koodali

Sunday, August 27, 2023

అంటుముట్టు

 

ఇక నెలసరి విషయంలో ఎన్నో చెబుతున్నారు. 4 రోజుల వరకూ కొన్ని నియమాలను పాటించటం ఫరవాలేదు.

 ఈ రోజుల్లో కొందరికి ఎక్కువరోజులు రక్తస్రావం కనిపిస్తోంది.
అలా జరిగినప్పుడు వారిని, వారింట్లో వారిని కూడా పూజలు చేసేవారు ముట్టుకోకూడదని కొందరు అంటున్నారు. లేదంటే వారు ముట్టులో ఉన్నామని చెప్పాలంటున్నారు. ఆడవాళ్ల నెలసరి పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు అందరికీ చెప్పుకోవటం ఇబ్బందిగా ఉంటుంది. 

 

 నాకు ఏమనిపించిందంటే,ఊళ్లో ఉన్న దేవాలయానికి వెళ్ళాలంటే ఇంట్లో స్నానం చేసి బస్సులు,లోకల్ రైళ్లు ఎక్కుతారు. అలాంటప్పుడు ప్రక్కన ఉండేవారిలో అంటు ఉన్నవారు ఉండవచ్చు. అందరికీ కార్లు ఉండవు కదా..కార్లు ఉన్నా కూడా కారును కూడా శుద్ధిచేయాలి మరి, ఇంతకుముందు ముట్టు ఉన్నప్పుడు కార్ ఎక్కిఉండవచ్చు కదా.. 

 

 అంతెందుకు ఈ రోజుల్లో చాలామంది అపార్ట్మెంట్స్లో ఉంటున్నారు. ఎక్కడికి వెళ్లాలన్నా లిఫ్ట్ ఎక్కిదిగాలి.లిఫ్ట్లో మైల ఉన్నవారు ఎక్కవచ్చు. వారు ముట్టుకున్న లిఫ్ట్ తలుపే అందరూ ముట్టుకుంటారు.మెట్లు ఎక్కిదిగినా వారు నడిచిన దారే కదా నడవాలి.ఈ రోజుల్లో అతిగా చెపితే అసలుకే మోసం వచ్చే ప్రమాదముంది. 

 దైవస్మరణకు అంటుముట్టు ఉండదు ..చక్కగా దైవస్మరణ చేసుకోవచ్చు . 

 

 అయితే, శరీరం సున్నితంగా ఉండే నెలసరి సమయంలో ఎక్కువపనులు చేయకూడదు. విశ్రాంతి తీసుకోవాలి. ఎక్కువగా పనిచేస్తే అనారోగ్యం కలిగే అవకాశాలున్నాయి. అందువల్ల 4రోజుల విశ్రాంతి మంచిదే. అయితే నియమాల పేరుతో అతిగా చేయకూడదు.

 

కొన్నిసార్లు ఏదైనా ఫంక్షన్ అనుకుని అందరినీ పిలిచి ఫంక్షన్ జరుగుతున్నప్పుడు సందేహాస్పదంగా తెలుపుఎరుపూ కానీ రంగులో అతికొద్దిగా స్రావం కనిపించవచ్చు.కొద్దిగా కనిపించి తరువాత ఆగిపోవచ్చు. అనారోగ్యకారణాల వల్ల టెన్షన్ తో ఇలా జరగొచ్చు.

 అప్పుడు ఏం చేయాలో తెలియదు. బోలెడు ఖర్చుపెట్టి ఫంక్షన్ జరుగుతుంటే విషయం చెప్పి ఫంక్షన్ ఆపేయమని చెప్పలేరు. భయంతో నిజంగా రక్తస్రావం కనిపించినా చెప్పకుండా ఊరుకుంటారు . 

 

మాకు ఇద్దరు పిల్లలు. అబ్బాయి ఇంజనీరు.అమ్మాయి డాక్టర్. అబ్బాయి దైవపూజ చేస్తాడు. అమ్మాయి డాక్టర్. అమ్మాయి దైవపూజ  చేస్తుంది  కానీ.. ఇన్నిరకాల ఆచారవ్యవహారాలను పాటించటం నావల్లకాదంటుంది.

 కొన్నిసార్లు..ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు అంటుముట్టు అనే భావనతో  వారికి సాయం చేయకపోవటం తప్పు.
 

నూటికినూరుశాతం  అంటుముట్టు నియమాలను పాటించాలంటే చాలా కష్టం. మనం ఎంత ఇంట్లో కూర్చున్నా కూడా ఏదో విధంగా మనకు చేరే అవకాశముంది.  ఉదా..కూరగాయలు, పువ్వులు, పండ్లు, దుకాణాలలో సరుకులు..ఇవన్నీ కొనక తప్పదు. కూరగాయలను  అమ్మే వారు నెలసరిలో ఉండవచ్చు.వారు ఆ వస్తువులను తాకి మనకు ఇస్తారు కదా..

 

   పాతకాలంలో పాటించే పద్ధతులను చాలావాటిని ఇప్పుడు పాటించలేకపోతున్నాం.  ఉదా..పాతకాలంలో స్త్రీలు..  బయటకు వెళ్లేవారు కాదు. ఈ రోజుల్లో అలా వెళ్ళొద్దని చెప్పగలమా? చెప్పినా వినేవాళ్ళెందరు?

 
నెలసరి 
ఆచారం  సరిగ్గా పాటించాలంటే, నెలసరి రోజుల్లో స్త్రీలు బయటకు వెళ్ళకూడదు. అలా ఎందరు పాటిస్తున్నారు?  కాలానుగుణంగా ఆచారాలను మార్చుకుంటున్నారు. ఉదా..ఈరోజుల్లో కాలేజీలకు, ఆఫీసుకు వెళ్ళే ఆడవాళ్లు నెలసరిరోజుల్లో బయటకెళ్ళి అంటుముట్టు  కలిపేస్తున్నారు..


ఈ విషయంలో ఆచారం గురించి ఏమంటారంటే, ఈరోజుల్లో స్త్రీలు బయటకు వెళ్ళకతప్పదు కాబట్టి, వెళ్ళవచ్చంటారు. బయటకెళ్ళి అంటుముట్టును అందరికి కలిపేసినా, ఇంటికొచ్చి దుస్తులు మార్చుకుంటే సరిపోతుందంటారు..కానీ, నెలసరిలో ఉన్న స్త్రీలు తప్పనిసరి పరిస్థితిలో ఇంట్లో వంటచేస్తే మాత్రం దోషం అంటారు.


అంటుముట్టును ఇంట్లో కలిపితే దోషం ఇంట్లో వారికే ఉంటుంది. బయటకలిపితే అందరికీ దోషం తగులుతుంది ..ఇంకా, అలా అందరికీ కలిపిన దోషం.. కలిపినవారికి ఇంకా ఎక్కువ ఉంటుంది..

ఎన్నో విషయాలను ఎవరికి అనుగుణంగా వారు మార్పులుచేర్పులు చేస్తూఉన్నారు.  వంటచేయకూడదని చెబుతున్నప్పుడు.. బయటకు వెళ్ళకూడదని కూడా స్త్రీలకు గట్టిగా చెప్పగలరా?

ఇలా రాయటం ఎవర్నీ తప్పుపట్టాలని కాదు. నెలసరిలో పూజలు చేయవచ్చని నా అభిప్రాయం కాదు.  తప్పనిసరి పరిస్థితిలో ఇంట్లో వంట చేసుకోవచ్చు..అని నా అభిప్రాయం. అలా చేయటం తప్పో..ఒప్పో ఏం చేయగలం?  అయినా, నెలసరిలో పక్కన కూర్చునే అలవాటులేని కుటుంబాలలో ఈరోజుల్లో ఇవన్నీ పాటించాలంటే కష్టం.  అర్ధం చేసుకోనప్పుడు,  మనుషులకు పదేపదే  చెప్పుకునే కన్నా, దైవానికి చెప్పుకోవటం మంచిది.

 రజస్వల ఉన్నవారు ఒక మూలన కూర్చోకుంటే, వారి ఇంట్లో వారిని కూడా పూజలు చేసే వారు ముట్టుకోకూడదంటున్నారు. మరి, వైద్యులు రోజూ హాస్పిటల్ కు వెళ్తారు.  ఎందరో  ఇతర సిబ్బంది..ఉంటారు. నెలసరి ఉన్నవారుంటారు. కొన్నిసార్లు రోగులు చనిపోతారు. ఇక వైద్యులు , హాస్పిటల్స్ లో ఇతర సిబ్బంది,  వారి కుటుంబసభ్యులు   పూజలు చేసుకోకూడదా? వారిని ఎవ్వరూ  తాకకూడదా? ఇవన్నీ పాటించటం . ఇవన్నీ చాలా కష్టం.  కొంతవరకే పాటించగలరు. 

 

 నేను ఎవరినీ బాధపెట్టాలని  ఈ విషయాలను వ్రాయలేదు. ఇంట్లో ఉండే స్త్రీల విషయంలో కూడా నెలసరి సమయంలో పక్కన కూర్చుంటే చిన్న పిల్లలకు కష్టం.ఈ రోజుల్లో చిన్న కుటుంబాల్లో భర్త ఆఫీసుకు వెళ్తే, పిల్లలు స్కూల్ నుంచి వస్తే పిల్లల్ని చూసుకోవాలి. ఇలా ఎన్నో పనులు ఉంటాయి.

 

   మనలో కూడా  దైవం ఉంటారని అంటారు.  దైవం సర్వాంతర్యామి. అయితే, సూర్యకాంతి.. మురికి నీటిపైన పడినా కూడా సూర్యునికి మురికి అంటదు.  మన లో దైవం ఉన్నా కూడా , మనుషులు చేసే పాపాలతో దైవానికి  సంబంధం ఉండదు. మనుషులు చేసే పుణ్యాలు, పాపాలను బట్టి మనుషులకు  కర్మఫలితం ఉంటుంది.

  మలమూత్రాలతో కూడిన శరీరంతోనే పూజలను చేస్తాము. ఉమ్మి ఉన్న నోటితోనే స్తోత్రాలను చదువుతాము. మానవశరీరాలు ఇలాగే సృష్టించబడ్దాయి. అలాగని మురికిగా ఉండకూడదు. 

 

 ఆచారవ్యవహారాలను అసలే వదిలేయమని కాదు. ఆచారవ్యవహారాలను పాటించాలి. పూర్వీకులు తెలియజేసిన ఆచారవ్యవహారాలలో ఎన్నో చక్కటి విషయాలు ఉన్నాయి. విచక్షణతో పాటించాలి.

 

11 comments:

  1. ఈ మధ్య కొందరు పురుషులు, కొందరు స్త్రీలు కూడా సమాజంలో ఉన్న కొన్ని ఆచారవ్యవహారాల గురించి వివరిస్తూ చక్కగా చెబుతున్నారు. ప్రజలలో మూఢనమ్మకాలను , ఎన్నో భయాలను పోగొడుతున్నారు. వారికి ధన్యవాదములు.

    అయితే, నెలసరి విషయంలో నాకు అనిపించిన కొన్ని విషయాలను వ్రాయాలనిపించింది.
    నెలసరి సమయంలో విడిగా కూర్చోవటం మంచిదే. అయితే, అలా కూర్చోవటం కొందరికి కుదరదు.
    అలాంటప్పుడు పాటించలేకపోతున్నామని భయపడకుండా కుదిరినంతలో పాటించాలి.

    మాంసాహారం ముట్టకుండా, ఎన్నో నియమాలతో జీవిస్తున్న వారు ..అనేక పూజలు, మడి ఆచారాలు, అంటుముట్టు వంటివి..సరిగ్గా పాటించగలరేమో కానీ, అన్నింటిని సరిగ్గా పాటించటం అందరికీ సాధ్యం కాదు.

    మాంసాహారం తింటూ, మడి ఆచారాలు వంటివి అంతగా అలవాటులేని వారికి, అంటుముట్టు వంటివి సరిగ్గా పాటించటం కష్టం.

    ఈ రోజుల్లో చాలామంది ఎన్నో పాపాలు చేసి సంపాదించిన సొమ్ముతో పూజలు చేసేస్తున్నారు. వీరిలో చాలామందికి తాము చేసే పాపాల పట్ల పశ్చాత్తాపం కూడా ఉండదు. పాపాలు చేసి సంపాదించిన సొమ్ముతో పూజలు చేయటం దోషం.ఇలాంటి పాపాత్ముల పట్ల కూడా అంటుముట్టు ఉండాలి.

    ఇక, ప్రకృతి ధర్మంగా వచ్చే నెలసరికే అంత అంటుముట్టు ఉంటే, పశుపక్ష్యాదులను చంపి ఆ శవాలను వండుకుతింటే ఎంత అంటుముట్టు ఉండాలి? అనిపిస్తుంది.

    ఎన్నో మోసాలు, పాపాలు చేయటం ద్వారా కలిగే దోషాలు, మాంసాహారం తినడంద్వారా కలిగే దోషాలు..వీటితో పోలిస్తే , నెలసరి రోజుల్లో తప్పనిసరి పరిస్థితిలో ఇంట్లో తిరగటం..వంట చేయటం . పెద్ద తప్పు కాదని నాకు అనిపిస్తుంది.

    ReplyDelete
    Replies
    1. జీవితంలో పాపాలు, మోసాలు చేయకూడదు. చేస్తే కష్టాలొస్తాయని చెప్పాలి. ఆచారవ్యవహారాల విషయంలో ప్రతిదానికి పాటించకపోతే కష్టాలొస్తాయని చెప్పటం కాకుండా, వాటిని పాటిస్తే మంచిదని చెప్పవచ్చు.

      Delete
  2. స్త్రీలకు నెలసరి సమయంలో ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి, రక్తస్రావం ఉంటుంది కాబట్టి.. విశ్రాంతి తీసుకుంటే మంచిది . ఇంట్లో పని చేయటం, పూజలు చేయటం, దేవాలయాలకు వెళ్ళటం చేయకూడదు.

    అయితే తప్పని పరిస్థితిలో ఇంటిపని చేయటం, స్కూల్స్, కాలేజ్, బయట పనికి వెళ్ళటం ఉన్నప్పుడు మరి వెళ్తారు కదా..

    అంతేకానీ, నెలసరి సమయంలోనే గుడికి ఎందుకు వెళ్ళకూడదు? పూజలు ఎందుకు చేయకూడదు? అని పంతానికి పోనవసరం లేదు. ఆ సమయంలో పూజలు చేయకుండా దైవధ్యానం చేసుకోవచ్చు.

    ఆచారవ్యవహారాలు ఎందుకు పాటించాలంటూ పంతాలుపట్టుదలలూ ఉండటమూ అవసరం లేదు.
    ఆచారవ్యవహారాలంటూ భయపడటమూ అవసరం లేదు.

    దైవాన్ని, ధర్మాన్ని నమ్మి పరిస్థితిని బట్టి విచక్షణతో నిర్ణయం తీసుకోవాలి.

    ReplyDelete
  3. రోజూ మాంసాహారం తినే వారింట్లో వంట చేసేటప్పుడు ఆ చేత్తోనే సీసాలోనుండి స్పూన్ తో ఉప్పు, కారం వేస్తూ ఉంటారు. మాంసాహారం వండేటప్పుడు ఒక ఉప్పు సీసా, శాకాహారానికి ఒక ఉప్పు సీసా.. అలా చాలామంది పాటించరు. ఇక అంటుముట్టు ఏముంటుంది.

    మాంసాహారాన్ని నూనెలో వేయించితే, ఆ నూనెను వేరేగా ఉంచి, మాంసాహార వంటలకే ఆ నూనెను వాడాలి. శాకాహార వంటలో ఆ నూనెను వేయకూడదు. ఈ మధ్య గుడ్డు శాకాహారం అని కొందరు తింటున్నారు. ఎగ్ బోండాలను వేస్తున్నారు. వ్యవస్థ ఇలా మారింది.

    ఇలాంటి భయాల వల్లే శాకాహారులు హోటల్స్ లో తినాలన్నా, మాంసాహారుల ఇంట్లో భోజనం చేయాలన్నా భయపడతారు. మాంసాహారం ఒకప్పుడు తిని తరువాత మానివేసిన వారు కూడా భయపడుతారు.

    ReplyDelete
  4. నెలసరి రోజుల్లో వంట చేయటం తప్పనిసరి అయినవారు కొన్ని పనులు చేయవచ్చు.

    గ్రహణాలు వచ్చినప్పుడు దర్భను పదార్ధాలపై వేసి గ్రహణం తరువాత తీసివేస్తారు. గ్రహణం ద్వారా వచ్చే నెగటివిటిని పోగొట్టే శక్తి దర్భకు ఉందని కనుగొన్నారు. నెలసరి వచ్చినవాళ్లు దర్భను ముట్టుకోవచ్చో లేదో నాకు తెలియదు. అయితే, శుద్ధి కొరకు పసుపునీటిని కూడా వాడుతారు..పసుపు నీటిని చల్లుతారు కదా.

    పసుపు నీటిని పప్పుదినుసులపై జల్లితే పురుగు వచ్చే అవకాశముంది కాబట్టి పసుపు కొమ్ములు వేయవచ్చు. చిన్న కాటన్ క్లాథ్ లో పసుపుకొమ్మును వేసి , దానిని బియ్యం, పప్పులు..వంటి వాటిలో వేసి నెలసరి శుద్ధి తరువాత తీసి పడవేయొచ్చని నాకు అనిపిస్తోంది..లేదంటే, శుద్ధి రోజున అన్నింటిపైన పసుపు కలిపిన నీటిని జల్లవచ్చు. ఆ నీటి చుక్కలతో ఇల్లు అంతా శుద్ధి అయిందని భావించవచ్చు.

    భావన ముఖ్యమని అంటారు .. పూజలు చేసేటప్పుడు దైవానికి రత్నసింహాసనం సమర్పించినట్లుగా భావించి పుష్పాలను, అక్షతలను సమర్పిస్తారు కదా.

    గ్రహణం, నెలసరి..వంటి సందర్భాలలో క్రింద ఉన్న వాటిని నీటితో శుద్ధి చేయగలం కానీ, ఇంటి గోడలను,అలమరాలను ..అన్నింటినీ తడిపి శుద్ధి చేయలేం. పసుపు నీటిని కానీ, గోపంచకం కలిపిన నీటిని కానీ ఇంట్లో చిలకరిస్తారు. శుద్ధి పేరుతో విపరీతంగా నీటిని వాడకూడదు.

    ఇంకో పద్ధతి ఏమిటంటే, నెలసరి రోజుల్లో వంట చేయాలంటే ముందే కొన్ని సరుకులను పక్కన పెట్టి వంట చేసుకోవచ్చు..ఎవరి వీలును బట్టి వారు చేసుకోవచ్చు.

    ReplyDelete

  5. నెలసరి ఇంట్లో కలుపుకోకూడదనే ఆచారాన్ని సరిగ్గా పాటించాలంటే ..అంటుముట్టును ఇంట్లోను కలపకూడదు.. బయట కూడా కలపకూడదు. అంటే, నెలసరి ఉన్నవారు బయటకు వెళ్ళకూడదు. ఎందుకంటే, నెలసరిలో ఉన్నప్పుడు బస్సులో కాలేజీలకు, ఆఫీసులకు వెళ్తే బయట అందరికీ ఆ అంటుముట్టు సోకుతుంది, బయటకెళ్ళినప్పుడు లిఫ్ట్ తలుపులను, కాలేజీలు, ఆఫీసులలో కుర్చీలను తాకుతారు. అవన్నీ శుద్ధి చేయలేరు. అందువల్ల అలా అంటుముట్టు కలవకూడదంటే బయటకు వెళ్ళకుండా ఇంట్లో ఒక పక్కన కూర్చోవాలి..మరి ఈ రోజుల్లో ఎంతమంది ఈ విధంగా పాటిస్తారు?
    ......
    యూట్యూబ్లో చెప్పేవారి నుండి నేను ఎన్నో గొప్ప విషయాలను నేర్చుకున్నాను. అయితే, మంచి విషయాలైనా కూడా కొన్ని విషయాలను నేను పూర్తిగా పాటించలేకపోవచ్చు. నేను వ్రాస్తున్న విషయాలను కూడా అందరూ పాటించలేకపోవచ్చు. ఎవరి పరిస్థితి వారిది.

    కరోనా సమయంలో మనుషులు చనిపోకుండా ఆరోగ్యంగా ఉండటానికే ఎన్నో కఠిననియమాలను చెప్పారు. అయినా కూడా అవి పాటించలేక జనం అల్లాడిపోయారు. దైవం దయవల్ల, ఇప్పుడు కరోనా తగ్గింది కాబట్టి జనం బ్రతికిపోయారు. ఇంకా కరోనా ఉంటే, ఏమైతే అయ్యిందని బయటకు వచ్చేస్తారు కానీ, నియమాలు అంటూ అస్తమాను కడగటం, తుడవటం..అలా చేయలేరని నాకు అనిపిస్తుంది.

    అన్ని ఆచారవ్యవహారాలను వదిలేయమని నా అభిప్రాయం కాదు. ఆచారవ్యవహారాలలో ఎంతో విజ్ఞానం ఉంది. మన మంచికొరకు ప్రాచీనులు ఏర్పరిచిన ఆచారవ్యవహారాలను పాటించాలి. అయితే, మన మంచికి అయినా కూడా , ఈ కాలంలో మారిన వ్యవస్థలో కొన్ని ఆచారవ్యవహారాలను పాటించే పరిస్థితి అందరికీ లేదు. పాటించగలిగినవారు పాటించగలరు.

    చాలాకాలం అన్నపానీయాలు సరిగ్గా తీసుకోకుండా తీవ్రమైన తపస్సులు చేసేవారు కొందరు ఉంటారు. అలా చేయటం అందరికీ సాధ్యమవదు. కొందరు తేలికగా పూజలు చేసుకుంటారు. ఎవరి శక్తి వారిది, ఎవరి పరిస్థితి వారిది.

    ReplyDelete
  6. ధర్మం విషయంలో ఏ కాలమైనా ఒకటిగానే ఉంటుంది, పెద్దగా తేడాలుండవు. ఉదా..చెడుగా ప్రవర్తించకూడదు, ఇతరులను మోసం చేయకూడదు, అత్యాశ ఉండకూడదు..ఇలాంటి వాటి విషయంలో ఏ కాలమైనా తేడాలుండవు.

    అయితే, ఆచారవ్యవహారాల విషయంలో దేశకాలమానపరిస్థితులను బట్టి కొన్ని సడలింపులు,మార్పులు చేర్పులు ఉండవచ్చు. ప్రాచీనకాలంలో పాటించే కొన్ని ఆచారవ్యవహారాలను ఇప్పుడు అలాగే చెప్పినట్లు పాటించటంలేదు. ఎన్నో ఆచారవ్యవహారాలలో మార్పులుచేర్పులు ఉన్నాయి.

    కలికాలంలో పరిస్థితులను బట్టి, చాలామంది ప్రజలు శారీరికంగా, మానసికంగా బలహీనులుగా ఉంటారని గ్రహించిన ప్రాచీనులు .. కలికాలంలో కొన్ని సడలింపులను తెలియజేసారు.

    నెలసరి విషయంలో.. ప్రాచీన కాలంలో సంగతి నాకు తెలియదు కానీ, ఈ రోజుల్లో నాకు తెలిసినంతవరకూ కొందరు శూద్రుల ఇళ్ళలో స్త్రీలు నెలసరి రోజుల్లో విడిగా కూర్చోవటం..అనే పరిస్థితి ఉండదు.

    శూద్రులు కూడా రజస్వల సమయంలో నాలుగురోజులు దైవపూజ చేయకుండా దూరంగా ఉంటారు. అయితే, చాలామంది స్త్రీలు ఆ సమయంలో వంట చేస్తారు. 4 రోజులు తరువాత ఇల్లు శుభ్రం చేసి, తలస్నానం చేస్తారు.

    పాతకాలంలో శూద్రులలో జన్మ సమయమే సరిగ్గా చూసుకునే వారు కాదు. ఇక, వివాహం విషయంలో జాతకాలు చూడటం పెద్దగా ఉండేది కాదు. ఇప్పుడు చాలామంది శూద్రులు వివాహానికి జాతకాలు కలవలేదంటూ.. నచ్చిన సంబంధాలను వదలుకుంటున్న వారెందరో ఉన్నారు.  ఆచారవ్యవహారాలు ఒకరిని చూసి ఒకరు ఎక్కువ చేసుకుంటున్నారు. వంశాచారాలు..వంటివి ఎవరివి వారికి ఉంటాయి.కులాలు, ప్రాంతాల వారీగా కూడా కొన్ని ఆచారవ్యవహారాలలో కొన్ని తేడాలు ఉంటాయనిపిస్తుంది.
    .............
    జీవితంలో నియమాలు అవసరమే, అయితే, నియమాలంటూ అతిగా ఆంక్షలు ఉంటే, అసలుకే మోసం వచ్చే ప్రమాదముంది.
    కరోనా సమయంలో అది ముట్టుకోకూడదు, ఇది ముట్టుకోకూడదంటే కొంతకాలానికి జనాలకు విసుగొచ్చి, కరోనా కొంత తగ్గుముఖం పట్టగానే పొలోమంటూ బయటకొచ్చేసి విపరీతంగా తిరిగారు.

    ఎంతో మారింది. బస్సులు, రైళ్లు వచ్చి అందరూ దగ్గరగా తిరుగుతున్నారు. స్త్రీలు బయటకెళ్లి చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు..చేస్తున్నారు. ఇలాంటప్పుడు అంటుముట్టు అని ఇంట్లో కూర్చోమంటే వినే పరిస్థితి ఉందా? ఆ నాలుగు రోజులూ పక్కన కూర్చుంటే మంచిదే, అయితే వినే వారెందరు? విడిగా కూర్చోకపోతే ఏం కష్టాలొస్తాయో? అని భయపడటం తప్ప చేయగలిగింది లేదు.
    ........
    గ్రంధాలలో ఉన్న కొన్ని ఆచారవ్యవహారాలు గత యుగాలకు సంబంధించినవి అయి ఉంటాయేమోనని అనిపిస్తుంది.

    ప్రాచీనకాలంలో ఉన్న వ్యవస్థలో నెలసరి సమయంలో విడిగా కూర్చోవటం వంటి ఆచారవ్యవహారాలు పాటించగలిగే వెసులుబాటు ఉండేది.  ఈ కాలంలో మారిన వ్యవస్థలో అవన్నీ పాటించాలంటే చాలా కష్టం.అలా పాటించకపోతే కష్టాలొస్తాయంటే ప్రజలు భయపడి, ఎందుకొచ్చిన గోల..అంట్లుముట్లు..అంతగాలేకుండా తేలికగా దైవపూజ చేసుకునే మార్గాలు చూసుకుంటే మంచిది.. అనుకునే పరిస్థితి కూడా ఉండొచ్చు.

    ఇలా చేస్తే తప్పు, అలా చేయకపోతే కష్టాలు వస్తాయంటూ కొందరు హిందువులు చెబుతుంటే.. మా విధానంలో నెలసరి అంటుముట్లు వంటి నియమాలు ఉండవు.. అని కొందరు చెబుతున్నారు.

    అన్ని ఆచారాలనూ పాటించలేని వారూ సమాజంలో ఉంటారు. పాటించకపోతే కష్టాలొస్తాయంటే భయపడతారు. కష్టాలొస్తాయంటే ఎవరికైనా భయమే కదా..

    కష్టాలలో ఉన్నవారి పరిస్థితి కొంత అయోమయంగా ఉంటుంది. ఆ పరిస్థితిలో ఎవరైనా వచ్చి, తేలికగా కష్టాలు పోయే విధానాలు చెప్తాం ..అంటే ఆశతో వెళ్ళేవారుంటారు.

    అంటుముట్టు సరిగ్గా పాటించకపోతే కొత్త కష్టాలొస్తాయంటే , ఎందుకొచ్చిన కష్టాలు..నెలసరి నియమాల వంటివి లేని మతాలను పట్టుకుంటే బాగుండనిపించవచ్చు. ..నేను ఈ విషయాలను ఎవర్నీ విమర్శించాలని వ్రాయలేదండి. ఈ విషయాన్ని దయచేసి గమనించండి.

    ReplyDelete
    Replies
    1. కొన్ని విషయాలను వ్రాయాలనిపించి వ్రాస్తున్నాను..
      నేను ఈ బ్లాగ్ ను మొదలుపెట్టడానికి అనేక కారణాలున్నాయి. కొన్ని మూఢాచారాల వల్ల సమాజానికి నష్టం కలుగుతోంది. పురాణేతిహాసాలలో విషయాల గురించి అనేక సందేహాలు కలుగుతుంటాయి. ఎందరో పండితులు ప్రవచనకర్తలు ఎన్నో విషయాలను తెలియజేస్తున్నారు. అయినా కొన్ని సందేహాలు ఉంటాయి. వాటిగురించి నాకు కలిగిన అభిప్రాయాలను బ్లాగులో వ్రాయటం జరిగింది.

      ఇప్పటికే చాలా వ్రాసాననిపించి, ఇప్పుడు ఎప్పుడో వ్రాయాలనిపిస్తే తప్ప వ్రాయటం లేదు. పోస్టులు ఎక్కువగా పెంచటం ఇష్టం లేక వ్రాయాలనుకున్నది కామెంట్స్ వద్ద రాస్తుంటాను. ఎప్పుడైనా పోస్టులో మరికొన్ని విషయాలను రాయాలనిపిస్తే, పోస్ట్ పెద్దది అవ్వకుండా ఆ విషయాలను కామెంట్స్ వద్ద రాస్తుంటాను. ఎన్నో విషయాలను వ్రాయటం నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇలా వ్రాయగలగటం దైవం దయవల్లనే. వ్రాసిన విషయాల్లో ఒప్పులను దైవదయవల్ల వ్రాసినట్లుగా,తప్పులు నేను వ్రాసినట్లుగా నేను అనుకుంటున్నాను.

      ఇక, యూట్యూబ్లో చెప్పే కొన్ని విషయాల గురించి నాకు ఏమనిపిస్తుందంటే, ఎందరో ఎన్నో చక్కని విషయాలను చెబుతున్నారు. అయితే కొన్ని విషయాలు వింటే అయోమయం, భయం కూడా కలుగుతుంది. వాటిని పాటించకపోతే తట్టుకోలేని కష్టాలొస్తాయంటే ఎవరికైనా భయమే కదా..అలాగని వారు చెప్పేవి అన్నీ పాటించే పరిస్థితి ఉండదు. అందరి పరిస్థితి ఒకలా ఉండదు కదా..

      కొన్ని ఆచారవ్యవహారాలను పాటించలేక నేను ఇబ్బందులు పడ్దాను. చాలాసార్లు నాకే విసుగొచ్చి నేను పాటించగలిగినంతవరకే పాటిస్తూ, నాకు తోచినట్లు దైవాన్ని హాయిగా ప్రార్ధించుకుంటే బాగుంటుందనిపిస్తుంది. పాపమో పుణ్యమో దైవమే చూసుకుంటారు. దైవానికి మన అశక్తతను చెప్పుకోవటం మంచిదనిపిస్తుంది. దయచేసి క్షమించండి దైవమా..అని ప్రార్ధించుకుంటే దైవం తప్పక అర్ధం చేసుకుంటారు.

      ఈ రోజుల్లో అనేక ఆచారవ్యవహారాలలో మార్పులుచేర్పులు వచ్చాయి.ఉదా..పూర్వం రోజుల్లో సముద్రం దాటి వెళ్లటం పెద్ద దోషం. ఇప్పుడు వేలమంది సముద్రాలను దాటి వెళ్తున్నారు.

      ఆచారవ్యవహారాలు, కొన్ని మూఢవిశ్వాసాల గురించి నేను చాలా పోస్టులు వ్రాసాను. ఏ ఒక్కరినో లేక కొందరినో ఉద్దేశించి నేను పోస్టులు, కామెంట్లు వ్రాయలేదండి. ఆ విషయాలను గురించి నా అభిప్రాయాలను రాయాలనిపించి వ్రాసాను.

      ఇక నెలసరి అంటుముట్టు గురించి ఈ రోజుల్లో పాటించటం అందరివల్లా సాధ్యం కాదని చెప్పాలనిపించి వ్రాసాను. ఎందరో పాటించలేని వారిని దృష్టిలో ఉంచుకుని వ్రాసాను. నేను కూడా నెలసరిలో పూజలు చేయాలని, దేవాలయాలకు వెళ్ళవచ్చని చెప్పలేదు. తప్పనిపరిస్థితిలో ఇంట్లో వంటచేసుకోవచ్చని చెప్పాను.

      సమాజంలో ఎన్నో వృత్తులవారున్నారు. ఎవరి నియమాలు వారికుంటాయి. కులాలు, ప్రాంతాల వారీగా ఆచారవ్యవహారాల్లో కొన్ని తేడాలుంటాయి. జీవితంలో దైవభక్తి కలిగి, నీతినియమాలతో, సత్ప్రవర్తనతో జీవిస్తే దైవకృపను పొందవచ్చని ప్రాచీనులు తెలియజేసారు.

      Delete
    2. దైవం సృష్టిలో ఎక్కడైనా ఉంటారు.
      మనలో కూడా దైవం ఉంటారని అంటారు. . అయితే, సూర్యకాంతి.. మురికి నీటిపైన పడినా కూడా సూర్యునికి మురికి అంటదు. మనలో దైవం ఉన్నా కూడా, మనుషులు చేసే పాపాలతో దైవానికి సంబంధం ఉండదు. మనుషులు చేసే పుణ్యాలు, పాపాలను బట్టి మనుషులకు కర్మఫలితం ఉంటుంది.

      కొన్ని కారణాల వల్ల సముద్రాలను దాటడం దోషమని నియమాన్ని ఏర్పరిచారు. అయితే, కొన్ని కారణాల వల్ల చాలామంది సముద్రాలను దాటి, అవతల ఉన్న దేశాలకు వెళ్తున్నారు.

      కొన్ని కారణాలతో నెలసరి సమయంలో కొన్ని నియమాలను ఏర్పరిచారు. అయితే, కొన్ని కారణాల వల్ల చాలామంది వాటిని సరిగ్గా పాటించలేకపోతున్నారు.

      Delete
  7. @anrd మీ అభిప్రాయాలు ఉత్తమంగా ఉన్నాయి.. హిందూ మతంలోని నియమాలకు భయపడి ఏ మడీ లేని క్రైస్తవంలోకి వెళ్ళిపోయిన జంట నాకు తెలుసు .. నిజానికి వేదాలలో.. పురాణాలలో అంటుముట్టు కోసం మరీ కటినమైన నియమాలు విధించలేదు .. ఈ కాలపు కుహానా సిద్ధాంతులు ఇలా డబ్బుకోసం , తమ పేరుకోసం ఇలా లేనిపోనివి సృష్టిస్తున్నారు .. ఇక యూట్యూబ్ ఛానల్లో అయితే మరీ ధారుణం .. తుమ్మినా, దగ్గినా స్నానం చేయాలి అంటున్నారు

    ReplyDelete
  8. ధన్యవాదములండి. ఎందరో పండితులు ప్రవచనకర్తలు పామరులు.. కూడా ఎన్నో మంచి విషయాలను తెలియజేస్తున్నారు. వారి నుంచి నేను ఎన్నో చక్కని విషయాలను నేర్చుకున్నానండి. అయితే, కొన్ని విషయాల గురించి పండితుల మధ్యన అభిప్రాయభేదాలు ఉండి వారి మధ్యన చర్చలు జరగటం కూడా జరుగుతుంది.. ఇలాంటప్పుడు ఎవరు చెప్పేది ఎంతవరకు పాటించాలో? పాటించకూడదో? అర్ధంకాక అయోమయం కలుగుతుంది. కొన్ని ఆచారవ్యవహారాలను పాటించటం కష్టం.

    ReplyDelete