koodali

Friday, March 4, 2011

బుడుగు, సీగానపెసూనాంబ లాంటి చిన్నారులను .............. ఈ రోజుల్లో స్వేచ్చగా నవ్వనిస్తున్నామా ?


రమణ గారి " బుడుగు.సీగానపెసూనాంబలు " వారి ముద్దుముద్దు మాటలతో ఎంతగానో ఆకట్టుకున్నారు.

ఇప్పటిలా టీవీలు అంతగా లేని రోజుల్లో .... మా చిన్నప్పుడు జనం పత్రికలలో కధలు బాగా చదివేవారు.

మొక్కపాటి నరసింహ శాస్త్రి గారి " బారిష్టర్ పార్వతీశం ", ఇలా ఎందరో మహానుభావులు వ్రాసినవి చదివేవాళ్ళం.

నాకు ఏమనిపిస్తుందంటేనండీ........ పాతకాలం పిల్లలు అమాయకంగా ఉండేవారు. తమ ముద్దుముద్దు మాటలతో బుడుగు, సీగానపెసూనాంబలా అన్నమాట..........

ఇప్పటి పిల్లలకు ఆటలు ఆడుకోవటం బాగా తగ్గిపోయింది. ఎప్పుడూ చదువు , చదువు ...అంతే పాపం. .

వారిని కేవలం భవిష్యత్తులో డబ్బు సంపాదించే యంత్రాల్లాగా తయారుచేస్తున్నారు చాలామంది తల్లిదండ్రులు.. మనము ఎలాగూ సంపాదించే యంత్రాల్లాగా అయిపోయాము.

ఇంకా మాటలు కూడా రాని చిన్నచిన్న పసిబిడ్డలను అమ్మానాన్నలు స్కూల్లో వేసేసి అదేదో గొప్పగా భావిస్తారు.

స్కూల్లో చేరటానికి కూడా పిల్లలకు పరీక్షలు.

ఇక వారికి ఆటల పోటీలు, పాటల పోటీలూ ఉంటాయి అవికూడా పోటీపరీక్షల్లాగ తయారయ్యాయి తప్ప సహజంగా లేవు. పాపం పసివాళ్ళు.

కొన్ని సంవత్సరాల క్రితం నేను శ్రీ రమణ గారి " మిధునం " కధ చదివాను .

కధలోని భార్యాభర్తల సంభాషణలు .... మన కళ్ళ ముందు జరుగుతున్నట్లు అత్యంత సహజంగా కధను నడిపించారు. ఈ కధలో భార్యాభర్తల అన్యోన్యత చూసి ఈ కాలం వాళ్ళు ఎంతో నేర్చుకోవచ్చు.

ఆ మధ్యన వచ్చిన బాపు-రమణ గార్ల " పెళ్ళిపుస్తకం " సినిమాలో కూడా భార్యాభర్తల మధ్యన వచ్చే గొడవల గురించి సున్నితంగా చూపించారు,.


ఇప్పుడు వచ్చే కొన్ని సినిమాలు, సీరియల్స్ ప్రవాహపు వెల్లువలో .... ఎన్నో విలువలు, వలువలు కూడా కొట్టుకుపోతున్నాయి.

ఈ మధ్య ఒకసారి నేను టివీ చూస్తోంటే .....అందులో ఒక భార్య ఎలా అరుస్తోందంటే ..... చేతితో చిటికెలు వేస్తూ భర్తతో .... ఏంట్రా ? నువ్వెంత ? నీ బతుకెంత ? అని సవాల్ చేస్తోంది.

ఆ భర్త పాత్రధారి బిక్కచచ్చి నిల్చుని ఉన్నాడు. ఆమెగారి వాగ్ధాటికి అదిరిపోయి టీవి ఎక్కడ బద్దలై పోతుందోనని వెంటనే కట్టేశాను.

అయితే మనలో మాట .......... కొందరు భర్తలు కూడా తక్కువ వాళ్ళేమీ కాదులెండి.

తాము భార్యకు చేయవలసిన అన్యాయం గుట్టుచప్పుడు కాకుండా చేసేసి ఏమీ ఎరగనట్లు , తప్పంతా ఆమెదే అన్నట్లు , నలుగురిలో మంచిగా ప్రవర్తిస్తారు.

అప్పుడు ఆ భార్య గయ్యాళితనం నలుగురికి వినిపిస్తుంది గానీ .... అతగాడి కూబీతనం అందరికీ కనిపించదు కదా !

ఇలా ఉన్నాయి ఈ నాటి కాపురాలు. ఇలాంటి విషయాల్లో భార్యాభర్తలిద్దరి తప్పూ ఉండే అవకాశమే ఎక్కువగా ఉంటుంది.

ఇక ముందుముందు కుటుంబాలు ఎలా ఉంటాయో !

బుడుగు ,సీగానపెసూనాంబల వంటి కల్లాకపటం తెలియని పిల్లలు సంతోషంగా ఉండాలంటే....... పెద్దవాళ్ళు తమ ప్రవర్తనను సరిచేసుకోవాలి.

అప్పుడే కదా తాము తమ పిల్లలతో..... నైతిక విలువల గురించీ, భవిష్యత్తులో తమ పిల్లల కుటుంబం బాగోగుల గురించీ పిల్లలతో మాట్లాడగలరు......
వారికి మంచి మార్గ దర్శకులు కాగలరు.

 

 

2 comments:

  1. ఇప్పటి పిల్లల బాల్యం ఒత్తిడిలో నలిగిపోతోంది
    ఎల్.కే.జీ లో చేరడానికి కూడా ఎంట్రెన్సు టెస్టులు. ఆ వయసులోనే పక్క వాళ్ళతో పోలికలు, ర్యాంకుల గోల
    అసలు ఆడుకోడానికి టైం ఎక్కడండీ?
    ప్లే గ్రౌండ్, గేమ్స్ పిరియడ్ ఉన్న స్కూళ్ళు ఎన్ని ఉన్నాయి?

    మరి బాల్యం లో సహజత్వం పోతోందంటే పోదూ

    ReplyDelete
  2. కృతజ్ఞతలండి.
    నిజమే ఈ కాలం పిల్లలకు ఆడుకోవటానికి సమయం లేకుండా అన్నప్రాసన నాడే ఆవకాయ లాగ ............ ఆ చిన్నవయస్సులోనే విశ్వవిజ్ఞానాన్ని అంతా వారికి నేర్పించేయాలని పెద్దల తాపత్రయం.

    ReplyDelete