koodali

Monday, November 20, 2017

పోలాల అమావాస్య నోము కధ క్లుప్తంగా ..



పోలాల అమావాస్య నోము కధ క్లుప్తంగా ..( మా ఇంటి వద్ద ఉన్న స్త్రీల  వ్రత కధలు..అనే  పుస్తకం నుంచి తెలుసుకున్నవి..)

ఒక ఊరిలో పోలి అనే ఆమె  మరియు  ఆమె  ఆరుగురు  తోటికోడళ్ళు ఉండేవారు. 


మొత్తం  యేడుగురు తోటికోడళ్ళు పోలాల అమావాస్య నోము నోచుకొనుటకు ప్రయత్నం  చేయగా  ,   పోలి యొక్క సంతానం మరణించటం జరిగింది.  ఇలా ఆరు సంవత్సరములు జరిగింది.  

  పూజ చేసుకోవటం కుదరటంలేదని  తోటికోడళ్ళు  పోలిని  తిట్టడం  జరిగేది.    

ఏడో సంవత్సరం పూజ సమయం రాగానే  పోలి యొక్క  ఏడో సంతానం మరణించగా, 

ఈ విషయం తోటికోడళ్ళకు  చెప్పడానికి భయపడిన పోలి తన బిడ్డ శవాన్ని గదిలో పెట్టి తాళం వేసి,  తోటికోడళ్ళతో కలసి పూజ చేసుకుని వస్తుంది. 

రాత్రి అయినతరువాత బిడ్డ శవాన్ని తీసుకెళ్లి  ఊరి చివరనున్న పోలేరమ్మ గుడి వద్ద కూర్చుని ఏడుస్తుండగా ,

 పోలేరమ్మ జాలిపడి... పోలికి కొన్ని అక్షతలను ఇచ్చి , వాటిని ఇంతకుముందు మరణించిన సంతానాన్ని పూడ్చిన చోట  చల్లి,  మరణించిన  వారిని వారివారి పేర్లతో పిలువవలసిందిగా జెప్పి వెడలిపోయెను. 

 అమ్మవారు చెప్పినట్లుగా  చేయగా.. మరణించిన పిల్లలు సజీవులయి  వస్తారు.  అందరూ ఇంటికి వెళ్తారు. 

తెల్లవారుసరికి  వీరిని చూసిన వారు ఆశ్చర్యపడి వివరాలు అడుగగా ...పోలి జరిగిన విషయాలను చెబుతుంది.  

ఈ నోమును నోచుట వలన , సంతానము లేని వారికి సంతతి కలుగును. సంతతి వున్నవారికి కడుపు చలువ కలుగును. 

****************
పుస్తకంలోఉన్నట్లు .. ప్రతి అక్షరం ఉన్నదున్నట్లు ఇక్కడ వ్రాయలేదు. 

నాకు  తోచిన  కొన్ని  ఆలోచనలు.. 

ఈ కధలో పోలి తన బిడ్డ శవాన్ని దాచి పూజ చేసుకుంటుంది. అయినా, పోలేరమ్మ  ఆగ్రహించలేదు.

 (  పోలి తప్పనిపరిస్థితిలో  శవాన్ని ఇంట్లో ఉంచి  పూజ చేయవలసి వచ్చింది. కావాలని ఆమె అనాచారం చేయలేదు. )   

శవాన్ని ఇంట్లో  అట్టేపెట్టి  పూజ చేయటం ఏమిటని  దైవం ఆగ్రహించకపోగా...

 పోలి బాధను అర్ధం చేసుకుని ఆమెను అనుగ్రహిస్తుంది.  దైవం  కరుణామయులు. 

*********  
వ్రాసిన వాటిలో  పొరపాట్లు  ఉన్నచో దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.

 
 

No comments:

Post a Comment