koodali

Sunday, February 16, 2014

జరిగే పరిణామాలను .....

 
ఒక  రాష్ట్రం  యొక్క  రాజధానిని  ఏర్పాటుచేయాలంటే  రాష్ట్రంలోని  ఏదో  ఒక ప్రాంతంలో  ఏర్పాటుచేస్తారు.  

 రాజధాని   అంటే  అక్కడ  అన్ని  ప్రాంతాల  వారికి   సమానమైన  స్వేచ్చ  ఉంటుంది.  ఉదా..  దేశరాజధాని  అయిన  ఢిల్లీ  అన్ని  రాష్ట్రాల  వారికి  రాజధాని.
............................


మీ ఇంట్లో  ఇద్దరు  పిల్లలు  ఒకరితో  ఒకరు  గొడవపడుతుంటే  మీరు    ఎవరివైపు  సపోర్ట్  చేస్తారు  ?  

తల్లితండ్రులకు  బిడ్డలు  ఇద్దరూ  సమానమే.  ఒకరికి  సపోర్ట్  చేస్తే  రెండవ  వారికి  కోపమొస్తుంది.  ఇలాంటి  పరిస్థితిలో  తల్లితండ్రి  పరిస్థితి   నిస్సహాయంగా  ఉంటుంది.  ప్రస్తుతం  రాష్ట్ర  పరిస్థితి  ఇలాగే  ఉంది.


రాష్ట్రం  సమైక్యంగా  ఉండాలంటుంటే  తెలంగాణా  వారికి  కోపమొస్తోంది.  విడిపోవాలంటే  సీమాంధ్ర  వాళ్ళకు  కోపమొస్తోంది.  అన్నిప్రాంతాలలోనూ  ఆత్మీయులు,  బంధువులు  ఉన్నవారి  పరిస్థితి  ఇప్పుడు  నిస్సహాయంగా  ఉంది.


ఇప్పటి  రాష్ట్ర  పరిస్థితిలో   తెలంగాణా  వారి  అభిప్రాయాలు  ఏమిటో  సీమాంధ్ర   వాళ్ళూ  గమనించాలి.  సీమాంధ్ర  వారి  అభిప్రాయాలు  ఏమిటో 
తెలంగాణా  వాళ్ళూ  గమనించాలి.  

    తెలంగాణా  వారు  తాము సీమాంధ్ర  వారిగా  భావించి  ఆలోచించాలి.  సీమాంధ్ర  వాళ్ళు  తాము  తెలంగాణా  వారిగా  భావించి  ఆలోచించాలి.

............................


 ఒకసారి  ఉమ్మడి రాజధానిగా  ఒప్పుకున్నాక   రాష్ట్రంలోని  అన్ని  ప్రాంతాల  వారికి  ఆ  నగరం  తమది  అనే  అనుబంధం  ఉంటుంది  కదా  !


 50  సంవత్సరాలకు  పైగా  ఉమ్మడి  రాజధానిగా   అనుబంధం  ఉన్న    హైదరాబాద్  మన  రాజధాని   కాదు  అనుకోవాలంటే   బాధగానే  ఉంటుంది.

  కొత్త  రాజధాని  ఏర్పాటుచేసుకోవాలంటే  ఎన్నో  కష్టాలు  ఉంటాయి.   ఎన్నో   నిధులు  అవసరమవుతాయి. 


 గత  50 సంవత్సరాల  కాలంలో  హైదరాబాద్లో  ఎన్నో  కేంద్ర  ప్రభుత్వరంగ  సంస్థలు   ఏర్పాటయ్యాయి.  విద్యా,  ఉపాధి  అవకాశాలు  హైదరాబాద్ లోనే  ఎక్కువగా  ఉన్నాయి.


  సీమాంధ్రలో  విద్యా , ఉపాధి  అవకాశాలు  తక్కువగా  ఉన్నాయి .

అయితే  సీమాంధ్ర  వాళ్ళు  కూడా  కొన్ని  విషయాలను  అర్ధం  చేసుకోవాలి..   తెలంగాణా  వారి  అభిప్రాయాలు  స్పష్ఠంగా  తెలుసుకున్న  గత  10  సంవత్సరాల  నుంచీ  అయినా  సీమాంధ్రులు  హైదరాబాద్  పై  ఆధారపడకుండా  తమ  ప్రాంతాలలో  ఉన్నత  విద్యావకాశాలను,  ఉపాధి  అవకాశాలను  అభివృద్ధి  చేసుకుని  ఉంటే  ఇప్పుడిలా  లబోదిబోమనే  పరిస్థితి  వచ్చుండేది  కాదు.


  ప్రభుత్వాలు  అన్ని  ప్రాంతాలలోనూ    ఉపాధి  అవకాశాలను  కల్పించి  అభివృద్ధి  చేసి  ఉంటే  ఇప్పటి  గొడవ  ఉండేది  కాదు  కదా  !

.............................


ఆంధ్రప్రదేశ్  ఏర్పడినప్పుడు   హైదరాబాదును  రాష్ట్రానికి  ముఖ్య రాజధానిగా  చేసి,  విజయవాడ,  కర్నూల్,  వైజాగ్,  కరీం నగర్,  ఖమ్మం .....  మొదలైన  పట్టణాలను  ఉపరాజధాని  స్థాయిలో  అభివృద్ధి  చేసి  ఉంటే  ఉపాధి  కోసం  అందరూ  హైదరాబాదుకు   వచ్చేవారు  కాదు.  


 ఏ  ప్రాంతం  వారికి  ఆ  ప్రాంతములో    ఉపాధి  అవకాశాలను  ఏర్పరిస్తే     రాజధానికి    ఎక్కువగా  వలస   రారు.  

.......................................... 


ఢిల్లీ  మనకు  చాలా  దూరంలో  ఉంది. ప్రతి  చిన్నపనికి  ఢిల్లీ  వెళ్ళాలంటే  దక్షిణాది  రాష్ట్రాల  వారికి  ఇబ్బందిగా  ఉంటుంది.  


 ఎంతో  దూరదృష్టి గల  అంబేద్కర్  గారు   హైదరాబాదును  దేశానికి    రెండవ  రాజధాని  చేస్తే  బాగుంటుందని  పేర్కొన్నారు.  అలా  చేస్తే  హైదరాబాద్  అంతర్జాతీయ   స్థాయిలో  అభివృద్ధి  చెందుతుంది. 

అయితే, మిగతా  దక్షిణాది  రాష్ట్రాలు  హైదరాబాద్కు  ఆ  అవకాశాన్ని  ఇవ్వనిస్తారా ?
..........................


కొందరు ,   మద్రాస్  నుంచి  ఆంధ్ర  రాష్ట్రం  విడిపోయిన  సంఘటనను  ఇప్పటి  పరిస్థితితో  పోలుస్తున్నారు.  ఈ  పోలిక  ఎలా  కుదురుతుంది ?

 మద్రాస్  రాష్ట్రం  నుంచి  ఆంధ్ర    విడిపోయినప్పుడు    విభజన  కోరుకున్న  తెలుగువారికి  రాజధాని  అయిన  మద్రాస్  నగరాన్ని  ఇవ్వలేదు  కదా  ! 
 

భాషాప్రయుక్త  రాష్ట్రాలు  ఏర్పడక  ముందు  మద్రాస్  పేరు  చెన్నపట్నం  అనేవారట.  ఒక  తెలుగు  వ్యక్తి  పేరు  మీద  చెన్నపట్నం  అనే  పేరు  వచ్చిందంటారు.  తరువాత  బ్రిటిష్  వాళ్ళు  మద్రాస్  అని  పేరు  మార్చారట.
..................................

 మన రాష్ట్రంలోని  ప్రజలు  ఒకరినిఒకరు   దోపిడీ  చేయలేదు.. రాష్ట్రంలోని  అన్ని  ప్రాంతాలూ  వెనుకబడే  ఉన్నాయి.   అన్ని  ప్రాంతాల  ప్రజలూ   వెనుకపడే  ఉన్నారు.

  రాష్ట్రంలోని   అన్ని  ప్రాంతాలకు  చెందిన   కొందరు  పెట్టుబడిదారులు  మాత్రమే  సంపదను  ప్రోగేసుకున్నారన్నది  అందరూ   తెలుసుకోవలసిన  విషయం.

...................................


రాష్ట్రాన్ని  విభజించమని  కోరుకోవటానికి  .....ఉమ్మడి  రాజధానితో  సహా  విభజించమని  కోరుకోవటానికి   తేడా  ఉంది.

అందరిదీ  అని  భావించే  ఉమ్మడి  రాజధానిని  కొందరు  తీసుకుని  వెళ్ళిపోతే  మిగతా  వారికి  అన్యాయం  జరుగుతుంది.   ఎప్పటికప్పుడు  కొత్త  రాజధాని  వెతుక్కోవటమూ  కష్టమే.

  రాజధానుల  విషయంలో  సమస్యలు  రాకుండా  ఉండాలంటే  కొన్ని  విధివిధానాలను  నిర్ణయించాలి.
....................

 మన  రాష్ట్ర   విషయం  తేలితే  తామూ  విభజన  డిమాండులు  మొదలెట్టాలని  ఎందరో  రాష్ట్రాల  వాళ్ళూ  వేచి  చూస్తున్నారు.

కొత్త రాజధానులు  ఏర్పాటు  చేయటానికి  అవసరమైన  భారీ  ప్యాకేజీలకు   కావలసిన నిధులను  కేంద్రం సరిగ్గా ఇస్తుందా   ?


 జార్ఖండ్  వంటి  రాష్ట్రాలలో  ప్రకటించిన  ప్యాకేజీలను  ఇప్పటి  వరకూ  సరిగ్గా  ఇవ్వనేలేదట.  
..................................................


  జరుగుతున్న  పరిణామాల  నుంచి  ప్రజలు   కూడా  కొన్ని  విషయాలను  నేర్చుకోవాలి.

ఒకే  భాషను  మాట్లాడే  తెలుగువారు  ఒకరితో  ఒకరు    కలిసి  ఉండలేని  పరిస్థితి  చూస్తుంటే  విదేశాలకు  వలస  వెళ్ళి  ఉంటున్న వారిని ...  అక్కడి  స్థానికులు  గెంటేసే  పరిస్థితి  త్వరలోనే  వస్తుందేమో...జాగ్రత్త. 


ఇక్కడ  నుంచి  వెళ్ళి  అక్కడి వారి  ఉద్యోగాలను,  వారి  ఉపాధి  అవకాశాలను  మనం  దెబ్బకొడుతుంటే  వాళ్ళు  మాత్రం  ఎందుకు  ఊరుకుంటారు ?  


  విదేశాలకు   వెళ్ళిన  తెలుగువాళ్ళను    కూడా వలసవాదులుగా  , దోపిడీదారులుగా   భావించి   వెళ్ళగొట్టే  అవకాశం  ఉంది  మరి.
...................................

ఈ   టపాలో గానీ  ఇంతకుముందు  టపాలోగానీ  నేను   వ్రాసిన  కొన్ని  విషయాలు  కొందరికి  నచ్చక  పోవచ్చు.   ఇలా  వ్రాయటం  వలన  నాకు  ఆత్మీయులైన  వారు  కొందరు  నన్ను  తిట్టుకుంటారేమో  ?  ఎవరి  మనోభావాలను  నొప్పించాలని   నాకు  లేకపోయినా  తప్పనిసరి  పరిస్థితిలో  ఇలా  వ్రాయవలసి  వచ్చింది. 

ఇప్పుడు ప్రజల మధ్య  ఆవేశకావేషాలు   ఎక్కువగా  ఉన్నాయి.  అవి   తగ్గితే బాగుండునని  చాలామంది ఆశ పడుతున్నారు.

విభజన  లేక  సమైక్యత  అంటూ  ఎంతో  ఓపికగా  ఉద్యమాలను  చేస్తున్నారు.   దీనికన్నా  ప్రజాసమస్యలను  పరిష్కరించాలని  ఉద్యమాలు  చేసినట్లైయితే  ఎంతో  బాగుండేది  అనిపిస్తోంది .



30 comments:

  1. ఈ విషయం మీద ఎక్కువగా మాటాడాలనే కోరిక లేదు గాని. జరుతున్నది సరిగాలేదని అనగలను. వ్యవహారాన్ని మొదటినుంచి నానా కంగాళీ చేసివదలిపెట్టేరు.

    ReplyDelete
    Replies
    1. ఈ గొడవ లన్నింటికీ కాంగ్రెసు దుష్టత్వమే కారణం. బీజేపీ అన్ని సార్లు అన్ని రాష్ట్రాల్ని అంత ప్రశాంతంగా జరిపిస్తే వీళ్ళకేం మాయరోగం? కేంద్రం లోనే కాదు, ఇక్కడ కూడా వీళ్ళే అధికారంలో ఉన్నారు కదా! అందర్నీ ఒక చోట చేర్చటం లాంటిది చేసి మీ మీ ప్రాంతాలకి యేం కావాలో చెప్పమని అన్నీ యెవరికీ అన్యాయం జరక్కుండా చెయ్యొచ్చు కదా?

      ప్రతి పక్షాలు సరే ప్రభుత్వం లో ఉన్న పార్టీని ఇరుకున పెట్టటానికి రెండు ముఠాలుగా విడిపోవటం అంటే అది కూడా దిక్కుమాలిన రాజకీయమే కావచ్చు గానీ కొంతవరకూ అర్ధం చేసుకోవచ్చు.

      కానీ తనే తన పార్టీలో రెండు ముఠాల్ని పోషించకుండా వాళ్ళని ఒక్కటిగా ఉంచగలిగి కూడా విచ్చల విడిగా వొదిలేసింది.దాని వల్లనే ఈ భీబత్సాలన్న్నీ జరిగినాయి. లేక పోతే సీమాంధ్ర ప్రజలు కూడా అలా ఉద్యమించే వాళ్ళు కాదు. కాంగ్రెసు వాళ్ళు కావాలని సృష్టించిన గందర గోళం ఇదంతా.

      Delete
  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    నిజమేనండి, రాష్ట్రం యొక్క పరిస్థితి ఇలా తయారవటం బాధగా ఉంది.

    ReplyDelete
  3. చాలా రోజులకు మళ్ళి మీ బ్లాగుకు వచ్చాను, సంతోషం :)

    ఒప్పందాలకు విరుద్దంగా తెలంగాణా వారికి ప్రభుత్వ పరంగా రావలసిన అవకాశాలకు గండి పడినప్పుడు 'ఉమ్మడి రాజధాని' అనే ఒప్పందాన్ని గౌరవించానవసరం లేదు.

    విదేశాలకు వెళ్ళే తెలుగు వారు అక్కడి దేశాల ఆహ్వానం మేరకు వెళ్లి అక్కడి చట్టాలకు లోబడి పనిచేస్తున్నారు, ఆయా దేశాలకు లోకల్ వనరులు సరిపోక ఆ అవసరాలకోసం విదేశియులను ఆహ్వానిస్తున్నారు. అలా వారి చట్టాలకు లోబడి కాకుండా అక్రమంగా వెళ్ళిన వారిని అక్కడి ప్రభుత్వం గుర్తించి తగిన చర్య తీసుకుంటుంది. ఒక వేల ప్రభుత్వం చర్య తీసుకోకపొతే ఆ పలితంగా నష్ట పోయిన ప్రతి వానికి కడుపు మండుతుంది, కడుపు మండిన వారు ఎక్కువయి వారికి తిక్క లేస్తే చట్ట బద్దంగా అక్కడ ఉంటున్న వారి ని కూడా తిరిగి పంపగలరు. మీరు రెండు పరస్పర విరుద్ద విషయాలను పోల్చ ప్రయత్నించారు.

    ధన్యవాదాలు.

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      హైదరాబాదు నిధులు తెలంగాణకే ఖర్చు పెట్టాలి అనేది చట్టం..అని మీరు ఇంతకు ముందే వ్యాఖ్యానించారు.

      ఉమ్మడి రాజధాని సీమాంధ్రలో పెట్టి ఆ నిధులను సీమాంధ్రకే వినియోగించాలి అని ... అంటే మీకు ఎలా అనిపిస్తుంది ? అని నేను అడిగిన సందేహానికి మాత్రం మీరు జవాబు చెప్పలేదు.

      రాష్ట్రంలోని అందరికి ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్ నిధులు ఒక్క తెలంగాణకే ఖర్చు పెట్టాలి అనే ఒప్పందం ఎంతవరకూ న్యాయం ?

      హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా చెయ్యాలని అప్పటి సీమాంధ్రులు ప్రతిపాదించినప్పుడు అప్పటి తెలంగాణావాళ్ళకు ఇష్టం లేకపోతే గట్టిగా వ్యతిరేకించవలసింది.

      విశాలాంధ్ర కోసం ఆశపడి అప్పటి సీమాంధ్రులు తెలివితక్కువగా ఒప్పందాలను చేసుకున్నారని తెలుస్తూనే ఉంది.

      ఎదుటి వాళ్ళు తెలివితక్కువగా ఒప్పందాలను చేసుకుంటుంటే అడ్డగించవలసింది పోయి అలాంటి ఒప్పందాలకు ఒప్పుకోవటం ఏం న్యాయం ?

      మనకు ఎవరైనా ఒక రూపాయి ఇవ్వటానికి బదులు తెలివితక్కువగా రెండు రూపాయలు ఇస్తుంటే మనం రెండురూపాయలనూ జేబులో వేసుకుంటామా ? ఎక్కువగా ఇచ్చిన రూపాయను ఎదుటి వ్యక్తికి తిరిగి ఇచ్చెయ్యమా ?

      ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాదు నిధులు తెలంగాణకే ఖర్చు పెట్టాలి అనే ఒప్పందాన్ని గమనిస్తే సీమాంధ్ర వాళ్ళు తమకు నష్టం కలిగించే విధంగా తెలివితక్కువగా ఒప్పందం చేసుకున్నారని తెలుస్తూనే ఉంది.

      తరువాత తమకు నష్టం కలిగించే ఒప్పందాలను అమలుచేయలేక ఉల్లంఘించారు.

      రాష్ట్రంలోని గిరిజనులు తమకు ప్రత్యేకంగా మన్యసీమ రాష్ట్రం రాష్ట్రం కావాలని డిమాండ్ చేస్తున్నారు. మీరు వారి ఆకాంక్షలకు విలువనిచ్చి వారి డిమాండుకు సంతోషంగా ఒప్పుకుంటారా ?

      భవిష్యత్తులో హైదరాబాదుతో కూడిన తెలంగాణా రాష్ట్రం వస్తే.. కొంతకాలం గడిచిన తరువాత... హైదరాబాదుకు దగ్గరగా ఉన్న 5 జిల్లాలతో కలిపి విడిపోతాము అనే డిమాండ్ రాదని ఎవరైనా గ్యారంటీ ఇవ్వగరా ?

      అలా డిమాండ్ వస్తే హైదరాబాదుకు దూరంగా ఉన్న ఖమ్మం మొదలైన 5 జిల్లాల వారు విడిపోయి కొత్త రాజధానిని ఏర్పరుచుకోవలసి వస్తే మీరు సంతోషంగా ఒప్పుకుంటారా ?






      Delete
    2. మీరన్నట్లు, విదేశాలకు వెళ్ళే తెలుగు వారు అక్కడి దేశాల ఆహ్వానం మేరకు వెళ్లి అక్కడి చట్టాలకు లోబడి పనిచేస్తున్నారు, ఆయా దేశాలకు లోకల్ వనరులు సరిపోక ఆ అవసరాలకోసం విదేశియులను ఆహ్వానిస్తున్నారు...అన్నది కొంతవరకే నిజం.

      ఇప్పుడు పరిస్థితులు మారాయి.

      విదేశాల్లో కూడా నిరుద్యోగం పెరిగింది. అందువల్ల అక్కడ స్థానికుల్లో అసహనమూ పెరిగింది. విదేశాల నుంచి తండోపతండాలుగా వస్తున్న వలసప్రజల వల్ల కూడా తమకు ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయని అక్కడి స్థానికులు కొందరు భావిస్తున్నారట.

      ఇప్పుడు విదేశీ వలస ప్రజల రాకను తగ్గించటం గురించి , ఔట్ సోర్సింగ్ కొంతవరకూ తగ్గించుకోవటం గురించి కూడా అక్కడి ప్రభుత్వాలు నిర్ణయించుకుంటున్నాయట.

      విదేశీ వలస ప్రజల పట్ల అక్కడి స్థానికులలో కొంత అసహనం పెరగటం గురించిన వార్తలు అప్పుడప్పుడు వింటున్నాము.
      ఈ మధ్యనే ఒక భారతీయ వనిత విదేశాల్లో జరిగిన అందాలపోటీలో గెలిచినప్పుడు ఆమె గెలిచినందుకు అక్కడి స్థానికులు కొందరు ప్రదర్శించిన అసహనాన్ని మీడియా ద్వారా తెలుసుకున్నాము కదా !
      ధన్యవాదాలు.

      Delete
    3. అమెరికా దేశంలో పౌరసత్వం పొందిన కొందరు, తప్పుడు పత్రాలతో ఆ పొరసత్వమ్ పొందినట్లు తెలుసుకొని 6-8 సంవత్సరాల తరువాత ఆ పొరసత్వాన్ని రద్దు చెసిన వార్తలు నేను చూసాను.

      అదే, తప్పుడు పత్రాలతో తెలంగాణాలో ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన సీమంద్రులను ఉద్యోగాల నుండి తొలగించిన వార్తలు చూడలేదు. అయితే గియితే కొందరిని సీమంద్రకు ట్రాన్స్ఫర్ చేసారు. అలా అక్రమ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని సమైక్య వాదులు ఎందుకు డిమాండు చెయ్యరు?

      సీమంద్రులను చూస్తే బంగారు గుడ్డు పెట్టె బాతును కోసుకున్న కథ గుర్తుకు వస్తుంది.

      Delete

    4. సీమాంధ్రలో కూడా ఇలా వచ్చి ఉద్యోగాలు చేస్తున్న తెలంగాణా వారు ఉన్నారట.

      ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులు ఇవన్నీ పాటించుకోరు కదా ! ఎక్కడో ఉన్న విదేశాలకు వెళ్తున్నాము.



      Delete
  4. Green Star baaga chepparu,
    oka pakkanemo samaikya vaadulu telangaana vaallani tiduthu ade time lo kalisumtaamu ante , IDI PEDDA hilarious JOKE.

    ReplyDelete
  5. "ఏర్పరుచుకోవలసి వస్తే మీరు సంతోషంగా ఒప్పుకుంటారా ?"

    తప్పకుండా. ఇప్పుడు మీకు తెలంగాణా ఇవ్వడానికి ఉన్న అభ్యంతరాలు తొలిగి పోయాయని ఆశిస్తాను.

    ReplyDelete
  6. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి. మీరు ఒప్పుకుంటే సరిపోతుందా ?

    అలా విడిపోయి కొత్త రాజధానిని ఏర్పరుచుకోవటానికి ఖమ్మం మొదలైన 5 జిల్లాల వాళ్ళు ఒప్పుకోవాలి గదా ?

    అంతే కాదు. ఇలా అయితే దేశమంతా రాజధానితో సహా విడిపోతామనే డిమాండ్లు వస్తే దానికి అందరూ ఒప్పుకోవాలి కదా !

    అభివృద్ధి చెందిన రాజధాని తీసుకుని విడిపోవటానికి అక్కడి వాళ్ళు చాలామంది ఒప్పుకుంటారు.

    అయితే, అలా ఇతరులను అన్యాయంగా గెంటటానికి అక్కడ కూడా న్యాయం తెలిసిన కొందరు ప్రజలు ఒప్పుకోరు.

    ReplyDelete
    Replies
    1. అక్కరలేదు.

      అన్యాయం వేరే, నష్టం వేరే. తెలంగాణా ఏర్పడితే ఆంధ్రకు నష్టం వచ్చినంత మాత్రాన అది అన్యాయం కాదు. అన్యాయం జరిగిపోతుందని నెత్తీ నోరూ బాదుకునే వారే ఆ అన్యాయం ఏమిటో నిరూపించాలి.

      రాజధాని అభివృద్ధి చెందలేదు. అప్పటికే మహానగరమయిన హైదరాబాదు ఇంకా పెరిగింది. ఈ పెరుగుదలకు రాజధాని అనే స్తాయికి సంబంధం లేదు.

      తిరుపతి బాలాజీ గుడికి వచ్చేవారు అది ఎ రాష్ట్రంలో ఉందొ చూడరు. హైదరాబాదు నగరం ఎ రాష్ట్రంలో ఉన్నా, రాజధాని అయినా కాకపోయినా పెట్టుబడిదారులకు అనవసరం.

      Delete
    2. "ఏర్పరుచుకోవలసి వస్తే మీరు సంతోషంగా ఒప్పుకుంటారా ?"..అని నేను వ్రాసిన దానికి తప్పకుండా. ..అని మీరు జవాబు వ్రాయటం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది.

      బహుశా మీరు నేను వ్రాసిన విషయాన్ని సరిగ్గా అర్ధం చేసుకోకపోవటం వల్లే ఇలా రాసారనుకుంటున్నాను.

      Delete
    3. నేను చాలా బాగా అర్ధం చేసుకొనే ఆ మాట అన్నానండీ. బలవంతంగా కలిసి ఉండడం అన్యాయమనే నా నమ్మకానికి ఆంద్ర తెలంగాణా రెండూ ఒకటే.

      Delete
  7. ఇవన్నీ చూస్తుంటే ఢిల్లీ కూడా మా రాష్ట్రంలోదే మిగతా వాళ్ళు దేశానికి కొత్త రాజధానిని ఏర్పరుచుకోండి అనే డిమాండ్ కూడా వస్తుందేమో ?

    ఎందుకయినా మంచిది ముందు జాగ్రత్తగా దేశానికి రెండవ రాజధానిని ..దక్షిణాదిన ఏర్పరుచుకుంటే మంచిదేమో ?

    ఎంతో దూరదృష్టి గల అంబేద్కర్ గారు హైదరాబాదును దేశానికి రెండవ రాజధాని చేస్తే బాగుంటుందని పేర్కొన్నారు. అలా చేస్తే హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందుతుంది.

    అయితే, మిగతా దక్షిణాది రాష్ట్రాలు హైదరాబాద్కు ఆ అవకాశాన్ని ఇవ్వనిస్తారా ?

    ReplyDelete
    Replies

    1. నేను మీ వ్యాఖ్యను కావాలని డిలీట్ చేయలేదు.
      నేను వ్రాసిన వ్యాఖ్యలో కొంత సరిదిద్దుదామని చూస్తుంటే మీరు వ్రాసిన వ్యాఖ్య డిలీట్ అయిపోయింది. జరిగిన పొరపాటుకు క్షమించండి.

      Delete
  8. >>ఉమ్మడి రాజధాని సీమాంధ్రలో పెట్టి ఆ నిధులను సీమాంధ్రకే వినియోగించాలి

    మరి ఆ పద్దతి మొదట ఎందుకు ఒప్పుకున్నట్లు? అసలు సీమంద్రకు రాజధానే ఉంటె ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు అయ్యేదేనా? ఈ సమాధానం నేను ఇదివరకే చెప్పాను

    >>తెలంగాణకే ఖర్చు పెట్టాలి అనే ఒప్పందం ఎంతవరకూ న్యాయం ?

    ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు వలన హైదరాబాదు ఆదాయం మరొకరితో పంచుకోవలసిన అవసరం తెలంగాణకు ఏంటి? హైదరాబాదు ఆదాయం సీమన్ద్రకు వచ్చిన లాబం అయితే, మరి తెలంగాణకు వచ్చిన లాబం ఏంటి? గ్రేటర్ హైదరాబాద్ అంటే అందులోనే చాలా భుబాగమ్ రంగా రెడ్డి, మెదక్, నల్గొండ జిల్లలొనిది. ఆ ఆదాయంలో సీమంద్రకు ఎందుకు భాగం ఇవ్వాలి?

    >>అప్పటి సీమాంధ్రులు ప్రతిపాదించినప్పుడు అప్పటి తెలంగాణావాళ్ళకు ఇష్టం లేకపోతే గట్టిగా వ్యతిరేకించవలసింది.

    హైదరాబాదును రాజదానిగా ప్రతిపాదించింది సీమన్ద్రులె. హైదరాబాదు ఆదాయం తెలంగాణకే చెందాలని ప్రతిపాదించింది తెలంగాణా వారు. అది సీమన్ద్ర వాళ్లకు ఇష్టం లేకపోతె అప్పుడే వద్దు అనాల్సింది. అలా అని ఉంటె ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు జరిగి ఉండేదే కాదు, మాకు నష్టం ఉండేది కాదు.

    >>ఎదుటి వాళ్ళు తెలివితక్కువగా ఒప్పందాలను చేసుకుంటుంటే

    మనది మనకే ఉంటుంది, నష్టం ఉండదు, సీమన్ద్ర వాళ్ళు రాజధాని కట్టుకునే శ్రమ ఉండదు అని తెలంగాణా వారు అనుకున్నారు. వారు ఏదంటే అది ఒప్పుకుందాం, కాదంటే విశాలాంద్ర ఏర్పాటు కాదు, ఒక సారి రాష్ట్రం ఏర్పడితే మెజారిటి మనదే, మన వాళ్ళదే హవా ఉంటుంది, మనకు కావలసింది మనం చేసుకోవచ్చు అని సీమన్ద్రులు అనుకున్నారు. అందుకే ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడిన మరుక్షణమే ఒప్పందాల ఉల్లంగన మొదలు పెట్టారు. ఇక్కడ ఎవరు తెలివి తక్కువ వారు అయ్యారో అర్థం అవుతూనే ఉంది కదా.

    >>మనకు ఎవరైనా ఒక రూపాయి ఇవ్వటానికి బదులు తెలివితక్కువగా రెండు రూపాయలు ఇస్తుంటే

    విశాలాంద్ర ఏర్పాటు వలన మనకు హైదరాబాదు లాంటి నగరంలో భాగం, మరి తెలంగాణా వారికి ఏమి లాబం అని సీమన్ద్రులు ఏమయినా ఆలోచించారా ?

    >>మీరు వారి ఆకాంక్షలకు విలువనిచ్చి వారి డిమాండుకు సంతోషంగా ఒప్పుకుంటారా ?

    తప్పకుండా. ముందు వారి రాష్ట్ర అవసరాన్ని దేశం గుర్తించనివ్వండి. వారి డిమండులో న్యాయం ఉంటె పార్లమెంటు తప్పక ఒప్పుకుంటుంది.

    >>హైదరాబాదుకు దగ్గరగా ఉన్న 5 జిల్లాలతో కలిపి విడిపోతాము అనే డిమాండ్ రాదని ఎవరైనా గ్యారంటీ ఇవ్వగరా ?

    అలా ఎవ్వరు ఇవ్వలేరు. ఎవ్వరి కారణాలు వారికి ఉంటాయి, అప్పట్లో సీమంద్రులు మద్రాసు నుండి విడిపోవటానికి వారి కారణాలు వారికి ఉన్నాయి. అప్పుడ్ వారిని ఇదే ప్రశ్న అడిగి ఉంటె ఏమని సమాధానం చెప్పి ఉండే వారో అదే సమాధానం ఇపుడు కూడా వర్తిస్తుంది.

    ఇంకో విషయం మీరు గమనించాలి. తెలంగాణా, సీమన్ద్ర మద్య జరిగిన ఒప్పందాలు సీమంద్రులచే ఉల్లగించబదినవి కాబట్టి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటును రద్దు చెయ్యవలసిందిగా కొన్ని దశాబ్దాలుగా తెలంగాణా వారు కోరుకుంటున్నారు. మొదటి SrC సూచనలను అమలు పరచవలసిందిగా కోరుకుంటున్నారు. అది న్యాయమైన కోరికే కదా.

    ReplyDelete
  9. >>దేశమంతా రాజధానితో సహా విడిపోతామనే డిమాండ్లు వస్తే దానికి అందరూ ఒప్పుకోవాలి కదా !

    మీరు కన్ఫోజ్ అవుతున్నారు, దేశ విభజన అనేది చట్టంలో లేదు, రాష్ట్ర విభజన చట్టంలో ఉంది.

    >>అభివృద్ధి చెందిన రాజధాని తీసుకుని విడిపోవటానికి అక్కడి వాళ్ళు చాలామంది ఒప్పుకుంటారు.

    రాజధానే కట్టుకునే పరిస్తితి లేని ఒక రాష్ట్రం, ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చెంది ఉన్న రాజధాని కల మరొక చిన్న రాష్ట్రంను కలుపుకోవటానికి కూడా చాలామంది ఒప్పుకుంటారు. ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు అనేది అలానే జరిగింది.

    ఒప్పందాల ఉల్లంఘనల వలన ఇన్నాళ్ళు కొన్ని తరాల పాటు తెలంగాణా నష్టపోయింది, హైదరాబాదు కోల్పోవటం వలన ఇక ముందు సీమాంధ్ర నష్టపోతుంది. ఇరు పక్షాల నష్టం యొక్క కారణం ఒక పక్షం చేసిన ఉల్లంఘనలు.

    ఇంకా చెప్పాలంటే, సీమాంధ్ర నాయకులు గత ఎన్నికలలో తెలంగాణా ఏర్పాటుకు ఒప్పుకున్నారు, తెలంగాణా ఏర్పాటు ఎజెండా గల పార్టీలకు సీమాంధ్ర ప్రజలు ఓట్లు వేసారు. అంటే వారందరూ ఒప్పుకున్నట్లే. ఇప్పుడు మాట తప్పి సమైకంద్ర అనటం అంటే మరోసారి తెలంగాణా ప్రజలను మొసగించటమే. ఇలా ఎన్ని సార్లు మాట తప్పి మోసగిస్తారు? ఈ ప్రశ్న ఎవ్వరూ అడగరా?

    ReplyDelete

  10. ఆంధ్రతో కలవటం , హైదరాబాద్ రాజధాని చెయ్యటం అప్పటి తెలంగాణా వారికి ఇష్టం లేకపోతే సీమాంధ్ర వారి ప్రతిపాదనకు ఒప్పుకోకుండా ఉండవలసింది. ఎవరి బ్రతుకులు వారు బ్రతికేవారు. సీమాంధ్రులు తమకు ఉన్న ఊరిలోనే రాజధాని ఏర్పరుచుకునేవారు.

    ఆంధ్రతో కలవటానికి ఒప్పుకుని అప్పటి తెలంగాణా పెద్దవాళ్ళు సంతకాలు చేసారు. వాళ్ళకు ఇష్టం లేకపోతే సంతకాలు చెయ్యరు కదా !

    పూర్వపు ఆంధ్రలో రాజధానే కట్టుకునే పరిస్తితి లేకపోవటం అనేది లేదు. అప్పటి సీమాంధ్రలో కూడా అభివృద్ధి చెందిన ఊర్లు ఉన్నాయి.

    విశాఖపట్నంలో 1920 లోనే ఆంధ్రయూనివర్శిటీ ఏర్పడింది. విజయవాడ గుడారాలు ఉన్న ఊరు కాదు. చక్కటి కట్టడాలు ఉన్న ఊరే. ఇంకా కొన్ని ఊర్లు సాంస్కృతికంగా ఎంతో అభివృద్ధి చెందాయి.

    మీరు అప్పటి హైదరాబాద్ బాగా అభివృద్ధి చెందినది అంటున్నారు. ....సీమాంధ్రలో తెలంగాణాలో ఉన్నట్లు బాంచెన్ దొరా.... అనే బానిస వ్యవస్థ లేదు.

    ఆ రోజుల్లోనే బాగా చదువుకున్న వారు ఎందరో సీమాంధ్రలో ఉన్నారు. వారిని తెలంగాణాకు రమ్మని ఆహ్వానించారు కూడా.

    పాత హైదరాబాద్ లో ఉన్న కట్టడాలతో పోల్చితే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత హైదరాబాద్లో జరిగిన అభివృద్ధి అనేక రెట్లు ఎక్కువ అని అందరికీ తెలుసు.

    హైదరాబాద్ ఆదాయం సీమాంధ్రులతో ఎందుకు పంచుకోవాలని మీరు అన్నారు. సీమాంధ్ర ఆదాయం తెలంగాణాతో ఎందుకు పంచుకోవాలని సీమాంధ్రులు అనుకోరు.

    ఇంకొక విషయం ఏమిటంటేనండి , తెలంగాణాలో నదుల ప్రవాహం ఉండే తీరు వల్ల ఎత్తిపోతల పధకాలు లేకపోతే నీరు పొలాలకు అందదు. అదే కోస్తాలో నీటివాలు పల్లానికి ఉంటుంది కాబట్టి చాలా తక్కువ ఖర్చుతో పొలాలకు నీరు వస్తుంది.

    నీటిప్రాజెక్ట్స్ వంటివి చాలా ఖర్చు అవుతాయి కాబట్టి , ఉమ్మడి డబ్బుతోనే నిర్మిస్తారు.

    ఎత్తిపోతల పధకాలకు చాలా డబ్బు ఖర్చు అవుతుంది. ఇప్పటి ఎత్తిపోతల పధకాలను కేవలం తెలంగాణా జిల్లాల నుండి వచ్చిన రెవెన్యూతోనే కట్టారా ?

    అయితే, ఉమ్మడి ఆదాయంతో తెలంగాణాలో ఎత్తిపోతల ప్రాజెక్ట్స్ నిర్మిచటం గురించి సీమాంధ్రులు ఎప్పుడూ బాధపడరు. తెలంగాణా వారు కూడా బాగుండాలనే సీమాంధ్రులు భావిస్తారు.

    ReplyDelete
    Replies
    1. ఒక సవరణ..
      ఆంధ్ర విశ్వవిద్యాలయము 1926 లో ఏర్పడింది.

      Delete
    2. తెలంగాణాలో (మూడు జిల్లాలో మాత్రమె) బాంచన్ కాల్మొక్త ఒకప్పుడు ఉండేది. సీమాంధ్రలో ఇదే అహంకారం ఉంకో రకంగా ఉందని కారంచేడు సాక్ష్యం.

      Delete
    3. మీకు ఆర్ధికశాస్త్రంలో పాఠాలు చెబుతున్నందుకు మన్నించండి. ఇక్కడ సమస్య "ఆదాయం" (income) కాదు, "మిగులు" (surplus). వచ్చిన ఆదాయం ఖర్చుల కన్నా ఎక్కువ అయితే, దాన్ని "మిగులు" అంటారు. ఒకవేళ ఖర్చులే ఎక్కువ అయితే దాన్ని "లోటు" (deficit) అంటారు.

      ఉమ్మడి ధనం అనే మాటకు అర్ధం పెద్దగా లేదు. రాష్ట్రవ్యాప్త కార్యాలయాలు (ఉ. సెక్రటేరియట్) లాంటి వాటికి ఆయె ఖర్చులు మాత్రమె ఉమ్మడి ఖర్చు కింద జమే చేయొచ్చు. దీన్ని అనుకూలమయిన ప్రాతిపదిక (ఉ. జనాభా) మీద ప్రాంతాలకు కేటాయించడం సులభం. ఉమ్మడి ఆదాయం అనేది దాదాపు సున్నా.

      తెలంగాణా మిగులు తెలంగాణకే ఖర్చు పెట్టాలన్న ప్రతిపాదనను రెండు ప్రాంతాల పెద్దమనుషులు ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తరువాత ఉల్లంఘించడం తప్పు.

      అయినా మేము పెద్ద మనస్సుతో పాత ఉల్లంఘనలకు నష్టపరిహారం అడగడం లేదు. ఇకముందయినా అలా జరగకుండా ఎవరి భవితవ్యం వారు చూసుకోవాలని అనడం తప్పెలా అవుతుంది?

      ఆంధ్రులు బాగు పడాలనే మేమూ కోరుకుంటాము. ఆ బాగేదో వారి సొంత వనరులతో జరగాలని అనడం న్యాయం కాదా?

      Delete
    4. కారంచేడు సంఘటన అత్యంత బాధాకరమైనదే. అయితే, అలాంటి సంఘటనలు సీమాంధ్రలో చాలాచాలా తక్కువ.

      కానీ, తెలంగాణా భూస్వామ్య వ్యస్థ వల్ల ప్రజలు అత్యంత బాధాకరమైన పరిస్థితి అనుభవించారు. దీని గురించి మా భూమి అనే తెలుగు సినిమాలో చక్కగా చూపించారట.
      Telangana Movies: Maa Bhoomi నేను ఈ సినిమాను కొద్దిగానే చూసాను.

      ఇక రజాకార్ల దారుణాల గురించి తెలిసిందే.
      .........................

      ఏ రాష్ట్రంలోనైనా ఉమ్మడి రాజధాని ఆదాయం ఆ రాష్ట్రంలో అందరికీ చెందటమే న్యాయం.

      Delete
    5. "ఏ రాష్ట్రంలోనైనా ఉమ్మడి రాజధాని ఆదాయం ఆ రాష్ట్రంలో అందరికీ చెందటమే న్యాయం"

      ఇది ఎ న్యాయశాస్త్రంలో ఉందండీ? కలిసి ఉందాం, మీ మహానగరం ఆదాయం మేము తింటాం అని పిలిస్తే ఎవరూ చేరరు.

      "నేను ఈ సినిమాను కొద్దిగానే చూసాను"

      మా కుటుంబ పెద్దలు సాయుధపోరాటంలో పాల్గొన్నారు. మాభూమి సినిమా ఒక్కటే కాదు ఈ పోరాటం తాలూకా ఎంతో సాహిత్యం చదివాను & ఎందరితోనో చర్చించి తెలుసుకున్నాను. నాకు ఈ పోరాటం గురించి తెలుసు కాబట్టే వ్యాఖ్యానించాను.

      Delete
    6. హైదరాబాద్ ను రాజధానిగా ఒప్పుకుంటేనే విశాలాంధ్రలో చేరతామని అప్పటి తెలంగాణా వారు అనటం వల్లే హైదరాబాద్ ను రాజధాని చేయటానికి సీమాంధ్రులు ఒప్పుకోవలసి వచ్చింది.

      విశాలాంధ్ర కోసం తమ ప్రాంతములో రాజధానిని ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని , తమ ప్రాంత అభివృద్ధిని వదులుకున్న సీమాంధ్ర వారి గురించి మీరు తప్పుగా అర్ధం చేసుకుంటున్నారు.

      రాజధాని అంటే అందరికి చెందినది అనే కదా ! అందరికీ చెందనప్పుడు ఇక దానిని ఉమ్మడి రాజధాని అనటం ఎందుకు ?

      ఉద్యమాలలో మా పూర్వీకులూ పాల్గొన్నారు. స్వాతంత్రోద్యమ కాలంలో జరిగిన ఉద్యమంలో మా తాతగారు వాళ్ళు చురుకుగా పాల్గొన్నారని , కష్టాలు అనుభవించారని మా పెద్దవాళ్ళు చెబుతారు.

      Delete
    7. ఒక సవరణ..
      విశాఖపట్నంలో 1920 లోనే ఆంధ్రయూనివర్శిటీ ఏర్పడింది. విజయవాడ గుడారాలు ఉన్న ఊరు కాదు. చక్కటి కట్టడాలు ఉన్న ఊరే. ఇంకా కొన్ని ఊర్లు సాంస్కృతికంగా ఎంతో అభివృద్ధి చెందాయి.

      కర్నూల్ వాతావరణం కూడా హైదరాబాదులా చెమట ఎక్కువ పట్టదు.

      అయితే, ఇప్పుడు హైదరాబాదులో కూడా పారీశ్రామీకరణ పెరగటం, ప్రజలు పెరగటం వల్ల వేడి పెరిగింది.

      Delete
  11. హైదరాబాదుకు దగ్గరగా ఉన్న 5 జిల్లాలతో కలిపి విడిపోతాము అనే డిమాండ్ ....అలా ఎవ్వరు ఇవ్వలేరు. అంటున్నారు. మరి హైదరాబాదుకు దగ్గరగా ఉన్న 10 జిల్లాలతో కలిపి విడిపోతాము అంటే ఇవ్వాలంటున్నారు.

    మీరు కన్ఫోజ్ అవుతున్నారు, దేశ విభజన అని నేను అనలేదు.

    సీమాంధ్ర నాయకులు గత ఎన్నికలలో తెలంగాణా ఏర్పాటుకు ఒప్పుకున్నారు, ..అన్నది మాత్రం నిజమేనండి. ఇప్పటి పరిస్థితికి అన్ని రాజకీయ పార్టీలు కారణమే.

    ఈ సమస్య వల్ల మనం అనేక విషయాలను తెలుసుకోవాలి. రాజధాని ప్రాంతాన్ని మాత్రమే కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను చక్కగా అభివృద్ధి చేయాలని , వీలైతే ఉపరాజధానులను ఏర్పాటు చేస్తే మరీ మంచిదని అనిపిస్తోంది. అప్పుడు ఇలాంటి గొడవలు రాకుండా ఉంటాయి.

    ReplyDelete
  12. ఏది ఏమైనా సీమాంధ్రులు, తెలంగాణా వారు ఎప్పటికీ శత్రువులు కాదు. కొందరు వ్యక్తులు సీమాంధ్రులను దొంగలు, దోపిడీదారులు అని తరచూ అనటం వారికి బాధను కలిగించి ఉండవచ్చు.

    తమ ఆవేదన గురించి సరిగ్గా పట్టించుకోవటంలేదనే బాధలో ఉన్న సీమాంధ్రులతో కేంద్ర ప్రభుత్వం మరింత రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించటం వల్ల కూడా పరిస్థితులు ఇంతగా దిగజారిపోయాయనిపిస్తుంది.

    ఏమైనా అందరూ సహనంతో ఉండి కొంచెం పట్టువిడుపు ధోరణిని ప్రదర్శిస్తే సమస్య పరిష్కారం అవుతుంది. అంతేకానీ పంతాలకు పోతే ఫలితం ఉండదు.

    పంతాలకు పోకుండా మనలో మనం సర్దుకుపోవాలి. మనవల్ల దేశానికి నష్టం కలగకూడదు.

    రాష్ట్రం విడిపోయినా, విడిపోకపోయినా అందరం ఎప్పటికీ స్నేహంగానే ఉండాలని , ఉంటారని కోరుకుందాము.

    ReplyDelete
    Replies
    1. భారతీయులు ఎవరూ మాకు శత్రువులు కారు. ప్రస్తుతానికి ఆంద్ర ఇంకా మన దేశంలోనే ఉంది కాబట్టి ఆంధ్రులు కూడా ఆ స్నేహానికి అర్హులే.

      Delete
  13. This comment has been removed by the author.

    ReplyDelete