‌మీద కూచుని సినిమా చూస్తున్నామా అన్న ఫీలింగు తెప్పించారు, దర్శకులు.

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి .

      మీడియా రంగం ప్రభావం సమాజంపై ఎంతో ఉంటుంది.. యువతపై మరీ ఉంటుంది. ఇలాంటప్పుడు మీడియా ఎంతో బాధ్యతగా ఉండాలి.

      మీడియా రంగంలో ధర్మాధర్మాల గురించి తెలిసిన వారెందరో ఉన్నారు.
      అయినా, కూడా భారతీయసంస్కృతికి దూరంగా ఉండే సినిమాలు, సీరియల్స్, కధలు, అశ్లీల దృశ్యాలు.... ప్రజల్లోకి రావటం బాధాకరమైన విషయం.

      ఇందులో ప్రజల తప్పూ ఉంది. అలాంటి వాటిని చూస్తున్నంత కాలం ఎవరేం చేయగలమండి ?
      తీసేవాళ్ళది తప్పే......... చూస్తున్న వాళ్ళది తప్పే.

      పాతకాలంలో అయితే, పిల్లలు తప్పులు చేస్తుంటే పెద్దవాళ్ళు కోప్పడేవారు.

      అయితే, ఇప్పుడు కొందరు పెద్దవాళ్ళు అలాంటి బాధ్యతలను వదిలేసి , సమాజంలో తప్పులు జరగటానికి తమవంతు ప్రోత్సాహాన్ని అందిస్తుండటం అత్యంత బాధాకరం.

      Delete
  6. మితి మీరిన స్వేచ్చ అనర్ధదాయకం.ఏదయినా పరిమితుల్లో ఉంటేనే మంచిది.బాగుంది మీ వ్యాసం.

    ReplyDelete
  7. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    నిజమేనండి మీరన్నట్లు,మితి మీరిన స్వేచ్చ అనర్ధదాయకం.ఏదయినా పరిమితుల్లో ఉంటేనే మంచిది.

    ReplyDelete