koodali

Friday, October 19, 2012

ఆదిపరాశక్తి కధలు....




వ్యాసమహర్షి , జనమేజయ మహారాజుకి దేవీ అవతారగాధలను తెలియజెప్పటం జరిగింది. కొన్ని కధలను క్లుప్తముగా ..........................

ఒకప్పుడు మహాశక్తి యొక్క సరస్వతీ శక్తి శుంభనిశుంభాది రాక్షసుల్ని సంహరించింది.

ఒకానొక సమయంలో శుంభుడు, నిశుంభుడు అనే పేర్లు గల రాక్షసులు ,వరబలగర్వాలతో దేవతల్ని అమరావతి నుండి తరిమివేశారు.


శుంభ,నిశుంభుల వల్ల ఎన్నో బాధలు పడ్డ దేవతలు ................. ఏదైనా ఉపాయం చెప్పమని దేవగురువు వద్దకు వెళ్ళి అడిగినప్పుడు, ఆయన చెప్పిన సలహా ప్రకారం , మీకేమయినా ఆపదలు వచ్చినప్పుడు నేను మిమ్మల్ని రక్షిస్తాను అని .......... మహిష వధానంతరం దేవి ఇచ్చిన అభయప్రదానమును గుర్తు తెచ్చుకుని , అందరూ కలిసి హిమాలయానికి వెళ్ళి దేవీద్యాన పరాయణులై, మాయాబీజ జపమగ్నులై పరమేశ్వరిని ప్రార్ధించారు.


దేవతల దీనాలాపాల్ని విని .. . . జగన్మాత ' కౌశికి ' అనే పేరుతో ఆవిర్భవించి మహాకాళి అనే నామంతో వారి కష్టాలు తీరుస్తానని పలికింది.


హిమాలయ ప్రాంతములో ఉన్న మహాకాళిని, శుంభనిశుంభుల సేవకులయిన చండముండాసురులు చూశారు. ఆ విషయాన్ని , ఆమె రూపలావణ్యాలను తమ ప్రభువులకు విన్నవించారు. ఆమె సౌందర్యాతిశయాన్ని గురించి విన్న శుంభుడు , సుగ్రీవుడనే రాక్షసుణ్ని దేవి దగ్గరకు రాయబారిగా పంపాడు.


సుగ్రీవుడు జగన్మాతను సమీపించి , శుంభనిశుంభుల గొప్పదనాన్ని ప్రశంసించి వారిలో ఎవరినో ఒకరిని వరించమన్నాడు. 



అతని మాటలు విని ఆ తల్లి చిరునవ్వు నవ్వి , "నీ పలుకులు యధార్ధం. నన్ను జయించిన వాణ్ని గాని, నాతో సరిసమానమయిన పరాక్రమశాలిని గాని నేను వివాహం చేసికొంటాను. ఇది నా నియమం. నీవు పోయి ఈ విషయాన్ని మీ ప్రభువులకు చెప్పు." అన్నది.


ఆ మాటలకు కోపించిన సుగ్రీవుడు, ఆమెతో ఏవేవో ప్రగల్భాలు పలికి, శుంభునకు విషయాన్ని వివరించాడు. శుంభనిశుంభులు రణమునకు బయలుదేరి వచ్చారు. ఉభయపక్షాలు పోరు ఘోరంగా చేస్తున్నాయి. వీరుల పదఘట్టనలతో భూమి దద్దరిల్లుతోంది. దేవతలు ఆసక్తిగా చూస్తున్నారు. సృష్టికి ప్రళయం సంభవిస్తుందేమోనన్న అనుమానం బయల్దేరింది. కొంతమంది విద్యాధరులకు.



జగన్మాత; సదాశివుని, శుంభనిశుంభుల దగ్గరకు రాయబారం పంపింది. రాయబారం విఫలమైంది. యుధ్ధం ప్రారంభమైంది. రాక్షససంహారం ముమ్మరంగా సాగుతోంది. పిశాచాలు రణరంగంలో ఆనందనాట్యం చేస్తున్నాయి. భూత- ప్రేత- పిశాచ- బ్రహ్మరాక్షస- శాకినీ- డాకినీ- హాకినీ గణాలు స్వైరవిహారం చేస్తున్నాయి. తెగిన తలలు, భుజాలు, అవయవాలు, ఎముకలగుట్టలు- ఓహ్! రణరంగం మహా భయంకరంగా ఉంది.



ఇంతలో వచ్చాడు రక్తబీజాసురుడు. వాడి శరీరంలో నుండి నేలమీద రాలే ఒక్కొక్క రక్తపు బొట్టుకి ఒక్కొక్క రక్తబీజుడు ఉధ్భవిస్తాడు. ఆ ఇంద్రాణీ శక్తి తన వజ్రాయుధంతో రక్తబీజుడ్ని కొట్టింది. వాడు గాయపడ్డాడు. రక్తం చిందింది. అనేకులు రక్తబీజులు పుట్టుకొచ్చారు. ఇది వాడు సాధించిన అపూర్వశక్తి. వాణ్ణి జయించటం కష్టం.



ఆ దృశ్యం చూసింది సరస్వతీదేవి. మహాకాళితో ఈ విధంగా అన్నది.


కాళీ! వీడి శరీరంలో రక్తం ఉన్నంతవరకు చావడు. కనుక, వీని శరీరం నుండి నేల మీద పడే రక్తాన్ని నేలమీదపడకుండానే త్రాగెయ్యి. నీకు చండిక సహకారంగా ఉంటుంది." మహాదేవి మళ్ళీ రక్తబీజుడ్ని గాయపరిచింది. రక్తం నేలమీద పడకుండానే మహాకాళి పీల్చివేసింది. రక్తరహితుడయ్యాడు ఆ రాక్షసుడు. వెంటనే వాని శిరస్సు ఖండించి అతని కపాలాన్ని తన కపాలమాలలో చేర్చుకొన్నది కాళిక .



రక్తబీజ సంహారం గాంచిన శుంభనిశుంభులు కాలాగ్నిరుద్రులై వచ్చారు. మళ్ళీ భయంకర యుధ్ధం. సరస్వతీదేవి సింహంలా గర్జించింది. నారిసారించి ధనుష్టంకారం చేసింది. ఆ ధ్వనికి బ్రహ్మదేవుని చెవులు గింగురుమన్నాయి. మృత్యుదేవత నృత్యం చేస్తూ దైత్యగణాల్ని అత్యుత్సాహంతో ఆరగిస్తున్నది.



నిశుంభాసురుడు జగదాంబను గుర్తించాడు. అసురీ మాయతో వేరొక ఆకారాన్ని పొందాడు. ఆ విధంగా కొంతసేపు పోరాడినాడు. జగదంబ భయంకరాకారాన్ని ధరించి నిశుంభుని మీదికురికింది. సింహనాదం చేస్తూ నిశుంభుని శిరసు ఖండించింది. దేవతలు ఆనందించారు. దుష్టరాక్షస గణాలు దుఃఖించాయి.

నిశుంభుడు చనిపోయాడు. శుంభుడు , దుర్గాదేవికి , నన్ను శరణు వేడుకో ! అని సలహా ఇచ్చాడు.


 అపుడు అంబ , నీవు పూర్వజన్మలో చేసికొన్న పుణ్యలేశం వల్ల నన్ను గాంచగలిగావు. నాతో సంభాషించగలిగావు. నేనెవరినో, నా రూపమేమిటో, నా  నామమేమిటో తెలియక వేదాలు ఘోషిస్తున్నాయి." అని అన్నది.


శుంభునికి జగన్మాత దర్శనమైనది. ఆమె తత్వం అవగతమయ్యింది. ఆమె చేతిలో చనిపోయి జన్మ ధన్యం గావించుకోవాలనుకొన్నాడు. ఆయుధాలు ధరించాడు. రధమారోహించాడు. పోరు ప్రారంభించాడు. వీరి పోరాటాన్ని గగనతలాన నిలిచి యక్ష కిన్నర కింపురుష గరుడోరగ సిధ్ధసాధ్య విద్యాధరాధి దేవతాగణాలు , మహర్షులు చూశారు. ఆ యుధ్ధంలో దేవి వాడిని సంహరించింది.

దేవతలు, దిక్పాలకులు, మహర్షులు మహాశక్తిని స్తుతించారు.


రాక్షస సంహారం జరిగింది. అంటే అజ్ఞానం తొలగిపోయింది. విజ్ఞాన కాంతులు దశదిశల వ్యాపించాయి.


 విజ్ఞానం సరస్వతి. కనుకనే మానవ హృదయాలలో గూడుకట్టుకొన్న దురభిమానం, అహంకారం, మమకారం, ఆత్మీయత, స్వార్ధం, ద్రోహం మొదలయిన దుష్ట రాక్షసశక్తులు నశించిపోవాలని, శాశ్వతమైనది, పారలౌకికమైనది, నిరంతరానందసంధాయకమైనది పరమేశ్వరీ కృపాకటాక్షమని గ్రహించడం కోసం సరస్వతీ పూజ చేస్తారని పెద్దలు చెబుతున్నారు.



7 comments:

  1. మంచి పోస్ట్ అనూరాధ గారూ!...
    నవరాత్రుల సమయంలో
    అమ్మ గురించి చర్చించడం కూడా పుణ్యకార్యమే...
    మీకు నవరాత్రుల శుభాకాంక్షలు...
    ఈ అవతారాలపై ఒక పోస్ట్ పెట్టాను చూడండి నా బ్లాగ్ లో...
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      మీకు మరియు మీ కుటుంబసభ్యులందరికి శరన్నవరాత్రుల సందర్భంగా శుభాకాంక్షలండి.

      Delete
  2. మంచి పోస్ట్ అండి. చక్కటి విషయాలను తెలిపారు. అభినందనలండి.

    ReplyDelete
    Replies
    1. భారతి గారు, మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
      పెద్దలు తెలియజేసిన విషయాలను చదివి వ్రాసానండి.

      మీకు మరియు మీ కుటుంబసభ్యులందరికి శరన్నవరాత్రుల సందర్భంగా శుభాకాంక్షలండి.

      Delete
  3. చక్కగా వివరించారు, దసరా శుభాకాంక్షలండి.

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      మీకు మరియు మీ కుటుంబసభ్యులందరికి శరన్నవరాత్రుల సందర్భంగా శుభాకాంక్షలండి.

      Delete
    2. అందరికి శరన్నవరాత్రుల సందర్భంగా శుభాకాంక్షలండి.

      Delete