ప్రాచీనకాలంలో ఒక పద్దతిగా సమాజంలో పని విభజన జరిగింది. ఎవరి పనిని వారు చక్కగా చేస్తే సమాజం సజావుగా ఉంటుంది. . రైతులు ఉదయాన్నే పొలానికి వెళ్తారు. సైనికులు ఎంతో అప్రమత్తంగా దేశరక్షణలో అప్రమత్తంగా ఉంటారు.
సమాజంలో ఎన్నో వృత్తులవారున్నారు. ఎవరి పని వారు చక్కగా చేస్తే అదికూడా పూజయే.
ఇవన్నీ తెలిసిన ప్రాచీనులు, కొన్ని వృత్తులవారు పెద్దేత్తున పూజలు చేయనక్కరలేదు, వారు తమ స్వధర్మాన్ని చక్కగా పాటిస్తే చాలు, కొద్దిపాటి పూజలు చేసినా బోలెడు పూజలు చేసినంత పుణ్యం వస్తుందని ప్రాచీనులు తెలియజేసారు.
అయితే, ప్రాచీనులు చెప్పినదానికి వ్యతిరేకంగా ఇప్పుడు కొందరు ఏమంటున్నారంటే, అన్ని వృత్తులవారు కూడా పెద్ద ఎత్తున పూజలు చేయవచ్చని, అందరూ చాలా ఆచారవ్యవహారాలను పాటించాలని చెబుతున్నారు.
మేమెందుకు పెద్ద ఎత్తున పూజలు చేయకూడదంటూ కొందరు మాట్లాడుతారు. ఇప్పుడు చాలామంది ఇతర ప్రాంతాల వారి నుండి నేర్చుకుని కూడా అనేకపూజలను చేస్తున్నారు. ఇవ్వాళ ఫలానా పూజ కాబట్టి, ఈ నియమాలను పాటించాలి, లేదంటే కష్టాలు వచ్చి పడిపోతాయంటూ చెప్పేవాళ్లు కూడా ఎక్కువయ్యారు.
కొత్తకొత్త ఆచారవ్యవహారాలను చెబుతున్నారు కొందరు. నిత్యమూ చాలా విషయాలను పాటించాలంటే అందరూ పాటించలేరు. వీటి గురించి కుటుంబసభ్యుల మధ్య గొడవలు కూడా జరుగుతున్నాయి. మళ్ళీ ఆ గొడవలు తగ్గాలంటే ఏమి పరిహారాలు చేయాలో?
కొందరు చెప్పేవి వింటే హిందువుల ముసుగులో హిందువులకు విసుగు కలిగేలా చెబుతున్నారేమో? అని సందేహాలు కూడా కలుగుతున్నాయి.
ప్రతి విషయానికి ఎన్నో కొత్తకొత్త విధివిధానాలను చెబుతుంటే అవన్నీ గుర్తు ఉంచుకుని పాటించాలంటే చాలా కష్టం. వాటిని పాటించడానికే ధ్యాస ఉంటే, ఇక దైవము పట్ల ధ్యాస ఎలా?
ఉదా..ఎవరికైనా తాంబూలం ఇవ్వాలంటే అరటిపండ్ల తొడిమలు ఏ దిక్కున ఉండేటట్లు ఇవ్వాలి, ఎలా ఇవ్వకూడదు..ఇలా వందల నియమాలు చెబుతారు. ఇవన్నీ గుర్తు ఉంచుకుని తప్పుల్లేకుండా పాటించాలంటే ధ్యాస అంతా విధివిధానాల పట్లే ఉంటుంది కానీ, దైవము పట్ల ధ్యాస ఎలా?
ఆచారవ్యవహారాల్లో ఎన్నో మంచివిషయాలను పొందుపరిచి ప్రాచీనులు మనకు అందించారు. అయితే, కాలక్రమేణా ఎన్నో మూఢనమ్మకాలు వచ్చాయి. అందువల్ల విచక్షణతో ప్రవర్తించాలి.
............
ఈ కాలంలో పండుగలు, ఫంక్షన్లు సందర్భంగా అనేక కొత్త ఆచారవ్యవహారాలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా చాలా ఖర్చులు, శ్రమ కూడా ఉంటోంది. అనవసర సామాను ఎక్కువవుతోంది.
ఇచ్చే గిఫ్టులతో ఇల్లంతా గజిబిజిగా తయారవున్నాయి. గిఫ్ట్ వద్దంటే వినరు. ఈ కార్యక్రమాల ద్వారా కొందరు వస్తువులను అమ్ముకుంటూ వ్యాపారం కూడా చేసుకుంటున్నారు. అన్ని వృత్తులవారు పాల్గొనటం వల్ల చాలామంది వ్యాపారస్తులకు ఆదాయం పెరిగింది.
కొంతకాలం క్రిందట కొన్ని వస్తువులు కొని సాటి స్త్రీలకు పంచిపెట్టాలని లేకపోతే అరిష్టమని ప్రచారం చేసారు. కొందరు వర్తకులు తమ వ్యాపారం కొరకు అలా ప్రచారం చేసారని కొందరు అన్నారు.
ఈ రోజుల్లో కొందరు మతాల పేరుతో కూడా ధనార్జన..వ్యాపారం చేయటం ఎక్కువయ్యింది. జీవనవిధానంలోనే మతము, ఆర్ధికాభివృద్ధి కలగలిపి ఉండవచ్చు కానీ, వ్యాపారమే ముఖ్యంగా మారకూడదు.
అవసరమైనంత వరకు ఆర్ధికాభివృద్ధి అవసరమే కానీ, ఆర్ధికాభివృద్ధే జీవిత ధ్యేయం కాదుకదా.. ఈ రోజుల్లో చాలామంది ఎలాగైనా సరే బోలెడు డబ్బు సంపాదించటమే జీవితధ్యేయంగా బతుకుతున్నారు.
కొందరు మతం పేరుతో సంస్థలను మెలకొల్పి ప్రజల వద్ద డబ్బు తీసుకుని మోసం చేస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి.
పాతకాలంలో దేవాలయాల నిర్వహణకొరకు రాజ్యాలను ఏలే రాజులు ధనాన్ని సమకూర్చేవారు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు..
ఈ రోజుల్లో అంటరానితనం వంటివి లేకుండా అన్ని వృత్తుల వారు దేవాలయాలకు వెళ్తున్నారు.
...................
ప్రజలు హుండీలలో వేసే ధనాన్ని.. బంగారాన్ని పెద్ద ఎత్తున నిల్వ ఉంచితే ఎవరైనా దోపిడీదారుల దృష్టి పడవచ్చు. హిందువులలో కూడా కొందరు చేతివాటం ఉండే వాళ్ళుండే అవకాశం ఉంది.
అలా పెద్ద ఎత్తున బంగారాన్ని ప్రోగుచేసి ఉంచటం కన్నా, కొంత నిల్వ ఉంచి, మిగతా ధనాన్ని హిందుపేదప్రజల కొరకు ఉపయోగించవచ్చు. అంటే, ప్రజలకు కొందరికి ఉచితంగా లేక కొందరికి తక్కువ ధరకు విద్యను, వైద్యాన్ని అందించవచ్చు.
హిందువులలోనే చాలామంది పేదలున్నారు.
హిందూదేవాలయాల సొమ్మును ఇతరమతస్తులకు ఇచ్చే హక్కు ఎవరికి ఉండదు. అలాగని దేవాలయాలను ప్రభుత్వాల నుంచి తప్పించటమూ మంచిది కాదనిపిస్తుంది.
కొందరు ఏమంటారంటే, దేవాలయాలను ప్రభుత్వాల నుంచి తప్పించి ప్రేవేట్ వారికి అప్పగించాలంటారు. ప్రభుత్వం వద్ద ఉంటే అక్కడ ఏమైనా అవకతవకలు జరిగితే కనీసం ఓటు ద్వారా ఆ ప్రభుత్వాలను దింపే అవకాశమైనా సామాన్యప్రజలకు ఉంటుంది. ప్రైవేట్ వారి చేతుల్లోకి దేవాలయాలు వెళితే అక్కడ ఏమైనా అవకతవకలు జరిగితే సామాన్యప్రజలు ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండే పరిస్థితి కూడా ఉండవచ్చు. ఈ రోజుల్లో ఎవర్ని నమ్మాలో? ఎవరిని నమ్మకూడదో? అర్ధం కావటం లేదు.
*****************
ఈ రోజుల్లో కొన్ని చోట్ల శుభ్రత లేని ప్రదేశాలలో కూడా కొత్తకొత్త దేవాలయాలను కడుతున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే, జనాలలో భక్తి నిజంగా ఉంటే సమాజంలో ఇన్ని నేరాలు, ఘోరాలు ఎందుకు జరుగుతున్నాయో? అర్ధం కావటం లేదు. కోరికలు తీరటానికి పూజలు చేయటం కూడా ఎక్కువయ్యింది.
.................
మన గ్రంధాలలో కొన్ని విషయాలను గమనిస్తే.. ఇలా ఎందుకు రాసారో? అనిపిస్తుంది. అవి ప్రక్షిప్తాలు కావచ్చు అనుకుంటున్నాము.
తరతరాలనుంచి అంటరానితనం మరియు కొన్ని మూఢనమ్మకాల వల్ల ఇప్పటికే హిందుసమాజం ఎంతో నష్టపోయింది.
పాతకాలంలో జరిగిన అంటరానితనం.. వంటి కొన్ని పాపాల వల్ల కాబోలు భారతదేశంలో విదేశీయుల పాలన రావటం, విదేశీమతాలు ప్రవేశం జరిగి ఉండవచ్చు. ప్రతివిషయానికి కర్మ ప్రభావం ఉంటుంది కదా..
ఇప్పటికైనా హిందువులు ఒకరినొకరు గొడవలు పడకుండా సామరస్యంగా ఉంటే బాగుంటుంది. సమాజంలో అన్ని వృత్తుల వారు అవసరమే. ఎవరి కష్టసుఖాలు వారికి ఉన్నాయి. అందరూ ఒకరికొకరు సహకరించుకుంటూ చక్కగా మంచిగా జీవించాలి.
..................
జీవితంలో కొన్ని నియమాలు ఉంటే ఎవరికైనా ఆచరించడానికి సులభంగా ఉంటుంది. అదేపనిగా నియమాలంటూ అంతులేకుండా చెప్పుకుంటూ ఉంటే అందరూ పాటించలేరు. మతాన్నే వదిలేయాలనిపించవచ్చు.
ఎందరో హిందువులు మతం కూడా మారారు. అందువల్ల సరిదిద్దుకుని ముందుకు వెళ్ళాలి.
దైవము యొక్క అవసరం అందరికి ఉంటుంది. అయితే, దైవారాధనకు కఠినమైన మార్గాలను వదిలి సులభమైన మార్గాలను ఎన్నుకోవాలనిపించవచ్చు.
పండుగలు వస్తున్నాయంటే టెన్షన్ వస్తుంది. బోలెడు నియమాలను పాటించలేక మతము అనేది లేకుండా నాకు కుదిరినంతలో దైవాన్ని ఆరాధించుకోవాలనిపిస్తుంది. ఇదంతా గమనించిన తరువాత,ఇప్పుడు నాకు వీలైనంతలో మాత్రమే పాటించటానికి ప్రయత్నిస్తున్నాను.
ఇది కలికాలం. కలికాలంలో మనుషులు శారీరికంగా, మానసికంగా కొంత బలహీనులుగా ఉంటారు కాబట్టి, దైవభక్తి కలిగి దైవస్మరణ చేస్తే చాలు తరిస్తారని ప్రాచీనులే తెలియజేసారు.
బోలెడు పూజలను చేయకపోయినా.. జీవితంలో దైవభక్తి కలిగి, కొన్ని పూజలను చేస్తూ, నీతినిజాయితీలతో జీవించటానికి ప్రయత్నిస్తే దైవకృపను పొందే అవకాశం ఉంటుంది.
.............
ఇక్కడ వ్రాసిన చాలా విషయాలు ఇంతకుముందు పోస్టులలో వ్రాసినవే.
ఈ పోస్టును కొంతకాలం తరువాత ఇక్కడ తొలగించే ఆలోచన ఉంది. కాబట్టి, ఎవరైనా వ్యాఖ్యలను వ్రాస్తే అవి కూడా డిలిట్ చేస్తే దయచేసి అపార్ధం చేసుకోవద్దండి.