koodali

Monday, March 6, 2017

స్త్రీలు..పురుషులు..సమాజం..పాతకాలం స్త్రీలు భర్త సంపాదించి తెస్తే ఆ సొమ్ముతో ఇంటి బాధ్యతను నిర్వర్తిస్తూ పిల్లలను దగ్గరుండి పెంచుకుంటూ ఇంటి అజమాయిషీ నిర్వర్తిస్తూ హాయిగా ఉండేవారు.

అప్పటి స్త్రీలకు బంగారం రూపంలో కూడా సంపద ఉండేది. ఆ స్త్రీ ధనాన్ని పురుషులు వాడుకునేవారు కాదు.

ఈ రోజుల్లో చాలామంది మగవాళ్ళు ఏమంటున్నారంటే భార్య బాగా చదివి, పెద్ద ఉద్యోగం చేసి ఎక్కువ జీతం తెస్తూ , ఇంట్లో పెద్దవారిని  బాగా చూసుకుంటూ, పిల్లల్ని బాగా  చూసుకుంటూ, భర్తను బాగా చూసుకోవాలని  అంటున్నారు.ఎన్నో బాధ్యతల్ని స్త్రీల నెత్తిన వేస్తున్నారు.


కొందరు మగవారేమో .. స్త్రీలు ఎన్నో పనులు చేయగల శక్తిగలవారని పొగుడుతూ ఎక్కువ పనులు చెబుతున్నారు.


ఇక స్త్రీలేమో బయట ఎన్నో అభద్రతల మధ్య భయపడుతూ, ఇంటాబయట పనిచేస్తూ అనారోగ్యాలు తెచ్చుకుంటూ ..ఇదంతా స్త్రీల అభివృద్ధి .. అని భ్రమపడుతున్నారు. స్త్రీలు ఈ భ్రమల నుంచి బయటకు రావాలి.


అయితే,చాలామంది స్త్రీలు ఏమనుకుంటున్నారంటే , ఇంట్లోనే ఉంటే మళ్ళీ స్వేచ్చ కోల్పోతామేమోనని భయపడుతున్నారు.అలాంటి భయాలు అక్కరలేదు.


 ఇంటిపట్టున ఉండే వాళ్లు ఉండవచ్చు. ఇంటిపనులు పూర్తయి ఇంకా ఎక్కువ సమయం మిగిలి ఉండే స్త్రీలు గ్రూపులుగా ఏర్పడి సమాజ సేవకు సమయాన్ని కేటాయించవచ్చు..

లేక, కుటుంబ ఆదాయం పెరగటం కోసం డ్వాక్రా గ్రూపులు వలె  ఏర్పడి ఆదాయం పొందటానికి చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటుచేసుకోవచ్చు.


పనిచేసే చోట  అందరూ మహిళలే ఉంటే లైంగిక వేధింపుల బాధలు ఉండవు.

సొంత పరిశ్రమలో కుటుంబాలకు అనువైనట్లుగా సమయాలు ఏర్పరుచుకోవచ్చు.


ఉదా..పరిశ్రమల వేళలు ఉదయం 10 నుండి సాయంత్రం 3 వరకు మాత్రమే ఉంటే ఉదయం ఇంటిపనులు పూర్తయి పిల్లలు స్కూళ్ళకు వెళ్ళిన తరువాత పరిశ్రమలకు వెళ్లి పిల్లలు స్కూళ్ల నుండి వచ్చే ముందే ఇంటికి వచ్చేయవచ్చు.

ఇలా స్త్రీలు ఏర్పాట్లు చేసుకుంటే అటు కుటుంబాన్ని చూసుకున్న తృప్తీ ఉంటుంది. ఇటు ఆదాయమూ ఉంటుంది. పనివేళలు తగ్గటం వల్ల స్త్రీల ఆరోగ్యమూ బాగుంటుంది.


జీవితంలో ఉన్నత ఉద్యోగం రావటం ..ఎక్కువ పేరు ప్రఖ్యాతులు రావటం గొప్ప విషయాలే కానీ, సమాజానికి చక్కటి శారీరిక, మానసిక దృఢత్వం కలిగిన పౌరులను తయారుచేసి అందించటం మరెంతో గొప్ప విషయం. 


రాబోయే తరాలు శారీరికంగా, మానసికంగా దృడంగా ఉంటేనే సమాజం చక్కగా ఉంటుంది.

రాబోయే తరాలు శారీరికంగా, మానసికంగా దృఢంగా ఉండాలంటే తల్లితండ్రులలో ఒకరైనా  .. పిల్లల పెంపకం, ఇంటి పనిపై ఎక్కువ సమయాన్ని కేటాయించవలసి వస్తుంది.


అయితే, ఎన్నో కోణాల నుంచి గమనిస్తే ఇంటిపని, పిల్లలపెంపకం..వంటివి ఎక్కువభాగం తల్లి చూసుకోవటమే సరైనది.

సంపాదన ముఖ్యమే కానీ, సమాజానికి మంచి పౌరుల అవసరం మరింత ముఖ్యం.
మంచి పౌరులు ఉన్నప్పుడు, సమాజంలో అత్యాశ, నేరాలు, ఘోరాలు తగ్గి సంపద సమాజంలో అందరికీ అంది సమసమాజం ఏర్పడుతుంది.


No comments:

Post a Comment