koodali

Wednesday, November 22, 2017

ఈ విషయంలో ఇలా ఆలోచించటం అతి కాదు...


కొందరు ఏం చేస్తారంటే , దైవ చిత్రాలను పడుకునే పరుపుల క్రింద ఉంచుతారు. ఇలా చేయటం మంచిదికాదని నా అభిప్రాయం. ఇలా చేసినవారికి కష్టాలు రావటం నేను గమనించాను.  

ఈ రోజుల్లో అపార్ట్మెంట్స్ పద్ధతి వచ్చాక క్రింద పోర్షన్ వాళ్ళ దేవుని  మందిరం పైన.. పై పోర్షన్ వాళ్ళ బెడ్రూం లేక బాత్రూం వచ్చే  అవకాశముంది.  

క్రింద పొర్షన్లో  దైవ మందిరం , దైవ  విగ్రహాలు ఉంటే పైన నడవటం ...ఇవన్నీ ఆలోచిస్తే ఎలాగో ఉంటుంది. 

అపార్ట్మెంట్ల విషయంలో .. ప్రతి ఇంటి పూజా మందిరం..క్రింద పొర్షన్ నుంచి పై పోర్షన్  వరకు  ..  ఒకే వరుసలో  వచ్చే విధంగా ప్లాన్ చేసి కట్టుకుంటే  పూజామందిరం పైన బెడ్రూం రావటం వంటివి జరగకపోవచ్చు.

 ఇంట్లో ఉన్న దేవుని  విగ్రహాలు, క్యాలెండర్లు అన్నీ ఇల్లంతా  ఉంచటం  కాకుండా,  కేవలం పూజగదిలో మాత్రమే ఉండేటట్లు చూసుకోవచ్చు.

అపార్ట్మెంట్ కాకుండా డాబా ఇళ్లయినా క్రింద దేవుని గది ..పైన టెర్ర స్ ..పైన  నడుస్తారు. 

క్రింద దేవుని మందిరం ఉన్న దగ్గర.. టెర్రస్ పైన  కొంతభాగం నడవకుండా,  అక్కడ సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకోవచ్చు  లేదా  కొంత ఎత్తులో నాలుగు  ప్రక్కల గోడ కట్టవచ్చు.

పాతకాలంలో ఇలా అపార్ట్మెంట్ పద్ధతి లేదు .  డాబా పైకి ఎక్కే విధంగా ఇళ్లూ ఉండేవి కాదు.  

అంతస్తులు ఉండే  రాజభవనాలలో  దేవాలయం  కొంచెం దూరంగా ఉండేది కావచ్చు.  

 ఈ రోజుల్లో దైవ చిత్రాలను యంత్రాలతో  విరివిగా ముద్రించి తరువాత బయటపడేయటం కూడా జరుగుతోంది.

విదేశాల వాళ్లు చెప్పులపై  దైవ చిత్రాలను ముద్రించారని తెలిసి ఆందోళనకు గురయ్యినప్పుడు.. మనం ఇక్కడ దైవచిత్రాలను ముద్రించి  తరువాత చెత్తలో పడేయటం కూడా తప్పేకదా! 

దైవపూజ తరువాత వచ్చే నిర్మాల్యాన్నే ఎక్కడపడితే అక్కడ పడేయకూడదు.. నీటిలోనో, చెట్లపైనో  వేయాలని పెద్దలు తెలియజేసారు.  


పూజ చేయడానికి ఉపయోగించిన పువ్వులు, పత్రి వంటివి  పడేయటానికే అన్ని నియమాలు  ఉన్నప్పుడు... 


సాక్షాత్తూ దైవచిత్రాల విషయంలో ఎన్ని నియమాలు పాటించవలసి ఉంటుందో ఆలోచించండి. 


అలాగని ఈ రోజుల్లో ప్లాస్టిక్ కోటింగ్ ఉన్న చిత్రాలను, లేని చిత్రాలను అన్నింటినీ  నీటిలో వేస్తే నీటిలో పెద్ద ఎత్తున పూడిక పెరిగే అవకాశముంది. 


  ఇలా ఆలోచించటం  కొందరికి అతిగా  అనిపించవచ్చు... అయితే, ఈ విషయంలో ఇలా ఆలోచించటం అతి కాదు.

కొన్ని ఆచారవ్యవహారాల విషయంలో   ఎక్కువగా  ఆలోచించటం అవసరం లేదేమో కానీ,  దైవ చిత్రాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.  

దైవ చిత్రాన్ని దైవానికి ప్రతిరూపంగా భావిస్తాము.  దైవచిత్రాల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. 

ఈ మధ్య ఒకరు మాకు వారి పిల్లల  వివాహ ఆహ్వానపత్రికను  ఇచ్చారు.

 ఆ పత్రికను పెద్దగా ముద్రించి ఎందరో దేవతల చిత్రాలను ముద్రించారు. 

ప్లాస్టిక్ కోటింగ్ తో ఆ పత్రిక చాలా దృఢంగా ఉంది. దాన్ని ఎక్కడ పడేయాలో తెలియటం లేదు. ఇంకేం చేస్తాం బయటే వేస్తాం.

ఇలా వచ్చిన ఆహ్వాన పత్రికలను, దైవ చిత్రాలున్న స్వీట్ ప్యాకెట్లను, విజిటింగ్ కార్డులను, వార్తాపత్రికలను ..ఇలాంటివన్నీ  ఇంట్లోనే అట్టిపెట్టుకోవాలంటే కష్టం కదా!

ఇంతకుముందు కూడా ఇలాంటివి జరిగాయి.. మేమేం చేయగలం?

 దైవచిత్రాలను చెత్త వద్ద పడేసిన  పాపం .. దైవ చిత్రాలను అలా ముద్రించిన వారికి వస్తుంది.


 

No comments:

Post a Comment