koodali

Sunday, August 27, 2023

చూసినవారు ఏమైంది? అన్నారు..

 

నేను కొంతకాలం క్రిందట ఏమనుకున్నానంటే, కుదిరినంతలో.. బెండకాయ, పనసపండు తినకూడదనుకున్నాను.అయితే ఆ విషయంలో చిత్రమైన విషయాలను ఫేస్ చేస్తున్నాను.

 నాకు చాలా పదార్ధాలు ఇష్టమే కానీ, బెండకాయ అయితే అన్ని కూరల్లో కలపరు కదాని.. బెండకాయను తినకూడదనుకున్నాను. అయితే భోజనాలకు వెళ్లినప్పుడు సాంబారులో, పులుసులో బెండకాయ వేసారేమో తెలియదు. అవి వద్దంటే ప్రక్కన కూర్చున్నవారు మీరు అన్నీ వద్దంటారేమిటి? అని ఆరాలు అడుగుతారు.

 తెల్లటి పంచదారలో ఎముకలపొడి కలుపుతారని ఎక్కడో చదివి స్వీట్స్ తినటం తగ్గించాను.అయితే, దేవుని ప్రసాదాలను తింటాను. 

ఒకసారి భోజనాలలో స్వీట్స్ వద్దంటే నా ప్రక్కనకూర్చున్న వారు నీకు సుగర్ ఉందా? అని అడిగారు. సుగర్ లేదన్నాను. మరి ఎందుకు స్వీట్స్ వద్దంటున్నావు అని అడిగారు. నేను పంచదార.. ఎముకలపొడి ..అన్నీ చెప్పవలసి వచ్చింది. బెల్లంతో చేసిన స్వీట్స్ తింటానన్నాను.

 బెల్లం తయారీ ఎప్పుడైనా చూసావా? తయారీలో బోలెడు చీమలు, ఈగలు చస్తాయి అన్నారు.

 ఆర్గానిక్ బెల్లం మొదలుపెట్టి కొంత సంతోషంగా ఉండగా పేపర్లో ఒక న్యూస్ చదివాను. వాళ్లెవరో కెమికల్స్ కలపని ఆరోగ్యకరమైన బెల్లం తయారీ విధానం గురించి వ్రాస్తూ ..బెండకాయజిగురు కలపటం వల్ల ఇలా సాధించగలిగామని ఆనందంగా వ్రాసారు. 

అది చదివి నాకు నీరసం వచ్చింది..నేనేదో సుగర్ తిందామనుకుంటే ఇలా జరుగుతోంది, బెల్లం బెండకాయను కలపటమేమిటి? ఎప్పుడైనా ఊహించామా? అయినా నేను తినకూడదనుకున్న బెండకాయ ఈ బెండకాయ వేరే జాతివి లా ఉన్నాయి. బెండకాయ అంటే అన్ని బెండకాయ జాతులూ తినకూడదా? ఇలా ఎన్నో సందేహాలు కలిగాయి. 

ఇక చెరుకురసం తెచ్చి పంచదార చేసుకుని వాడాలేమో..చెరుకుగడ పైన శుభ్రంగా కడగాలి,లోపల పుచ్చులు లేకుండా చూడాలి..అతిగా ఆలోచిస్తే అన్నీ కష్టాలే అని తెలుస్తోంది. 

(నా సంగతి అలా ఉంచితే, కెమికల్స్ కలపకుండా బెండకాయ జిగురు కలిపి మంచిగా బెల్లాన్ని తయారుచేయడం మంచి విషయం.) 

......

శాస్త్రప్రకారం గుడాన్నం తయారీకి కొన్ని నియమాలున్నాయి. ఎలా తయారుచేయాలో పదార్ధాల వివరాలు కూడా ఉన్నాయని పండితులు తెలియజేసారు. అయితే ఈ రోజులలో కొన్నిరకాల బెల్లం లో  కొన్ని రసాయనాలు, బెండకాయ జిగురు వంటివి కూడా కలుపుతున్నారు.  ఇలాంటి పదార్ధాలను వాడితే మరి, శాస్త్రప్రకారం సరైనదేనా? కాదో? తెలియదు.

.......

ఇక పనసపండు సంగతి..

ఒక ఫంక్షన్ లో భోజనాలకు వెళ్తే స్పీడుగా వడ్దించుకుంటూ నా విస్తరాకులో పులావ్ వడ్దించారు. తినబోతుంటే అందులో నుంచి ఒక్స ముక్క బైటపడింది. ఇదేమిటని చూస్తే పనసముక్క, అది పనసబిర్యానీ.

 ఒక్క ఉదుటున తేరుకుని ప్రక్కన పెట్టేసాను. చూసినవారు ఏమైంది? అన్నారు. నేను పనసపండు తినను అన్నాను. వివరాలు తెలుసుకుని, పనసపండు తినకూడదనుకున్నప్పుడు పనసకాయ తినవచ్చని సలహా ఇచ్చారు. అయోమయంతో చిరాకు కలిగి, నేను తిననన్నాను.

విస్తరాకును మార్చుకుంటే బాగుంటుందనిపించింది కానీ, విస్తరాకులో అప్పటికే కొన్ని పదార్ధాలను వడ్దించారు. ఇక చేసేదేమీ లేక పులావును ప్రక్కకు జరిపి జాగ్రత్తగా తిన్నాను. 

ఎవరైనా విస్తరిలో పదార్ధాలు వదిలేస్తే, అలా పదార్ధాలు వేస్ట్ చేయటమెందుకు ? ముందే వేయించుకోకుండా ఉండవచ్చు కదా.. అని విమర్శించే నేను అలా పనస పులావు ప్రక్కన వదిలేయవలసి వచ్చింది.

 ఈమధ్య ఇంకో న్యూస్ ఏమిటంటే, పనసగింజలు ఎంతో బలవర్ధకమైన ఆహారం కాబట్టి, వాటిని పొడి చేసి అన్నింట్లో కలిపి తింటే మంచిదని వ్రాసారు. ఇదెక్కడ ఖర్మ.. అందరూ నేను తినకూడదనుకున్న వాటిపైనే రీసెర్చులు చేస్తున్నారేమిటి..ఇక పనసపొడిని అన్నిటిలో కలుపుతారో ఏమిటో? అని సందేహాలు కలిగాయి. 

కలిపితే కనీసం ప్యాకెట్ పైన వివరాలను వ్రాయాలి. నేను ఎప్పుడైనా కేరళ వెళ్తే జాగ్రత్తగా ఉండాలి. అక్కడ పనసపండు ఎక్కువగా వాడుతారు కదా.. 

ఇవన్నీ పాటించలేక,  నేను ఇప్పుడు మామూలు బెల్లం,పంచదార కూడా కొంతవరకూ తింటున్నాను.అయితే, ఇప్పుడు ఆర్గానిక్ పంచదార అని కూడా అమ్ముతున్నారు. 

బయట భోజనాలలో వంకాయలలో పుచ్చులు సరిగ్గా తీయరేమోననే భయంతో వంకాయ కూర అంతగా తినను. ఇంట్లో తింటాను. ఇలా నా బాధలు నాకు ఉన్నాయి. అయితే  కొందరు ఊరుకోకుండా, అలా వద్దంటావేమిటి? అని ప్రశ్నలు అడుగుతారు.


 

1 comment:

  1. ఈ మధ్యన ట్రైప్లయ్ స్టీల్ సామాను వస్తున్నాయి. మధ్యలో అల్యూమినియం క్రింద పైన స్టీల్ ఉంటుందట. నేనూ కొన్నాను. అయితే అవి..తక్కువ మంటలో, మీడియంలో బాగానే ఉంటాయి. ఎక్కువ మంటపైన వండితే గిన్నెలోపల మరకలు వస్తున్నాయి. కొన్ని పిండివంటలు కొంచెం ఎక్కువ మంట పెట్టి వండితే తోమటం కష్టం అవుతుంది. గట్టిగా రుద్దితే కొంతకాలానికి స్టీల్ కోటింగ్ పోయి అల్యూమినియం బైట పడుతుందేమో? అనిపిస్తోంది. అల్యూమినియం వాడకూడదనే కదా ఆ పాత్రలు వదిలి స్టీల్ కు మారింది.

    పూర్తి స్టీల్ తో చేసిన కుక్కర్లు అడుగుభాగం మందంగా ఉండి బాగానే ఉంటాయి. కడాయిలు కూడా పూర్తిగా స్టీల్ తో అడుగుభాగం మందంగా చేయవచ్చు కదా..

    నేను ఈ మధ్యన మట్టి పాత్రలు కొన్నాను. అయితే అవి డెలికేట్ గా ఉన్నాయి. దీపారాధనకు (అఖండ దీపం) పెద్ద మట్టి పాత్ర వాడతారు కదా..అది చాలా దృఢంగా ఉంటుంది. అది కొని కూరలు వండితే, దాంట్లో కూరలు చక్కగా ఉడుకుతున్నాయి.

    పిండివంటలు వండటానికి అడుగు మందంగా ఉన్న ఒక్క స్టీల్ మూకుడు ఉంటే సరిపోతుంది. మా వద్ద కొన్ని సంవత్సరాల నుంచి వాడుతున్న ఒక స్టీల్ కడాయ్ ఇప్పుడు కూడా చక్కగా ఉంది. బరువు తేలికగా ఉంటుంది. కాపర్ బోటం ఉంటుంది.ఎక్కువ మంటపై వండినా కూడా, గిన్నె లోపల మరకలు పడవు.. కొద్దిగా పడినా, రుద్దితే పోతాయి. గట్టిగా రుద్దినా లోపల అల్యూమినియం బైటపడుతుందనే భయం ఉండదు.ఏమిటో పాతకాలంలోనే బాగా ఉండేవి.

    ట్రిప్లై గిన్నెలు మార్కెట్లో విపరీతంగా వస్తున్నాయి. చూడటానికి బాగుంటాయి. అయితే, గిన్నెలు అల్యూమినియం లేకుండా తయారుచేస్తేనే బాగుంటుంది.

    అంతగా ట్రైప్లైయ్ చేయాలంటే, అల్యూమినియం బదులు మధ్యలో ఇనుము వేయవచ్చు. ఇనుము కూడా మంచిది కాదు కానీ, ఎలాగూ ఇనుప పాత్రలను వాడుతున్నారు కదా..అందువల్ల మధ్యలో ఇనుము వేసి పైన క్రింద స్టీల్ వేసి తయారుచేయవచ్చు. అయితే, మొత్తం స్టీల్ అయితే మంచిది.

    ఇప్పుడు కూడా కొందరు పూర్తి స్టీల్ తో గిన్నెలు తయారు చేస్తున్నారు. కొంతకాలానికి పూర్తి స్టీల్ పాత్రలు ఉండవేమోనని అనిపిస్తోంది.

    ReplyDelete