koodali

Wednesday, January 15, 2014

ప్రత్యక్ష పరమాత్మ సూర్య భగవానుడు.

 
  సంక్రాంతి  పర్వదినములలో  సూర్యారాధనకు  ఎంతో  ప్రాధాన్యత  ఉన్నది.

 సూర్యుడు  ఆరోగ్యప్రదాత.  సూర్యరశ్మి  వల్ల  చక్కటి  ఆరోగ్యం  చేకూరుతుంది. 

సూర్యనమస్కారములు  చేయటం   ఎంతో  మంచిదని  పెద్దలు  చెబుతారు.   


  ఈ  రోజుల్లో  మనుషులు  సూర్యరశ్మికి  దూరంగా  ఏసీ  గదుల్లో  గడుపుతున్నారు. 

 అందువల్ల  ఇప్పటి  వాళ్ళకు   చిన్నతనంలోనే  బీపీ,  సుగర్..వంటి  జబ్బులు  వస్తున్నాయంటున్నారు.  


ఉదయం,  సాయంత్రం  కొంతసేపు   తగుమాత్రం  సూర్యరశ్మి  శరీరానికి  తగిలేలా  చూసుకుంటే  ఆరోగ్యానికి  మంచిది.
 
 ప్రత్యక్షపరమాత్మ  అయిన  సూర్యునికి  అనేక  ప్రణామములు.





Monday, January 13, 2014

దైవం నిత్యం.. దైవానికి ఆది, అంతము లేవు ..ఉదాహరణ.. మరియు..


సృష్టి  ఎలా  ప్రారంభమయ్యింది  ?  అనే  ప్రశ్నకు ,  దైవం  వల్ల   ప్రారంభమయ్యింది.  . అని  ఆస్తికులు   ఖచ్చితమైన   సమాధానం  చెప్పగలరు.


    సృష్టి  ఎలా  ప్రారంభమయ్యింది  ?  అనే  ప్రశ్నకు ,  నాస్తికులు  సరైన , హేతుబద్ధమైన  జవాబు  చెప్పలేరు. 


కొంతకాలం  క్రిందట   టీవీ చానల్ లో  ఆండాళ్  అమ్మవారి  చరిత్ర  ( శ్రీ గోదాదేవి  శ్రీ రంగనాధుల కల్యాణం ) 
సినిమాగా  ప్రసారమయ్యింది. అందులోని కొన్ని  విషయాలు..

 ఆ  కధలో,   ఒక  రాజుగారు  నాస్తికులు.   రాజు  ,  ఆస్తికులను   దైవం  గురించి   కొన్ని    ప్రశ్నలు  అడుగుతారు.   


సృష్టికర్త  అయిన  దైవానికంటే  ముందు  ఏమున్నది ?  అనే  అర్ధం  వచ్చేటట్లు ...  ప్రశ్న  అడుగుతారు.

 అప్పుడు ,  ఆండాళ్  మాతకు  తండ్రి  అయిన  విష్ణుచిత్తుల  వారు   రాజుతో ...  ఒకటి  అనే  అంకెకు  ముందు  ఉన్న  అంకె  పేరు  చెప్పమంటారు.

   రాజు  చెప్పలేకపోతారు.  (  ఒకటి  అనే  అంకెకు  ముందు  ఏ  అంకె  లేదు  కదా  !  )

 
విష్ణుచిత్తుల  వారు  చెప్పిన విషయములో ఎన్నో విషయములు ఉండి ఉంటాయి. అవన్నీ నాలాంటి సామాన్యులకు అర్ధం కాకపోయినా ....నాకు  తోచినంతలో  కొన్ని  అభిప్రాయాలు... 

         
ఒకటి  అనే  అంకెకు  ముందు  ఏ   అంకె   లేదు.  అలాగే,  

 దైవాన్ని  ఎవరూ    సృష్టించనవసరం  లేదు.   దైవం  నిత్యం.  దైవానికి  ఆది అంతమూ  లేదు. అని  చెప్పటం   విష్ణుచిత్తుల వారి  అభిప్రాయం  కావచ్చు .   అనిపిస్తోంది . 

 ...............................

 సంఖ్యలలో  ఆఖరి  సంఖ్య  ఏది  ?   అనే  ప్రశ్నకు  కూడా  మనకు   జవాబు  తెలియదు. 


ఎందుకంటే,  సంఖ్యలను  అలా  లెక్కవేసుకుంటూ   వెళ్తే    ఒకదాని  తరువాత  ఒకటి  అంతం  లేకుండా  అలా  వస్తూనే  ఉంటాయి  కదా  !


.............................


   ఆది,  అంతమూ  లేక   అంతటా  వ్యాపించి  ఉన్న  శక్తినే  దైవమని  ఆరాధిస్తారు.  ఆస్తికులు.


అసలు  ప్రతిదానికి    ఆది ,  అంతమూ  ఉంటుందని   ,  ఉండాలని  మనం  ఎందుకు  అభిప్రాయపడాలి  ?

సృష్టిలో  మనకు  తెలిసిన  విజ్ఞానం  సముద్రంలో  నీటిబొట్టంత  అయితే,  మనకు   తెలియని  విజ్ఞానం   సముద్రమంత,  ఇంకా  ఎక్కువ  కూడా. 


  వ్రాసిన  విషయాలలో  ఏమైనా  పొరపాట్లు  ఉంటే  దయచేసి  క్షమించమని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.

...............................

 
రామకృష్ణపరమహంస  శారదాదేవిల   శిష్యులైన   వివేకానందుని  జయంతి ,

సంక్రాంతి  పండుగ  రోజుల లో  సూర్యారాధన  ,

 గోదారంగనాధుల   కల్యాణం  ( భోగి పండుగ),


 సంక్రాంతి, 
 అయ్యప్ప  స్వామి  మకరజ్యోతి  దర్శనం.... 

అన్నింటి   సందర్భంగా   అందరికి  శుభాకాంక్షలు.



Friday, January 10, 2014

.పూజలు చేయటంతో పాటు పర్యావరణం విషయంలో జాగ్రత్తలు....

  
   ఈ  మధ్య  కాలంలో  శ్రీశైలంలో   శివలింగమూర్తికి  వచ్చిన  తేడా  గురించి  వార్తలు  వస్తున్నాయి.  లోకంలో    పాపం  పెరిగితే  ఇలాంటివి  జరుగుతాయేమో ?
................................. 


  ఇంతకుముందు  కూడా  పంచారామక్షేత్రాలలో  ఒక  శివలింగము   యొక్క  మూర్తిలో  తేడాలు  కనిపించాయని ,  అప్పుడు   కొంతకాలం  అభిషేకాల  విషయంలో  జాగ్రత్తలు  తీసుకున్నారని  విన్నట్లు  గుర్తు.

కొంతమంది  ఏమంటున్నారంటే ,  అభిషేకాలకు  వాడే  పాలు,  నీళ్ళు  వంటివి   శుద్ధమైనవి  కానప్పుడు    ఇలా  జరిగే  అవకాశం  ఉంది  అంటున్నారు.

 శివలింగమూర్తి  విషయంలో  అభిషేకాల  విషయంలో   బయట  నుంచి  తెచ్చిన  పాలను  కాకుండా  దేవస్థానం  వద్ద    పెంచిన  ఆవుల  పాలనే  వినియోగిస్తే  బాగుంటుందని   టీవీ  చర్చలలో  ఒకరు    చక్కటి  సూచనను  చేసారు.

........................................ 


  ఒకప్పుడు     దేశవాళీ  ఆవుపాలను  వాడేవారు.    ఇప్పుడు   అంతా  కల్తీ  ఎక్కువయ్యింది.  నీళ్ళు  కల్తీ,  పాలు  కల్తీ,  గాలిలో  పొల్యూషన్.. 


  రసాయనాలతో  కలుషితమైన  జలాలతో  పెరిగిన  గడ్డిని  తిన్న  పశువుల  పాలను  త్రాగినా  ప్రమాదమేనని    పరిశోధకులు  హెచ్చరిస్తున్నారు.

పెరిగిన  కాలుష్యం  వల్ల   మనుషులలో  కూడా  కాన్సర్  వంటి  జబ్బులు  ఎక్కువగా  వస్తున్నాయి.  కొంతకాలం  క్రిందట  కాన్సర్  వంటి  జబ్బులు  తక్కువగా  ఉండేవి.

......................... 


పూర్వం  తలస్నానం   చేయాలంటే  కుంకుడురసం,  శీకాయ  వంటి  సహజసిద్ధమైనవి  వాడేవాళ్ళం.  ఇప్పుడు  షాంపూలు  వాడుతున్నాము. అందువల్ల  ఇప్పుడు  కొందరు   పిల్లలలో  చిన్న  వయసులోనే    వెంట్రుకలు  నెరవటం  వంటి  సమస్యలు  వస్తున్నాయి.

పాత్రలు,  ఇల్లు  శుభ్రం   చేసుకోవాలంటే  పూర్వం  ఆసిడ్లు  వాడేవారు  కాదు.  ఇప్పుడు  ఇళ్ళు  శుభ్రం  చేయాలన్నా,  బాత్రూంస్  శుభ్రం  చేయాలన్నా    రసాయనాలను ( యాసిడ్స్ )  వాడుతున్నారు.

 శుభ్రం  చేయటానికి  వాడే  ఈ  యాసిడ్స్  మురికి  నీటితో  పాటు  బయటకు  పోయి  భూమిలో   ఇంకుతాయి.   వర్షం  నీటితో  పాటు  చెరువుల్లో,   నదుల్లో  కలిసిపోతాయి.  ఆ  నీటినే   త్రాగటానికి , పంటలు  పండించటానికి   వాడుతారు.

 ఇలా  రసాయనాలతో  కలుషితమైన  భూమిలో,  నీటితో   పెరిగిన  ఆహారపదార్ధాలలో  కూడా    రసాయనాల  అవశేషాలు  ఉంటున్నాయంటున్నారు.  


 నిస్సారమైన   ఇలాంటి  ఆహారాన్ని  తీసుకోవటం   వల్ల  కాబోలు   ఇప్పటి  మనుషులు   ఎంత  తిన్నా  కూడా   నీరసంగానే  ఉంటున్నారు.

  పర్యావరణం  బాగుంటే  శుద్ధమైన  నీళ్ళు,  పాలు    లభిస్తాయి.

............................ 


ఇవన్నీ  గమనించితే  ఏమనిపిస్తుందంటే,   శివలింగము మూర్తి  విషయం    మానవులకు  హెచ్చరికగా  భావించి,  పర్యావరణాన్ని  కాపాడుకోవాలి.    


రేపు  వైకుంఠ  ఏకాదశి ..........  .పూజలు  చేయటంతో   పాటు    పర్యావరణం  విషయంలో  జాగ్రత్తలు   తీసుకుంటే   దైవకృప    లభిస్తుంది . దేవాలయాల  వద్ద  ప్లాస్టిక్   కవర్లను  ఎక్కడపడితే  అక్కడ  పడేయవద్దు.




Wednesday, January 8, 2014

స్థానికతను ఎలా నిర్ణయిస్తారో దయచేసి తెలియజేయండి .



వెనకటికి  ఒక  ఈగ  ఇల్లిల్లు  తిరుగుతూ  తన  పేరు  మర్చిపోయి  అందరిని  అడిగిందట.   బదిలీల  వల్ల  ఊర్లు  తిరిగే  మాకు   మా  సొంత  ఊరు  ఏదో     దయచేసి  చెబుతారా  ?
 ...............................

* మాకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల లోనూ బంధువులున్నారు. మాది బదిలీలతో కూడిన ఉద్యోగము. ఈ బదిలీల వల్ల మంచీ ఉంది. చెడూ ఉందనిపిస్తుంది.


ఒకసారి బదిలీ వల్ల ఒక ప్రాంతానికి వెళ్ళాము. యధాప్రకారం చుట్టుప్రక్కల వారితో పరిచయాలు అయ్యాయి.


కొంతకాలం తర్వాత , ఒకరోజు మా పొరుగామె ఒకామె మా ఇంటికి వచ్చారు.


ఆమెతో నాకు మంచి స్నేహమే ఉంది. నాకన్నా వయసులో పెద్ద. అలా మాటల్లో ఇళ్ళ అద్దెలు, స్థలాల రేట్ల ప్రసక్తి వచ్చింది.


నేను, ఇక్కడ వాటి రేట్లు ఎలా ఉంటాయండి ? అని అడిగాను.


అంతే, అప్పటివరకు చక్కగా కబుర్లు చెబుతున్న ఆమె ఒక్కసారిగా .


* ఏం ? కొంటారా ? బదిలీపై వచ్చారు. అద్దెకుండి మీ పని అయ్యాక వెళ్ళిపొండి. అంతే. ఇక్కడ రేట్లతో మీకేం పని ?  అనేసింది.


నేను ఒక్క క్షణం బిత్తర పోయి, అబ్బే నేను కొనాలని అడగలేదండి. అన్నాను.


* నిజంగానే , నేను కొనే ఉద్దేశంతో అడగలేదు. నాకు అలా విషయసేకరణ చేయటం అలవాటు.విషయ పరిజ్ఞానం పెంచుకుందామని పనీపాటా లేక అలా అడిగానంతే.


కానీ, ఆమె ముఖం మీదే అలా అనేస్తుందని అనుకోలేదు.


 ఇంకొకామె   ఇతరప్రాంతం   వాళ్ళు   తమ  ప్రాంతానికి  వచ్చి స్థిరపడుతున్నారని   వారిని  తిట్టారు. 



ఇతర ప్రాంతాల నుంచీ వలసలు మితిమీరి పెరిగితే స్థానికులు ఆందోళన పడటం , వలసలవల్ల తమకు ఉపాధి అవకాశాలు తగ్గుతాయని భయపడటం జరుగుతుంది.



* ఈ భయం ప్రపంచవ్యాప్తంగా ఉంది. అందుకే  ఎక్కడివాళ్ళు అక్కడే జీవించటం వల్ల ఇలాంటి గొడవలు తగ్గే అవకాశం ఉంది  అనిపిస్తుంది. 



సరే, అప్పుడు వాళ్ళు నాతో అలా అన్నందుకు నాకు బాధతో పాటు ఆశ్చర్యము,    ఎన్నో   ఆలోచనలు కూడా కలిగాయి.


* ఎందుకంటే , నన్ను అలా అడిగిన   వాళ్ళ యొక్క   పిల్లలు,  బంధువులు ..   ఇతర ప్రాంతాలలోనూ, రాష్ట్రాల్లోనూ,   ఇతరదేశాల్లోనూ  ఉద్యోగ, వ్యాపార రీత్యా ఉంటున్నారు.


వారు అక్కడ ఆస్తులూ కొనుక్కుంటున్నారు.


అలాంటప్పుడు ఆమె నన్ను అలా అడగటం న్యాయమా?


* కొందరు తమకొక నీతి ఇతరులకు ఒక నీతిగా ప్రవర్తిస్తుంటారు.


* మా ఊరు ఎవరూ రాకూడదు అనేవారు ఇతరుల ఊళ్ళు కూడా వెళ్ళకూడదు కదా !


* అయినా ఆమె నన్ను పరాయి ప్రాంతం వాళ్ళగా భావించింది కానీ, మాకు ఆ ప్రాంతం వారితో వివాహబంధుత్వాలు కూడా ఉన్నాయి.


* మాకు రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లోనూ బంధువులు, ఆత్మీయులు ఉన్నారు.


......................................... 


భార్యా భర్తలు వేరేవేరే ప్రాంతాలకు చెందిన కుటుంబాల్లో ఈ స్థానికత అనే విషయాలపై అపార్ధాలు కూడా చోటుచేసుకుంటున్నాయి.
.............................

*  విదేశాలకు  వెళ్తే  స్థానికులు .. వలసదారులు  అనే  తేడా  ఉందంటే  ఆశ్చర్యం  అనిపించదు.  స్వదేశంలోనే  వలసదారులు.. దోపిడిదారులు..  అంటుంటే  ఎంతో  అవమానంగా,  బాధగా  ఉంది.

 *   స్థానికులు..వలసవాదులు ...  అంటూ  ఉద్యమాలు  చేస్తున్న  స్టూడెంట్స్   భవిష్యత్తులో ఉద్యోగాలు ,  వ్యాపారాలు కొరకు ఇతర రాష్ట్రాలు,  దేశాలు  వెళ్ళకుండా ఉంటారా ?


 బదిలీలవల్ల   మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇతర ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుంది.
............................ 

*  మేధావులు ఇవన్నీ ఆలోచించి కొన్ని ఊళ్ళు   ఒక ప్రాంతంగా  నిర్ణయించి (  జోనల్  సిస్టం లా )..ఇక అక్కడి వాళ్ళు బయటికి పోకుండా అక్కడనే జీవించేటట్లూ ఉపాధి అవకాశాలు కల్పించాలి.


బదిలీలు కూడా ఆ పరిధిలోని ఊళ్ళలోనే జరగాలి.

* ఇదంతా సంకుచితతత్వం అంటే నేనేమీ చెప్పలేను. గొడవలు రాకుండా ఉంటాయని ఇలా చెబుతున్నాను.


బదిలీల   ఉద్యోగాలు   చేసేవారు  ఆస్తిపాస్తులను  కొనుక్కోవాలన్నా   ఎక్కడ  కొనాలనే  సమస్య  ఎదురవుతుంది.  

* ఇది మన రాష్ట్రం అనుకునేంతలో మీ రాష్ట్రం కాదంటున్నారు. మన ప్రాంతం అనుకుంటే  మీ  ప్రాంతం కాదంటున్నారు. ఇలాంటి   పరిస్థితిలో   స్థానికత   గురించి  అయోమయంగా  ఉంటుంది .


.......................... 

*    స్థానికతను   భాష  ఆధారంగా   కూడా   నిర్ణయిస్తారని  ఇంతకుముందు  అనుకునేవారం.  ఒకే  భాష  వాళ్ళ  మధ్య    కూడా  స్థానికులు..వలసవాదులు  అనే  తేడాలు  వచ్చిన  ప్రస్తుత  పరిస్థితిలో  అసలు స్థానికత అంటే ఏమిటో తెలియటం  లేదు.

* చదివిన ప్రాంతం ఆధారంగా స్థానికత నిర్ణయిస్తారని కొందరు  అంటున్నారు. 


అలా  అయితే,  బదిలీల వల్ల  ఒకే ఇంట్లోని కుటుంబసభ్యులు వేరేవేరే ప్రాంతాల్లో చదివితే .... ఒకే ఇంట్లో కుటుంబసభ్యులు వేరేవేరే ప్రాంతాలకు చెందే అవకాశం ఉంది  కదా !

ఏమిటో..స్థానికత  విషయం   ప్రస్తుత పరిస్థితిలో గందరగోళంగా  ఉంది .
............................. 


* మేము  ఇక్కడ  స్థానికులం  అని    మనము,  మన  తరువాతి  తరాల  వాళ్లు  కూడా  చెప్పుకుని  ప్రశాంతంగా  జీవించాలంటే  అసలు  స్థానికత  అనేది  ఎలా  నిర్ణయిస్తారో  తెలియాలి. 

*  స్థానికత అనే విషయం గురించి మేధావులు గట్టిగా ఆలోచించి  దయచేసి    తెలియజేయండి .



Monday, January 6, 2014

మిగతా రాష్ట్రాల ప్రజలు అయినా.......


గత  కొంతకాలంగా  రాష్ట్రంలో   అంతా  అయోమయం,  గందరగోళం.  తెల్లవారితే  ఒకళ్ళనొకళ్ళు   తిట్టుకోవటం  తప్ప,   ప్రజల  సమస్యల  పరిష్కారం  గురించి  ఎంత  తక్కువగా  మాట్లాడుకుంటే  అంత  మంచిది అన్నట్లు  ఉంది  పరిస్థితి.



రాష్ట్రంలోని  ప్రజల  మధ్య  విభేదాలు,  ఆవేశకావేషాలు  రావటం  అత్యంత  బాధాకరం.
  ప్రజల  మధ్య  విభేదాలు,  ఆవేశకావేషాలతో   పబ్బం  గడుపుకునే  వారికి ..... వారి  కుటుంబసభ్యుల  మధ్య    విభేదాలు  వచ్చినప్పుడు  ఆ  బాధ  తెలుస్తుందేమో  ?


దేశంలో  మన  రాష్ట్రంలో   వలె    అస్థిర  పరిస్థితులు  రాకూడదని,  మన  రాష్ట్రంలో  జరుగుతున్న   దిక్కుమాలిన  పరిస్థితి  ఏ  రాష్ట్రంలోనూ  రాకూడదని,
  మన  రాష్ట్ర  ప్రజలలా  ఏ రాష్ట్ర  ప్రజల  మధ్య  విభేదాలు  రాకూడదని  , 


 మిగతా  రాష్ట్రాల  ప్రజలు  అయినా   అపార్ధాలు , విభేదాలు  లేకుండా    కష్టసుఖాలలో  కలిసిమెలసి   అన్యోన్యంగా  ఉండాలని   కోరుకుంటూ....

*************
marikonni vishayaalu..

చాలామంది భారతీయ తల్లితండ్రులు తమ పిల్లలను విదేశాలకు పంపాలని తాపత్రయపడుతున్నారు. యువత కూడా చాలామంది ప్రపంచంలోని అనేకదేశాలకు వెళ్ళిపోతున్నారు. 

 
విదేశాల్లో ఎప్పుడైనా కష్టం వచ్చి, అక్కడివాళ్లు పొమ్మంటే ఏంటి పరిస్థితి ?
 

 ప్రస్తుతం హిందువులు మనదేశం అని చెప్పుకోవడానికి భారతదేశం అని చెప్పుకుంటున్నారు. క్రమంగా ఎక్కువమంది యువత చెల్లాచెదురుగా విదేశాలకు పోతే భవిష్యత్తులో మాది ..అని చెప్పుకోవటానికి  ఏ దేశం  మిగులుతుందో?  భవిష్యత్ భారతం ఎలా ఉంటుందో?

 ******************

 ఉదా..ఏదైనా దేశంలో మెజారిటీ జాతుల వాళ్ళు కొన్ని కారణాల వల్ల  తప్పనిసరి పరిస్థితిలో వివిధదేశాలకు వెళ్ళిపోయారట.  అలా చాలాకాలం గడిచిన తర్వాత,  దేశం విడిచి వెళ్ళిపోయిన వారందరూ ఆలోచించుకుని తిరిగి తమ పాతదేశానికి వెళ్ళాలని నిశ్చయించుకుని, ఎన్నో ప్రయత్నాల తర్వాత పాత దేశానికి తిరిగివచ్చి ఉంటున్నారట.
 

అయితే, అప్పటికి అక్కడ స్థిరపడి ఉన్న వాళ్ళు అది తమదేశమని, కొత్తగా తిరిగివచ్చిన వాళ్ళతో అంటారు. తిరిగివచ్చిన వాళ్లేమో ఒకప్పుడు అది తమ దేశమంటారు. ఇలాంటప్పుడు  గొడవలు జరుగుతాయి. అందువల్ల, దేశం విడిచి విదేశాలకు వెళ్లే వారు ఎన్నో ఆలోచించుకోవాలి.

**************
 
చాలామంది విదేశాలకు వెళ్లి అక్కడ ఉపాధి పొందాలని ప్రయత్నిస్తుంటారు. ఈ మధ్య ఒక వార్త ఏమిటంటే, అక్రమంగా విదేశీసరిహద్దులను దాటుతూ పట్టుబడుతున్నవారిలో ఎందరో భారతీయులు కూడా ఉన్నారట. ఈ ప్రయత్నాలలో కొందరు ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారట.


ఇప్పుడు విదేశాల్లో స్థిరపడిన కొందరు భారతీయులు ఏమంటున్నారంటే, భారతీయులు ఎక్కువగా విదేశాలకు రావద్దు..అని సలహాలిస్తున్నారు.


అయితే, విదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడిన భారతీయులు చాలామంది ఏం చేస్తున్నారంటే, వాళ్ళ గొప్ప ఇళ్ళువాకిళ్ళు చూపిస్తూ యూట్యూబులో పెడుతుంటారు.


విదేశాల్లోని భారతీయుల లగ్జరీ జీవితాలు చూసి, విదేశాలకు వెళ్లాలనే తాపత్రయం ఇక్కడ ఉన్న భారతీయులకు పెరుగుతుంది. విదేశాల్లో కష్టాలు ఉండవనుకుంటారు. ఎక్కడైనా కష్టాలు సుఖాలు ఉంటాయి. దూరపుకొండలు నునుపు అనే సామెతలాగా ఉంటుంది. 


విదేశాల్లోని భారతీయుల లగ్జరీ జీవితాలు చూసి, విదేశాలకు వెళ్లాలనే తాపత్రయం ఇక్కడ ఉన్న భారతీయులకు పెరుగుతుంది...అనేది నిజం.ఇప్పుడు విదేశాల్లో స్థిరపడిన కొందరు భారతీయులు ఏమంటున్నారంటే, భారతీయులు ఎక్కువగా విదేశాలకు రావద్దు..అని సలహాలిస్తున్నారు.


ఇలా సలహాలు ఇచ్చిన వారిని ఉద్దేశించి నేను, భారతీయులు విదేశాలకు రావద్దని అంటున్నప్పుడు.. మీరు అక్కడి లగ్జరీస్ చూపిస్తూ వీడియో పెట్టకుండా ఉంటే బాగుంటుందని వ్రాసాను. అలా వీడియోలు పెట్టొద్దంటే కొందరికి కోపం వస్తుంది.


మరి, లగ్జరీలను చూపిస్తూ వీడియోలు పెట్టవద్దంటే కోపం వచ్చినప్పుడు, విదేశాలకు భారతీయులు రావద్దని వారు ఎందుకు చెబుతున్నారు? 


యూట్యూబ్లో చూసిన ప్రతిదాని వెంట పడటం కాకుండా, ఎవరికివారు ఆలోచించాలి. మనదేశాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఇందుకు ప్రజలందరూ  కలసి అభివృద్ధిలో సహకరించాలి.
 
 

Friday, January 3, 2014

నిజాయితీపరులు, నిరాడంబరులు అయిన నిజమైన నాయకులు..


 
కేజ్రీవాల్  గారు  ప్రభుత్వాన్ని  ఏర్పాటుచేసారు.  అవకాశం  వచ్చిన  వెంటనే  ప్రభుత్వాన్ని  ఏర్పాటు  చేయటం  కోసం  హడావుడి  పడకుండా    ప్రజల  అభిప్రాయాన్ని  అడగటం  వంటి  పద్ధతులను  గమనించితే   కేజ్రీవాల్   గారి  వ్యవహారశైలి  బాగుందనిపిస్తోంది.



అయితే,   కేజ్రీవాల్కు  ఓట్లేసాము  కాబట్టి    ఇక   సమాజ  ప్రక్షాళన   అంతా   ఆయనే  చూసుకుంటాడులే ....  మనం  కాళ్ళు  బారజాపుకుని  సరదాగా  వినోదకార్యక్రమాలు  చూస్తూ  పొద్దుపుచ్చుదాం  ..... అని    ప్రజలు  అనుకోకూడదు.



  సమాజం  కొంతయినా  బాగుపడాలంటే   ప్రజలు  కూడా  తమ  వంతు  సహకారాన్ని    అందించాలి. అప్పుడే  సమాజంలో  పెద్ద ఎత్తున  మార్పు  సాధ్యమవుతుంది.  

........................................

ఇక్కడ  మనం,   మరి   కొన్ని  విషయాలను  గురించి   ఆలోచించాలి.

స్వతంత్రంగా  ప్రభుత్వం  ఏర్పాటుచేయటానికి   కొన్ని  సీట్లు  తక్కువ  రావటం  వల్ల  కేజ్రీవాల్  పార్టీ  ఇతరపార్టీ  మద్దతు  తీసుకోవలసి  వచ్చింది.  (  తమకు  ఇష్టం  లేకపోయినా  ).



* ప్రజలు తమకు నచ్చని వారికి ఓట్లు వేయకుండా తమ తిరస్కారాన్ని తెలియజేస్తారు……. అయితే ఎన్నికల తర్వాత గెలిచిన పార్టీలు … ప్రజలు తిరస్కరించిన పార్టీలతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని అగౌరవపరచటం అవుతుంది కదా !



* ప్రభుత్వాన్ని ఏర్పరచటానికి చాలినన్ని సీట్లు రాకపోయినా , ఎన్నికలలో ఎక్కువ సీట్లను గెలుచుకున్న పార్టీ   ఇతరుల  మద్దతు  లేకుండా  స్వతంత్రంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి అవకాశం ఇచ్చే విధంగా నియమాలను సడలించవలసిన  అవసరముంది.



* నియమాలు మన బాగుకొరకు మనమే ఏర్పాటు చేసుకున్నవి. అవసరమైతే నియమాలను మార్చుకోవటం మంచిది.



* ఎన్నికలు జరగటానికి ముందే పార్టీల మధ్య పొత్తులు ఉండటమనేది న్యాయం…. అప్పుడు ప్రజలు తమ ఇష్టాన్నిబట్టి తీర్పు చెబుతారు. అంతేకానీ , ఎన్నికల తరువాత పార్టీలు తమకు ఇష్టం వచ్చినట్లు పొత్తులు పొట్టుకుంటే అప్పుడు ప్రజలను ఓట్లు వేయమని అడగటం ఎందుకు ?

  ...............................

  అధికారం  కోసం ,  ధన వ్యామోహం  కోసం    కాకుండా  ప్రజాసేవ  కోసం  వ్యక్తులు  రాజకీయాలలోకి  వచ్చినప్పుడు    రాజకీయరంగంలో  మంచి  మార్పు  సాధ్యమవుతుంది. 

....................................
 
 ప్రజల  సమస్యలను  పరిష్కరించటం  చేతకాకపోయినా , ప్రజల  మధ్య  విభేదాలు  కల్పించే  వారు   నాయకులుగా  చెలామణి  అవుతున్న  ఈ  రోజుల్లో  ....  



  మాణిక్  సర్కార్   గారు..   వంటి  నిజాయితీపరులు,  నిరాడంబరులు   అయిన   నిజమైన  నాయకులు    రాజకీయాల్లో  ఉండటం  ప్రజలకు  శుభసూచకం.




Wednesday, January 1, 2014

శుభాకాంక్షలు ... మరికొన్ని విషయాలు..

ఈ  బ్లాగును  ప్రోత్సహిస్తున్న  అందరికి  అనేక  కృతజ్ఞతలు   మరియు  అందరికి  ఆంగ్ల  నూతన  సంవత్సర  శుభాకాంక్షలండి.

ఆసక్తి  ఉన్నవారు  ఈ  క్రింది  లింకులను  కూడా  చూడగలరు.



Valley of Flowers National Park - Wikipedia, the free encyclopedia  


Flowers of Himalayas.

**************

konni vishayamulu..

పొన్నగంటి కూరలో రెండు రకాలున్నాయంటూ ఈ మధ్య కొందరు చెబుతున్నారు. జాగ్రత్తగా ఉండాలి, ఒకటి ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు. రణపాల మొక్క, సరస్వతి మొక్క గురించి కూడా ఇలాగే చెప్పారు.

ఇంతకుముందు ఇవన్నీ చెప్పకముందు బయట అమ్మే పొన్నగంటికూర తెచ్చి చక్కగా తినేవాళ్ళం. ఇప్పుడు ఏది అసలైనదో? ఏది కాదో? అనే సందేహాలతో కొనాలంటే భయంగా ఉంది.

 ఇలాంటప్పుడు మొక్కలశాస్త్రం చదువుకున్న వాళ్ళు, ప్రజలకు ఏది నిజమో చెబితే బాగుంటుంది..(ఎవరైనా చెప్పారేమో నాకు తెలియదండి.)
 
 ప్రపంచంలో ఇన్ని గందరగోళాలు ఏమిటో?
***********************
marikonni vishayaalu..

ఆధునిక కాలంలో మనుషులు బిజి అయిపోయారు. తలుపులు, కిటికీలు మూసిన గదులలో కంప్యూటర్లు,ఫోన్లు చూస్తూ ఎక్కువసమయం గడుపుతున్నారు.  సహజమైన గాలి, వెలుతురు తగలటం తగ్గిపోయింది. మనుషులు ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం తగ్గింది.

 పాతకాలంలో స్త్రీలు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ కష్టసుఖాలు చెప్పుకునేవారు. పిల్లలు ఆరుబయట ఆడుకునేవారు. మగవాళ్లు రచ్చబండ వద్ద కబుర్లుచెప్పుకునేవారు.

 అప్పట్లో ఇప్పుడు ఉన్నంత కొత్తవస్తువులు, వస్తువినియోగం లేదు. ఉన్నంతలో తృప్తిగా, పొదుపుగా జీవించటానికి ప్రయత్నించేవారు. అప్పుడూ కొన్ని కష్టాలు ఉండేవి. కాని, ఇప్పటిలా పరిస్థితి కాదు.

ఈ రోజుల్లో ఎన్ని సౌకర్యాలు ఉన్నా, చాలా డబ్బు ఉన్నా కూడా, ఇంకాఏదో లేదనే అసహనం ఎక్కువయ్యింది. యంత్రాలు వచ్చి కొన్ని పనులు సులభం అయినా కూడా,చాలా పనులు పెరిగాయి. 

పాతకాలంలో సాయంకాలం 5 గంటలకు ఇంటికి వచ్చే ఉద్యోగులు, ఇప్పుడు రాత్రి వరకు ఆఫీసుల్లోనే పనిచేసే సందర్భాలూ ఉంటున్నాయి. కొన్ని చోట్ల ఉద్యోగస్తుల సంఖ్యను తగ్గించి, తక్కువమందితో ఎక్కువ సమయం చేసే పరిస్థితి కూడా ఉంది. ఉద్యోగాలు పోతాయేమోననే భయంతో కొందరు చాలా పనిచేస్తున్నారు.

* పని ఎక్కువయినా కూడా కోపం, డిప్రెషన్ పెరుగుతాయి.

 డబ్బు సరిపోవటం లేదని కొందరు, ఇరుగుపొరుగు, బంధువులు, ఫ్రెండ్స్..పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారని, బోలెడు డబ్బు సంపాదిస్తున్నారని, విదేశాలకు వెళ్తున్నారని, తామూ బోలెడు డబ్బుసంపాదించాలని పోటీలుపడుతూ జీవితంలో అలసిపోతున్నారు.

జీవితంలో విశ్రాంతి సరిపోక, కోరికలు పెరగటం వల్ల డబ్బు సరిపోక ఎదో విధంగా బతుకుతున్నారు. 

అపార్ట్మెంట్లలో పెద్దవాళ్ళు కూడా కలసి కబుర్లు చెప్పుకోవటం తగ్గిపోయింది. ఎవరింట్లో వాళ్ళు టీవీలు, ఫోన్లు చూసుకుంటూ ఉంటున్నారు. అపార్ట్మెంట్లలో అందరి ఇళ్ళలో పెద్దవాళ్ళు కలిసి  కొంతసేపయినా కబుర్లు చెప్పుకోవచ్చు.

 ప్రజలలో మానసిక, శారీరిక సమస్యలు పెరుగుతున్నాయనిపిస్తుంది. గొడవలు పెరుగుతున్నాయి. వార్తలు గమనిస్తే నేరాలు..ఘోరాలు భయానకంగా ఉన్నాయి.

 పాతకాలంలో దొంగలు వంటివారు దొంగతనాలు, హత్యలు చేసేవారంటారు. ఇప్పుడు కుటుంబసభ్యులు, తెలిసినవారి వల్లే ఇలాంటి నేరాలు..ఘోరాలు జరిగిన సంఘటనలు ఉన్నాయి.

* కంప్యూటర్, ఫోన్లు అస్తమాను చూడటం వల్ల కోపం, డిప్రెషన్ వంటివి పెరిగే అవకాశముంది.


 
కంప్యూటర్ వాడుతూ పనిచేసే వాళ్ళు, రోజులో కొంతసేపయినా ఆరుబయట సూర్యరశ్మి,గాలి తగిలేలా గడపటం మంచిది. నచ్చిన పాటలు వినవచ్చు. 

పిల్లలను కూడా అస్తమాను హోంవర్క్ అని పేరెంట్స్ అనటం వల్ల, వాళ్ళకూ విసుగు వస్తుంది. వాళ్ళకూ ఆటలుపాటలు వినోదం అవసరమే.పెద్దవాళ్ళు పిల్లలకు సరైన పోషకారాన్ని పెట్టాలి.


అందరూ అస్తమానూ కంప్యూటర్లు, ఫోన్లతో గడపటాన్ని కొంత తగ్గించుకుని, కిటికీలు తెరిచి గాలి, వెలుతురు గదుల్లోకి వచ్చేలా కొంతసేపయినా తలుపులు తెరవాలి. 

కుటుంబసభ్యులు రోజులో కొంతసేపయినా చక్కగా మాట్లాడుకోవాలి. గొడవలు వచ్చినా 10 నిమిషాలకన్నా గొడవపడకుండా అలవాటుచేసుకోవాలి. ముఖ్యమైన పాయింట్లు చెప్పుకుని ఆపేయాలి. వారాంతంలో బయటకు పార్కులకు వెళ్ళవచ్చు.
...............

సమయం ఉంటే, స్త్రీలుకొందరు కలిసి చిన్నపరిశ్రమలు పెట్టి,ఉదయం 10 నుంచి మధ్యాహ్మ్నం 3 వరకు చేతనైనంతలో ఉపాధిపొందవచ్చు. 

సొంతవ్యాపారం కాబట్టి, సమయం తమకు అనుకూలంగా ఏర్పరుచుకుని త్వరగా ఇళ్ళకు వెళ్ళవచ్చు. తమ చంటి పిల్లల్ని తమ దగ్గరే ఉంచుకోవచ్చు.

కొందరు స్త్రీలు మహిళామండలిగా ఏర్పడి , ఇంటిపని అయ్యాక ఉదయం 10 నుంచి మధ్యాహ్మ్నం 3 వరకు సమాజానికి ఉపయోగపడే పనులు చేయవచ్చు. పేదవారికి చదువుచెప్పటం, ఆరోగ్యసలహాలు చెప్పటం, వారికి ఉపాధి లభించేలా ప్రభుత్వం పధకాల గురించి చెప్పి సాయం అందించటం..చేయవచ్చు.

ఇవన్నీ చేయకపోయినా ఫరవాలేదు, ఎవరి కుటుంబాన్ని వారు చక్కగా చూసుకుంటూ పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దినా చాలు.

ఉద్యోగాలు ఎవరైనా చేయగలరు. నైతికవిలువలతో పిల్లలను చక్కగా పెంచి పెద్దచేయటం చాలా గొప్ప విషయం. మనుషులు నైతికవిలువలను పాటిస్తే, సమాజంలో నేరాలు..ఘోరాలు ఉండవు. అశ్లీలతతో కూడిన చిత్రాలు, రచనలు చేయరు. జీవహింస చేయరు. ఇతరులను పీడించరు. మంచిగా ఉండేవారివల్ల సమాజం ప్రశాంతంగా ఉంటుంది.