koodali

Sunday, August 27, 2023

నేను గతంలో ఒక....

 

ఒక స్త్రీల వ్రతకధ పుస్తకం చదివి ఉత్సాహపడిపోయి కల్యాణగౌరీదేవి నోము చేస్తే బాగుంటుందని అనిపించింది. చాలాకాలం క్రితం జరిగిందిది.అప్పుడు ఏమనుకున్నానో కూడా సరిగ్గా గుర్తు లేదు. తరువాత గుర్తొచ్చి చేయాలని చూస్తే గుండెగుభేలుమంది. సంవత్సరకాలం రోజూ ఒక ముత్తయిదువకు తలదువ్వి, బొట్టుపెట్టాలట.

 

 వివరంగా చూద్దామని యూట్యాబ్ నొక్కి చూస్తే, తలదువ్వటమేకాకుండా తలస్నానం చేయించాలని కూడా ఇంకోదగ్గర ఉంది.ఇదేమిటి తలస్నానం చేయించాలని నేను చదివిన పుస్తకంలో లేదు..ఈ కొత్త ట్విస్ట్ ఏమిటి? నేను అందరి ఇళ్లకు వెళ్ళి వాళ్ళ బాత్రూంలో దూరి తలస్నానం చేయించటం అయ్యే పనేనా? అసలు ఇలా చెబితే ఎవరు ఒప్పుకుంటారు? నన్ను పిచ్చిదానిలా చూస్తారు అనిపించి, అయినా నేను మొట్టమొదట చదివిన పుస్తకంలో తలదువ్వమనే ఉంది కాబట్టి, అంతవరకూ చేస్తే చాలు అనిపించింది. తలకు నూనెకూడా రాయాలట.  

 

పాతరోజుల్లో స్నానాలగది ఇంటి బయట ఉండేది.ఈ రోజుల్లో టాయ్ లెట్స్ ఇళ్ళలోపల ఉంటున్నాయి. తెలియని వారి ఇళ్ళలోపలికి వెళ్ళటం ప్రమాదం. మహిళలను కూడా అందరినీ నమ్మే పరిస్థితి లేదు. మోసం చేసే మహిళలూ ఉంటారు. అలాగే నన్నూ వారు నమ్మకపోవచ్చు. తెలియని వారొచ్చి తలదువ్వి, బొట్టుపెడతానంటే దొంగ అని భయపడొచ్చు.

 

ఈ రోజుల్లో ఎవరింటికి పడితే వారింటికి వెళ్తే ప్రమాదం. నేను తలదువ్వుతానంటే అందరూ ఒప్పుకోరు కూడా....రకరకాల కారణాల వల్ల ఎవరిభయాలు వారికుంటాయి. 

ఒకామె ఏమన్నారంటే, తల పైపైన దువ్వితే సరిపోతుంది. అన్నారు. ప్రతిఒక్కరికీ కొత్త దువ్వెన ఉపయోగించాలి. 

 

ఈ విషయం గురించి ఒక పంతులు గారిని అడిగితే, ఏదైనా ఫంక్షన్ లో చాలామంది స్త్రీలు వస్తారు కదా.. అక్కడ ఒకేసారి ఎక్కువమందికి బొట్టుపెట్టండి అన్నారు. కానీ, రోజూ ఒక కొత్త మహిళకు తలదువ్వి, బొట్టుపెట్టడం.. సంవత్సరం ఆచరించమన్నారు కదా..అన్నాను. ఈ రోజుల్లో ఇవి అన్నీ జరిగేపనికాదు...  చేయలేనని దైవానికి చెప్పేసుకోమని.. అన్నట్లుగా అన్నారు. 

 

 ఈ నోములు వ్రతాలలో చిన్నపొరపాటు చేసినా వచ్చే జన్మలో కూడా దోషం వెంటాడి కష్టాలు వస్తాయని చెప్పారు కదా..అని భయం వేసి , దేవాలయాల్లో స్త్రీల వద్దకు వెళ్లి తలదువ్వవచ్చని ఆలోచించి, మళ్లీ ఏమనిపించిందంటే, దేవాలయాలకు వచ్చేవారు తలస్నానం చేసి , తలలో పువ్వులు పెట్టుకుని వస్తారు. నేనుపోయి వారి పువ్వులు తీసి మరల తలదువ్వటం పద్ధతి కాదనిపించింది. స్నానఘట్టాల వద్దకు వెళ్ళి తలదువ్వాలంటే వారి మ్రొక్కులు వారికి ఉంటాయి, వారి పూజలో భాగంగా తలకు నూనె రాసుకుని, తలస్నానం  చేసి దేవాలయానికి వెళ్దామని అనుకుంటారు. వెళ్ళి తలదువ్వటం సరికాదనిపించింది. 

 

 పుస్తకంలో చెప్పినట్లు రోజూ కాకపోయినా ఎప్పుడు వీలుకుదిరితే అప్పుడే చేయాలి. పూర్తవటానికి ఎంతకాలమైనా కావచ్చు, వేరేదారిలేదు అనిపించింది. భావన ముఖ్యం అంటారు కదా..మనస్సులోనే రోజూ ఒక ముత్తయిదువకు తలదువ్వి బొట్టుపెట్టినట్లు భావించటం కూడా కొంత చేసాను. 

 

ఇంకో ఆలోచన ఏమిటంటే, ఏదైనా హాస్పిటల్కి వెళ్లి రోజూ ఒక పేషంట్ కు తలదువ్వితే ఎలా ఉంటుందనిపించింది. ఇక్కడా కష్టాలున్నాయి. ఆమె ముత్తయిదువ అయి ఉండాలి. మైల వంటివి ఉండరాదు. ఏ హాస్పిటల్కి పోవాలి. అయినా పేషెంట్లు వారి బాధలు వారు పడుతుంటే , వెళ్ళి తలదువ్వి రావటం ఏం బాగుంటుంది. అలా అని వారికి రోజంతా సేవ చేయలేను. 

 

హాస్పిటల్ అంటే అంటుముట్టు ఉంటాయి.పేషెంట్ల వద్దకు వెళ్లి మీరు ముత్తయిదువులేనా? మైల వంటివి ఏమీ లేవుకదా? అని అడగటం, ఆ వివరాలను సేకరించటం బాగోదు.

ఇవన్నీ తలచుకుని భయం వేసి ఎందుకు ఇలా అనుకున్నానో ఏమిటో ? అనిపిస్తోంది. 

 

 అయితే, ఇవన్నీ ఇంత క్లిష్టంగా ఎందుకు చెప్పారంటే, ఎవరైనా గతజన్మలోనో, ఈ జన్మలోనో పాపాలు చేస్తేనే కష్టాలు వస్తాయి. ఆ కష్టాలు పోవాలంటే కొంత కష్టం పడాలి మరి. ఈజీగా కష్టాలు పోయే మార్గాలు ఉంటే ఇక అందరూ పాపాలు చేసేసి, పరిహారాలు తేలికగా చేసేసుకుని మళ్లీ పాపాలు చేస్తుంటారు. పరిహారాలు కొంత కష్టంగా ఉంటేనే కొంతయినా భయముంటుంది. 

 

పాతకాలంలో స్త్రీలు ఇల్లు వదిలి బయటకు వెళ్లటం తక్కువ. వారు తోటి స్త్రీలతో కలిసి కబుర్లు చెప్పుకోవటానికి కూడా ఈ నోములు, వ్రతాలు ఉపయోగపడేవి. 

 

 ఏవైనా నోములు,వ్రతాలను ఆచరించాలనుకుంటే,చేసేస్తానని  గబుక్కున అనేసుకోకుండా నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కుదిరితేనే చేస్తానని అనుకోవటం ఇంకా మంచిది.

 
 మీ శక్తి మేరకు అనుకోండి. తేలికగా ఉండేవి అయితే కొంత సులభంగా ఆచరించవచ్చు.

 

ఇలా రోజూ ముత్తయిదువకు బొట్టుపెట్టడం అనేవి ఆచరించటం అనేది మంచిదే. చక్కగా కొత్తకొత్త వారు పరిచయమవుతారు. బాగుంటుంది కూడా. అయితే ఇలా నేను ఎంతవరకూ చేయగలను? అనేది నాకు సందేహం. పాతకాలంలో అయితే ఇవన్నీ చెప్పినా చక్కగా అర్ధం చేసుకుంటారు. ఈ రోజుల్లో ఎంతమంది అర్ధం చేసుకుంటారు? 

 

తలదువ్వి, బొట్టుపెట్టటమేగా అని తేలిగ్గా అనిపిస్తుంది. ఆచరణలో తెలుస్తుంది. పెద్దగా పట్టించుకోకుండా ఎలాగోలా పాటించేవారికి ఏమోగానీ, తూ.చా తప్పకుండా పాటించాలంటే కష్టమే. 

 

దైవస్మరణ చేసుకోండి. సత్ప్రవర్తనతో జీవిస్తూ , చేతనయినంతలో ఆపదలో ఉన్నవారికి సాయం చేయండి. తగినంత శక్తిని ఇమ్మని దైవాన్ని ప్రార్ధించుకోండి. అంతా దైవం దయ. 

 

2 comments:

  1. కొన్ని అపార్ట్మెంట్స్ లో లిఫ్ట్ బయటవారు కనిపించేటట్లు ఉంటుంది. అయితే, కొన్నిచోట్ల పూర్తిగా క్లోస్ చేసిన తలుపులతో ఉండే లిఫ్ట్ ఉంటుంది. ఇలాంటి లిఫ్ట్ ఏ కారణం చేతనైనా కొద్దిసేపు ఆగిపోతే అందులో వారు భయపడతారు. చిన్నపిల్లలయితే ఇంకా భయపడతారు. ఇలాంటి లిఫ్ట్ల్లో ఒక తలుపుకు పైనుంచి క్రిందకు కొద్దిగా ఖాళీ ఉండేటట్లు, అంటే పొడుగుగా ఉండే కిటికీలాగ చేసి దానికి మెష్ అమర్చి తయారుచేస్తే ఎప్పుడయినా ఆగిపోతే అందులో ఉన్నవారికి గాలి ఆడుతుంది, బయటకు కనిపిస్తుంది.చిన్నపిల్లలకు కూడా బయట కనిపించేలా ఉండాలి. అయితే చేతి వేళ్ళు పట్టకుండా సన్నటి మెష్ అమర్చాలి. లిఫ్టులో వాచ్ మెన్ కు తెలిసేలా ఫోన్ కూడా పెట్టవచ్చు.

    చాలా అపార్ట్ మెంట్స్ లో ఇళ్లలో పనిచేసేవారిని, కూరలు అమ్మేవారిని లిఫ్ట్ వాడనివ్వరు. అన్ని మెట్లు ఎక్కాలంటే ఎవరికైనా కష్టమే. ఆ వర్కర్స్ వచ్చి పనిచేయకపోతే చాలామందికి కుదరదు. అందువల్ల వర్కర్స్ నూ లిఫ్ట్ వాడనివ్వాలి. అలా కుదరదు అంటే, కనీసం పైకి వెళ్ళేటప్పుడు లిఫ్ట్ ఉపయోగించి, క్రిందకు దిగేటప్పుడు మెట్లను వాడవచ్చు.
    ........

    ReplyDelete
  2. ఎత్తైన అపార్ట్మెంట్స్లో కొందరు బాల్కనీల్లో అద్దాలు డోర్లు అమరుస్తారు. అవి లోపల నుండి బోల్ట్ ఉంటాయి. బాల్కనీకి వెళ్లి తటాలున డోర్ వేస్తే క్లోస్ అయ్యి మనుషులు బాల్కనీలోనే ఉంటారు. ఇంట్లో ఎవరైనా ఉంటే ఫరవాలేదు. లేకపోతే బాల్కనీ నుంచి అరచి బైటవారిని పిలిచి, ఇంటి తలుపు ఎలాగోలా తెరిచి లోపలికి వెళ్లి బాల్కనీ అద్దాలతలుపు తెరవాలి.

    ఇక 12వ అంతస్తు లో బాల్కనీలో చిక్కుకున్నవారు ఎంత అరిచినా క్రింద ఉన్నవారికి వినపడదు. పక్కన పోర్షన్లో వినిపించేటట్లు ఎవరైనా ఉండాలి. చేతిలో ఫోన్ ఉండాలి. ఫోన్ చార్జిన్గ్ ఉండాలి. బాల్కనీల్లో ఫోన్ అమర్చుకుంటే వాచ్మెన్ ను పిలవచ్చు. లేకపోతే ఒక గట్టితాడుకు చిన్న బకెట్ కట్టి అన్ని బాల్కనీల్లో ఉంచుకోవాలి. ఎవరైనా ఇరుక్కుపోతే బకెట్ క్రిందకు వెయ్యచ్చు. బాల్కనీలో ఒకచిన్న అల్మారా కట్టి, అందులో చిన్నబుక్, పెన్ పెట్టుకుంటే బాల్కనీలో ఇరుక్కుపోయిన విషయం పేపర్లో వ్రాసి, బకెట్లో వేసి క్రిందకు వదలవచ్చు. క్రింద తిరిగేవారు చూసి కాపాడతారు.

    ReplyDelete