koodali

Thursday, July 19, 2018

సీతారాములు ఏం చేసిఉంటే అందరు ప్రజలు మెచ్చుకునేవారు? రామాయణం..కొన్ని విషయాలు..


  రామాయణంలో సీతాదేవి అగ్ని పరీక్ష, అడవులకు పంపటం..విషయాలలో ఎందరో ఎన్నో అభిప్రాయాలను చెబుతుంటారు.

సీతాపహరణం విషయంలో..

సీతాపహరణం తరువాత రాములవారు ఎన్నో కష్టాలు పడి సీతాదేవిని రక్షించుకున్నారు.

(ఈ ఆధునిక కాలంలో అయినా ఎందరు మగవాళ్లు తమ భార్య కోసం అంత రిస్క్ తీసుకుంటారు?  కొందరు మగవాళ్లు తిరిగి ఇంకొక వివాహం చేసేసుకుంటారు.)


 లోకం పోకడ తెలిసిన రాముల వారు అగ్నిపరీక్ష ద్వారా ప్రజల సందేహాలను నివృత్తి చేయడానికి ప్రయత్నించారు.


 అగ్నిపరీక్ష జరిగినా కూడా కొందరు ప్రజలు నిందలు వేసారు. ఇక, అగ్నిపరీక్ష జరగకుంటే ఇంకెన్ని చిత్రమైన మాటలు అనేవారో?


 రావణ సంహారం తరువాత  సీతారాములు అయోధ్యకు వచ్చి సంసారం చేస్తుంటే,  కొందరు ప్రజలు అన్న మాటల వల్ల సీతాదేవిని వనాలకు పంపవలసి వచ్చింది.


ప్రజల భయాలు, అనుమానాల వల్ల సీతారాములు అలా చేయటం జరిగి ఉంటుంది.


కొందరు ప్రజలు ఏమన్నారంటే, పరాయి పురుషుని వద్ద ఉండి వచ్చిన భార్యను ఏలుకోవటం వల్ల, రాజు  ఎలా  చేస్తే అలా చేయాలి కదా! 

భవిష్యత్తులో తమ భార్యలు కూడా పరాయి పురుషుల వద్ద ఉండి వస్తే తామూ తమ భార్యలను ఏలుకోవలసిందేనా?  అన్నారట.


(మరిరాముడు జీవితంలో ఎన్నో ధర్మాలు పాటించారు ఏకపత్నీవ్రతుడు గా కూడా ఉన్నారు 

మరిప్రజలందరూ అంత ధర్మంగా ఉంటారా?)


ఈ ప్రజల వ్యవహారాన్ని గమనిస్తే,  వారికి సీతాదేవి గురించి సందేహాలకన్నా, భవిష్యత్తులో తమ భార్యల విషయంలో ఏమైనా సమస్య వస్తే తాము ఏం చేయాలో? అనే బాధ ఎక్కువగా  కనిపిస్తుంది.


(సీతాదేవి మహాపతివ్రత. అయితే, స్త్రీలలో అనేకరకాల మనస్తత్వాల వాళ్ళుంటారు. వివాహేతరసంబంధాలు ఉంటే తప్పేంటి ? అని ప్రశ్నించే వాళ్ళను కూడా ఈ రోజుల్లో చూస్తున్నాంకదా ! )


అయితే, ప్రజలు ఏదో అన్నారు కదా.. అని శ్రీ రాముడు సీతాదేవితో ..ఇకమీదట  నీకూ నాకూ ఏం సంబంధం లేదు ..నువ్వు అడవులకు వెళ్ళిపో.. అనలేదు.


  సీతాదేవి  అడవులకు వెళ్ళి ఆశ్రమంలో ఉంటే రాముడు రాజ్యాన్ని పాలిస్తూ కూడా తిరిగి వివాహం చేసుకోకుండా  దర్భలపై శయనించటం వంటి నియమాలతో రుషుల వలె జీవించారు.


అశ్వమేధయాగ సందర్భంగా తిరిగి వివాహం చేసుకొమ్మని కొందరు సలహానిచ్చినా కూడా ,

రాములవారు యాగనిర్వహణలో స్వర్ణసీతను ప్రక్కన ఉంచుకుని యాగ నిర్వహణచేయటం ద్వారా సీతాదేవే తన భార్య .. అని లోకానికి తెలియజేసారు. 

తమ పుత్రులైన కుశ లవులకు  రాజ్యాలను అప్పగించారు. 


సీతాదేవిని అడవులకు పంపటంలో కూడా ఆమె ఖర్మకు  ఆమెను వదిలేయటం కాకుండా,  దశరధుల వారికి మిత్రులైన వాల్మీకి మహర్షి ఆశ్రమ సమీపంలో దిగవిడిచి వచ్చారట.


సీతాదేవి వనాలకు వెళ్ళేటప్పుడు అక్కడి స్త్రీల కోసం సీతాదేవి ఎన్నో బహుమతులను తీసుకెళ్ళటం జరిగిందట.


( గర్భిణి అయిన సీతాదేవిని ఏదైనా కోరుకోమంటే తనకు ఆశ్రమాలలో ఉండే ఋషులను దర్శించాలని ఉందని అన్నదట.)

ప్రజల అనవసర భయాల వల్ల సీతారాములే ఇబ్బందులు అనుభవించారు గానీ, వారు ప్రజలను ఇబ్బంది పెట్టలేదు.


తన భార్యను తాను ఏలుకోలేని పరిస్థితి  శ్రీ రామునిది .. తన ఇంటికి   తాను వెళ్ళలేని పరిస్థితి  సీతాదేవిది.


ఎన్నో విషయాలు, ఎందరో చేసిన చర్యల వల్ల సీతారాములు ఇద్దరూ బాధను అనుభవించారు.


రాముడు సీతను ఏలుకోవటం తప్పని అంటారు కొందరు..

రాముడు సీతను అడవులలోని  ఆశ్రమానికి పంపటం తప్పంటారు కొందరు.

సీతారాములు ఏం చేసినా తప్పేనా? సీతారాములు ఏం చేసిఉంటే అందరు ప్రజలు మెచ్చుకునేవారు?


2 comments:

 1. dear sir very good blog and very good content
  Telugu News

  ReplyDelete
 2. రావణుడికి ఒక శాపం ఉందట. అతను ఏ స్త్రీనైనా అత్యాచారం చేస్తే అతని తల ముక్కలై మరణిస్తాడట.

  సీతాదేవిని అంతఃపురంలో కాకుండా ఆరుబయట అశోకవృక్షం వద్ద ఉంచి, రోజూ వచ్చి తనను వివాహం చేసుకొమ్మని బ్రతిమాలటం, భయపెట్టటం చేసేవాడు.

  రావణుడు చాలామంది స్త్రీలను ఎత్తుకొచ్చి వాళ్లను బ్రతిమాలి, భయపెట్టి వాళ్ల మనసులు మార్చి తన వశం చేసుకున్నాడు.

  కొందరు స్త్రీలు అతని వైభోగం చూసి తమకు తామే అతనికి భార్యలయ్యారట.

  అయితే, సీతాదేవి మహా పతివ్రత. అతని మాటలకు ఆమె మారలేదు.

  అందుకనే కొంతకాలం గడువిచ్చి, ఆ సమయంలోగా ఆమె మనస్సు మార్చుకోకుంటే చంపేస్తానని అతను బెదిరించటం జరిగింది.

  ఇవన్నీ గమనిస్తే, తనంటే ఇష్టంలేని స్త్రీని ఏమైనా చేయాలంటే అతనికి భయమని తెలుస్తుంది.

  ReplyDelete