koodali

Friday, January 31, 2025

కొన్ని విషయములు..


ఈ పోస్ట్ పెద్దగా అవటం వల్ల, ఈ పోస్ట్ లోని కొంత భాగాన్ని మార్చ్ నెలలో పోస్ట్ చేయటం జరిగిందండి.
...........

ఈ రోజుల్లో, బ్రతుకుతెరువు కొరకు ఉద్యోగం అని కాకుండా, ఉద్యోగం కొరకు బ్రతకటం అన్నట్లు ఉంది వ్యవహారం.
 
ఈ మధ్య కొందరు పెద్ద కంపెనీల వాళ్ళు ఏమంటున్నారంటే, ఉద్యోగస్తులు మరిన్ని ఎక్కువ గంటలు పనిచేయాలని చెబుతున్నారు. త్వరగా ఇంటికెళ్ళటం వేస్ట్ అన్నట్లు, భార్యాభర్తలు ఎక్కువగా మాట్లాడుకోకూడదన్నట్లు కూడా కొందరు చెబుతారు.

 ఉద్యోగస్తులతో బాగా పనిచేయిస్తూ వేలకోట్లు సంపాదించే కంపెనీల వాళ్ళు ఇలా మాట్లాడటం అన్యాయం..

కొన్ని సంవత్సరాల క్రిందట పనిగంటలు పెరిగినదానికి వ్యతిరేకంగా విదేశాలలో కార్మికులు పోరాటం చేసారు. ఆ పోరాటాలకు గుర్తుగా మేడే జరుపుతారు.
 
 ఈ రోజుల్లో కంపెనీలు కొందరు ఉద్యోగస్తులను పని లో నుండి తీసివేస్తున్నారు..అది చూసి భయపడి, మిగతావాళ్ళు విపరీతంగా పనిచేస్తుంటారు.
...............

మనుషులు  డబ్బు కొరకు  పనిచేయటం కొరకే పుట్టలేదు. పనిచేసి డబ్బు సంపాదించటం జీవితంలో ఒక భాగం. మనుషులు దైవధ్యానం చేసుకోవాలి. గృహస్థాశ్రమంలో కుటుంబాన్ని చక్కగా చూసుకోవాలి.కుటుంబం అంటే ఎన్నో బాధ్యతలుంటాయి. సంతానాన్ని చక్కటి పౌరులుగా తయారుచేయటంలో తమ వంతు పాత్రను సరిగ్గా నిర్వహించాలి.

 
ఎవరైనా తాము ఆరోగ్యంగా ఉండటానికి కొంత సమయం కేటాయించుకోవాలి. చక్కటి చెట్లు, మొక్కలు పెంచుతూ ఆహ్లాదంగా ఉండవచ్చు. ప్రపంచంలో ఉన్న ప్రకృతిసుందరదృశ్యాలను చూసి ఆనందించవచ్చు. పర్యావరణాన్ని కాపాడటంలో కొంత సమయం కేటాయిస్తే మంచిది.

 
సమాజంలో కష్టాలలో ఉండేవారికి కొంత సేవ లేక సాయం చేయవచ్చు. ఇలా ఎన్నో ఉండగా, సమయం చాలక ఎందరో ఉరుకులు పరుగులతో జీవిస్తున్నారు. కొన్ని ఉద్యోగాల వారికి ఇంటికొచ్చినా, ఆఫీసువాళ్ళు ఫోన్లు చేసి పనులు చేయించుకుంటున్నారు.

 .....................
అనేకకారణాల వల్ల, కుటుంబసభ్యుల మధ్య కొన్ని గొడవలు వస్తుంటాయి.  
పనివత్తిడి వల్ల  కూడా కుటుంబాలలో గొడవలు జరిగి, వివాహబంధాలు విచ్చిన్నమవుతున్నాయి. ఈ రోజుల్లో చాలామంది  విచ్చలవిడి ప్రవర్తనకు ఇష్టపడుతున్నారు.
.....................

ఈ రోజుల్లో చాలా మంది ఉద్యోగులు సమయం చాలక ఒత్తిడితో అనారోగ్యం పాలవుతున్నారు. ఈ మధ్యన యువత కొందరు  పని ఒత్తిడితో ఉన్నపళాన చనిపోయారు. కొందరు ఉద్యోగస్తులు ఆహారం వండుకోవటానికి సమయం చాలక,బయట  ఆహారాన్ని తిని అనారోగ్యం పాలవుతున్నారు.

  ఈ రోజుల్లో ప్రజలకు ఉదయం, సాయంకాలం ఎండ తగలకపోవటం, శరీరానికి వ్యాయామం లేకపోవటం, సరైన ఆరోగ్యకరమైన ఆహారం లభించకపోవటం, వాతావరణకాలుష్యం..వంటి సమస్యలతో పాటు......
 
 ఎక్కువమంది ఎప్పుడూ సెల్ఫోన్లు, కంప్యూటర్లు వాడటం వల్ల రేడియేషన్ మరియు సెల్ఫోన్లను వేళ్లతో అదేపనిగా నొక్కటం వల్ల నరాల వ్యాధులు, మెడనొప్పి, కంటిసమస్యలు, తల దిమ్ము..వంటి సమస్యలు వస్తున్నాయి.
 
 కొంతకాలం క్రిందట ఐటీ రంగంలో పనిచేసేవారికి మెడనొప్పులు, భుజాల నొప్పులు..వంటివి ఎక్కువగా ఉండేవి. సెల్ఫోన్లు అందరికీ అందుబాటులోకి వచ్చాక, ఇప్పుడు చాలామందికి ఈ జబ్బులు వస్తున్నాయి.
 
 పిల్లలు కూడా ఆన్లైన్  ద్వారా పాఠాలు నేర్చుకుంటున్నారు. ఇవన్నీ సరిదిద్దుకోకుంటే ఎవరూ ఏం చేయలేరు.

 
ప్రపంచంలోని ప్రతి ఒక్కరు ప్రపంచంలోని ప్రతి విషయాన్ని నేర్చుకోవలసిన అవసరం లేదనిపిస్తుంది.  ప్రపంచంలోని విషయాలన్నీ తెలుసుకోవాలనుకోవటం కూడా వ్యసనమే. ఎంతవరకు అవసరమో అంతవరకు తెలుసుకుంటే చాలు అనిపిస్తుంది.
  ..........
 

చాలామంది సంతానాన్ని పెంచే సమయం, ఓపిక లేదంటూ డేకేర్లలో వేస్తున్నారు. ఇంటివద్ద అల్లారుముద్దుగా పెరగవలసిన చంటిపిల్లలు బయట ఎక్కడో పెరుగుతున్నారు. కొందరు తల్లితండ్రి ఏమంటారంటే, పిల్లల కోసమే డబ్బు సంపాదిస్తున్నామని చెబుతుంటారు.

  మాటలు కూడా సరిగ్గారాని, వాళ్ళ బాధలు చెప్పలేని చిన్నవయస్సులో పిల్లల్ని బయట డేకేర్లలో వేసి, వాళ్ళకొరకు డబ్బు సంపాదిస్తున్నామని చెప్పటమేమిటో?
 
కొందరు పేరెంట్స్  పిల్లలను జాగ్రత్తగా చూసుకోవటం లేదని  కొన్ని సంఘటనల ద్వారా తెలుస్తోంది. అది చాలా పాపం.  

 చంటి పిల్లలను పెంచడానికి చాలా ఓపిక అవసరం. తల్లితండ్రి కూడా ఓపికతో వ్యవహరించాలి. 

 

కొన్ని డేకేర్ సెంటర్ల వాళ్ళు కూడా బాగానే చూసుకుంటారట. పిల్లలు అక్కడ తోటిపిల్లలతో ఆడుకుంటారు. అయితే, ఎవర్ని నమ్మాలో ఎవర్ని నమ్మకూడదో..అర్ధం కావటంలేదు. పైకి అందరూ బాగానే మాట్లాడతారు. తల్లి దగ్గరుండి చంటిపిల్లలను ప్రేమగా చూసుకుంటే మంచిది.
 
చిన్నపిల్లల విషయాలలో చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.
 .................
 
 కొన్ని ఆఫీసుల్లో ఉద్యోగులకు పనివత్తిడి తగ్గటం కొరకు అంటూ..ఆఫీసులోనే రకరకాల ఆహారం, వినోదం..వంటివి ఏర్పాటుచేస్తున్నారు.  ఇక, కొందరు ఉద్యోగులు ఇంటికంటే ఆఫీసులోనే బాగుందని ఆఫీసులోనే ఎక్కువసేపు పనిచేస్తుంటారు.

 ఈ రోజుల్లో పెంచుకున్న పనివత్తిడితో ఎవరికీ సరైన విశ్రాంతి ఉండటం లేదు.

అలాగని అందరూ పనులు మానేసి సోమరిగా ఉండకూడదు. అతిగా పనిచేసి అలసిపోకూడదు కాని, ఎవరి పనులు వారు చక్కగా నిర్వహించాలి.
.............................

  ఎన్నో రంగాలలో పనిచేసేవారు  చాలా టెన్షన్ తో పనిచేసే పరిస్థితి ఉంది.

......................

యంత్రాలు లేని పాతకాలంలో ఒక వస్తువు తయారుచెయ్యాలంటే
కొన్నిరోజులు పట్టేది, చేయడానికి కొన్ని రోజులు పని ఉండేది.
 
ఇప్పుడు యంత్రాల సాయంతో అదేపనిని గంటలో చేస్తున్నారు.ఇందువల్ల నిరుద్యోగం పెరుగుతుంది. అదేపనిగా వస్తువుల తయారీ వల్ల ప్రపంచంలో ఉన్న సహజవనరులూ త్వరగా ఖర్చవుతాయి.

ఉపాధి..ఉద్యోగాల కొరకు అదేపనిగా పనిచేసి, అదేపనిగా వస్తువులను ఉత్పత్తి చేస్తూ పోతే, పర్యావరణం పాడయ్యి ప్రపంచానికి పెనుప్రమాదం వచ్చే పరిస్థితులు రావచ్చు.
 
 మనం వాడుతున్న కంప్యూటర్లు, ఏసీలు, ఫ్రిజ్లు..వంటి వాటివల్లకూడా ఓజోన్ పొర పల్చనయ్యే ప్రమాదముందని ఒక దగ్గర చదివాను. అప్పుడు ఓజోన్ పొర పల్చనయ్యి అతినీలలోహిత కిరణాలు భూమిపై వ్యాపించి కొత్త విపత్తులు రావచ్చు.

 అందువల్ల అతిని తగ్గించుకుంటే మంచిది.
  

2 comments:

  1. "అతి సర్వత్ర వర్జయేత్" అని మన పెద్దలు ఏనాడో చెప్పారు. అలాగే "పరిగెడుతూ పాలు తాగడం కన్నా నిలబడి నీళ్ళు తాగటం ఉత్తమం" అనే భావనకు మనం ఎప్పుడు వస్తామో వేచి చూడాలి !!

    ReplyDelete
  2. మీ వ్యాఖ్యకు ధన్యవాదములండి

    ReplyDelete