koodali

Sunday, August 27, 2023

బలవంతులు బలహీనులను పీడించకూడదని మాట్లాడే హక్కు వీరికి ఉందా?

 

చాలామంది ఏమంటారంటే, సమాజంలో బలవంతులు బలహీనులను అణచివేస్తున్నారు. ఇది అన్యాయం కదా..బలహీనులకు జీవించే హక్కులేదా? అని ప్రశ్నిస్తారు. నిజమే బలవంతులు బలహీనులను అణచివేయటం ఘోరమైన తప్పే. 

 మరి ప్రపంచంలో అన్ని జీవులకూ జీవించే హక్కు ఉంది. చాలామంది మనుషులు జంతువులను ఎందుకు చంపి తింటున్నారు? 

 

 మనుషులు బలవంతులు కాబట్టి, బలహీనులైన పశుపక్ష్యాదులను బంధించటం, చంపి తినటం చేస్తున్నారు. మనుషులకు తెలివి ఉంది. రకరకాల విధాలుగా ఆలోచించి జంతువులను శాసిస్తున్నారు.

 

 ఇలా పశుపక్ష్యాదులను బాధపెట్టేవారికి, చంపి తినేవారికి ..బలహీనులను బలవంతులు శాసించకూడదని మాట్లాడే హక్కులేదు. 

 

 మనకు బుద్ధి బలం ఉంది కదా ..అని జంతువులను ఎన్నో విధాలుగా వాడుకుంటున్నాము. వాటిని తాళ్లతో కట్టి, పొలాలలో బండ్లకు కట్టి వ్యవసాయం చేస్తాము. అవి ఎదురుతిరగలేవు కాబట్టి అలా బాధను అనుభవిస్తున్నాయి. 

బండిలాగకుంటే చర్నాకోలతో కొట్టి నడిపిస్తారు. అదే మనుషులతో బండిలాగిస్తే అన్యాయం.. అంటూ గుండెలు బాదుకుంటారు. 

 

నొప్పి,బాధ.. మనిషికైనా, జంతువుకైనా ఒకటే. మనుషులు నీతులు చెప్పటం కాదు, నీతులను ఆచరించాలి. ఉదా.. మూగ జీవులపట్ల దయతో ఉండాలి. వాటిని చంపి తినకూడదు..అలా తింటున్నవారికి ..బలహీనులను బలవంతులు పీడించకూడదని మాట్లాడే హక్కులేదు. 

 ..............

  ఎవరికైనా.. గతజన్మలోనో, ఇప్పుడో చెడుకర్మలు చేసినప్పుడు ఆ చెడుకర్మల ఫలితంగా కష్టాలు వస్తాయి. మూఢనమ్మకాలు ఉండి.. వాటితో కుటుంబసభ్యులను, ఇతరులను ఇబ్బంది పెట్టినా కూడా కష్టాలు వచ్చే అవకాశముంది.



 కష్టాలను పోగొట్టుకోవటానికి పరిహారాలపేరిట ఇతరజీవులను బాధకుగురిచేసి జీవహింస వంటివి చేస్తే తాత్కాలింగా కొందరికి కష్టం తగ్గినట్లు అనిపించినా..జీవహింస చేసినందుకు  భవిష్యత్తులో ఇంకా కష్టాలు వచ్చే అవకాశముంది..గతంలో పాపాలు చేసినందుకు వచ్చిన కష్టాలను పోగొట్టుకోవటానికి , జీవహింస చేయటం అనే కొత్త పాపం చేసి కొత్త కష్టాలు తెచ్చుకోవటం ఎందుకు?


 మనుషులు చెడును బలి చేయటానికి (వదిలివేయటానికి) ప్రయత్నించవచ్చు..
చెడ్డపనులు చేయకుండా.. ఇతరజీవులను బాధపెట్టకుండా ఉండటానికి ప్రయత్నిస్తూ.. దైవప్రార్ధన చేస్తూ మంచిపనులు చేస్తూ ఉంటే..  కష్టాలు తగ్గే అవకాశముంటుంది.

oka link...

  మొక్కులు తీర్చగలమో ? లేదో? ..మరికొన్ని విషయాలు..

 

1 comment:

  1. ఎవరైనా మంచిచేసినా.. చెడ్ద చేసినా దానికి తగ్గ ఫలితాలు ఉంటాయి.

    చెడ్దవారి విషయంలో ఎలాగూ వారు చేసిన చెడుపనులకు తగ్గ ఫలితాలు ఉంటాయి. అయితే, కొందరు మంచివారికి కూడా కొన్ని కష్టాలు రావటం, వ్యాధులు రావటం.. లోకంలో గమనిస్తాం.

    గొప్ప మహానుభావులకు ఎన్నో మంచిపనులు చేసినా కూడా ఇలాంటి కష్టం ఎందుకు వచ్చిందో కదా ..అనిపిస్తుంది. అయితే, కర్మలకు సంబంధించి ఎవరికర్మ ఏమిటి? దానికి ఫలితాలు ఎలా ఉంటాయి? అనేది..మనకు తెలియని విషయాలెన్నో ఉంటాయి. అవన్నీ దైవానికి తెలుస్తాయి. కొన్ని విషయాలు ఆలోచిస్తే ఏమనిపిస్తుందంటే, మంచివారి వల్ల కూడా కొన్నిసార్లు ఇతరులకు ఇబ్బందులు వస్తాయి.

    ఉదా..ఒక మంచివ్యక్తి తాను కొన్ని మూఢనమ్మకాలను నమ్మి, కుటుంబసభ్యులను, ఇతరులను కూడా ఆ మూఢనమ్మకాలతో ఇబ్బంది పెడితే, ఆ ఉసురు వల్ల అతనికి ఈ జన్మలోనో, మరుజన్మలోనో..కొన్ని కష్టాలు..వచ్చే అవకాశముంది.

    మూఢనమ్మకాలతో కొందరు తాము భయపడుతూ ఇతరులను భయపెడుతుంటారు. వారి మాటలను నమ్మి చాలామంది మూఢనమ్మకాలను ఆచరించే విషయంలో వారి కుటుంబసభ్యులతో గొడవలు పడతారు. అందువల్ల కుటుంబాలలో గొడవలు జరిగే పరిస్థితి వస్తుంది. కుటుంబాల్లో జరిగే గొడవల ఫలితం ..మూఢనమ్మకాలను చెప్పిన వారికి కూడా కొంత తగిలే అవకాశముంది. అందువల్ల ఎవరు ఏం చెప్పినా జాగ్రత్తగా చెప్పాలి.

    ఈ రోజుల్లో యూట్యూబులో కొందరు తమకు తోచినట్లు ఎన్నో విషయాలను చెబుతున్నారు. గ్రంధాలలో ఉన్న విషయాలలో కొన్ని ప్రక్షిప్తాలు ఉంటాయి. అందువల్ల విచక్షణతో నిర్ణయాలు తీసుకోవాలి.

    దైవం అంటే కూడా భయపడుతూ ఉండటం అనేది బాధాకరమైన విషయం. మనుషులకు దైవం అంటే ఎంతో ఆత్మీయంగా, ఆప్యాయంగా, అరమరికలు లేకుండా మన కష్టసుఖాలను అన్నింటినీ చెప్పుకోగలిగిన ఆత్మీయశక్తిగా ఉండాలని అందరికీ అనిపిస్తుంది.

    దైవం అంటే గౌరవంతో కూడిన భయభక్తులు ఉండవచ్చు కానీ, దైవపూజ అంటే భయపడుతూ ఏం తప్పులు వస్తే ఏం కష్టాలు వస్తాయో? అనే విధంగా ఉండకూడదు.

    దైవం మనలో ఉన్నారు..సృష్టి అంతా ఉన్నారు. మనలోనే ఉన్న దైవాన్ని ఎప్పుడైనా చక్కగా స్మరించుకోవచ్చు.

    ప్రతిదానికి ఇలా చేయకూడదు, అలా చేయాలి..అనుకుంటూ భయపడుతూ దైవానికి దూరమవ్వకూడదు.

    ReplyDelete