koodali

Sunday, August 27, 2023

కష్టాలు తీరటం..

 

కొందరు ఏమంటారంటే, ఎంతో డబ్బు ఖర్చుపెట్టి ఎన్నో పూజలు చేసాము. అయినా మాకు కష్టాలు తీరటం లేదు అంటారు.

 ఇలాంటప్పుడు కొంతకాలం మామూలుగా పూజ చేసుకోవచ్చు,  నిత్యపూజ చక్కగా చేసుకోండి.ఎవరేది చెబితే అవి అన్నీ చేయనవసరం లేదు... దైవనామస్మరణ, దైవాన్ని స్మరించుకోవటం సులభం.

ఎందుకంటే, పూజలు చేసినా కష్టాలు తీరటంలేదు అనటం తప్పు. కష్టాలు తీరకపోవడానికి ఎన్నో కారణాలుంటాయి.

 ఎవరికైనా గతంలో చేసిన పాపాల వల్ల కష్టాలు వస్తాయి. గతజన్మలోనో, ఈ జన్మలోనో వారు చేసిన తప్పులు వారికి గుర్తు ఉండకపోవచ్చు. ఇప్పుడు పాపాలు చేయటం మాని, పుణ్యకార్యాలు చేస్తుంటే కష్టాలు తగ్గే అవకాశముంది. అందుకు కొంత సమయం పట్టవచ్చు. 

 కొందరికి తాము తప్పులు చేసినా కూడా అవి తప్పులుగా అనిపించవు. మేము ఎప్పుడూ పాపాలు చేయలేదు. అయినా కష్టాలు వచ్చాయని వాపోతారు. 

ప్రత్యేకమైన పెద్ద పూజలు చేయటం కొంత మాని, పేదవారికి, ఆపదలో ఉన్నవారికి సాయం చేయవచ్చు. గోవులకు, మూగజీవులకు చక్కటి ఆహారాన్ని అందిస్తే పుణ్యం వస్తుంది. 

అలాగని గోవులకు, ఇతరమూగజీవులకు ఏదిపడితే అది తినిపించకూడదు. అలా తినిపిస్తే పుణ్యానికి బదులు పాపం వస్తుంది. వాటి ఆహారం ఏమిటో సరిగ్గా తెలిసినవారిని అడిగి తినిపించాలి.

 కొన్ని ప్రత్యేకంగా చేసే పూజలు ఎన్నో నియమాలతో చేయాలి. పూజలో తప్పులు వస్తే ప్రాయశ్చితం చేసుకోవాలట. పూజలకు వాడే ద్రవ్యాలు కల్తీ కానివి వాడాలి. అన్యాయంగా ఆర్జించిన సొమ్ముతో పూజలు చేయకూడదంటారు.

 కష్టాలు వచ్చాక బాధలు పడేకన్నా, ముందే దైవభక్తి కలిగి, మనస్సును చెడు వైపుకు వెళ్ళకుండా నియంత్రించుకోవటానికి ప్రయత్నించాలి. శక్తి చాలకుంటే దైవాన్ని ప్రార్ధించుకోవాలి. 

................
ప్రతిపనికి కొన్ని నియమాలు ఉంటాయి.
ఉదా..పెట్రోల్ బంక్ కు వెళ్తే పరిసరాల్లో అగ్గిపుల్ల వెలిగించకూడదని, సెల్ఫోన్లు మాట్లాడకూడదని  జాగ్రత్తలు చెబుతారు. కారణాలు మనకు తెలుసు.

 ప్రాచీనకాలంలో ఏ నియమాలను ఎందుకు పెట్టారో మనకు ఇప్పుడు తెలియదు. వాటి అంతరార్ధాలు మనకు తెలియకపోయినా , కొన్ని నియమాలను పాటించితే  మంచిది.  అయితే, గ్రంధాలలో మార్పులు చేర్పులు జరిగాయని..అంటే ప్రక్షిప్తాలు కూడా ఉన్నాయని అంటారు.

కొన్ని పూజలకు ఎన్నో నియమాలను పాటించవలసి ఉంటుంది. ఎలాపడితే అలా చేస్తే మంచిదికాదు. కొందరు  ఎవరు ఏది చెబితే అది చేస్తుంటారు. అలాకాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

సంస్కృతంలో పలికేటప్పుడు కొన్నిసార్లు  కొద్దిగా తేడా వచ్చినా , అర్ధం మారిపోయే అవకాశం ఉంది.  దైవాన్ని తిట్టినట్లు అర్ధం మారిపోయే అవకాశముంది. ఇలా తప్పులు చదివితే పుణ్యానికి బదులు పాపం వచ్చే అవకాశముంది.

ఇలాంటప్పుడు, అనేక నామాలను చదవటం కన్నా తేలికగా తప్పులు రాని నామాలను చదువుకోవటం మంచిది.ఈ రోజుల్లో కొన్ని పుస్తకాలలో తప్పులుంటున్నాయి. మాతృభాషలో దైవాన్ని పూజించుకోవటం కూడా మంచిదే.

దేవాలయాల వద్ద మైకులలో కూడా, కొన్ని తప్పుగా పాడిన కొన్ని కేసెట్లు వేస్తున్నారు.

 ఇప్పుడు అందరికీ అందుబాటులోకి ఫోన్లు వచ్చాక తేలికగా ఒక కామెంట్ పెట్టేస్తున్నారు..ఈ విషయంలో ఏం చెయ్యాలి? అని.  అవన్నీ చదివిన వారికి మరిన్ని సందేహాలు, అనుమానాలు వస్తుంటాయి..

 సందేహాలను అడగటంలో తప్పులేదు గానీ, అదేపనిగా సందేహాలతోనే జీవితమంతా సతమతమయితే, సందేహాలతోనే సమయం గడిచిపోతుంది.

ఇలా అనేక సందేహాలను అడుగుతున్న వారు జీవితంలో ఇతరులను బాధపెట్టకుండా, పాపాలు చేయకుండా ఉంటున్నారా? అన్ని పనులను సత్ప్రవర్తనతో ఉంటూ సవ్యంగా చేస్తున్నారా?
ఇవన్నీ పాటించటం కూడా ముఖ్యమే. ఇది కూడా పూజలో భాగమే.

 

3 comments:

  1. క్యాలెండర్లు చూస్తే దాదాపు నెలలో 25 రోజులూ పండుగలకు సంబంధించి ఏదో ఒక విశేషాలు ఉంటాయి. ఇవి కాకుండా ఈ మధ్య చాలామంది ఇంకా చాలా పూజలు, ఆచారవ్యవహారాల గురించి చెబుతున్నారు.
    పండుగలంటేనే తలస్నానం, ఉపవాసం, బ్రహ్మచర్యం..వంటివి పాటించాలని అనుకుంటారు చాలామంది. అలాగని నెలలో సుమారు 25 రోజులూ తలస్నానాలు, ఉపవాసాలు, బ్రహ్మచర్యం.. పాటించలేరు కదా.
    రోజూ ఏదో ఒక విశేషం చెబుతున్నారు కదా.. అని రోజూ తలస్నానం, ఉపవాసం, బ్రహ్మచర్యం..పాటించాలేమో? అని కొంతమంది అయోమయానికి గురవుతారు. ఆచారవ్యవహారాలంటే కొంత భయభక్తులున్న యువజంటలకు.. ఎలా ప్రవర్తించాలో తెలియక భయం ఏర్పడుతుంది. ఎవరినీ అడగలేరు. యూట్యూబ్ చూస్తే ఎన్నో ఆచారవ్యవహారాల గురించి చెబుతూ.. అవి పాటించకపోతే కష్టాలే..అని చెబుతుంటారు.

    ఈ విషయాల గురించి నా అభిప్రాయం ఏమిటంటే.. మామూలుగా రోజూ నిత్య పూజ చేసుకోవచ్చు. పండుగలు, ప్రత్యేకమైన పూజలు ఉన్నప్పుడు మాత్రం తలస్నానం, ఉపవాసం, బ్రహ్మచర్యం.. పాటిస్తే సరిపోతుంది.

    భార్యాభర్త గొడవలు లేకుండా అన్యోన్యంగా ఉంటే కుటుంబ వాతావరణం బాగుంటుంది. కొందరు ఎలా ఉంటారంటే, గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు వానప్రస్థాశ్రమం పద్ధతులను ఎక్కువగా పాటిస్తుంటారు. వయస్సు పైబడిన తరువాత యుక్తవయస్సులో ఉండేటట్లు ప్రవర్తిస్తుంటారు. మనకు నాలుగు ఆశ్రమ ధర్మాలను ప్రాచీనులు తెలియజేసారు...ఆ విధంగా పాటించాలి. ప్రాచీనులు చెప్పినట్లు చతురాశ్రమ ధర్మాలను చక్కగా పాటిస్తూ చక్కగా దైవకృపను పొందవచ్చు.

    ReplyDelete
  2. ఎప్పుడైనా పాపాలు, జీవహింస..వంటివి చేస్తేనే ఎవరికైనా కష్టాలు, బాధలు వస్తాయి. కష్టాలు పోవాలంటే, మనము వర్తమానంలో పాపాలను చేయటం ఆపేయాలి. అంతేకానీ పాపాలు చేస్తూ కష్టాలు పోవటానికి పరిహారాలు చేసినా పనిచేయవు. కష్టాలు పోగొట్టుకోవటానికి చేసే పరిహారాలను జాగ్రత్తగా చేయాలి. ఏ మాత్రం పొరపాట్లు జరిగినా కొత్త పాపాలు చుట్టుకుంటాయి.

    కష్టాలు పోవాలన్నా, ధర్మబద్ధమైన కోరికలు తీరాలన్నా..దైవభక్తి కలిగి దైవాన్ని ఆరాధించుకుంటూ, సత్ప్రవర్తనతో జీవించటానికి ప్రయత్నిస్తూ.. కష్టాలలో ఉన్నవారికి సాయం చేయటం, ఆర్ధికంగా సాయం చేయటం, ఆర్ధికసాయం చేయలేనివారు తమకుతోచినట్లు వారికి పనిలో సహాయం చేయటం ద్వారా సాయం చేయవచ్చు. పశుపక్ష్యాదులకు సాయం చేయటం కూడా చేయవచ్చు. ఇలా చేయటం వల్ల గతపాపకర్మ కరిగి మంచి జరుగుతుంది. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎంతో సంతోషం కలుగుతుంది. అంతేకానీ, కష్టాలు పోవాలని ఎవరేది చెబితే అది విచక్షణ లేకుండా చేయటం వల్ల కొత్త కష్టాలు వచ్చే అవకాశముంది.

    ReplyDelete

  3. జంతువులకు ఉప్పుకారం వేసి వండిన ఆహారం..వంటివి పెట్టకూడదట...కానీ, మనుషులు వాటికి అన్నింటినీ తినిపిస్తుంటారు. మూగజీవులు ఆకలితో మనుషులు ఏం పెడితే అవి తినేస్తుంటాయి. అందుకే జూ వద్ద పశుపక్ష్యాదులకు ఆహారం పెట్టవద్దని బోర్డులు ఉంటాయి. అయితే,ఆ నియమాలను ఎందరు పాటిస్తారు? ఉప్పు, కారం కలిసిన ఆహారం వల్ల జంతువులకు అనారోగ్యం వస్తుందట.

    ఉప్పు, కారం లేని అన్నం పెట్టవచ్చనుకుంటా..నాకు పశుపక్ష్యాదుల ఆహారం గురించి సరిగ్గా తెలియదు. పశుపక్ష్యాదులకు ఆహారం ఇవ్వాలనుకునేవారు..నిపుణులను అడిగి తెలుసుకుని ఆహారాన్ని అందివ్వాలి.

    ReplyDelete