koodali

Friday, July 20, 2012

ఓం. శ్రీ హరిహరహిరణ్యగర్భ త్రిమూర్త్యాత్మక శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి వారి జయంతి.....శ్రావణ విదియ నాడు .

ఓం. 

శ్రీ  అన్నవర  క్షేత్రం  గురించి    నేను  చదివిన   ఒక  పుస్తకంలోని ...కొన్ని  విషయాలు.

ఒకప్పుడు  నారదుడు   భూలోకానికి  రావటం  జరిగిందట. భూలోకంలో  ఎటు  చూచినా ... కరవు కాటకాలు,  ప్రజల  మధ్య  అన్యోన్య  కలహాలు,  దురాశలు  ఇవన్నీ  చూసి  కలత  చెందిన   నారదుడు  శ్రీమన్నారాయణుని   అనుగ్రహంతో  భూలోకాన్ని  ఉద్ధరించాలనే  సంకల్పంతో  అంతర్ముఖుడవుతాడు.


పరమభాగవతుడైన   నారదుని  ధ్యానకీర్తనలకు  సంతుష్టుడైన  దేవదేవుడు  ఆకాశపధంలో  సాక్షాత్కరించాడు.అమరమునికి  ప్రత్యక్షమైన  ఆ  దివ్యమంగళమూర్తి   విలక్షణమైనది.  


ఒక  క్షణం   నారాయణ  రూపాన్ని,  ఉత్తర  క్షణం  శివరూపాన్నీ,  మరుక్షణం  బ్రహ్మ  రూపాన్నీ   దర్శించిన  విలక్షణానందం  నారదుడికి  కలిగింది. అదిగో  వైకుంఠం  !   ఇదిగో  కైలాసం  !  అదే  సత్యలోకం  !  అనుకుంటూ  ఆనంద  పరవశుడయ్యాడు.


ఆ  దేవదేవుడు  ఆదరానుగ్రహాలతో  నారదుని  పరామర్శించాడు. 
ఆ  దేవుని  ఆదరానుగ్రహాలకు  ఉప్పొంగుతూ  నారదుడు   సవినయంగా  అంటున్నాడు....

పరంధామా  !  నీవు  సర్వజ్ఞుడవు.   ......................స్త్రీలకూ,  వృద్ధులకూ,  బాలబాలికలకూ  రక్షణ  అనేది  లేదు.  దేశక్షోభం  కలిగించే   క్షామం    తాండవిస్తోంది. 



 ఇది  ఇలా  ఉండగా,  మతభేదాలు,   శివుడే  అధికుడనీ ,  విష్ణువును  మించి  దేవుడు   లేడనీ  ..వాదించుకుంటూ  క్రమంగా  హింసాకృత్యాలకు  సంశయించకుండా    ప్రవర్తిస్తున్నారు.....

......  "  సర్వలోక సంరక్షకుడైన  భగవానుడు  ఒక్కడే   భుక్తిముక్తిదాయకుడు  అతడే  "  అనే  విశ్వాసం  ప్రజలకు  కలిగినప్పుడే  లోకానికి  కళ్యాణం ...  అస్తిక్యబుద్ధి  కలగనంత   కాలం  ఈ  దుర్భిక్షమూ ,  దుఃఖమూ , విరోధభావాలు  తొలగిపోవడం  సాధ్యం  కాదు. ....

.... కనుక  సర్వాత్ముడవైన  నీవు  త్రిమూర్త్యాత్మకంగా  హరి  హర  బ్రహ్మ  రూపంలో  అవతరించి  లోకకళ్యాణం  కలిగించాలి.   అని  నారదుడు  ప్రార్ధించగా .

దేవదేవుడు  ప్రసన్నవదనంతో  ....... అలాగే  అని  వాగ్దానం  చేసి  అంతర్హితుడవుతాడు. 

  భగవానుడగు  అన్నవరం  రత్నాద్రి  మీద స్వయం ప్రతి
ష్టితుడు   కావడానికి  సంకల్పించుకున్నాడు. 

శ్రీ  రాజా  ఇనుగంటి  వేంకటరామరాయిణిం  గారు  గొప్ప  దైవ  భక్తులు.

ఒకనాటి  రాత్రి   దేవదేవుడు   స్వప్నదర్శనం  ద్వారా తన  భక్తుడైన  ప్రభువుతో  .... లోకహితార్ధమై   తాను  రత్నగిరి  మీద  అవతరించటం  గురించిన  విషయాలను    తెలియజేస్తారు.


ప్రభువు  హర్షపులకాంకితుడై  కలలో  కనపడిన  సత్యదేవుని  శివసుందర  రూపాన్ని  అనుధ్యానం  చేసుకుంటూ  లేచి ,....... తన  అదృష్టానికి  మనసులో  ఆనందపడుతూ  ,  ఇష్ట  బంధుమితృలందరికీ  స్వప్న  వార్తను  చెబుతారు.


శ్రావణ  విదియ  నాడు  సత్యదేవుని  స్వయం  ప్రకాశం  అభివ్యక్తమయ్యే  రోజు. పాడ్యమి  నాటి  రాత్రి  జాగరణం   చేసి,  ప్రభువుతో  సహా  భక్తులందరూ మర్నాడు   ఉషఃకాలంలో  నిర్మలమైన  పంపా  నదిలో  స్నానం  చేశారు. 

 పూజాదికం  నిర్వర్తించుకుని .  భక్తబృందంతో  మంగళవాద్య  పురస్సరంగా  బయలుదేరి   ముందుగా  గ్రామదేవత  "నేరేళ్ళమ్మ  కోవెల "  దగ్గరకు  వెళ్ళి  ప్రదక్షిణ  ప్రణమాలు  చేసుకున్నారు. 


 ఆ  చిన్న  కోవెలకు  ఎదురుగా  చిట్టడవిలో  ఆవరించి  ఉన్న  మెట్ట  ఒకటి  గోచరించింది.  ఆ  గిరికి  పరమభక్తిగా  నమస్కరించి  భక్తులు   దైవనామ  సంకీర్తన  చేసుకుంటూ  కొండ  ఎక్కి  అన్వేషణ  చేస్తున్నారు.,  

అలా  వెదకుతూ  ఉండగా    ఒక "కుంకుడు  చెట్టు  "  మొదట  దేవదేవుని  స్వరూపావిర్భావం  కల్పవృక్ష  లాభంగా  గోచరించింది.  


ప్రభువు  ఆనంద  భాష్పధారలతో  సత్యదేవుని  విగ్రహ  శ్రీ  చరణాలు  తడుపుతూ  సాష్టాంగ   ప్రణతులు  చేశారు. భక్తులందరూ   దివ్యదర్శన  లాభంతో  "  పేదలకు  పెన్నిధి  దొరికింది  "   అంటూ  కొండంత   ఆనందంతో  స్వామి  వారికి  మోకరిల్లారు.


ఆయా  భక్తులను  నిమిత్తమాత్రులుగా  చేసికొని  సత్యనారాయణస్వామి  వారు " రత్నాచలం"  మీద   స్వయం  ప్రతిష్టితులైనారు.  సర్వాత్మకుడైన  స్వామి  రత్నగిరి  మీద  దివ్యసౌధంలో   అనంతలక్ష్మిసత్యవతిదేవితో  గృహస్థాశ్రమ  స్వీకారం  చేసారు.



శ్రీ   స్వామి  వారి  దేవస్థానం   కనుపండువు  చేసే   రెండు  అంతస్థులుగా  ఉంటుంది.  క్రింది  భాగంలో  యంత్ర  ప్రతిష్ఠ  జరిగింది.  స్వామి  వారి  దివ్య  మంగళమూర్తిని  మేడమీద  చూడగలుగుతాము.ఈ  రెండింటికి     నడుమ  పానవట్టం  వంటి  నిర్మాణం.  అందు  త్రిపీఠముల  మీద  బీజాక్షర  సంపుటి  యంత్రం   బిందు  స్థానమున  ఏక శిలా  స్థంభం  ,  పై  భాగమున " శ్రీ  సత్యనారాయణ  స్వామి  వారి  చెంత  అమ్మవారు  అనంత  లక్ష్మీ   సత్యవతీదేవి.  వేరొక  వైపు  శివలింగం.దిగువ  భాగంలో  గణనాధుడు...ఆదిత్యుడు,,, అంబిక  మహేశ్వరుడు   నాల్గువైపులా   ప్రతిష్టితులు. .   ఈ  విధంగా  విష్ణు  పంచాయతనం  గర్భాలయంలో  గోచరిస్తుంది."


యంత్రమునకు  స్వామి  వారి  మూర్తికి   త్రికాలార్చనలు   జరుగుతూ  ఉండటమే   కాక,  స్పటిక  శ్రీ  చక్రార్చనము,  సాలగ్రామార్చనము  నిత్యమూ  చేయబడతాయి.


శ్రీ  స్వామి  వారి  పేరుతో  సృష్టి  స్థితి  లయ  కారకులైన  ముగ్గురు  మూర్తుల  ఏకాకృతి  ఈ  రత్నగిరి  మీద  వెలసినదని  తెలిసిన  పెద్దలు  అభివర్ణిస్తారు.

 

ఆదిలోని  వృత్తాకారమైన   శిల  బ్రహ్మ  స్వరూపమనీ,  నడుమనున్న  లింగాకార  స్థంబం  శివస్వరూపమనీ,  ఊర్ధ్వమందలి  విగ్రహం   నారాయణ  స్వరూపమనీ,  ఈ  విధంగా  హరి హర హిరణ్యగర్భాత్మక   ప్రతిష్ఠ  అపూర్వమైనదని  భక్తులు  గ్రహిస్తారు.

శ్రీ  సత్యనారాయణ   స్వామి  వారి  ఆలయంలో  ప్రవేశించగానే   , బహుజన్మసంచితమైన  పాప ప్రతిబంధకం  తొలగి,  సత్యలోక  ప్రవేశానుభవ  స్పురణ  కలుగుతుంది.

ఉత్తర  క్షణంలో  , గౌరీశంకరులు  కొలువుతీర్చి   ఉన్న  కైలాస   మానసాహ్లాదం  కలిగిస్తుంది.

వెంటనే  కన్నుల  వైకుంఠం  : శ్రీ  వీరవేంకటసత్యనారాయణస్వామివారి   దివ్యమంగళ  దర్శనలాభం.  స్థితిమూర్తియైన  స్వామి  అర్చాకృతిని  దర్శించుకుంటూ,  చేతులు  జోడించి  భక్తులు  ఇలా  కీర్తిస్తున్నారు.

"  మూలతో  బ్రహ్మరూపాయ
మధ్యత  శ్శివరూపిణే
అగ్రతో  విష్ణురూపాయ
త్రైక్య  రూపాయ  తేనమః  "

సత్యదేవవ్రతకల్పం  స్కాందపురాణం  రేవాఖండంలో  అయుదు  అధ్యాయములుగా  ఉన్నది.

ఈ  సత్యవ్రత  విధానము  నారదునకు  విష్ణువుచే  బోధింపబడినది.

కల్పోక్త  విధానంతో  యీ  వ్రతం  చేసి  ,  అభీష్ట  సిద్ధులు  పొందిన  వారి  గాధలు  ఎన్నో  యీ  రేవా  ఖండంలో  వినిపిస్తాయి. 

 కాశీలోని  ఒక  నిరుపేద  బ్రాహ్మణుడు  " సత్యవ్రతం  "  ఆచరించి  సర్వభాగ్యసంపన్నుడౌతాడు.

కట్టెలమ్ముకుని  బ్రతికే  ఒక  దరిద్రుడు  యధాశక్తి,  భక్తితో  యీ  వ్రతము  చేసి  పాపవినిర్ముక్తుడై  వైకుంఠధామం  చేరుకుంటాడు.



సాధువనే  ఒక  వైశ్యుడు  సత్యవ్రతం  చేసి, మహాపద్సముద్రంలో   నుండి  బయటపడి  ఐశ్వర్యవంతుడవుతాడు.



తుంగధ్వజుడనే  రాజు  వేటకు  వెళ్ళి  అడవిలో  గోపాలకులిచ్చిన  సత్యనారాయణ  ప్రసాదం  తిరస్కరించి  రాజ్యభ్రష్టుడై   ,  బుద్ధి  వచ్చి  మరల  ప్రసాదస్వీకారం  చేసి  రాజ్యం  సంపాదించుకుంటాడు.



ఇంకా,  దుష్టబుద్ధి  కధ,  కౌముది  కధ...సత్యనారాయణ  వ్రత  ప్రభావాన్ని   వేనోళ్ళ  కీర్తిస్తున్నవి.


......................


ఈ  విషయములు  మధునాపంతుల  సత్యనారాయణ  గారు  రచించిన  పుస్తకములో  చదివి  రాసానండి.. శ్రీ  అన్నవర  క్షేత్రము.  (  స్థల  పురాణము.  ) శ్రీ  వీరవేంకటసత్యనారాయణ స్వామివారి  ఆవిర్భావ  చరిత్ర.  రచన;మధునాపంతుల  సత్యనారాయణ  శాస్త్రి.
ప్రోత్సాహకులు;దాసరి  కృష్ణమూర్తి.   


అందరికి   కృతజ్ఞతలు.

నేను వ్రాసిన  విషయాలలో  ఏమైనా  పొరపాట్లు  ఉన్నచో    దయచేసి  క్షమించాలని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.




No comments:

Post a Comment