koodali

Monday, March 6, 2017

.ఎంతో శ్రమపడి కష్టపడుతూ పనిచేయటమే స్త్రీల అభివృద్ధి అనుకోవాలా?


 
కొంత పాతకాలంలో ఆడవాళ్ళు ఎక్కువగా ఇంటిపట్టున ఉన్న రోజుల్లో స్త్రీలు ఎన్నో కష్టాలు పడుతున్నారని భావించి ..బైటకు వచ్చి, విద్యను అభ్యసించటం, ఉద్యోగాలు చేయటం,వ్యాపారాలు చేయటం ఎక్కువయింది.


 సరే, మరి ఇప్పడు స్త్రీల పరిస్థితి ఎలాగుంది ?

ఈ రోజుల్లో స్త్రీలపై జరుగుతున్న అఘాయిత్యాలను గమనిస్తే ఏమనిపిస్తుందంటే,ఈ రోజుల్లో స్త్రీల పరిస్థితి పెనం పైనుంచి పొయ్యిలో పడినట్లు అనిపిస్తోంది.


ఈ రోజుల్లో ఎన్నో కేసుల గురించి వింటున్నాము. పాఠశాలలో కొన్నిలైంగిక వేధింపు కేసులు, ఉద్యోగరీత్యా పనిచేసే చోట కొన్ని లైంగిక వేధింపు కేసులు, పనుల వల్ల బయటకు వెళ్ళి వచ్చే సమయంలో రహదారుల వెంట వేధించే పోకిరీల వల్ల లైంగిక వేధింపులు,..సామూహిక అత్యాచారాల కేసులు..గురించి వింటున్నాము.



చాలామంది స్త్రీలు తాము సూపర్ విమెన్ అని నిరూపించుకునే ప్రయత్నంలో  పనులన్నీ నెత్తిన వేసుకుని ఇంటాబయటా విపరీతంగా కష్టపడుతున్నారు.

 తాము కష్టపడటం మాత్రమేకాకుండా స్త్రీలందరిని బయటకు రావాలంటూ ఎన్నో ప్రయత్నాలు చేసారు.



ఫలితంగా ఇప్పుడు పరిస్థితి ఏమయ్యిందంటే.. దాదాపు ప్రతిస్త్రీ ఇంటాబయటా కష్టపడవలసిన  పరిస్థితి ఏర్పడింది.

ఉద్యోగం చేయకుండా ఇంటిపట్టునే ఉండి ఇంటిపనులు నిర్వహించాలనుకునే స్త్రీలను తక్కువగా చూసే పరిస్థితి ఏర్పడింది.



కొందరయితే వంటింట్లో కుందేలు అంటూ హేళనగా మాట్లాడుతూ ఇంటిపట్టున ఉండే గృహిణుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు.

ఇదంతా స్త్రీల గొప్పదనం ..అని కొందరు స్త్రీలు అనుకుంటున్నారు కానీ, ఎక్కువగా లాభపడుతోంది పురుషులే.


మా దూరపు బంధువు ఏమన్నదంటే ,ఈ రోజుల్లో ఆడవాళ్ళు కూడా కుటుంబంకోసం సంపాదించటం వల్ల మగవాళ్ళు పని చేయకుండా కుటుంబ భారాన్ని ఆడవాళ్ళపై పడేసి తప్పించుకు తిరుగుతున్నారని వాపోయింది.



ఆమె ఉద్యోగం చేసి సంపాదిస్తుంటే భర్త ఇల్లు పట్టకుండా తిరుగుతుంటాడట.

పాతకాలంలో ఆడవాళ్ళు ఇంటిపట్టున ఉండేరోజుల్లో మగవారికి ఆడవారిని వేధించటానికి అవకాశాలు తక్కువగా ఉండేవి. ఇప్పుడు మగవాళ్ళు స్త్రీలను వేధించటానికి సులువయింది.


ఆడపిల్లలకు నెలసరి రోజులో మరియు గర్భవతిగా ఉన్నప్పుడు..విశ్రాంతి ఎక్కువగా అవసరమవుతుంది.  అయితే ఈ రోజుల్లో , ఆరోగ్యం ఎలాగున్నా తప్పనిసరిగా పనికి వెళ్ళాల్సిన పరిస్థితి స్త్రీలకు దాపురించింది.


ఉదయమే లేచి హడావిడిగా పనులు చేసుకుని బయటకు పరిగెత్తాలి. షేర్ ఆటోల్లో ఆడ, మగ తేడా లేకుండా ఇబ్బందిగా కూర్చుని ప్రయాణించవలసి వస్తుంది.


నెలసరి సమయం అయినా, గర్భం దాల్చిన తొలినెలలయినా  బస్సుల్లో కొన్నిసార్లు నిలబడి కూడా  ప్రయాణించవలసి వస్తుంది. ఈ కుదుపులకు అబార్షన్ జరిగినా ఆశ్చర్యం లేదు.


సొంత కారులో ప్రయాణించాలన్నా భయపడే పిదపకాలం దాపురించింది.


ఇక పనిచేసేచోట ఎలాంటి వేధింపులు ఉంటాయో చెప్పలేం. ఇక, కొన్ని ఉద్యోగాలయితే స్త్రీలు అర్ధరాత్రి కూడా పనిచేయవలసి ఉంటుంది. 


 ఇక చిన్నపిల్లలున్న స్త్రీల పరిస్థితి మరీ ఘోరం. పిల్లలను  ఎక్కడయినా వదిలి పనికి రావలసి ఉంటుంది. అక్కడ పిల్లలు ఎలా ఉన్నారోననే ఆందోళనతో పనిమీద సరిగ్గా ధ్యాస ఉంచలేరు.


స్త్రీల పట్ల జరుగుతున్న అఘాయిత్యాలు కొన్ని కేసులు బయటలు వస్తున్నాయి. బయటకు రానివి ఎన్ని ఉన్నాయో? బైటకు చెప్పుకోలేక ఎందరు ఆడవాళ్ళు క్షోభ అనుభవిస్తున్నారో?


తెలివైన మగవాళ్ళు .. స్త్రీలు ఎంతో కష్టపడిపనిచేస్తారంటూ పొగిడి మరింత పనిచేయించుకుని లాభాలు పొందుతారు.


ఇంటాబయటా ఎంతో శ్రమపడి కష్టపడుతూ పనిచేయటమే స్త్రీల అభివృద్ధి అనుకోవాలా?


No comments:

Post a Comment