koodali

Tuesday, November 28, 2017

.భగవంతుడా నాకు ఇంతే ఓపిక దయచేసి నన్ను క్షమించు అని..... ..


ఈ రోజుల్లో కొన్ని పధ్ధతులు పాటించటం కుదరకపోవచ్చండి.

ఉదా.......ఏదైనా గుడికి గానీ పుణ్యక్షేత్రములకు గానీ వెళ్ళేముందుగానీ, తిరిగి అక్కడినుండి వచ్చేటప్పుడు గానీ ఇతరుల ఇళ్ళకు వెళితే మన పుణ్యములు వారికి, వారి పాపములు మనకు తగులుతాయని నేను ఒక దగ్గర చదివానండి. ఇది పాటించటం ఒకోసారి చాలా కష్టంగా ఉంటుంది. 
 
అయితే పాతకాలంలో కొందరు ఊళ్ళు తిరుగుతూ బంధువుల ఇళ్ళలో రోజులతరబడి ఉండేవారట. 
 
 ఇప్పటికీ తిరుపతిలో నివసించేవారికి బంధువుల తాకిడి ఎక్కువగా ఉంటుందని అనుకుంటుంటారు. ఇలాంటి ఇబ్బందులు తప్పించటానికి ఒకవేళ పెద్దలు పై విధముగా చెప్పారేమోనని నా ఊహ.

అయితే ఒకోసారి మనకు బాగా దగ్గర బంధువుల ఇళ్ళకి వెళ్ళాలని మనకీ ఉంటుంది. అంతదూరం వెళ్ళి వెళ్ళకపోతే వారూ బాధపడతారు. ఇలాంటప్పుడు ఏమి చెయ్యాలో నాకు అర్ధం కాదు. 

ఇంకో సంఘటన. ........మేము చెన్నైలో ఉన్నప్పుడు ఒకసారి ఒక గుడికి వెళ్ళామండి. తిరిగి వచ్చేటప్పుడు షాపింగ్ కు వెళ్ళాలని మా
  ఇంట్లోవారి కోరిక. నాకేమో గుడినుంచి సరాసరి ఇంటికి వెళ్ళాలని.

నిజం చెప్పాలంటే నాకూ షాపింగ్ కు వెళ్ళాలని ఉంది. కానీ గుడినుంచి షాపింగ్ కు వెళ్తే మన పుణ్యం షాప్ వారికి, వారి పాపం మనకు వస్తే ఏది దారి ?......ఆఖరికి ఇంటికే వెళ్ళామనుకోండి.

కానీ గుడికి వెళ్ళివచ్చిన ప్రశాంతత ఏమాత్రం లేదు. ఇంట్లో అందరూ సీరియస్ గా కూర్చున్నారు. సెలవు రోజు అంత దూరం వెళ్ళి షాపింగ్ కు వెళ్ళలేదని వారి బాధ.

ఇలా కొన్ని సార్లు జరిగాక నేను గుడికి రమ్మంటే మాకు పనులున్నాయి అని ........ అలా ఏదో వంక చెప్పి తప్పించుకోవటం మొదలుపెట్టారు మా కుటుంబసభ్యులు.

వారి దృష్టిలో నాది చాదస్తం. భక్తి ఉండాలి గానీ చాదస్తం ఉండకూడదని మా కుటుంబసభ్యుల కామెంట్. 


నిజమే కానీ నేను చదివిన మరియు , విన్న దాని ప్రకారం అలా చేయకపోతే కష్టములు వస్తాయేమోననే భయంతో అలా చేసాను మరి..

ఆ తరువాత నాకు ఏమనిపించిందంటే,  కుదరనప్పుడు ఏం చేస్తాము ఇలాంటిపరిస్థితులలో పిల్లలకు మరియు మనకు కూడా దేవుని యందు కొంచెమయినా భక్తి ఉండేలా చూసుకుంటే అదే పదివేలు అని. 
 
కానీ, నాకు సందేహం ఏమిటంటే, మరి టిఫిన్, భోజనం.. తినడానికి హోటల్స్ కు వెళ్ళకుండా కుదరదు కదా.. అనిపిస్తుంది.
 
విచారించదగ్గ విషయమేమిటంటేనండీ , షాపింగ్ లాంటి ఇతర విషయాలలో ఎంతసేపయినా విసుగు రాకపోవటము ఏమిటో అర్ధం  కాదు. 

 ఇంకా ఏమని అనుకున్నానంటేనండి .......భగవంతుడా నాకు ఇంతే ఓపిక దయచేసి నన్ను క్షమించు అని..
 
Saturday, September 18, 2010

 

No comments:

Post a Comment