koodali

Wednesday, March 15, 2017

మాకు తెలిసిన ఒక కుటుంబం ఇంకో మతం ..మరి కొన్ని విషయాలు...



మేము చెన్నైలో ఒక అపార్ట్మెంట్లో ఉండే రోజుల్లో  అపార్ట్మెంటుకు సెక్రటెరీగా ఒకామె ఉండేవారు. ఆమె బాగా చదువుకున్నామె . నాకు ఆమె గురించి ఎక్కువ విషయాలు తెలియవు.

 అయితే, అపార్ట్ మెంట్  లో  తెలుగు తెలిసిన ఒక పెద్దామె నాకు బాగా పరిచయం అయ్యారు.


ఆ పెద్దామె ఎన్నో  కబుర్లు చెప్పేవారు. మాటల్లో సెక్రటరీ కుటుంబం గురించి కూడా కొన్ని విషయాలు తెలియజేసారు.

ఉదా.. సెక్రటరీ,  శ్రీ కృష్ణజయంతి పండుగ రోజు  బాగా పూజలు చేస్తారట , సుమారు 21 రకాల పిండివంటలతో నైవేద్యం దేవునికి నివేదిస్తారట.

ఒకసారి నేను ఒక పని గురించి సెక్రటరీ గారింటికి వెళ్ళాను. వారి ఇంట్లో  గమనిస్తే , వేరే మతం యొక్క చిత్రాలు గోడకు కనిపించాయి. ఈ విషయాన్ని నేను నాకు పరిచయం ఉన్న పెద్దామెతో చెపితే ఆమె ఆశ్చర్యపోయి నమ్మలేదు.


కొంతకాలానికి సెక్రటరీ వాళ్ళు వేరే మతం ప్రకారం పూజలు చేస్తున్నట్లు బహిరంగంగా తెలిసింది ..ఈ విషయాన్ని పెద్దామె నాతో చెప్పి విపరీతంగా ఆశ్చర్యపోయింది.

నేను ఇంతకుముందే చెప్తే మీరు నమ్మలేదు కదా ! అన్నాను.

సెక్రటరీ గారు  విషయాన్ని రహస్యంగా ఉంచటం వల్ల త్వరగా ఎవరికీ తెలియలేదు.


విషయం బయటకు తెలిసిన తరువాత సెక్రటరీ గారి ఆచారవ్యవహారాలలో చాలా మార్పులు వచ్చాయి.

అప్పటివరకూ విపరీతంగా  హిందూ ఆచారవ్యవహారాలను పాటించిన ఆమెలో అంత మార్పు ఎలా వచ్చిందో ? అని మాకు  ఆశ్చర్యం అనిపించింది.

కొద్దికాలం తర్వాత మేము మా సొంత కారణాలతో  ఆ అపార్ట్ మెంట్  మారి వేరే ఇంటికి వెళ్లటం వల్ల అపార్ట్ మెంట్   విషయాలు సరిగ్గా తెలియలేదు.


 అయితే, కొంతకాలం తర్వాత , మాకు తెలిసిన పెద్దామె ద్వారా కొన్ని విషయాలు తెలిసాయి. సెక్రటరీ మళ్లీ ఏమంటున్నదంటే , తమ పిల్లలకు హిందువులతోనే వివాహాలు జరిపిస్తామని చెప్పటం జరిగిందట.  తరువాత ఏం జరిగిందో తెలియదు.

 ఎవరైనా మతం మారటానికి ఎన్నో కారణాలు ఉంటాయేమో?


*******************
మరి కొన్ని విషయాలు... 

శుభకార్యం కొరకు శుభముహూర్తం చూడాలంటే అనేక విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. 

ఉదా..ఒక కారు కొనాలంటే నెలలో తక్కువ  ముహూర్తాలే  చెప్పబడి  ఉంటాయి. 

వారి నక్షత్రానికి..  వస్తువును  కొనాలని అనుకునే సమయానికి ఉన్న నక్షత్రం...విపత్తార  కాకుండా ఉండాలి.

ఇంకో రోజు అన్నీ బాగున్నాయనుకుంటే,  మంగళవారం, శనివారం వచ్చిందనుకోండి. 

మంగళవారం జయవారం ..అంటూనే కొన్ని పనులు చేయకూడదంటారు. వాహనం కొనటం చేయవచ్చోలేదో ? కానీ,  కొందరికి మంగళవారం ఏ పనీ చేకూడదని  కూడా పట్టింపు ఉంటుంది. 

ఇంకో రోజు అన్నీ కుదిరేటట్లు ఉంది.. అనుకుని సంతోషపడేసరికి మూఢమి  జరుగుతోందని గుర్తు వస్తుంది.ఈ మూఢమి  తమిళులకు లేదట. హిందువులలోనే ఎన్నో తేడాలున్నాయి. ఒకరికి మంచి సమయం, ఇంకొకరికి మంచికాదు అని.

 ఇలా చూస్తూ ఉంటే వాహనం కొనటం ఎప్పటికప్పుడు వాయిదాపడుతుంటుంది. ఏ పనైనా  ఎప్పటికప్పుడు  వాయిదాలు పడుతుంటే కష్టం. 

అసలు ఏ ముహూర్తానికైనా 100 శాతం అన్నీ సరిగ్గా కుదరటం చాలా కష్టం.

 అందువల్ల, ఎవరికి వారు శుభముహూర్తాలు చూసుకోవటం కాకుండా, పండితులకు చెబితే వారే నిర్ణయిస్తారు. ఎవరికి వారు ముహూర్తం చూసుకుంటే చూస్తూచూస్తూ దేన్నీ విడిచిపెట్టలేరు. బయటివారైతే పట్టువిడుపుతో ఉన్నంతలో మంచి ముహూర్తం నిర్ణయించి ఇస్తారు.

దయచేసి దిగువన  లింక్ వద్ద కూడా చదవగలరు. 

పంచాంగం..మరి కొన్ని విషయాలు...

***************
ప్రశాంతంగా కొద్దిసేపు  పూజ చేద్దామంటే, అక్కడ కూడా  ఎన్నో నియమాలు, ఆంక్షలున్నాయి.

ఉదా..  దీపంలో  ఇన్ని వత్తులే ఉండాలి... అని  చెబుతారు .   ఇలాంటి  నియమాలను ఉల్లంఘిస్తే బోలెడు కష్టాలు వచ్చిపడతాయని భయపెడుతుంటారు కొందరు.

 పూజలో పొరపాట్లు వస్తే ..  కొత్త కష్టాలొస్తాయంటే  అయోమయం  కలుగుతుంది.   

 పాపపరిహారార్ధం చేసే పూజలకు, కోరికలు తీరటం కొరకు చేసే పూజలకు ఎన్నో నియమాలు ఉండవచ్చు.

 కానీ, నిత్యపూజకు కూడా ఎన్నో నియమాలు చెబుతుంటారు. 

నియమాల విషయంలో కూడా  భిన్నాభిప్రాయాలున్నాయి.

నియమాలు ఉండటం ఎంతో అవసరమే. అలాగని ప్రతిదానికి విపరీతమైన నియమాలు, నిషేధాలు ఉంటే  విసుగుపుట్టి, అసలుకే మోసం వచ్చే ప్రమాదముంది.

  చాలా  నియమాలు ప్రాచీనకాలం నుండి ఉన్నవి కాకపోవచ్ఛు . మధ్యకాలంలో చేర్చబడ్డవి కావచ్చు . 

గ్రంధాలలో కూడా కొన్ని విషయాలు (ప్రక్షిప్తాలు)మధ్యకాలంలో చేర్చబడ్డాయంటారు. 

ఇవన్నీ చూస్తే ఏం చేయాలో? ఏం చేయకూడదో ?  అని అయోమయంగా అనిపిస్తుంది. 
*************
 ఇంకో  విషయం ఏమిటంటే,  నియమాలను పాటించటం విషయంలో కొన్నిసార్లు కొందరు కుటుంబసభ్యుల మధ్య అభిప్రాయభేదాలు వస్తున్నాయి.

ఇంట్లో గొడవలు కూడా జరుగుతుంటాయి.ఇలాంటప్పుడు  ప్రశాంతంగా పూజ కూడా చేయటం కష్టం.

 నియమాల విషయంలో భయం ఉన్నవారు వాటిని పాటించాలనుకుంటే ...కొందరు కుటుంబసభ్యులేమో నీ చాదస్థంతో మమ్మల్ని విసిగించవద్దంటారు.

ప్రాచీనులు  ఏం చెప్పారంటే, కలియుగంలో పెద్దపెద్ద పూజలు చేయలేకపోయినా, దైవనామస్మరణ చక్కటిమార్గమని తెలియజేసారు.

 జీవితంలో దైవభక్తి కలిగి ఉండి, పాపభీతి కలిగి, నైతికవిలువలకు విలువనిస్తూ జీవించటానికి ప్రయత్నించటం వల్ల దైవకృపను పొందగలరు. సరైన పద్ధతిలో జీవించే శక్తినిమ్మని దైవాన్ని ప్రార్ధించుకోవటం మంచిది. 

 దైవస్మరణకు, దైవనామస్మరణకు ఆంక్షలు  ఉండవు..  చక్కగా దైవాన్ని తలచుకోవచ్చు.
*****************
జీవితంలో అన్నీ తేలికగా జరిగిపోవాలంటే కుదరదు. సమాజంలో ఉన్నతస్థాయికి చేరాలంటేనే ఎంతోకొంత  కష్టపడాలి.అలాంటిది జీవితంలో ఉన్నతమైన మోక్షం..  దైవాన్ని పొందాలంటే ఎంతోకొంత కష్టపడక తపదు.కొన్ని నియమాలను పాటించక తప్పదు.

అయితే, మూఢాచారాలను, అర్ధం లేని నియమాలను వదిలేయాలి.
కొన్ని ఆచారాలను గమనిస్తే...

ఉదా..గృహప్రవేశసమయంలో గోమాతను ఇంట్లో ప్రవేశింపజేయటాన్ని ఒక ఆచారంగా పాటిస్తారు. అలాగని ఆధునిక కాలంలో అపార్ట్మెంట్స్ గృహప్రవేశాలలో... గోవులను కష్టపెడుతూ బలవంతంగా మెట్లపైకి లాక్కెళుతూ గృహప్రవేశాలు జరుపుకోవటం సరైనది కాదు.

 అలా చేయటం కన్నా, మనసులో గోమాతను స్మరించుకోవటం మంచిది. గోశాలకెళ్లి గోవులకు కొంత గ్రాసం సమర్పించటం వంటివి కూడా చేయవచ్చు.

ఉదా..ఏదైనా పనికొరకు బయలుదేరివెళ్ళేటప్పుడు భర్త మరణించిన స్త్రీ ఎదురువస్తే అపశకునం అని వెనక్కి వెళ్లిపోతారు కొందరు. అలా చేస్తే ఆ స్త్రీ మనస్సు బాధపడుతుంది. 

ముత్తైదువ ఎదురువస్తే మంచి శకునమని నమ్ముతారు. 

భర్త పోయిన స్త్రీలలో అయినా,  భర్త ఉన్న స్త్రీలలో అయినా...మంచిగుణాలు, చెడ్డగుణాలు ఉన్నవారుంటారు. కొంత మంచి,కొంత చెడుగుణాలు ఉన్నవారుంటారు. 

 చెడుప్రవర్తన గలవారి శకునం మంచిదికాదని నా అభిప్రాయం. 

ఎవరు ఎటువంటి వారో మనకు తెలియదు కాబట్టి, ఎవరు ఎదురు వచ్చినా వారి ముందే గిరుక్కున వెనక్కి తిరిగివెళ్ళకుండా, మనస్సులో దైవాన్ని ప్రార్ధించుకుని ముందుకు  వెళ్ళవచ్చు.ఇలా ఎన్నో విషయాలుంటాయి.  

జీవితంలో  విచక్షణతో ప్రవర్తించటం మంచిది. మనకు తోచనప్పుడు సరైన బుద్ధిని ప్రసాదించమని దైవాన్ని ప్రార్ధించుకోవటం మంచిది.


  .మన పూర్వకర్మ, వర్తమానకర్మ..ఇవన్నీ బేరీజు వేసుకుని దైవం మనకు తగిన విధంగా ప్రసాదిస్తారు.


No comments:

Post a Comment