koodali

Sunday, January 12, 2025

కొన్ని విషయములు..

 

 పండుగల సమయాల్లో దేవాలయాలకు భక్తులు ఎక్కువగా వస్తుంటారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శనానికి జనం బాగా వెళ్తారు.

 వైకుంఠ ఏకాదశి టికెట్ల కొరకు రద్దీ ఎక్కువై జరిగిన తోపుడులో కొందరు మృతిచెందారని, మరికొందరికి గాయాలయినట్లుగా వార్తల ద్వారా తెలుస్తోంది. 

 ఇలా జరగటానికి అనేకకారణాలుంటాయి. ఏం జరిగిందో అంతా దైవానికే తెలుస్తుంది.

జనం  బాగా ఎక్కువ వస్తే ఏం చేయాలో దేవాలయాలను నిర్వహించేవారు  అనేక   జాగ్రత్తలు తీసుకోవాలి.    బాగా ఎక్కువమంది సెక్యూరిటీ సిబ్బందిని నియమించాలి. 

 

  సిబ్బందిని ఎక్కువగా నియమించితే ఎక్కువమందికి ఉద్యోగాలు కూడా వస్తాయి. సిబ్బంది  కూడా చక్కగా పనిచేయాలి. ..

ప్రజలు అందరూ కూడా జాగ్రత్తగా  ప్రవర్తించాలి.

 నిర్వాహకులు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి...వీఐపి..దర్శనాలంటూ సామాన్య భక్తులను ఇబ్బంది పెట్టటం సరైనది కాదు...అవి  తగ్గించితే చాలామందికి ఇబ్బందులు తగ్గుతాయి.

 

 దైవం వద్ద వీ ఐ పీ.. అని ఎవరూ ఉండరు...అయితే, సెలెబ్రిటీలు అనేవారు వస్తే  కొందరు జనాలు ఒకరినొకరు తోసుకుంటూ.. సెలెబ్రిటీ వెంటపడే ప్రమాదం లేకపోలేదు. సెలెబ్రిటీలు మనుషులే. వారికీ దైవదర్శనం చేసుకోవాలనిపిస్తుంది కదా..

 

  అందువల్ల,  వీ ఐ పీ దర్శనాలు  వారంలో   ఒక గంట చొప్పున , ముఖ్యమైన రోజులలో కొంత సమయం వారికి కేటాయించవచ్చు. లేదంటే, ఎలా కేటాయిస్తే బాగుంటుందో ఆలోచించి చేయాలి.

 

వీ ఐ పీలు.. ఇతర భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, దైవదర్శనం కొరకు తరచుగా కాకుండా, కొన్నిసార్లు మాత్రమే వస్తే బాగుంటుంది..వీఐపీలు తమతోపాటు బోలెడు మందిని తీసుకువస్తే, వాళ్ళను కూడా వీఐపీ సౌకర్యాలతో పంపకూడదు.

************

మేము ఈ మధ్యన పొరుగురాష్ట్రంలోని ఒక ప్రముఖ పుణ్యక్షేత్రానికి వెళ్లినప్పుడు రద్దీ బాగా ఉంది. ఆ రోజున ముందుగా అనుకుని మేము వెళ్ళలేదు. కొన్ని కారణాలవల్ల అనుకోకుండా అప్పటికప్పుడు వెళ్ళాము. చాలా మందితో కిక్కిరిసి ఉంది. క్యూలలో తిరుగుతూ దైవదర్శనానికి చాలా సమయం పట్టింది.



 కొందరు ఓపికతో క్యూలలో నడుస్తున్నారు. కొందరు జనాలు గోలగా ఒక క్యూనుంచి ఇంకో క్యూలోకి దూకేసారు. అదంతా చాలా గాభరా అనిపించింది.అలాంటప్పుడు ఏమైనా తొక్కిసలాట జరిగితే ఏమవుతుందోనని భయం కలిగింది.

***********

ఎక్కువమంది జనం వచ్చినప్పుడు సహజంగానే ఎక్కువసమయం వేచిఉండవలసి వస్తుంది. అలా వేచి ఉండలేనప్పుడు రద్దీ సమయాల్లో రాకుండా ఉంటేనే మంచిది. ముఖ్యంగా చిన్నపిల్లలను తీసుకుని విపరీతమైన రద్దీ సమయాల్లో అసలు వెళ్లకూడదు.


క్యూలలో వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి. క్యూలలో తోపుళ్ళు జరిగి ఎవరికైనా విషాదం జరిగితే వారు, వారి కుటుంబసభ్యులే కదా బాధలు అనుభవించాలి.


బాగా ఎక్కువసేపు క్యూలో ఉండలేక అసహనం, నీరసం కలుగుతాయి. ఇలాంటప్పుడు కూడా ప్రజలలో అసహనం పెరుగుతుంది.  

 
 కొందరు వాళ్లకు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తారు. ఇలాంటి కొందరివల్ల చాలామందికి కష్టాలు కలుగుతాయి.
..
................


తిరుమలలో ఇంతకుముందు కూడా రద్దీ ఉండేది. క్యూలలో కొందరు జనం తోసుకుంటారు. గేట్లు తెరవగానే ఒకేసారి గోలగా పక్కవాళ్ళను నెట్టేస్తూ వెళ్లేవారు ఉంటారు.


కొన్నిచోట్ల అటుఇటూ జనంతో ఆ క్యూలైన్ల మధ్య ఊపిరి ఆడనట్లు ఉంటుంది. బయటకు వెళ్ళాలన్నా పక్కన 
మెష్ లు పైవరకూ ఉంటాయి. వాటికి తాళాలు వేసి ఉంటాయి. తాళాలు తీయడానికి అక్కడ ఎవరైనా ఉన్నట్లు అనిపించలేదు. అలాంటప్పుడు ఏమైనా తొక్కిసలాట జరిగితే ఎలా..అని భయమేస్తుంది.

 

అయితే, క్యూలలో ఎంత రద్దీగా ఉన్నా కూడా,  దైవం దయ వల్ల తిరుమలలో ఇప్పటివరకూ ఎలాంటి విషాదం జరగలేదు.

***************

 తిరుమల భక్తులు వేచి ఉండే రూములలో ఒక్కో రూములో సగానికి బారికేడ్లు వేసి, భక్తులను కూర్చోబెట్టి తలుపులు తెరిచినప్పుడు అందరూ ఒకేసారే  రాకుండా, రూములో వారిని ఒక వరుసలో  రమ్మని..భక్తులను బయటకు పంపేటప్పుడు రెండు లైన్ల లో పంపుతూ..ఆ రెండులైన్లలో మాత్రమే భక్తులు ఉన్న కంపార్ట్మెంట్ గదుల నుండి...మూలవిరాట్టు వరకు వెళ్ళి దర్శనం చేయిస్తే బాగుంటుందనిపిస్తుంది.


 మూలవిరాట్టు వద్దకు వెళ్ళేముందు కొంతదూరంలో అన్ని క్యూలైన్లను కలిపేస్తే..  జనాలు నెట్టుకుంటూ దైవదర్శనం సరిగ్గా చేయలేరు. 

 

అలా కాకుండా, మొదటినుంచి.. మూలవిరాట్టు దర్శనం వరకు పక్కపక్కన ఉండే రెండు క్యూలైన్లలో మాత్రమే భక్తులు బయటవరకూ  వెళ్ళేలా చేస్తే బాగుంటుంది. 

ఒక్కో క్యూలైన్లో కూడా ఒకరితరువాత ఒకరు నడిచేలా చూడాలి.


 
భక్తులు ఒకరినొకరు నెట్టుకోకుండా క్యూలైన్ల వద్ద అక్కడక్కడా సెక్యూరిటీ సిబ్బందిని ఎక్కువమందిని నియమించాలి. 

గ్రిల్స్ కు తాళాలు వేసినా కూడా, ఆ తాళాలు అక్కడ ఉండే సెక్యూరిటి వద్ద ఉంచితే ఎప్పుడైనా అవసరం అనిపించినప్పుడు వెంటనే తాళాలు తీసేలా ఉండాలి... అక్కడి సిబ్బంది క్యూలో ఉన్నవారి బాగోగులు చూడాలి.

 

తిరుమలలో భక్తులకు ఎప్పటినుంచో ఎన్నో సౌకర్యాలను ఇస్తున్నారు. ఉదా..కంపార్ట్మెంట్లలోను, బయట వేచి ఉండే భక్తులకు ఆహారాన్ని, నీటిని అందిస్తున్నారు.

 

క్యూలైన్లో ఉన్న భక్తులకు పెద్దవారికి, చిన్నపిల్లలకు అర్జంటుగా బాత్రూం కు వెళ్లాలంటే గ్రిల్స్ తాళాలు తీసి, బయటకు వెళ్ళేవారికి ఒక టోకెన్ ఇచ్చి, మరల క్యూలోకి రావటానికి ఆ టోకెన్ చూపించితే లోపలికి పంపవచ్చు. కొన్ని క్యూలైన్ల పక్కనే టాయ్లెట్స్ ఉన్నప్పుడు వాటిని ఉపయోగించవచ్చు.

  *************

 క్యూలలో దైవదర్శనం విషయంలో బోలెడు మంది భక్తులకు దైవదర్శనం చేయించాలంటే ఎన్నో  విషయాలుంటాయి. ..నాకు తెలిసినంతలో, దేవాలయాలలో దైవానికి రోజూ నిర్వహించే పూజలు ఉంటాయి..అందువల్ల భక్తుల దర్శనానికి కొన్నిసార్లు బ్రేక్ ఇస్తారు....

 

 ఇంకా, వీ ఐ పీ లు దర్శనాలంటూ మరికొంత సమయం బ్రేక్ ఉంటుంది. ఇక, ఇతర భక్తులకు దర్శనం కొరకు మిగిలే సమయం తక్కువగా ఉంటుంది.. ఇలాంటప్పుడు వేలాదిగా వచ్చే భక్తులు దైవాన్ని దర్శించుకోవాలంటే చాలా సమయం వేచి ఉండవలసి వస్తుంది.

********

 దైవదర్శనం ఎక్కువసేపు చేయాలని, చాలామంది మూలవిరాట్టు ముందు ఎక్కువసేపు ఉండాలనుకుంటారు. అయితే, మన వెనుక ఎందరో వేచిఉన్నారని గుర్తుంచుకుని ప్రవర్తించాలి. 

కొన్నిసార్లు కొందరు  సిబ్బంది ప్రజలను లాగేయటం కాకుండా, నిదానంగా పక్కకు జరపాలి.

  *********

ఎక్కడైనా ప్రమాదాలు జరగటానికి అనేక కారణాలుంటాయి. ఉదా..సరైన ప్రణాళిక లేక పోవటం వల్లగానీ, కొన్నిసార్లు వేసిన అంచనాలు తప్పటం వల్లకానీ, కొందరికి క్రమశిక్షణ..బాధ్యత సరిగ్గా లేకపోవటం వల్లకానీ, సమన్వయలోపం వల్ల కానీ, ఊహించని విధంగా అప్పటికప్పుడు సంఘటనలు జరగటం వల్లకానీ, ఎవరైనా కుట్ర చేయటం వల్లకానీ, ఇంకా మనకు తెలియని అనేక కారణాల వల్లకానీ..ప్రమాదాలు జరగవచ్చు. సరిగ్గా ఏం జరిగిందో దైవానికే  తెలుస్తుంది.

**************

 భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఎన్నో ఏళ్ళు గడిచినా కూడా, ఇంకా ఎన్నో సమస్యలు అలానే ఉన్నాయి.. సమాజం సరిగ్గా ఉండాలంటే.. ప్రజలు, అధికారులు, ప్రభుత్వాలు..అందరూ ఎవరి పనిని వారు సక్రమంగా నిర్వహించాలి.

 **********
వ్రాసిన వాటిలో ఏమైనా తప్పులుంటే దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.


2 comments:

  1. మీ విశ్లేషణ బాగుంది .

    ReplyDelete
  2. సర్..మీకు ధన్యవాదములండి.

    ReplyDelete