koodali

Friday, April 13, 2012

మనకు తెలిసింది చాలా తక్కువ అని......

 

ఇంతకు ముందు టపాలో పళ్ళతో లారీ, లేక బస్సులను లాగటం గురించి చెప్పుకున్నాము కదా ! తమ జుట్టుతో బరువైన వాహనాలను లాగిన వ్యక్తులు కూడా కొందరు ఉన్నారు.


సాధారణంగా ఎవరైనా ఇలా లాగితే వాళ్ళ పళ్ళు లేక జుట్టు కుదుళ్ళతో సహా ఊడి వచ్చేస్తాయి. లారీని లాగేంత బలంగా అవి ఉండవు కదా మరి. అలా లాగే వ్యక్తులు ఎలా లాగుతున్నారో అర్ధం కావటం లేదు. .


ఇదంతా చూస్తే శారీరిక శక్తిని మించి మానసిక శక్తి బలమైనదేమో అనిపిస్తుంది.


ఇంకా కొందరు ప్రాణాయామ , యోగా చేసేవారు నీటిపై తేలుతూ నిశ్చలంగా పడుకుని చాలాసేపు ఉండగలరు. యోగా ద్వారా శరీరాన్ని తేలిగ్గా చేసి అలా ఉండగలరట వాళ్ళు.


కొందరి శరీరాలకు చెంచాలు, గిన్నెలు వంటివి అతుక్కుపోయే అయస్కాంత శక్తి ఉంటోంది. మరి అందరికి ఆ శక్తి ఉండదు. కారణం ఏమిటో ?


౧..మనకు తెలిసినంత వరకూ శరీరానికి అయస్కాంత శక్తి ఉండదు కదా !

౨..మనకు తెలిసినంత వరకూ మనుషుల జుట్టుకు, పళ్ళకు లారీల వంటి వాటిని లాగేంత శక్తి ఉండదు కదా !

౩..మనకు తెలిసినంత వరకూ మనిషి శరీరానికి నీళ్ళలో నిశ్చలంగా తేలే శక్తి ఉండదు కదా !


మనిషి నీళ్ళలో నిశ్చలంగా తేలాలంటే శరీరానికి లైఫ్ జాకెట్స్ వంటివి అమర్చుకోవాలి.

లారీని కొంతదూరం లాగాలంటే యంత్రం సహాయం అవసరం.

మరి పరికరం సహాయం లేకుండా కొందరు వ్యక్తులు ఇలాంటి విన్యాసాలు ఎలా చెయ్యగలుగుతున్నారు. వాళ్ళ శరీరాలకు శక్తి ఎలా వస్తోంది ?


ఇలాంటి చిత్రమైన విషయాలెన్నో ప్రపంచంలో జరుగుతున్నాయి.. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుందంటే, మనకు తెలిసింది చాలా తక్కువ అని. మనకు తెలిసిన విజ్ఞానానికి మించి ఇంకెన్నో విషయాలు ఉంటాయని అనిపిస్తోంది..


కొందరు నిరంతర సాధన వల్ల తాము అలా చేయగలుగుతున్నాం. అంటారు. అంటే సాధన వల్ల శరీరధర్మాలను, సైన్స్ కనుగొన్న విషయాలను మార్చవచ్చని తెలుస్తోంది.

సామాన్యులే సాధన వల్ల ఇలా చేయగలిగినప్పుడు, తపశ్శక్తి గల మహర్షులకు సాధ్యం కానిదేముంటుంది . పూర్వపు మహర్షులు సంవత్సరాల తరబడి నిరంతర తపస్సాధన చేసి దైవానుగ్రహాన్ని పొంది , అసంభవాలను సంభవాలుగా మార్చే శక్తిని సాధించారు కాబోలు అనిపిస్తుంది..

.....................

కొన్నిసార్లు మనం గతంలో విన్న, చదివిన, చూసిన విషయాలు మనం మర్చిపోయినా కూడా, అవి కలల్లో వచ్చే అవకాశముంది. కొన్నిసార్లు.. తెలియని విషయాల గురించి కలలు వచ్చి, అవి భవిష్యత్తులో ఎంతో కొంత జరిగే అవకాశమూ ఉంది.

............

నిన్న ఒక చానల్లో కొందరు వ్యక్తులను చూపించారు. ఒక విదేశీ అమ్మాయి 9 సంవత్సరముల వయస్సులో సడన్ గా బొమ్మలు వెయ్యటం ప్రారంభించిందట. ఆమె బొమ్మలను వేసే విద్యను ఎక్కడా నేర్చుకోలేదట. వాళ్ళింట్లో కూడా ఎవరూ వెయ్యరట,.


ఆ బొమ్మలు అద్భుతంగా సజీవకళ ఉట్టిపడుతున్నట్లున్నాయి. ఆమెను బొమ్మలు వెయ్యటం ఎలా నేర్చుకున్నావని అడిగితే తనకు చిన్నప్పుడు దేవుడు కనిపించాడని అప్పటినుంచి అలా వేయగలుగుతున్నానని , దేవుడే తన గురువు అని చెబుతోంది....

ప్రపంచంలో ఎన్నో వింతలు ఉన్నాయి.



2 comments:

  1. అసలు ఈ ప్రపంచమే ఒక పేద్ద వింత.
    ఇందులో జీవించటమే ఒక గొప్ప అనుభూతి.
    చక్కగా ఆనందించండి యీ అపురూపమైన అవకాశాన్ని.

    ReplyDelete
    Replies
    1. వ్యాఖ్యానించినందుకు కృతజ్ఞతలండి.

      నిజమేనండి. దైవం ఆవిష్కరించిన ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు, విశేషాలూ, అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు ఉన్నాయి.

      మీరన్నట్లు ఇందులో జీవించటమే ఒక గొప్ప అనుభూతి.
      అందుకే ఈ అపురూపమైన జీవితాన్ని అందరూ ఆనందంగా గడపాలి.

      Delete