koodali

Friday, October 1, 2010

ఇదండీ నా ఉపవాస ప్రహసనం................. ...

 

జీవితములో ప్రతి పనిని పధ్ధతిగా చేస్తే మంచి ఫలితములు వస్తాయి కదండి. ఉదా.......ఆఫీసులో పనులు పధ్ధతిగా చేస్తే సత్ఫలితాలు వస్తాయి. ఆడవాళ్ళు పధ్ధతిగా వంట చేస్తే వంట రుచిగా ఉంటుంది. వైద్యం పధ్ధతిగా చెస్తే రోగం త్వరగా తగ్గుతుంది. ఇలాగే దైవ పూజ విషయంలో కూడా పెద్దలు పధ్ధతులను ఏర్పాటు చేసారు.


కొంతకాలం క్రితం నేను పూజలు కొద్ది భయభక్తులతో చేయటం జరిగేది. అయితే వాటి గురించి విషయములు తెలిసేకొద్దీ ఎందుకో మరి ......... బాబోయ్ ! ఏదైనా లోటు జరిగితే ఏం కష్టం జరుగుతుందో ? అని ఒక భయం ఏర్పడింది.


దాంతో దేవునియందు భక్తిశ్రధ్ధ కన్నా పూజయొక్క విధివిధానముల గురించిన శ్రధ్ధ ఎక్కువయిందండి. అప్పుడు నాకు ఏమని అనిపించిందంటేనండి......... ఎక్కువ విషయములు తెలియకముందే ప్రశాంతముగా పూజ చేసుకున్నానేమోనని .


ఇప్పుడు మళ్ళీ ఏమి అనిపిస్తుందంటేనండీ పెద్దలు చెప్పిన విషయములను మనము సరిగ్గా అర్ధం చేసుకోకుండా అపార్ధం చేసుకోవటం వల్ల ఇలా అనిపిస్తోంది అని.


ఉదా......ఉపవాసం ఉన్నప్పుడు నాకు ఒక సందేహము వచ్చిందండి. ఇది చదివి మీరు ఏమీ అనుకోకూడదు. ఏమి జరిగిందంటేనండీ.........ఒక రోజున ఉపవాసం ఉన్నప్పుడు పళ్ళ సందున ఒక మూల క్రిందటి రోజున మిగిలిపోయిన ఆహారపదార్ధం నాలుకకు తగిలిందండి. నేను బాగానే శుభ్రం చేసుకుంటాను మరి.


ఇక నాకు సందేహం వచ్చేసింది. ( నాకు రాకపోతేనే ఆశ్చర్యపడాలి ) ఉపవాసం అంటే అన్నం లాంటి పదార్ధములు తినకూడదు. మరి ఇప్పుడు నా ఉపవాసనియమము భగ్నం అయిపోయినట్లేనా ?ఏమి చెయ్యాలి ?సుబ్బరంగా భోజనం చేసేసి రేపు మళ్ళీ మొదలుపెట్టాలా ?లేక ఇలా కొనసాగించాలా ?ఒకవేళ రేపు కూడా ఇలా అయితేనో ? ఇప్పుడు ఏది దారి ? ( ఇది చదివి మీరు కొత్త అనుమానాలు పెంచుకోకండి దయచేసి )


ఇప్పటికి మీకు అర్ధం అయిపోయుంటుంది. నా చాదస్తం ఏ స్థాయికి చేరిందో ?దీనినే అతి అంటారేమో ?ఉపవాసం గురించి మన పెద్దల అసలు అభిప్రాయము ఇది కాదేమో ?ఇలా ఆలోచిస్తూపోతే నాకు దేవునియందు భక్తి మాట అటుంచి ఏమయిపోతానో అని అనిపించిందండి.......


.ఇంకా ఏమిటంటేనండి నక్షత్రము చూసినతరువాత భోజనం చేయటం ఒక పధ్ధతి కదా. ఎప్పుడు నక్షత్రము కనిపిస్తుందా ......ఎప్పుడు భోజనం చేస్తానా అని ఆలోచన ....... నాకయితే భోజనం చేస్తేనే దైవపూజ నాకుచేతనయినంత శ్రధ్ధగా చేయగలననిపిస్తుంది. ఇది నా గురించి మాత్రమే చెబుతున్నానండి.
.

కలియుగములో జీవులు అన్నగతప్రాణులని అంటారు. ( ఈ వాక్యం నేను సరిగ్గా వ్రాసానో లేదో తెలియదండి )


అయితే కఠిన నియమములను పాటిస్తూ అపారమయిన దైవభక్తి గలవారు ఎందరో ఉన్నారు. వారికి నా వందనములు. నాలాంటి సామాన్యులకు కొంతదైవభక్తి, దేహభ్రాంతి రెండూ ఉంటాయి కాబట్టి ఇలా రకరకముల ధర్మసంకటములు తరచూ వస్తూ ఉంటాయి.


సరే , ఇలా నేను దైవభక్తిని గాలికొదిలేసి నక్షత్రములు ఎప్పుడు కనబడతాయో అని ఆలోచిస్తూంటే పరీక్షలాగ ఆ రోజే మబ్బులు వచ్చి నక్షత్రములు కనబడేవి కావు.

నాకయితే మరుసటి రోజు వరకూ నక్షత్రములు కనబడేవరకూ వేచిఉండే ఓపిక లేదు. ఏదో ఒక దేవుని పటములో చంద్రుని చూసి ఉపవాసమును వదులుకోవటము జరిగేది.

ఒకోసారి నాకు ఆకలివల్ల కోపం, చిరాకు కూడా వస్తుంటాయి. దాంతో ఇంట్లో వాళ్ళమీద చిరాకు పడటము కూడా జరిగేది . ఇలా చేసి వాళ్ళలో పూజలు అంటేనే విరక్తి కలిగితే అది మరింత ప్రమాదం.

అప్పుడు నాకు నా శక్తిమేరకు నేను ప్రవర్తించటం మంచిది అనిపించిందండి.

ఇంతకీ నాకు ఏమని అనిపిస్తుందంటేనండి ఒకోసారి కొన్ని విధివిధానములను పాటించటము కుదరదు. అలా అని మనకు అనుగుణంగా వాటిని మార్చుకొమ్మని చెప్పటము నా ఉద్దేశ్యం కాదు.

మరీ కుదరనప్పుడు నా ఉపవాస ప్రహసనం లోలా అతి గా ఆలోచించకుండా విచక్షణగా ఆలోచించాలి. శక్తి చాలనప్పుడు దైవం పైన భారం వెయ్యటం ఉత్తమము.

ఉపవాస సమయములలో దైవానికి సమీపముగా మనస్సు ఉండటము ముఖ్యమని పెద్దలు కూడా చెబుతున్నారు.


అప్పుడప్పుడు ఇష్టపడి చేసినా,
కష్టపడి చేసినా ......... ఉపవాసము వల్ల చాలా ఉపయోగములున్నాయండి.


శరీరములోని మలిన పదార్ధములన్నీ పోయి ఆరోగ్యం వస్తుందట. ఇంకా పేదవాళ్ళ ఆకలి బాధ అందరికి తెలిసివస్తుంది. ఆహారం యొక్క విలువ అందరికీ తెలిసివస్తుంది.


ఇంకో విషయమండి పూజలప్పుడు అతిగా తినటం వల్ల పూజ మధ్యలో కాలకృత్యములకు వెళ్ళవలసి రావటం ఇలా జరగకుండా ఉపవాసం సహాయపడుతుంది. ఉపవాససమయములో పాలు ,పండ్లు తీసుకోవచ్చని పెద్దలు చెబుతున్నారు. (ఇది నాకు ఆనందమును కలిగించే విషయం ).


నేను చిన్నప్పుడు ఎప్పుడైనా ఉపవాసం పాటించినప్పుడు బాగా నీరసం వచ్చేది. ఇప్పుడు అంత రాదు అలవాటయిందండి. నేను అప్పుడప్పుడు మాత్రమే ఉపవాసం ఉంటుంటాను.
ఇదండీ నా ఉపవాస ప్రహసనం
...

 

3 comments:

  1. ఉపవాసము అంటే ఆహారం తినకుండా ఉండడం కాదు. భగవంతుని ధ్యానంలో మనసుని నివసింప జేసి ఉండడమండీ ! ఆ పనిని మీరు రోజంతా చేయనక్కర్ లేదు. అలా చేయలేరు కూడ ! నేను నాకు తెలిసిన రహస్యం చెప్తాను వినండి !పంచాంగంలో వర్జ్యము అని కొంత కాలాన్ని కేటాయిస్తారు కదండీ ! ఆ కాలంలో లౌకిక కార్యాలేవీ చేయ్కూడదు, కాని ఎంచక్కా ఉపవాసం చేయవచ్చండీ !మీకు శుభం కలుగు గాక !!

    ReplyDelete
  2. మీ అభిప్రాయములు తెలిపినందుకు చాలా కృతజ్ఞతలండి. మీరు తెలిపిన విషయములు చక్కగా ఉన్నాయండి. శుభాకాంక్షలు తెలిపినందుకు మీకు నా కృతజ్ఞతలండి. మీకు మరియు అందరికి శుభం కలగాలని ఆ దైవాన్ని కోరుకుంటున్నానండి...

    ReplyDelete


  3. ఉపవాసంలో వివిధ పద్ధతులున్నాయి. వాటిలో నాకు తెలిసినంతలో, ఒంటిపూట భోజనం చేయటం ఒకటి.

    అయితే, ఉపవాసంలో ఒంటిపూట భోజనం అంటే కొన్నిసార్లు 12 గంటలు కన్నా ఎక్కువ సమయం పడుతోంది.

    ఉదా.. ఈ రోజు ఉదయం నుంచి సాయంకాలం నక్షత్రాలు కనిపించేవరకూ ఉపవాసం అంటే..

    ముందురోజు రాత్రి 9 గంటలకు భోజనం చేసి, మరుసటి రోజు సాయంకాలం (సుమారు రాత్రి 7 గంటలకు )నక్షత్రాలు కనిపించాలంటే సుమారు 22 గంటలు అవుతుంది. ( అంటే.. ముందు రోజు రాత్రి 9 నుండి మరుసటి రోజు రాత్రి 7 వరకు..)

    పోనీ, ముందు రాత్రి 12 గంటల నుండి లెక్కించినా కూడా సుమారు 19 గంటలు సమయం పడుతుంది.
    ( అంటే.. ముందు రోజు రాత్రి 12 నుండి మరుసటి రోజు రాత్రి 7 వరకు..)

    ఇన్ని గంటల సమయం ఒంటిపూట ఎలా అవుతుంది?

    నాకు ఏమనిపించిందంటే, నేను అంతసేపు ఉపవాసం ఉండలేకపోతున్నాను. ఒక్కపూట అంటే 12 గంటలేకదా..ఎంత పుణ్యం వస్తే అంతే వస్తుందని.. క్రింద వ్రాసిన పద్ధతులను పాటిస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నాను.

    ఒక పద్ధతి..ఈ రోజు సూర్యోదయం లోపలే భోజనం చేసి సాయంకాలం నక్షత్రాలు కనిపించిన తరువాత,
    మబ్బుల వల్ల నక్షత్రాలు కనిపించకపోతే దైవానికి నమస్కరించుకుని భోజనం చేయటం.( ఉదయం సుమారు 6 నుండి సాయంకాలంగ్ సుమారు 7.)(అట్లతద్ది రోజు సూర్యోదయం లోపలే భోజనం చేసి తరువాత ఉపవాసం ఉండే పద్ధతి ఉన్నది కదా!)

    ఇంకో పద్ధతి..ఈ రోజు సాయంకాలం సూర్యాస్తమయం లోపల భోజనం చేసి, మరుసటి రోజు సూర్యోదయం తరువాత భోజనం చేయటం..అంటే, (నిన్న సాయంకాలం సుమారు 5 నుండి ఈ రోజు ఉదయం సుమారు 6 గంటల వరకు..)

    ఇంకో పద్ధతి..ఈ రోజు రాత్రి భోజనం చేసి మరుసటి రోజు మధ్యాహ్నం 12 లేక ఒంటిగంట కు భోజనం చేయటం.( నిన్న రాత్రి సుమారు 9 నుండి ఈ రోజు మధ్యాహ్నం 12 లేదా 1 గంట వరకు )

    సూర్యోదయ సమయం, సూర్యాస్తమయ సమయం పంచాంగంలో చూడవచ్చు.

    మొత్తానికి ఎలాగైనా ఒంటిపూట అంటే 12 గంటలు మాత్రమే భోజనం లేకుండా ఉపవాసం ఉండటం. మధ్యలో అవసరం అనుకుంటే పండ్లు తినవచ్చు. మరీ ఉండలేని వారు రాగుల జావ ఉప్పు లేకుండా త్రాగవచ్చు.


    ReplyDelete