koodali

Friday, June 17, 2016

బదిలీ వ్యవస్థ వల్ల ఎన్నో ఇబ్బందులు...

ఈ రోజుల్లో ఎన్నో రంగాలలో బదిలీల వ్యవస్థ ఉంది. ఉద్యోగస్తులను ఎన్నో ఊళ్లకు బదిలీలు చేస్తుంటారు.

 ఉదా.. బ్యాకింగ్ రంగాన్ని గమనిస్తే ..వాళ్ళను  దేశవ్యాప్తంగా బదిలీ చేసే అవకాశముంది. మారుమూల పల్లెటూళ్ళలో కూడా బ్యాంక్ శాఖలు ఏర్పాటు చేస్తున్నారు. 

అలాంటప్పుడు ఉద్యోగస్తులు వసతులు సరిగ్గా లేని ఊళ్ళకూ వెళ్ళవలసి ఉంటుంది. అక్కడ మా కుటుంబానికి సరైన సౌకర్యాలు లేవు.. మేము వెళ్ళము.. అంటే  పై అధికారులు ఊరుకోరు. 

మారుమూల ఊరికి వెళ్తే అక్కడ పిల్లలు చదువుకోవటానికి సరైన అవకాశాలు ఉండవు. ఇవన్నీ ఆలోచించి కుటుంబాన్ని వదిలి ఉద్యోగం చేసే వ్యక్తి ఒక్కరే వచ్చి ఉద్యోగం చేస్తుంటారు.

 అప్పుడప్పుడు వెళ్లి కుటుంబాన్ని చూసి రావటం జరుగుతుంది. ఇలాంటప్పుడు ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి. కుటుంబానికి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ఒంటరిగా ఉంటున్న వ్యక్తికీ ఎన్నో ఇబ్బందులు ఉంటాయి.

 కొన్ని సంవత్సరాలు అలా ఉద్యోగం చేసినా సరే కుటుంబం ఉన్న ఊరికి  బదిలీ అడిగితే పై అధికారులు ఇస్తారో లేదో తెలియదు.

 మాకు తెలిసిన ఒక కుటుంబంలో భార్య ఒక దగ్గర భర్త ఒక దగ్గర పనిచేస్తున్నారు. భార్యకు కిడ్నీ జబ్బు వచ్చింది. భర్త బదిలీ అడిగినా పై అధికారులు బదిలీ చేయలేదు. 

కొన్నాళ్లకు భార్య చనిపోవటం జరిగింది. వేళకు వండుకుని సరిగ్గా భోజనం చేయకపోవటం వల్ల భర్త కూడా కొన్నాళ్ళకు చనిపోవటం జరిగింది. పిల్లలు అమ్మమ్మ వారి వద్ద ఉన్నారు. 

బదిలీల వల్ల ఎందరో కష్టాలు అనుభవిస్తున్నారు. ఇక టీనేజ్ పిల్లలకు వేరే ఊళ్లో కాలేజ్ సీట్ వస్తే ఇక వాళ్ళను హాస్టల్లో వేయటమో లేక తల్లి  గానీ తండ్రి గానీ  దగ్గర ఉండి చదివించటమో చేస్తున్నారు.

 ఈ రోజుల్లో విద్యావ్యవస్థ, ఉద్యోగవ్యవస్థ వల్ల చాలా కుటుంబాలలో కుటుంబసభ్యులు కలిసి జీవించే పరిస్థితి తగ్గిపోయింది.

 ఇక సైనికుల కుటుంబాలు అయితే పరిస్థితి మరీ కష్టం.

 ఇవన్నీ ఇలా ఉండగా మన ప్రభుత్వ ఉద్యోగులు కొందరు అమరావతి  ఇప్పుడే రాలేము..అక్కడ సరైన సౌకర్యాలు లేవంటున్నారు. 

నాకు తెలిసినంతలో సెక్రటేరియట్ ఉద్యోగస్తులకు  తరచూ బదిలీలు ఉండవనుకుంటున్నాను. సచివాలయ ఉద్యోగస్తులను అమరావతి తీసుకురావటానికి ప్రభుత్వం ఎన్నో సౌకర్యాలు కల్పిస్తామంటోంది. రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా వాళ్లకు జీతాలు పెంచటం జరిగింది.


హైదరాబాద్లో ఆఫీసులు ఉంటే ప్రజలు తమ పనుల కోసం అక్కడివరకూ రావలసి ఉంటుంది. ఆంధ్రా ఆఫీసులు హైదరాబాద్ నుంచి పనిచేస్తే కొన్నికోట్ల సొమ్ము తెలంగాణా రాష్ట్రానికి వెళ్తుందంటున్నారు. ఇవన్నీ కూడా ఆలోచించాలి. 

 అయితే, అమరావతిలో భవనాలు వీలయినంత త్వరగా నిర్మించటం అవసరమే కానీ , ఆ కట్టడాలు దృఢంగా ఉండేలా నిర్మించటమూ అవసరమే. అందువల్ల భవనాల నిర్మాణం కొద్దిగా ఆలస్యమయినా భవనాలు నాణ్యతాపరంగా బాగుండేలా నిర్మించాలి. 

అసలు బదిలీలు ఎందుకు చేస్తారో ? ఇందుకు అనేక కారణాలు ఉన్నాయంటారు. 

 ఉద్యోగస్తులు ఒకే దగ్గర ఉంటే అవినీతి జరిగే అవకాశముందని , అందువల్లే బదిలీలు చేస్తారని కొందరి అభిప్రాయం. 

నా అభిప్రాయం ఏమిటంటే అవినీతి ఉద్యోగులను ఎన్నిఊళ్లకు  బదిలీ చేసినా అవినీతి చేస్తారు. నీతిమంతులు ఒకే ఊరిలో పనిచేసినా అవినీతి పనులు చేయరు.

 బదిలీలు చేయటం తప్పదు అనుకున్నప్పుడు దూరదూరాలకు కాకుండా ఒకే జోనులో లేక ఒకే జిల్లాలో మాత్రమే ఉన్న ఊళ్లకు బదిలీలు చేస్తే  కుటుంబం దగ్గరలో ఉండే అవకాశముంటుంది.

 ఈ బదిలీలు జరగటానికి ఇంకో కారణం ఏమిటంటే  మారుమూల పల్లెలలో కూడా ఆఫీసులు  ఉండటం వల్ల అక్కడ పనిచేయటానికి ఉద్యోగులు అవసరం. 

 అయితే పల్లెటూళ్ళలో పనిచేయటానికి ఉద్యోగస్తులు అంతగా ఇష్టపడరు. అందరూ సౌకర్యాలు ఎక్కువగా ఉండే నగరాలలో  ఉండటానికే ఇష్టపడుతున్నారు. 

సౌకర్యాలు తక్కువగా ఉండే చోట ఉద్యోగులు పనిచేయటం కోసం బదిలీల వ్యవస్థ వచ్చి ఉంటుందనిపిస్తోంది.

 బదిలీ వ్యవస్థ  వల్ల ఎన్నో కుటుంబాలు ఇబ్బందులు అనుభవిస్తున్నాయి.


బదిలీల కష్టాల గురించి ఇంతకు ముందు కూడా ఒక టపా రాసాను.  ఆసక్తి ఉన్నవారు చదవగలరు.  



2 comments:

  1. బదిలీలు ఉంటాయని ఉద్యోగంలో చేరే ముందే తెలుసు కనుక ప్రతి ఉద్యోగి వాటికి సిద్దపడే చేరుతారని అనుకుంటా. కాకపొతే ప్రభుత్వ ఉద్యోగం దొరికిందనే సంబరంలో సాధక బాధకాలను పూర్తిగా అర్ధం చేసుకోక పోవడం వలన ఇబ్బందులు వస్తాయి.

    ReplyDelete
  2. నిజమేనండి.బదిలీలు ఉంటాయని ఉద్యోగంలో చేరే ముందే తెలిసినా చేరుతారు.
    ఈ రోజుల్లో బదిలీలు లేకుండా, ఉద్యోగ భద్రత ఉన్న ఉద్యోగాలు తక్కువ.
    ఇక చేసేదేమీ లేక.. బదిలీలు కష్టమే అయినా ..ఉద్యోగ భద్రత ఉంటుందనే ఉద్దేశంతో చేరుతున్నట్లున్నారు.

    ReplyDelete