koodali

Monday, April 9, 2012

లోక కళ్యాణం కోసమే.....


పురాణేతిహాసాలు లోని ఎన్నో అంతరార్ధాలు శ్రీ పాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతము గ్రంధములో చెప్పబడ్డాయి.... . ఈ గ్రంధములో ఇంకా ఎన్నో చిత్రమైన విషయాలు చెప్పబడ్డాయి.
...................................


పురాణేతిహాసాలు ఎంతో గొప్పవి. ఆ కధల ద్వారా లోకానికి ఎన్నో విషయాలను నేర్పించటం అన్నది పెద్దల అభిప్రాయం.


నేను ఈ మధ్యన ఒక నవలలోని కొన్ని పేజీలను చదవటం జరిగింది. ఆ పేజీలలో కుంతీదేవి గురించి, ద్రౌపదిదేవి గురించి దారుణంగా వర్ణించారు. నాకు చాలా బాధ కలిగింది. అలా వ్రాయటం ఎంతో దురదృష్టకరం.

పురాణేతిహాసాలలోని కధలలోని పాత్రధారులు వరాలను, శాపాలను పొందటం, వాటిని అనుసరించి జన్మలనెత్తతం ద్వారా ..... మనకు ఎన్నో విషయాలు తెలుస్తాయి.

సామాన్యంగా లోకంలో ఎవరైనా తాము పొరపాట్లు చేసినప్పుడు ఆ విషయాలను అందరికీ చెప్పాలని అనుకోరు. ఆ పొరపాట్లను దాచేసి తాము చేసిన గొప్ప పనులనే లోకానికి తెలియజేస్తారు.

కానీ పురాణేతిహాసాలలోని గొప్పవారు చేసిన పొరపాట్లు దాచకుండా కధల ద్వారా లోకానికి చెప్పబడ్డాయి. ఆ కధలను తెలుసుకుంటే పుణ్యం వస్తుందని , వాటిని తప్పనిసరిగా తెలుసుకోవాలని కూడా పెద్దలు చెప్పటం జరిగింది.


దీన్ని బట్టి చూస్తే మనం తెలుసుకోవలసింది ఏమిటంటే ....దేవతలు చేసే పొరపాట్లు, పొందే శాపాలూ లోకకళ్యాణం కోసమేనని. . వారి కధల ద్వారా ప్రజలకు ధర్మాధర్మాల గురించి తెలియచెప్పటానికి వారలా జీవితమనే కధలలో పాత్రధారులయ్యారు అనిపిస్తుంది.


ధర్మరాజు జూదం ఆడటం వల్ల రాజ్యాన్ని కోల్పోవటం, ఇంద్రుడు పొరపాటు చేయటం వల్ల స్వర్గాధిపత్యాన్ని వదిలి కష్టాల పాలవటం గురించి గ్రంధాలలో ఉంది కదా ! ఇవన్నీ చూస్తే ...


ఎంత గొప్పవారైనా సరే పొరపాటు చేసినప్పుడు వాటికి తగ్గ ఫలితాన్ని అనుభవిస్తారు అని తెలుస్తుంది. 



పురాణేతిహాసాల ద్వారా ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు.

కుంతీదేవి చరిత్ర ద్వారా వివాహానికి ముందు బిడ్డను కంటే జీవితమంతా ఎన్ని సమస్యలు అనుభవించాలో తెలుసుకోవచ్చు. ఆమె తన భర్త కోరిక మీదటే పాండవులను సంతానంగా పొందటం జరిగింది.

శకుంతల పాత్ర ద్వారా పెద్దవాళ్ళకు తెలియకుండా వివాహం చేసుకోవటం వల్ల ఎన్ని సమస్యలు వస్తాయో తెలుస్తుంది.

ఇలాంటి జాగ్రత్తలను తల్లిదండ్రులు పిల్లలకు చెప్పటానికి ఇబ్బంది పడతారు. పురాణేతిహాసాల ద్వారా పిల్లలు కూడా .... జీవితంలోని ఎన్నో కోణాలను , భిన్న మనస్తత్వాలనూ తెలుసుకోవటానికి వీలవుతుంది.

ద్రౌపది విషయానికి వస్తే ఆమె తనకు తాను కావాలని అయిదుగురిని వివాహం చేసుకోలేదు కదా ! అలా జరిగిందంతే.

ఎక్కువ వివాహాలు చేసుకుంటే ఎన్నోసమస్యలు ఎదురవుతాయి.

ద్రౌపది పంచపాండవుల దగ్గర ఒక్కొక్కరి దగ్గర..... కొంత కొంతకాలం చొప్పున ఉండటం జరిగిందట. ఆమె ఒక భర్త వద్ద ఉన్నప్పుడు మిగతా భర్తల ఇంటి బాధ్యతలు ఎవరు నిర్వహిస్తారు ? ఇవన్నీ చాలా చిత్రమైన సున్నితమైన విషయాలు. ఇలాంటి ఒక సందర్భంలో అర్జునుడు తీర్ధయాత్రలకు వెళ్ళవలసి వచ్చింది కూడా.

ఎక్కువ వివాహాలు చేసుకుంటే ఉండే సున్నితమైన కష్టాలు
, ఎన్నో ఇబ్బందులను ద్రౌపది పాత్ర ద్వారా తెలుసుకోవచ్చు .

రామాయణంలో కూడా కైకేయి వరాలు అడగటం వల్ల సీతారామ లక్ష్మణులు వనవాసం చేయవలసి వచ్చింది. సుమిత్రాదేవి దేవి వంటి వారు అరుదుగా ఉంటారు. కైకేయి వంటి వారే లోకంలో అధికంగా ఉంటారు. అలాంటి వరాలు అడకకుండా ఉంటే కధ మరోలా ఉండేదేమో ?

ఏమైనా ఎక్కువ వివాహాలు చేసుకోవటం వల్ల అలా చేసుకున్న వారి సంతానం కష్టాలు అనుభవించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది.


సీతారాములు కష్టాలను అనుభవించినా వారి సంతానం చక్కగా ఉన్నారు..

భారతంలో శంతనుడు తన పెద్ద కుమారుడైన భీష్మునికి వివాహం చేసి రాజ్యాన్ని అప్పగించినట్లయితే కధ వేరేగా ఉండేదేమో ? అనిపిస్తుంది.

ఆదిమ కాలమైనా, ఆధునిక కాలమైనా మనుషుల్లో కొన్ని లక్షణాలు మారవు. ఉదాహరణకు ....తన భార్య ఇంకో వివాహం చేసుకుంటే ఏ భర్తా సహించలేడు. అలాగే తన భర్త ఇంకో వివాహం చేసుకుంటే ఏ భార్యా సహించలేదు.

ఇలా ఎక్కువ వివాహాలు చేసుకున్నప్పుడు పెద్దల మధ్య అసూయల వల్ల వారి పిల్లలకు కష్టకాలం దాపురిస్తుంది. ఈ రోజుల్లో కూడా ఇలాంటి కేసులు వింటూనే ఉన్నాము.

పిల్లల సంతోషం గురించి ఆలోచించి అయినా పెద్దవాళ్ళు తాము ఎక్కువ వివాహాలు చేసుకోకూడదు.. కష్టమో సుఖమో ఒక్క వివాహం చాలు. ( ఒక్క వివాహం వల్ల బాధ్యతలు పెరగకుండా ఉంటాయి.
( కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప ,)


భూమి మీది పాపాత్ములు పెరిగిపోయినప్పుడు దైవం ఒక ప్రణాళిక ప్రకారం దేవతలను మానవులుగా జన్మింప జేసి కధలు నడిపించి రామాయణ, భారత వంటి మహాసంగ్రామాల ద్వారా రాక్షసులను, పాపాత్ములను సంహరించటం జరుగుతుందట. . పనిలో పనిగా రామాయణ, భారత ఇతివృత్తాలలోని పాత్రల ద్వారా లోకానికి ఎన్నో విషయాలనూ నేర్పించటమూ జరుగుతుంది అనిపిస్తుంది.

దైవం తలచుకుంటే రావణాసురుని వంటి రాక్షసులను చంపటం పెద్ద పనేమీ కాదు. అందుకోసం సీతారాముల వనవాసం, సీతాపహరణం, ఇవన్నీ జరగనవసరం లేదు.

అయితే కధలను ఇలా నడిపించటం వల్ల ( రామాయణ, భారత ) కధలలో వచ్చే ఎన్నో పాత్రలు , ఎన్నో సంఘటనలు ..వాటినుంచి లోకానికి ఎన్నో విషయాలు తెలియజెప్పటం జరుగుతుంది అనిపిస్తుంది.

ఈ రోజుల్లో సమాజంలో జరుగుతున్న ఎన్నో సంఘటనలు పురాణేతిహాసాల్లో కనిపిస్తాయి.



No comments:

Post a Comment