koodali

Monday, February 23, 2015

ఈ రోజుల్లో చాలామంది స్త్రీల పరిస్థితి ...

 
 
ఈ రోజుల్లో స్త్రీలు మగవారితో పోటీ పడుతున్నారు.  అయితే, మారిన పరిస్థితిలో ఎంతమంది మహిళలు నిజంగా సంతోషంగా ఉన్నారు ? 
.................... 

తాము సూపర్ విమెన్ అని నిరూపించుకోవటం కోసం కొందరు స్త్రీలు  ఎన్నో పనులు నెత్తిన వేసుకుంటున్నారు. తెల్లారిలేస్తే రాత్రి పడుకునేవరకూ విశ్రాంతి అనేది తగ్గిపోయింది. ఇంతా చేసి మహిళలు సాధించింది ఏమిటన్నది అర్ధం కావటం లేదు.


 ఎన్ని పనులు చేసినా సరే, స్త్రీలు గొప్పవారని అనే మగవాళ్ళు ఎంతమంది?  స్త్రీలు ఎంతో గొప్పవారు..అంటూ తమ బాధ్యతలను కూడా తెలివిగా స్త్రీల నెత్తిన వేస్తున్న మగవాళ్ళ సంఖ్యా ఎక్కువవుతోంది.


 ఇంటి బాధ్యతలు ఒక వైపు.. బయట బాధ్యతలు ఒక వైపూ వేసుకుని రెండు పడవల ప్రయాణంలా దేనికీ సరిగ్గా న్యాయం చేయలేక అలసిపోతున్నారు ఎక్కువమంది మహిళలు.

.................

 పూర్వపు స్త్రీలకు ఇంటిని సర్దుకుంటే సరిపోయేది. ఇంటి పనులు అయిన తరువాత మధ్యాహ్నం  విశ్రాంతి లభించేది. అప్పుడు, ఇరుగుపొరుగు అమ్మలక్కలతో కష్టమూసుఖమూ చెప్పుకుని సేదతీరేవారు. 


వారి కబుర్లలో ఎన్నో అంశాలు చోటుచేసుకుని కొత్తకొత్త విషయాలను ఒకరినుంచి ఒకరు తెలుసుకునేవారు.


 స్త్రీలకు ప్రకృతిసిద్ధంగా వచ్చే నెలసరి, గర్భాన్ని ధరించటం వంటి సమయాల్లో ఇంటిపట్టున ఉండి విశ్రాంతిని పొందేవారు. 


పిల్లల ఆలనాపాలనా చూసుకుంటూ బిడ్డల ఎదుగుదలలో స్వయంగా పాలుపంచుకుంటూ వారి ఆటలను ముద్దుమురిపాలను చూసుకునేవారు. పిల్లల ఆలనాపాలనా చక్కగా చూసుకుంటున్నామనే తృప్తి వాళ్ళకు ఉండేది. 

...................

 పిల్లలు పుట్టిన దగ్గరనుంచి కొన్నిసంవత్సరాల వరకు చక్కటి ఆహారం, సరైన పర్యవేక్షణ అవసరం. 


చిన్నతనం నుండి సమతులాహారం తో, పెద్దవాళ్ళ ఆలనాపాలనాలో పెరిగిన పిల్లలలో శారీరిక, మానసిక ఎదుగుదల బాగుంటుందని వైద్యులు చెబుతున్నారు. 


ఈ రోజుల్లో చాలామంది పిల్లల చిన్నతనం క్రెచ్ లకు మరియు హాస్టల్స్ కు పరిమితం అయిపోయింది.

...............

ఉదయం , పిల్లలు  నిద్రలేచి ఆదరాబాదరాగా  ఏదో ఒకటి తిని స్కూలుకు వెళ్ళిపోతారు.( కాలకృత్యాలు తీర్చుకోవటానికి కూడా సమయం ఉండదు కొన్నిసార్లు.) 


చిన్న వయసున్న పిల్లలు కూడా బండెడు బరువున్న పుస్తకాల బరువుతో బస్సులలో నుంచుని స్కూలుకు వెళ్ళటం కూడా కనిపిస్తుంది.


ఇక, స్కూల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకూ గోడకుర్చీ వేసినట్లు కుర్చీలలో కూర్చుని  పాఠాలు వినాలి. నెలసరి సమయంలో ఆడపిల్లలకు విశ్రాంతి  అవసరం. 


నిట్రాయిలా గంటల తరబడి కూర్చోవటం అనేది..తరువాత కాలంలో వారి ఆరోగ్యం పైన ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ రోజుల్లో ఎందరో అమ్మాయిలు చిన్నవయస్సుకే నడుం నొప్పితో బాధ పడుతున్నారు.

...................

ఇక ఉద్యోగాలు చేసే స్త్రీలకు ఎన్నో సమస్యలు. ఆఫీస్ ఇంటికి దూరంగా ఉంటే బస్సులలో, షేర్ ఆటోలలో ఇరుక్కుని కూర్చుని వెళ్ళవలసి ఉంటుంది. 


బస్సులలో సీట్ దొరకకపోతే నిలబడి వెళ్ళవలసి ఉంటుంది.


 ( అందరికీ కార్లు ఉండవు కదా ! ఉన్నా ఇంట్లో ప్రతి ఒక్కరికి కారు ఉండే అవకాశాలు తక్కువే.)  

.................

ఇక గర్భిణి స్త్రీల సమస్యలు చెప్పనే అక్కర్లేదు. గర్భం వచ్చిందని తెలుసుకునే లోపలే బస్సు లేక ఆటో ప్రయాణాల్లో కుదుపులకు,  ప్రారంభపు నెలల్లోనే గర్భం పోయే ప్రమాదమూ పొంచి ఉంది. గర్భం ధరించినట్లు తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి.


సున్నితమైన గర్భ సంబంధ సమస్యలు ఉన్నవారికి కారు ప్రయాణమూ ప్రమాదమే. 

గర్భంలో పిండానికి  అవయవాలు ఏర్పడే సమయంలో తల్లి జాగ్రత్తగా ఆహారం తీసుకోవాలి. ఏదిపడితే అది జంక్ ఫుడ్ లాంటివి..  తినకూడదు. 


 నచ్చినట్లు  ఆహారం వండుకోవటానికి, తాపీగా తినటానికి సమయం ఎక్కడిది ? 

......................

ఇక, ప్రసవానంతరం చంటిపిల్లలను స్వయంగా చూసుకోలేని నిస్సహాయ పరిస్థితి. ప్రభుత్వరంగసంస్థలు కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా స్త్రీల కొరకు కొన్ని సెలవులను ఇస్తారు. 


అయితే, సెలవు ముగిసిన తరువాత అయినా ఆఫీసుకు వెళ్ళాలి కదా! చంటిపిల్లలను ఎక్కడో క్రెచ్లలో వదిలివెళ్ళాలంటే ప్రాణం ఉసూరుమంటుంది.

................

 ఒక ప్రక్క  బయట నెరవేర్చవలసిన టార్గెట్లూ మరో ప్రక్క ఇంటి బాధ్యత మధ్య నలిగిపోతూ ఉంటారు. తద్వారా  ఎన్నో అనారోగ్యసమస్యలు వచ్చే అవకాశమూ ఉంది.


అనారోగ్యంతో పనికి వెళ్ళలేకపోతే ఉద్యోగమో లేక వ్యాపారమో ఊడిపోతుంది.  అనారోగ్యం వచ్చి మంచాన పడితే చూసే వాళ్ళు ఎవరన్నది ప్రశ్న. ఇంట్లో అందరూ  ఎవరి పనితో వారు బిజీ కదా !

................

ఇంటాబయటా  పనిచేయలేక..  ఇంటిపట్టునే ఉండాలి.. అని ఎవరైనా భావించినా ఉండే పరిస్థితి అంతలా కనిపించటం లేదు.


 కొందరు స్త్రీలు ఏమన్నారంటే , ఇంటాబయటా కష్టపడాలని మాకూ లేదు. అయితే, ఉద్యోగం మానేస్తే మగవారు ఊరుకుంటారా ? మేము కూడా సంపాదిస్తేనే ఇల్లు గడవాలి అంటారు. అన్నారు. 


ఇదండి పరిస్థితి.. ఈ రోజుల్లో చాలామంది  మహిళల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలోకి పడినట్లుంది. 

..............
ఆదాయం అవసరమే కానీ ఆరోగ్యమూ అంతకన్నా ముఖ్యం కదా ! కొన్ని కోరికలను తగ్గించుకుంటే తక్కువ ఆదాయమైనా సరిపోతుంది.
.................

ధరలు పెరుగుతుంటే ధరలు తగ్గేటట్లు  చర్యలు తీసుకోవాలి   కానీ పెరిగే రేట్ల వెంట పరుగులు తీయటం అంటే ఎండమావుల వెంట పరుగులు తీయటం వంటిది.

.......................... 
ఇక , స్త్రీలకు పనిచేసే చోట ఎన్నో వేధింపులు ఉండే అవకాశం ఉంది. 

 కొన్ని పాఠశాలలో చిన్నపిల్లలను  లైంగికంగా వేధిస్తున్న కేసులను గురించి వింటుంటే , ఆడవారి పరిస్థితి మెరుగయ్యిందా లేక దిగజారిందా అనేది అర్ధం కావటం లేదు.

.........

డబ్బు సంపాదిస్తేనే స్త్రీల గొప్పదనం తెలుస్తుందా ? ఇంటిపట్టున ఉండి గృహనిర్వహణను చూసుకోవటం  చిన్నతనం ఎలా అవుతుంది ? ఇంటిని చక్కదిద్దుకుంటే  సమాజాన్నీ  చక్కదిద్దినట్లే కదా !


కుటుంబంలో సంపాదన బాధ్యతలు ఎంత ముఖ్యమైనవో...  కుటుంబాన్ని  చక్కదిద్దుకోవటం కూడా అంతే ముఖ్యమైనది. 

......................... 

ఇంటిని చక్కదిద్దుకుంటూనే తీరికసమయాన్ని సమాజసేవకూ కేటాయిస్తూ తృప్తిగా జీవిస్తున్న స్త్రీలెందరో ఉన్నారు.


 ఎంతో గొప్ప ఆదాయం వచ్చే ఉద్యోగాలను వదిలి కుటుంబాన్ని చూసుకుంటూనే..  సమాజసేవనూ చేస్తూన్న వారిలో ఇంఫోసిస్ సుధామూర్తి ,  మిచెల్ ఒబామా..వంటి గొప్ప స్త్రీలూ ఉన్నారు. 


15 comments:

  1. కథా మంజరి:బ్లాగులో తిడితే తిట్టే నంటారు, కానీ, బ్రహ్మయ్యకి బుద్ధుందా చెప్పండి ?!
    ..అనే టపాకు వ్యాఖ్య వ్రాయటానికి ప్రయత్నిస్తే కుదరలేదు. ఆ వ్యాఖ్యను ఇక్కడ ఇస్తున్నాను.
    ...........

    నిజమేనండి..ధర్మం నడక ఎంతో సూక్ష్మమైనది.

    బలికి రాబోయే యుగాలలో ఇంద్ర పదవి లభిస్తుందని చదివాను.( ఇతని సత్యసంధతకు మెచ్చి విష్ణువు ఇతనికి ..పై మన్వంతరమున దేవేంద్రత్వమును అనుగ్రహించెను.)

    సక్తుప్రస్థునికి స్వర్గము లభించి ఉండవచ్చు. స్వర్గం కంటే స్వర్గాధిపత్యం ఇంకా గొప్పది కదా !

    కుంతికి స్వర్గం లభించింది అన్నారు. అయితే, లక్ష్మీదేవి అంశ అయిన సీతాదేవి అవతారం చాలించిన తరువాత లక్ష్మీదేవిలో లీనమయిందని అంటారు.

    ReplyDelete
  2. మీరు రాసింది పట్టణ ప్రాంత అగ్ర వర్ణ మహిళలకు మాత్రమె వర్తిస్తుంది. శ్రామిక వర్గ స్త్రీలు తరతరాల నుండి ఇంటిపని బయటి పని రెంటినీ చక్కగా చేసుకుంటున్నారు.

    ReplyDelete
    Replies

    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి. వ్యాఖ్యలను కొద్దిసేపటి క్రితమే చూశాను.

      నేను రాసింది అన్ని వర్గాల వారికీ వర్తిస్తుందండి. శ్రామిక వర్గ స్త్రీలు తరతరాల నుండి ఇంటిపని బయటి పని రెంటినీ చక్కగా చేస్తున్నారు..అనటం సరైనది కాదు. పేదరికం వల్ల తప్పని పరిస్థితిలో చేస్తున్నారు అంతే.(చక్కగా చేయటం లేదు.)

      ఏదైనా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి చూస్తే, ఇంటాబయటా చేసే పని వత్తిడితో కలిగిన అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రికి వచ్చిన శ్రామికవర్గ స్త్రీలు ఎందరో కనిపిస్తారు.

      పనివత్తిడికి పట్టణప్రాంతం, పల్లె ప్రాంతము అని తేడా ఏమీ లేదు. శ్రామిక వర్గం ,అగ్ర వర్గము అని తేడా కూడా అంతగా లేదు. ఎక్కువ ఆదాయం లభించే అగ్రవర్గాలు కొద్దిగా మంచి ఆహారాన్ని తీసుకుంటారు అంతే తేడా.

      ఎక్కువ ఆదాయం లభించే మహిళలు కూడా ఇంటాబయటా పెరిగిన పనివత్తిడి మరియు వేళకు సరైన ఆహారం తీసుకోకపోవటం వలన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తే ఇలాంటి వారు ఎందరో కనిపిస్తారు.

      Delete
    2. ఆరోగ్యం విషయంలో బీద మహిళల & పురుషుల పరిస్తితి దాదాపు ఒకటే. ఇంకా చెప్పాలంటే స్త్రీలే ఆరోగ్యంగా ఉన్నారు.

      పేదరికం వల్లనే స్త్రీలు పని చేయాల్సి వస్తుందనే అవగాహన సరి కాదు. ప్రతి కులవృత్తిలో పనుల విభజన ఖచ్చితంగా ఉంటుంది. ఉ. గొల్లవారిలో ఉన్ని కోయడం మగ వారి పనయితే గొంగడీలు పేనడం ఆడ వారి పని. ప్రతీ కుటుంబం ఒక ఆర్ధిక యూనిట్.

      మగవారు డబ్బులు సంపాదించడం & స్త్రీలు ఇంటి పనికి పరిమితి కావడం అన్న సిద్దాంతం పట్టణ అగ్ర వర్ణాలలోనే కనిపిస్తుంది. మహిళల నిమ్న స్థాయి ఈ ఆర్ధిక అసహాయత పరిస్తితుల పర్యవసానమే.

      Delete
    3. ఆరోగ్యం విషయంలో బీద మహిళల & పురుషుల పరిస్థితి దాదాపు ఒకటే... అనేది నిజమేనండి. అయితే, స్త్రీల విషయంలో.. నెలసరి, గర్భం ధరించటం..వంటి సమస్యల వల్ల శారీరికంగా సున్నితంగా ఉంటారు.అందువల్ల వారు పురుషులలా బయట ఎక్కువ పనులు చేస్తే త్వరగా అలసిపోతారు.

      కులవృత్తులు ఉన్న రోజుల్లో, పురుషులు కూడా ఎక్కువగా ఇంటిపట్టునే ఉండి పనులు చేసుకునేవారు. స్త్రీలు మగవారికి సాయం చేసేవారు.

      ఉదా..కుండల తయారీలో భార్యా భర్తా పాల్గొనేవారు. సరుకులు అమ్ముతూ భర్త అంగడిలో కూర్చుంటే అంగడి వెనుక ఇంటిలో భార్య సరుకులను శుభ్రం చేయటంలోనూ, సర్దటంలోనూ సాయం చేసేది.

      అయితే అప్పటి స్త్రీలు ఇంటిపట్టునే ఉండి భర్తకు ఆర్ధికవిషయాల్లో సాయాన్ని చేసేవారు కాబట్టి, బయటకు వెళ్ళి పనిచేస్తూ ట్రాఫిక్ లో ప్రయాణించి అలసిపోయే అవసరం ఉండేది కాదు. ఇంకా, బయట పరాయి పురుషుల వల్ల ఎదుర్కునే లైంగిక వేధింపుల గోలా ఉండేది కాదు.


      Delete
    4. అంటే సమస్యకు మూలం స్త్రీలు బయటికి వెళ్ళడం కాదని స్పష్టం అయినట్టే. ఇంటి పనులు మగవారు చేయకూడదని ఎక్కడా రాసిలేదే? పట్టణ ప్రాంత అగ్ర వర్ణ పురుషులు (ముఖ్యంగా తన భార్య ఉద్యోగం చేయాలని కోరుకునే వారు) ఇంట్లో చేదోడు వాదోడుగా ఉంటె సరిపోతుంది. పల్లెల్లో కుమ్మరులకు ఉన్న సుగుణం దొరబాబులకు ఎందుకు లేదు?

      Delete

    5. స్త్రీలు బయటకు వెళ్తే ఎన్నో సమస్యలు ఉంటున్నాయి. ఇంటిపనులంటే వంట చేయటం మాత్రమే కాదు. చిన్నపిల్లలు ఉంటే వారికి తరచు ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. వారిని దగ్గరుండి చూసుకోవటం ముఖ్యం.

      ఇంటి పని అంటే అదేమీ పార్ట్ టైం జాబ్ లాంటిది కాదండి. సరిగ్గా చేస్తే చాలా సమయం పడుతుంది. అయితే ఈ రోజుల్లో పనివాళ్ళ మీద ఆధారపడి,ఇంకా బయట ఆహారం తెచ్చుకుని సరిపెట్టేస్తున్నారు.

      ఇంటి పనులు అంటే చాలా ఉంటాయి. ఇల్లు శుభ్రం చేసుకోవాలి. ఉదయం, మధ్యాహ్నం, రాత్రికి కుటుంబసభ్యులకు సమతులాహారం అందించాలంటే ఆ ఏర్పాట్లకు ఎంతో సమయం పడుతుంది.

      పాతకాలంలో అయితే కుటుంబసభ్యుల ఆరోగ్యానికి అవసరమయ్యే వాటిని కూడా ఇంట్లోనే తయారుచేసుకునే వారు. ఉదా..కళ్ళకు కాటుక, తలకు నూనె, సున్నిపిండి, ..ఇలా అనేకం ఉన్నాయి. ఈ రోజుల్లో సమయం చాలక ఎక్కువగా బయటే కొనుక్కుంటున్నారు.

      ఇంటిపనిలో భర్త భార్యకు సహాయం చేసినా ఏదో కొద్దిగా సాయం చేయగలరు. అంతేకానీ పూర్తిస్థాయి సహకారం అందించలేరు.

      ఈ రోజుల్లో భార్యాభర్తా ఉదయం బయటకు వెళ్తే రాత్రికి ఇంటికి చేరుకుంటున్నారు. అప్పుడు అలసటతో ఏదో కొద్దిగా వండుకుని తినేస్తారు. లేకపోతే బయటనుంచి తెచ్చుకుని తినేస్తారు.

      పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి త్వరగా వచ్చినా ఇంట్లో పెద్దవాళ్ళు ఉండరు. ఇదంతా ఎందుకని పిల్లలను హాస్టల్స్లో వేసేస్తున్నారు. అక్కడ వాళ్ళ కష్టాలు వాళ్ళవే. అనారోగ్యం వచ్చినా తల్లితండ్రులకు దూరంగా వారి ఇబ్బందులు వారు పడాలి. ఇక కుటుంబసభ్యుల మధ్య అనుబంధాలు ఎలా పెరుగుతాయి ? ఎవరికివారే ..అన్నట్లు..కుటుంబ సభ్యులు జీవిస్తున్నారు.

      Delete
  3. Excellent andi
    ela alochinche ammailanu abbailu evaru pelli chesukovadam ledu...

    job chese ammai kavalani adugutunnaru.... evanni chepite chadastam la, pata kalam ammaila chustunnaru :( best example nene

    ReplyDelete
    Replies

    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      అవునండి, ఈ రోజుల్లో చాలామంది అబ్బాయిలు జాబ్ చేసే అమ్మాయే కావాలంటున్నారు. ఇలాంటి పరిస్థితి సరైనది కాదు.

      Delete
  4. Mr/Mrs Aanandam,ee rojullo pillalani chakkaga chadivinchalanna, saraina poshakaharam andichalanna, valla ku kavalasinavi konalanna, oka illu samakuchukovaalanna denikina intlo iddaru pani chestene ivanni cheyagalam. bottom line is dabbu unte inti pattuna undi yenni veshalesina kudiriddi. ledante aada maga teda lekunda job cheyali. yevari preferences vaarivi. finally you are what you chose to be.

    inka korikalu tagginchukovadam gurinchi.... oka illu samakurchukovadam, pillalanu chadivinchukovadam chala pedda korikalani nenu anukonu. avi mana badhyathalu. so kastapadi sadhichu kovali. meeku teludsu kada 4 cents sthalam konalante 20 Lakhs, andulo illu kattalante inko 20 Lakhs avuthunnayi.

    ReplyDelete

  5. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    ఈ రోజుల్లో రెండు జీతాలు లేకపోతే బ్రతకలేరనేది వట్టిమాట. కోరికలకు అంతేముంది. ఉన్నదానితో తృప్తిపడి హాయిగా జీవిస్తున్న వారు కూడా ఉన్నారు.

    పాతకాలంలో మగవారే సంపాదించిన రోజుల్లో అందరూ చక్కగానే జీవించారు కదా !

    పిల్లలని చక్కగా చదివించాలన్నా, సరైన పోషకాహారం అందించాలన్నా, వాళ్ళకు కావలసినవి కొనాలన్నా, ఒక ఇల్లు సమకూర్చుకోవాలన్నా...బోలెడు డబ్బు కావాలనేది మనం చేసుకున్న స్వయంకృతాపరాధాల వల్ల జరుగుతోంది.

    పాతకాలంలో ప్రభుత్వపాఠశాలలో చదువుకుని గొప్పవాళ్ళైన వారెందరో ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చదివించే పేరెంట్స్ తక్కువమంది.

    బోలెడు ఫీజులు చెల్లించి అయినా సరే, పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లోనే చదివించటానికి పేరెంట్స్ పోటీపడుతున్నందువల్ల ప్రైవేట్ పాఠశాలల వాళ్ళు ఫీజులు విపరీతంగా పెంచేశారు.

    ప్రభుత్వ పాఠశాలలలో పరిస్థితి చక్కదిద్దాలని పేరెంట్స్ ప్రభుత్వంపై గట్టిగా ఒత్తిడి తేవచ్చు కదా !
    ......................

    పోషకాహారం తక్కువ డబ్బుతో కూడా లభిస్తుంది. బోలెడు డబ్బు పెట్టి యాపిల్ కొనే బదులు జామకాయలు కొనవచ్చు. తక్కువ ఖర్చుతో లభించే తృణధాన్యాలతో చక్కటి పోషకాహారాన్ని పిల్లలకు ఇవ్వవచ్చు.

    జామపండు, ఉసిరిపండులో కూడా సమృద్ధిగా సి విటమిన్ ఉంటుంది. ఆరెంంజ్ జ్యూస్ కొనే బదులు నిమ్మరసం ఇవ్వవచ్చు. జీడిపఫ్ఫులానే వేరుశనగపప్పులోనూ బలమైన పోషకాలున్నాయి. ఇలా ఎన్నో ఉంటాయి.

    ఇప్పుడు ఎక్కువమంది పిల్లలు హాస్టల్స్లోనే ఉంటున్నారు కదా ! బోలెడు డబ్బుపెట్టి పిల్లల్ని హాస్టల్లో చదివిస్తే అక్కడ వాళ్ళు పోషకాహారాన్ని తింటారని నమ్మకమేముంది. తినటానికి బద్ధకించి లేక హాస్టల్లో పదార్ధాలు నచ్చక బ్రెడ్ తిని కడుపునింపుకునే పిల్లలూ ఉంటారు.

    ఇద్దరు సంపాదించినంత మాత్రాన పోషకాహారం లభిస్తుందనే గ్యారంటీ ఏమీ లేదు. ఉరుకులుపరుగుల జీవితంలో సమతులాహారం వండుకోవటానికి ఓపిక లేక బ్రెడ్, నూడిల్స్... వంటివి తినటం ఎక్కువయ్యింది. లేకపోతే బయట ఆహారం కొనుక్కుని తింటున్నారు.
    ..................

    ఇక ఇళ్ళు, స్థలాల ధరలు ఇంతలా పెరగటానికి కారణం మనమే. రేట్లు ఎంత పెరిగినా కొనే వాళ్ళుంటే రేట్లు ఎందుకు తగ్గుతాయి ? కొనేవాళ్ళు లేకపోతే కొంతకాలానికి అన్ని రేట్లూ తగ్గుతాయి.
    ....................

    ధరలు పెరిగాయి కదా ! అని ఇంట్లో అందరూ ఉద్యోగాలు , వ్యాపారాలు చేసి మరీ ..పోటీపడి వస్తువులను కొంటుంటే ధరలు ఎప్పటికీ తగ్గే అవకాశం లేదు.

    ఉద్యోగస్తుల జీతాలు పెరుగుతుంటే వ్యాపారస్తులు వస్తువుల రేట్లనూ పెంచేస్తారు. మధ్యలో నలిగిపోతున్నది ఆదాయం పెరిగే అవకాశం అంతగా లేని వర్గాల వాళ్ళే.

    పాతకాలంలో తక్కువ జీతాలు ఉన్నా వస్తువుల రేట్లు తక్కువగానే ఉండేవి. ధరలు ఇంతలా పెరగటానికి కారణం మనుషుల స్వభావాలలో వచ్చిన మార్పులే.

    ReplyDelete
  6. ఈ విషయాన్ని దేశ ప్రయోజనాల కోణంతో చూద్దామా? ఒక్కో పనికి కొన్ని లక్షణాలు (ఉ. తెలివి, ప్రతిభ, కార్యదక్షత వగైరా) అవసరం/ఉపయోగం. ఇవేవీ ఒకే లింగానికి పరిమితం కావు. ఎలాంటి పనికి తగిన మనుషులు దొరకడం దేశానికి మంచిది. కేవలం ఊహాజనితమయిన విషయాన్ని ఆధారం చేసుకొని జనాభాలో సగాన్ని ఆర్ధిక వ్యవస్తకు దూరం చేయడం దేశ ప్రగతికి హానికరం.

    ReplyDelete
  7. దేశప్రయోజనాలు అంటే ఆర్ధికపరిస్థితి కోణం ఒక్కటే ఉండదండి. స్త్రీల పట్ల అనేక దారుణాలు జరుగుతున్న ఈ రోజుల్లో ఎన్నో అంశాల గురించి ఆలోచించవలసి ఉంది.
    ....................
    మానసికవైద్యులు చెబుతున్న దాన్ని బట్టి చూస్తే , చిన్నతనం నుండి పిల్లల పట్ల తల్లితండ్రులు ప్రేమాభిమానాలు చూపించాలి. వారి పట్ల పర్యవేక్షణ ఉండాలి. పిల్లల కష్టసుఖాలను పట్టించుకోవాలి.

    ఇలా కాకుండా పిల్లలమానాన పిల్లలను వదిలి ఆర్ధికాభివృద్ధి అంటూ తల్లితండ్రులు ఎవరిదారిన వాళ్ళు పరుగులు పెడుతుంటే పిల్లలూ తమను పట్టించుకునే వారు లేరనే భావంతో క్రుంగిపోతారు.

    బాగా డబ్బున్నవారిలో కొందరి పిల్లలు పబ్బులు, క్లబ్బులు తిరుగుతూ పట్టుబడటం గురించిన వార్తలు చూస్తున్నాము కదా !

    దేశం ఉన్నతంగా ఉండాలంటే ఆర్ధికాభివృద్ధి ఒకటే ఉంటే సరిపోదు. ప్రజలలో నైతికాభివృద్ధి ఎంతో అవసరం. నైతికాభివృద్ధి ఉన్న దేశంలో బోలెడు సౌకర్యాలు లేకపోయినా ప్రజలు సంతోషంగానే ఉంటారు.
    ....................

    పిల్లలు నైతికంగా ఎదగటంలో తల్లితండ్రుల పాత్ర చాలా ఉంటుంది. అత్యాశ గల తల్లితండ్రులు తమ తరతరాల కోసం అవసరానికి మించి ఆస్తులను కూడబెడుతున్నారు. ఇలాంటి వారి వల్ల సమాజంలో ఆర్ధిక అసమానతలు విపరీతంగా పెరుగుతున్నాయి.
    ....................

    పేదప్రజలు నేరాలు చేయటానికి వారి పేదరికమూ ఒక ముఖ్య కారణమే. ఈ రోజుల్లో అనేకకారణాల వల్ల యువతకు ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయి. ఉన్న ఉద్యోగం కూడా ఎప్పుడు ఊడుతుందో తెలియని పరిస్థితిలో యువతలో నిరాశా,నిస్పృహలు పెరుగుతున్నాయి.
    ..............
    ఇక ఈ రోజుల్లో అందరికీ అందుబాటులోకి వచ్చిన సెల్ఫోన్లు, నెట్, మరియు మీడియా ..ద్వారా లభ్యమవుతున్న అశ్లీల దృశ్యాల ప్రభావం కూడా నేరాలు పెరగటానికి ముఖ్యకారణమే.
    ...................

    దేశంలో అవినీతి, నైతికదిగజారుడుతనం ఎక్కువయింది.

    చిన్నతనం నుంచీ చక్కటి సమతులాహారం, చక్కటి పరిసరాలల్లో , చక్కటి పర్యవేక్షణలో పెరిగిన పిల్లలు చక్కటి నైతికత ఉన్న పౌరులుగా ఎదుగుతారు.ఎన్నో ఆకర్షణలు చుట్టుముట్టిన ఈ రోజుల్లో పిల్లలు చక్కటిపౌరులుగా తయారవాలంటే తల్లితండ్రులు ఎంతో బాధ్యతగా ఉండవలసిన అవసరం ఉంది.

    స్త్రీలు ఎంతో ఓపిక ఉన్నవారు. పిల్లల ఆలనాపాలనా చూడటంలో పురుషులకన్నా స్త్రీలకే నేర్పు, ఓర్పూ ఎక్కువగా ఉంటాయి. ప్రకృతిపరంగా చూసినా పిల్లల పెంపకంలో తల్లి పాత్ర ఎంతో ముఖ్యమైనది.

    ఆర్ధికావసరాలను పురుషులు నిర్వర్తించగలరు. పిల్లల ఆలనాపాలనను పురుషులు సరిగ్గా నిర్వర్తించలేరు. పాతకాలంలో పురుషులు ఇంటి ఆర్ధికావసరాలను చూసుకుంటే స్త్రీలు ఇంటి బాగోగులను చూసుకునేవారు.

    కుటుంబంలో సంపాదన ఎంత ముఖ్యమో కుటుంబసభ్యుల సంరక్షణా అంతే ముఖ్యమైనది. తల్లితండ్రి ఇద్దరూ సంపాదనకే సమయాన్ని వెచ్చిస్తే కుటుంబసభ్యుల సంరక్షణ కుంటుపడుతుంది.

    పిల్లలు సరైన పోషకాహారంతో పెరగకపోతే రాబోయే తరాలు ఆరోగ్యకరంగా ఉండవు.

    లక్షల కోట్ల ధనం నల్లడబ్బుగా మారి విదేశాలకు తరలిపోవటం, అవినీతి స్కాములు పెరగటం....వంటి వాటివల్ల దేశ ఆర్ధిక పరిస్థితి దిగజారి పేదరికం పెరుగుతోంది. ఇలాంటివాటికి కారణం ప్రజలలో నైతికవిలువలు తగ్గటమే.

    * ఇప్పుడు దేశానికి కావలసినది నైతికత ఉన్న ప్రజల సంఖ్య పెరగటం.

    ReplyDelete
    Replies
    1. ఆర్ధిక వ్యవస్థ ఒక్కటే దేశ ప్రగతికి సోపానం కాదు నిజమే. కానీ జనాభాలో సగం మంది ప్రతిభను ఆర్ధిక రంగానికి కృత్రిమ కారణాలతో దూరం చేసిన దేశం బాగు పడలేదు.

      పిల్లల ఆలనాపాలన మగవారు చూసుకోలేరని, లావాదేవీలు ఆడవారికి చేతకావని అనుకోవడం సరికాదు. ఇది సమాజాన్ని ముందుకు తీసుకు వెళ్ళలేదు.

      స్త్రీల పట్ల దారుణాలు, అఘాయిత్యాలు & దౌర్జన్యం ఎందుకు జరుగుతున్నాయి? మహిళను పురుషుల కంటే తక్కువగా చిత్రీకరించే మధ్య తరగతి మనస్తత్వం స్త్రీని ఒక విలాస వస్తువు చేసింది. తండ్రి గొప్ప తల్లి తక్కువ అని పిల్లలకు ఉగ్గుపాలతో నేర్పిస్తున్నారు. కొడుకును విచ్చలవిడిగా తిరగనిచ్చే తల్లి తండ్రులు బిడ్డలను కట్టడి చేస్తున్నారు. నేను మగవాడిని కనుక ఏమి చేసినా చెల్లుతుందని అహంకార భావన మగవారిలో రావడానికి ముఖ్య కారణం ఈ లోపభూయిష్టమయిన దృక్పథమే. ఆడవారు బుద్ధిగా ఇంటిపట్టున ఉండి పనులు చేసుకోవాలనే వాదన దీన్ని పరోక్షంగా సమర్తిస్తుంది.

      Delete
    2. మగవాళ్ళం ఇంటి పట్టున ఉండి పిల్లల ఆలనాపాలనా చూసుకుంటాము, స్త్రీలు బయటకు వెళ్ళి సంపాదించాలని అనుకుంటే ఎవరేం చేయగలరు ? ఇలాంటి కాన్సెప్ట్ తో ఆ మధ్య ఒక తెలుగు సినిమా వచ్చింది.

      తల్లులు దగ్గరుండి పిల్లలను పెంచుకుని స్త్రీలను గౌరవించాలని నేర్పించుకోవచ్చు కదా ! కొడుకు వివాహం జరిగి కోడలు వస్తే కోడలిని సాధించి, ఆమెను కొడుకుతో తిట్టించే అత్తలు చాలామందే ఉన్నారు.

      Delete