koodali

Saturday, October 16, 2010

శ్రీ దేవీ అవతార గాధలు...............

 

నారాయణుడు నారదుడి కోరికమీద భ్రామరీదేవి దివ్యావతార గాధను చెప్పడం జరిగింది.

ఒకప్పుడు అరుణుడు అనే దైత్యుడు పాతాళానికి ప్రభువుగా ఉండేవాడు. దేవతలంటే అతనికి ద్వేషం. వాళ్ళనెలాగైనా నిర్జించానే కోరికతో భూలోకానికి వచ్చి హిమాలయ పర్వతప్రాంతములో ఒక పర్ణశాలను నిర్మించుకుని , ముప్పైవేల సంవత్సరాలు కఠోరదీక్షతో గాయత్రీ మంత్రాన్ని జపించాడు.

తపశ్శక్తి చేత అతని శరీరం వేడెక్కింది. ప్రపంచమంతా అట్టుడికినట్లు ఉడికిపోయింది. ప్రజలు గగ్గోలు పెట్టారు.


దేవతలు భీతులై పరిస్థితిని బ్రహ్మకు నివేదించి ఈ విపత్తు నుంచి ప్రపంచాన్ని రక్షించమని మొరపెట్టుకున్నారు.

బ్రహ్మ వెంటనే హంస నెక్కి అరుణుడి సమక్షానికి వచ్చాడు.ఆయన వెంట చతుర్వేదాలతో పాటు గాయత్రీ దేవి కూడా ఉంది.
అరుణుడు బక్కచిక్కి, కొన ఊపిరితో ఉన్నాడు. అతని ముఖం మాత్రం అగ్నితేజంతో ప్రకాశిస్తోంది.


నాయనా! నీ తపస్సు చాలించు. దేనికోసం ఇదంతా ? అన్నాడు బ్రహ్మదేవుడు.

ఆ చల్లని మాటలు విని అరుణుడు కళ్ళు తెరిచాడు. పరమేష్టికి నమస్కరించాడు.


పితామహా ! అస్త్రాలతోను, శస్త్రాలతోను, స్త్రీపురుషులతోను, రెండురూపాలు కలవారితోను, రెండుపాదాలు లేక నాలుగు పాదాలు కలవారితోను, నాకు మృత్యువు కలగకుండా వరం ప్రసాదించు. యుధ్ధంలో విజయం లభించేటట్లు బలం అనుగ్రహించు. ఇదే నా కోరిక." అన్నాడు తెలివిగా.

అలాగే అని వరాలను ఇచ్చి వెళ్ళిపోయాడు బ్రహ్మదేవుడు.

వరాల్ని పొందిన మరుక్షణమే అసురుడు గర్వంతో విర్రవీగిపోయాడు. అతని బాహువులు యుధ్ధం కోసం ఉబలాటపడ్డాయి. విజయ కాంక్ష, పదవీవ్యామోహం పరుగులు తీశాయి.

ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన లోకానికి వెళ్ళి, దేవేంద్రునికి ఒక వర్తమానాన్ని పంపించాడు.
"మీరు స్వర్గలోకాన్ని నా అధీనం చెయ్యండి. అది కుదరదంటే మిమ్మల్ని యుధ్ధంలో ఓడించి నేనే స్వాధీనం చేసుకుంటాను.


ఇంద్రుడు ఏమి చెయ్యాలో తోచక కంగారు పడ్డాడు. బ్రహ్మ ఇచ్చిన వరం గుర్తుకొచ్చి దిగులుపడ్డాడు.
దేవతల్ని తీసుకొని వెళ్ళి పరమేష్టితో మొరపెట్టుకున్నాడు. ఆ తరువాత అందరూ వైకుంఠానికి, అటుతరువాత కైలాసానికి వెళ్ళి న తరువాత, శ్రీ మహావిష్ణువు, శివుడు అందరూ దీర్గాలోచనలో పడ్డారు.

ఇంతలో దివ్యవాణి సందేశం వినిపించింది.

" అరుణుడు గాయత్రీ మంత్ర జప పరాయణుడు. గాయత్రీ జపాన్ని చేసినంతకాలమూ అతన్ని ఎవరూ ఏమీ చెయ్యలేరు. ఆ మంత్రాన్ని విడిచిపెట్టినప్పుడు అతనికి మరణం ఆసన్నమయినట్లే. మీరు ఈ లోపల భువనేశ్వరిని భజించండి. శుభం కలుగుతుంది."

ఈ సందేశం దేవతల్ని ఆనంద సముద్రంలో ఓలలాడించింది.
ఈ లోపల అరుణుడు స్వర్గాన్ని ఆక్రమించాడు.

దేవేంద్రుడు బృహస్పతితో " గురువర్యా! మీ తెలివితేటల్ని ఉపయోగించి దానవుడి చేత గాయత్రి జపాన్ని మానిపించండి. తర్వాత పని మేము చూసుకుంటాము " అన్నాడు.

బృహస్పతి అరుణుడి దగ్గరకు వెళ్ళాడు.
" ఆచార్యా! మీ రాక మాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దేవతలు మాకు విరోధులు. శత్రు వర్గానికి చెందిన వాళ్ళు. మాతో ఏమి పని ఉండి వచ్చారు ? అరుణుడు అనుమానంతో స్వాగతం పలుకుతూ ప్రశ్నించాడు.

" మేము ప్రార్ధించే గాయత్రినే నువ్వుకూడా ప్రార్ధిస్తున్నావు కదా! ఇంకా మా వర్గం మీ వర్గం ఎక్కడ ? దేవ గురువు బుధ్ధిచాతుర్యాన్ని ప్రదర్శించాడు.
దానవుడు దేవమాయామోహితుడై ఆలోచనలో పడ్డాడు. బృహస్పతి చెప్పింది నిజమే. దేవతలు యుగయుగాలనుంచీ దైత్యులకు ప్రబల విరోధులు. వాళ్ళు సేవించే దేవతనే తానెందుకు సేవించాలి ?

ఇలా తీర్మానించుకుని గాయత్రీ జపాన్ని మానేశాడు. ఆ కారణంగా కొంతకాలానికి తేజోవిహీనుడయ్యాడు. తమకు కాలం కలసి వచ్చిందని, పరిస్థితి అనుకూలంగా మారిందని గ్రహించి దేవతలు సంతోషముతో అంబను ఆరాధించారు.

కరుణామృతవర్షిణి, జగన్మంగళకారిణి అయిన జగజ్జనని ప్రసన్నురాలై కోటిసూర్య ప్రతీకాశంతో, కోటి కందర్ప సుందరాకాశంతో, చిత్ర విలేపన వస్త్రాలతో , విచిత్ర మాల్యాభరణాలతో, వరాభయ హస్తాలతో, భ్రమరముష్టికయై, నానాభ్రమర సంయుక్త పుష్పమాలా విరాజితయై భ్రామరీ దేవిగా అవతరించింది,.


ఆమె చుట్టూ కోట్లకొద్దీ భ్రమరాలు { తుమ్మెదలు } హ్రీంకార నాదం చేస్తున్నాయి. వేదాలు ఆమెను వినుతిస్తున్నాయి.

దేవతలు పరమానంద భరితులై, భ్రామరిని అనేక విధాలుగా ప్రస్తుతించి-
" తల్లీ ! అరుణుడు చేసే అత్యాచారాలు నీకు తెలియనివి కావు. నువ్వు మమ్మల్ని కనికరించి, దానవ సంహారం చేసి, ధర్మాన్ని పరిరక్షించు." అని ప్రార్ధించారు.


వాళ్ళు చేసిన విన్నపం విని ఆమె తన పిడికిలి లోని భ్రమరాలను, తన చుట్టూ ఉన్న భ్రమరాలనూ, అప్పటికప్పుడు తాను సృష్టించిన అసంఖ్యాకమైన భ్రమరాలనూ ప్రేరేపించింది.


అంతరిక్షం భ్రమరాలతో నిండిపోయింది. భూమి చిమ్మచీకటిలో మునిగిపోయింది. దేవి కనుసైగ చెయ్యగానే ఆ గండు తుమ్మెదలు జుమ్మని ఝుంకారం చేస్తూ అరుణుణ్ణీ, అతని పరివారాన్నీ చుట్టుముట్టి వాళ్ళ ప్రాణాలను పీల్చేశాయి. ( తుమ్మెదలకు ఆరు కాళ్ళుంటాయి కాబట్టి బ్రహ్మ ఇచ్చిన వరానికి చేటు రాదు. )
యుధ్ధం లేకుండా, అస్త్రశస్త్ర ప్రయోగం లేకుండా అరుణుడు అసువులు కోల్పోయాడు. ఈ అద్భుతాన్ని తిలకించి, దేవి లీలా విలాసాన్ని కొనియాడుతూ దేవతలు పూలవానలు కురిపించారు. ఆటపాటలతో వినోదించారు.


భ్రామరీ దేవి మందహాసం చిందిస్తూ దేవతల్ని ఆశీర్వదించి అంతర్ధానమయ్యింది.

దశమి రోజున అమ్మవారిని రాజరాజేశ్వరీ దేవిగా అలంకరిస్తారు. శ్రీచక్ర అధిష్ఠాన దేవత అయిన లలితాదేవే రాజరాజేశ్వరి. మహా కామేశ్వరుడి అంకాన్ని నిలయంగా చేసుకుని ఉంటుంది. శాంత స్వరూపంతో చిరునవ్వులు చిందిస్తూ భక్తులకు అభయమిచ్చే అమ్మ రాజరాజేశ్వరీ దేవి. ఆమెను ధ్యానిస్తే అపజయమే ఉండదంటారు.

దశమి రోజే శిరిడి శ్రీసాయి బాబా సమాధి చెందిన రోజు.

ఈ మధ్య నేను హనుమాన్ చాలీసా చదువుతున్నప్పుడు,...అందులో,..జై జై జై హనుమాన్ గోసాయీ
కృపాకరో గురుదేవకీ నాయీ అన్న దానిలో....
హనుమాన్ గోసాయి ...అన్న దగ్గర సాయి గుర్తు రావటం జరిగింది.

అంతా దైవం దయ. భగవంతునికి నమస్కారములు. ఇన్ని విషయములు మనకు అందించిన భగవంతునికి, పెద్దలకు నా నమస్కారములు.

 

No comments:

Post a Comment