koodali

Sunday, August 27, 2023

ఒంటినిండా, ఇంటినిండా ఎన్నో వస్తువులు ప్రోగేసుకోవటం కన్నా...

 


ఈ రోజుల్లో చాలా మంది ఎలాగోలా డబ్బు  సంపాదించి, వస్తువులను కొనటం కోసం విపరీతంగా ఖర్చు పెడుతున్నారు.

దుస్తుల కోసం, ఫర్నిచర్ మరియు  కార్లు..వంటి వాటి విషయంలో అవసరానికి మించి ఖర్చుపెడుతున్నారు.

ఈ రోజుల్లో చాలామందికి నెలకే వేలు లేక కొన్ని లక్షల వరకు  ఆదాయం వస్తోంది. ఈ డబ్బుతో విపరీతంగా వస్తువులను కొనిపడేస్తున్నారు.

మనిషి  సౌకర్యంగా జీవించాలంటే కొన్ని వస్తువులు చాలు.
 ఉదాహరణకు దుస్తుల విషయంలో చూస్తే..

 ఒక మనిషి ఒక సంవత్సరానికి.. రోజువారీ ధరించే దుస్తులు అరడజను( సుమారు 1000  రూపాయల లోపు ), వారాంతాల్లో ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ధరించటానికి  నాలుగు దుస్తులు ( సుమారు 1000 నుంచి 2000 ధరలో ) ఫంక్షన్స్లో  ధరించటానికి (2000 నుంచి 5000 ధరలో)  రెండు ఖరీదైన డ్రస్సులు కొనుక్కోవచ్చు.

ఈ విధంగా ఒక  మహిళకు  సంవత్సరానికి సుమారు  సుమారు  10,000 లేక  25,000 ఖర్చు చేస్తే 12 చీరలు లేక డ్రస్సులు వస్తాయి.. వచ్చే సంవత్సరం మళ్లీ కొత్తవి కొనుక్కోవచ్చు.

  అయితే, ఈ రోజుల్లో చాలామంది ఒక్కో డ్రస్సుకే 20 వేలు, 50 వేలు, ఒక లక్ష..ఆపైన కూడా ఖర్చు చేసి కొంటున్నారు.

 ( సొంత ఫంక్షన్స్ కొరకు అయితే కొంచెం ఎక్కువ ఖరీదు పెట్టి  దుస్తులు కొనుక్కోవచ్చు. )

డబ్బు ఎక్కువఉన్న వారు కూడా  పరిమితమైన ధరలో వస్తువులు కొనుక్కోవచ్చు.

కోటి రూపాయల కారు కన్నా 10 లక్షల లేక 20 లక్షల  కారును కొనుక్కోవచ్చు.

 (పైన వ్రాసిన ధరలను కొంచెం ఎక్కువ తక్కువగా మార్చుకోవచ్చు.)

మార్కెట్లో కుప్పలుతెప్పలుగా వచ్చి పడుతున్నవన్నీ కొనాలని ఆశపడకుండా , ఏది అవసరమో అవే కొనుక్కుంటే బాగుంటుంది.

 బాగా డబ్బున్న వాళ్ళు ఎక్కువ ధరలు పెట్టి బోలెడు వస్తువులను కొనటం కన్నా, తగుమాత్రం వస్తువులను కొనుక్కుని,  తమ ఉద్ద ఉన్న డబ్బుతో.. డబ్బు బాగా అవసరం ఉన్నవారికి సహాయం చేస్తే ఎంతో మనశ్శాంతి లభిస్తుంది.

 ఉదా.. డబ్బు లేక  వైద్యాన్ని చేయించుకోలేకపోతున్నవారికి, డబ్బు లేక చదువుకు దూరమవుతున్నవారికి..ఇలా సహాయం చేయవచ్చు.

ఊళ్ళలో నీటిశుద్ధి కేంద్రాలను  ఏర్పాటుచేయవచ్చు. ఉచిత అన్నదానం, వైద్యకేంద్రాలను ఏర్పాటుచేయవచ్చు. ఇలా ఎన్నో చేయవచ్చు. 
 
పర్యావరణాన్ని రక్షించే సంస్థలకు ధనసహాయం చేయవచ్చు. 
 
పశుపక్ష్యాదులను కాపాడే వారికి సాయం చేయవచ్చు. ఇందువల్ల పుణ్యం వస్తుంది. 
 
  అదేపనిగా అతిగా దానాలు చేసేసి తాము అడుక్కునే పరిస్థితి తెచ్చుకోకూడదు.
 
జీవితంలో ఎప్పుడైనా కష్టం వస్తే, మనం చేసుకున్న పుణ్యం వల్ల కష్టాలు తగ్గే అవకాశం ఉంటుంది.
 
 పొదుపుగా జీవించలంటారు.. వస్తువులపైన వ్యామోహాన్ని తగ్గించుకుంటే, వాటికోసం  అతిగా డబ్బు సంపాదించవలసిన అవసరం కూడా తగ్గుతుంది.
 
 ఐశ్వర్యాన్ని అతి ఆడంబరంగా ప్రదర్శించేవారికి ఇతరుల నుండి దృష్టి ( నెగటివ్ శక్తి..) తగిలి కష్టాలు వచ్చే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. 
 
 ఒంటినిండా, ఇంటినిండా ఎన్నో వస్తువులు  ప్రోగేసుకోవటం కన్నా, మనతో పాటు ఇతరుల జీవితాలు బాగుపడటంలో  సహాయపడటం ఎంతో మంచిది.
 .....................
 

2 comments:

  1. కొన్ని అపార్ట్మెంట్స్ లో లిఫ్ట్ బయటవారు కనిపించేటట్లు ఉంటుంది. అయితే, కొన్నిచోట్ల పూర్తిగా క్లోస్ చేసిన తలుపులతో ఉండే లిఫ్ట్ ఉంటుంది. ఇలాంటి లిఫ్ట్ ఏ కారణం చేతనైనా కొద్దిసేపు ఆగిపోతే అందులో వారు భయపడతారు. చిన్నపిల్లలయితే ఇంకా భయపడతారు. ఇలాంటి లిఫ్ట్ల్లో ఒక తలుపుకు పైనుంచి క్రిందకు కొద్దిగా ఖాళీ ఉండేటట్లు, అంటే పొడుగుగా ఉండే కిటికీలాగ చేసి దానికి మెష్ అమర్చి తయారుచేస్తే ఎప్పుడయినా ఆగిపోతే అందులో ఉన్నవారికి గాలి ఆడుతుంది, బయటకు కనిపిస్తుంది.చిన్నపిల్లలకు కూడా బయట కనిపించేలా ఉండాలి. అయితే చేతి వేళ్ళు పట్టకుండా సన్నటి మెష్ అమర్చాలి. లిఫ్టులో వాచ్ మెన్ కు తెలిసేలా ఫోన్ కూడా పెట్టవచ్చు.

    చాలా అపార్ట్ మెంట్స్ లో ఇళ్లలో పనిచేసేవారిని, కూరలు అమ్మేవారిని లిఫ్ట్ వాడనివ్వరు. అన్ని మెట్లు ఎక్కాలంటే ఎవరికైనా కష్టమే. ఆ వర్కర్స్ వచ్చి పనిచేయకపోతే చాలామందికి కుదరదు. అందువల్ల వర్కర్స్ నూ లిఫ్ట్ వాడనివ్వాలి. అలా కుదరదు అంటే, కనీసం పైకి వెళ్ళేటప్పుడు లిఫ్ట్ ఉపయోగించి, క్రిందకు దిగేటప్పుడు మెట్లను వాడవచ్చు.
    ........

    ReplyDelete
  2. ఎత్తైన అపార్ట్మెంట్స్లో కొందరు బాల్కనీల్లో అద్దాలు డోర్లు అమరుస్తారు. అవి లోపల నుండి బోల్ట్ ఉంటాయి. బాల్కనీకి వెళ్లి తటాలున డోర్ వేస్తే క్లోస్ అయ్యి మనుషులు బాల్కనీలోనే ఉంటారు. ఇంట్లో ఎవరైనా ఉంటే ఫరవాలేదు. లేకపోతే బాల్కనీ నుంచి అరచి బైటవారిని పిలిచి, ఇంటి తలుపు ఎలాగోలా తెరిచి లోపలికి వెళ్లి బాల్కనీ అద్దాలతలుపు తెరవాలి.

    ఇక 12వ అంతస్తు లో బాల్కనీలో చిక్కుకున్నవారు ఎంత అరిచినా క్రింద ఉన్నవారికి వినపడదు. పక్కన పోర్షన్లో వినిపించేటట్లు ఎవరైనా ఉండాలి. చేతిలో ఫోన్ ఉండాలి. ఫోన్ చార్జిన్గ్ ఉండాలి. బాల్కనీల్లో ఫోన్ అమర్చుకుంటే వాచ్మెన్ ను పిలవచ్చు. లేకపోతే ఒక గట్టితాడుకు చిన్న బకెట్ కట్టి అన్ని బాల్కనీల్లో ఉంచుకోవాలి. ఎవరైనా ఇరుక్కుపోతే బకెట్ క్రిందకు వెయ్యచ్చు. బాల్కనీలో ఒకచిన్న అల్మారా కట్టి, అందులో చిన్నబుక్, పెన్ పెట్టుకుంటే బాల్కనీలో ఇరుక్కుపోయిన విషయం పేపర్లో వ్రాసి, బకెట్లో వేసి క్రిందకు వదలవచ్చు. క్రింద తిరిగేవారు చూసి కాపాడతారు.

    ReplyDelete