koodali

Monday, March 24, 2014

ఉద్యోగం లేని యువకుల బాధలు .... ఉద్యోగాలు చేసే వారి బాధలు ..

ఈ  రోజుల్లో  అమ్మాయిల్లో  కూడా   ఇంజనీరింగ్  చదివేవారు  ఎక్కువయ్యారు. 
ఆ  విషయం  అలా  ఉంచితే,

................................


 కొంతకాలం  క్రిందట  ఒక  పెద్ద కంపెనీ  వారు  తమ  సంస్థలో  ఉద్యోగాల  కోసం  ఇంటర్వ్యూకు  రమ్మని  2000  వేల  మంది  అభ్యర్ధులను  పిలిచారట.  


రెండు , మూడు  వడపోతల  తర్వాత  2 వేలమందిలో  కేవలం  ఇద్దరు  అమ్మాయిలను  సెలక్ట్  చేసారట. 

 ఇక  అబ్బాయిల  నిరాశ  చెప్పనలవి కాదు.  అంతమంది  వెళ్తే  ఇద్దరినే  సెలక్ట్  చేసారు.  అబ్బాయిలను  ఎవరినీ  సెలక్ట్  చేయలేదు  అంటూ  వాపోయారు.  


ఎంతో  ఆశతో  వెళ్ళిన  వారి  మనస్సు    ఎంత బాధగా   ఉంటుందో   ఊహించటానికి  అందదు.
............................................


ఇంకొక  సంఘటనలో  ఒక సంస్థ  వాళ్ళు,   ఇంజనీరింగ్  పూర్తయిన  కొందరిని    ఉద్యోగానికి    సెలెక్ట్  చేయగానే  అందరూ  ఎగిరి గంతేసి  ఉద్యోగం  వచ్చేసిందని  సంతోషంగా   చెప్పుకున్నారట. 


అయితే  ఎంతకాలానికీ  సంస్థ  వారు  జాయిన్  అవటానికి  రమ్మని   పిలవటం లేదు.

 ఇలా  ఒక  సంవత్సరం  గడిచేసరికి  అబ్బాయిలలో  నిరాశానిస్పృహలు  పెరిగిపోయాయి.


 ఇక  ఎదురు  చూడలేక   కొందరు  అబ్బాయిలు  కలిసి  సంస్థ  వారికి  ఒక  మెయిల్  పంపించారట.

 తమ  దయనీయమైన   పరిస్థితిని  తెలియజేస్తూ  ఉద్యోగానికి  పిలవమని    ప్లీజ్  !   అని   వేడుకున్నారట.

 ఈ  సంఘటన  గురించి  విన్నాక    ఆ యువకుల  పరిస్థితికి    చాలా  బాధ  అనిపించింది. 


  ఉపాధి  కోసం  ఎదురు  చూస్తూ    ఖాళీగా  ఉంటే  అబ్బాయిలు  ఎంతో  నిరాశకు  గురవుతారు.  అలాంటప్పుడు  తల్లితండ్రి  వాళ్ళను  తిట్టకుండా  ధైర్యాన్ని  చెప్పాలి.  

..............................................


మాకు   తెలిసిన    కూరలు  అమ్మే   ఒక  ఆమెకు  ఇంజనీరింగ్   చదివిన  అబ్బాయున్నాడు.  అయితే  ఆ  అబ్బాయికి  ఉద్యోగం  లభించక  ఇంట్లోనే  ఉన్నాడని   నా దగ్గర  చెప్పి  బాధపడేది.  


నేను  ఏమన్నానంటే,   అబ్బాయిని  ఏమీ  కోప్పడవద్దు.   అసలే  అబ్బాయి  బాధపడుతున్నాడు.  ఇప్పుడు  అందరి  పరిస్థితి  అలాగే  ఉంది.    ఉద్యోగాలు  త్వరగా   రావటం  లేదు....అబ్బాయి  మాత్రం  ఏం  చేయగలడు.   అని  నచ్చజెప్పాను.  

......................................


ఈ  దేశంలో  బడా  పారిశ్రామిక  సంస్థలకు  కోట్ల  కొద్దీ  రుణాలు  ఇస్తారు  కానీ,  నిరుద్యోగులైన  యువకులు  కొందరు  కలిసి    చిన్న , మధ్య  తరహా  పరిశ్రమలను   ఏర్పాటు  చేసుకోవటానికి    రుణాలు  అడిగితే  సవాలక్ష  ప్రశ్నలతో  వేధిస్తారు. 


యువత  సొంతంగా    ఉపాధి   ఏర్పాటు  చేసుకోవటాన్ని    ప్రభుత్వాలు  ప్రోత్సహించాలి.

.......................................


అమ్మాయి   ఉద్యోగం  లేక   ఖాళీగా  ఉంటే  ఇరుగుపొరుగువారు  ఏమీ  అనరు.  

అయితే,  అమ్మాయి  విషయంలో   ఏమంటారంటే,   మీ  అమ్మాయికి  ఇంకా  పెళ్ళి  సంబంధాలు  చూడటం  లేదా  ?  అని  అడుగుతూ  హింసిస్తారు.

అబ్బాయి  ఇంట్లో  ఖాళీగా  ఉంటే  చుట్టుప్రక్కల  వారు ....
మీ అబ్బాయికి  ఇంకా  ఉద్యోగం  రాలేదా  ? వంటి   పరామర్శలతో  హింసించేస్తారు. 
 
..................................................

ఉద్యోగం  లేని  యువకుల  బాధలు  ఇలా  ఉంటే  ఉద్యోగాలు  చేసే   వారి  బాధలు   మరొక  రకంగా  ఉంటాయి.

మాకు  తెలిసిన   ఆఫీసులో  పనిచేసే  ఆడవారు  కొందరు  ఉద్యోగం  చేసే  ఊరిలో  కాకుండా  ప్రక్క  ఊరిలో  నివాసం  ఉంటారట.  


ఇక   సాయంత్రం  3 గంటలు  అవగానే  ఇంటికి   వెళ్ళిపోవాలని   అడుగుతారట. 

  అదేంటమ్మా  అప్పుడే  వెళ్ళిపోతే  ఆఫీస్   పని  ఎలా  ?  అంటే.... 


 ప్లీజ్  !   ఇప్పుడు  బయలుదేరకపోతే   బస్సు  అందదు,   చీకటి  అవుతుంది.  గంటన్నర  ప్రయాణం  చేయాలి....ఇంటికి  పిల్లలు  వచ్చేస్తారు..  అని  చెప్పి  వెళ్ళిపోతారట. 

వాళ్ళను   ఏమీ  అనలేక  పంపించేస్తారట  మగవాళ్ళు.   ముందే  వెళ్ళిపోయిన  ఆడవారి  పని   కూడా   కొన్నిసార్లు  ఆఫీసులోని   మగవాళ్ళే  చేయవలసి  వస్తుందట.  


  ఆడవాళ్ళు    ఆలస్యంగా  ఇంటికి వెళ్ళాలంటే    సెక్యూరిటీ  ప్రాబ్లం  , ఇంకా   ఇంట్లో   పని  ఉంటుంది  కదా  ! 


 ( అయితే,  అన్ని  ఆఫీసుల్లోనూ  ఇలా  త్వరగా  పంపించరు.  కొన్నిసార్లు  రాత్రై  తొమ్మిది  అయినా  పనిచేయవలసి  వస్తుంది.  )

 
ఏంటో   ఈ  రోజుల్లో   వ్యవస్థ  గందరగోళంగా  తయారయింది.




6 comments:

  1. Mee post kuda ante gandaragolam ga vundi. Emi cheppalanukunnaro artham kaledu:(

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      ఇందులో గందరగోళం ఏమీ లేదులెండి.

      గత పోస్టులను కూడా కలిపి చదివితే మీకు తేలికగా అర్ధం అవుతుంది.

      అయినా మన అభిప్రాయాలను మరీ డైరెక్టుగా చెపితే అందరూ సరిగ్గా అర్ధం చేసుకోవటం లేదు కదా !

      అందుకని ఇలా కొంచెం గందరగోళంగా వ్రాయవలసి వస్తోంది.

      అయినా, మరింత వివరంగా చెప్పటానికి ప్రయత్నిస్తాను.

      Delete

  2. నా అభిప్రాయం ఏమిటంటే ఈ రోజుల్లో అనేక కారణాల వల్ల నిరుద్యోగ సమస్య బాగా పెరిగింది.

    మగవారికి ఉపాధి లభించటం ఎంతో అవసరం. మగవారికి ఉపాధి లభించకపోతే ఆ నిరాశానిస్పృహతో వ్యసనాలకు అలవాటు పడే అవకాశం ఉంది.

    స్త్రీలకు ఉద్యోగం లభించకపోయినా తట్టుకోగలరు. సమాజం కూడా వారిని ఏమీ అనదు.

    స్త్రీలకు ఇంటిని చక్కబెట్టుకోవటం అనే పని ఎలాగూ ఉంటుంది. వారికి దానితోనే కాలం గడిచిపోతుంది. తీరిక సమయం ఉన్న మహిళలు బోలెడు సమాజసేవ చేయవచ్చు.

    ఉదా..ఆర్ధికంగా ఉన్నతంగా ఉన్న కొందరు మహిళలు కలిసి పేద, మధ్య తరగతి మహిళలకు సాయాన్ని అందించవచ్చు. వారితో కుటీరపరిశ్రమలను పెట్టించవచ్చు.

    డ్వాక్రా సంఘాల మహిళలకు మరింత తోడ్పాటును అందించవచ్చు.

    చదువుకున్న మహిళలు...చదువురాని మహిళలకు చదువును నేర్పించవచ్చు. మాతాశిశు సంరక్షణ గురించి నేర్పించవచ్చు.

    తక్కువ ఖర్చుతో పుష్టికరమైన ఆహారాన్ని ఎలా తయారుచేయాలో పేద మహిళలకు నేర్పించవచ్చు.

    కొందరు మహిళలు కలిసి గ్రూపుగా ఏర్పడి తమ కాలనీలోని సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవచ్చు...ఇలా మహిళలు తలుచుకుంటే ఎంతో సమాజ సేవ చేయవచ్చు.

    మహిళలు వంటింట్లో కుందేలులా పడి ఉండనవసరం లేదు. ఇంటి పని అయిన తరువాత పగలు కొంత సమయాన్ని సమాజసేవకూ కేటాయించవచ్చు.
    ...........................................

    అరుణారాయ్ అనే మహిళ అయ్యేయస్ పదవిని వదులుకుని సమాజసేవ చేస్తున్నారట. ఇంఫోసిస్ సుధామూర్తి గారు కుటుంబాన్ని చూసుకోవటం కోసం చక్కటి ఉద్యోగాన్ని వదులుకుని ఇటు కుటుంబాన్ని చూసుకుంటూనే ....సమాజసేవనూ చేస్తున్నారు.

    మరెంతో మంది మహిళలు కూడా ఉన్నదానితో సరిపెట్టుకుని ఒక ప్రక్క కుటుంబాన్ని చూసుకుంటూనే ... మరో ప్రక్క తీరిక సమయంలో తమకు చేతనైనంతలో సమాజానికి తోడ్పాటును అందిస్తున్నారు.

    ReplyDelete
    Replies

    1. మహిళలకు శారీరికంగా ఎన్నో సమస్యలు ఉంటాయి. ఉదా..గర్భిణీ సమయం, నెలసరి మొదలైనవి ఉన్నప్పుడు కొంత విశ్రాంతి అవసరం. ఉద్యోగం అంటూ బస్సులలో, షేర్ ఆటోలలో తిరిగితే గర్భానికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది.

      ( అందరికీ కారులో వెళ్ళే ఆర్ధిక స్తోమత ఉండదు కదా !)

      ఇల్లాలికి ఇంట్లో చిన్న పిల్లలను చూసుకోవలసిన బాధ్యతా ఉంది .

      ఇంత కష్టపడుతూ కూడా ఇప్పుడు ఎందరో స్త్రీలు బయటకెళ్ళి పనులు చేస్తున్నారు. అయినా ఇంట్లో వాళ్ళ మెప్పును పొందగలుగుతున్నారా ? భార్య సంపాదన లాక్కుని తమ ఇష్టానికి ఖర్చుపెట్టేసే భర్తలు ఎందరో ఉన్నారు.

      అలాగని స్త్రీలందరూ పురుషులను ద్వేషించటం సబబు కాదు. స్త్రీలలోనూ చెడ్డవారు, మంచివారూ ఉంటారు. పురుషులలోనూ చెడ్డవారు, మంచివారూ ఉంటారు.

      మన కుటుంబవ్యవస్థను కాపాడుకోవటం ఇప్పుడు అత్యంత ముఖ్యం.

      Delete

    2. జంబలకిడిపంబ సినిమాలో ఒక దృశ్యంలోలా సమాజం తయారవాలని భారతీయ స్త్రీ కోరుకోదు.

      ఇంటిని చక్కదిద్దుకోవటంలో మహిళలే నేర్పరులు. అంత ఓపిక సహనం మగవారిలో తక్కువ. అందుకని ఇంటి బాధ్యతను స్త్రీలే చక్కగా నిర్వహించగలరు.
      ................................................

      కొందరు ఏమంటారంటే భార్యాభర్త చెరిసగం పనిని షేర్ చేసుకోవాలి అంటారు. ఇది ఆచరణలో సరిగ్గా పనిచేయదు. ఏ పనీ సరిగ్గా జరగదు....ఎవరికీ సరిగ్గా విశ్రాంతి లభించదు.

      పూర్వం మగవాళ్ళు సంపాదన కోసం బైటకెళ్ళి కష్టపడి ,.......ఏ మధ్యాహ్నమో భోజనానికి ఇంటికి వచ్చినప్పుడు ... లేక ... ఏ సాయంకాలానికో ఇంటికి వచ్చినపుడు, కాసేపు విశ్రాంతి తీసుకోవటానికి అవకాశముండేది.

      (అప్పుడు మగవాళ్ళని ఇంటి పనులు చెయ్యమని ఎవరూ అడిగేవారు కాదు. అలాగే ఆడవాళ్ళని సంపాదించుకు రమ్మని అడిగే వారు కాదు. .)

      ఆడవాళ్ళు అయితే , మగవాళ్ళు బయటకు వెళ్ళాక నిదానంగా ఇంటి పనులు చక్కబెట్టుకొని పగలు కాసేపు విశ్రాంతి తీసుకోవటానికి అవకాశముండేది.

      కానీ ఈ రోజుల్లో భార్యాభర్తా ఇద్దరూ సంపాదన కోసం బైటకు వెళ్ళి రాత్రికి ఇంటికి వస్తారు.

      ఇక అప్పుడు అలసిపోయి ఇంట్లో పనులు చెయ్యాలంటే ఇద్దరికీ విసుగే. అప్పుడు నీరసంగా ఏదో ఇంత వండుకొని తింటారు.

      ఈ విధానంలో ఎవరికీ విశ్రాంతి తీసుకోవటానికి అవకాశం లేదు. ( రాత్రికి నిద్రలో విశ్రాంతి తప్ప. )

      నేనూ మీలాగే బైట సంపాదిస్తున్నాను కాబట్టి, భర్త కూడా ఇంటి పని చెయ్యాలంటుంది భార్య.

      ఇక ఇంటి పనులు తప్పించుకోవటానికి భర్త ఇంటికి ఆలస్యంగా రావటం మొదలవుతుంది. ఇక గొడవలు మొదలు.

      ఆ కోపమంతా ....... అప్పటికే అలసిపోయి బడి నుంచీ వచ్చిన పిల్లల పట్ల చూపిస్తారు.

      భార్యను భర్త తిడితే ........... పురుషాహంకారం నశించాలి ........ అని నినాదాలు చేస్తారు .

      మరి పిల్లలను తల్లిదండ్రులు తిడితే ......? తల్లిదండ్రుల అహంకారం నశించాలి ..... అని పిల్లలు కూడా నినాదాలు చెయ్యాలేమో ఇక !

      ఆఫీసుల్లో పని విభజన ఉంటుంది. ఎవరి పనిని వారు చేస్తారు. అలాగే ఇంట్లో కూడా స్త్రీలకు, పురుషులకు పని విభజన ఉండి ఎవరి పని వారు చేస్తే సులువుగా ఉంటుంది.

      Delete

  3. అలాగని స్త్రీల పని పురుషులు ....పురుషుల పని స్త్రీలు అసలే చెయ్యకూడదని కాదు.

    పాత కాలంలో కూడా భర్తలు తమ భార్యలకు సహాయాన్ని అందించేవారు.

    ఉదా...భార్య వంట చేస్తుంటే అప్పుడప్పుడు భర్త కూరలు తరిగి ఇవ్వటం వంటివి.... భార్య కారప్పూస వండుతుంటే భర్త కారప్పూస వత్తటంలో సాయాన్ని అందించటం వంటివి....

    పాతకాలంలో స్త్రీలు కూడా భర్తకు పనిలో సాయాన్ని అందించేవారు.

    భార్యాభర్త కలిసిమెలసి పనిచేసుకునేవారు. భర్త వ్యవసాయం చేసేవారైతే ఇంటికి తెచ్చిన ధాన్యాన్ని భార్య జాగ్రత్త చేసేది. భర్త కుండలు చేసే వృత్తి అయితే భార్య భర్తకు పనిలో సాయాన్ని అందించేది. భర్త వ్యాపారస్తుడైతే భార్య సరుకులను శుభ్రం చేయటంలో సాయాన్ని అందించేది. అప్పట్లో కిరాణా కొట్లు వెనకే ఇల్లు ఉండేది.

    ఇలా రోజులో ఎక్కువ భాగాన్ని కలిసి గడపటం వల్ల భార్యాభర్త మధ్య అన్యోన్యత పెరిగేది. ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడుంది ?

    ఇప్పుడు ఉపాధి కోసం భార్యా భర్తా ఉదయం అనగా ఎవరిదారిన వాళ్ళు వెళ్తున్నారు. ఇక వాళ్ళకు మాట్లాడుకోవటానికి కూడా సమయం దొరకటం లేదు.

    పరాయి స్త్రీలు పురుషులు కలిసి పనిచేయవలసిన ప్రస్తుత పరిస్థితి కొన్ని కుటుంబాలలో గొడవలకు కారణం అవుతోంది.

    ఇక స్త్రీలకు బయటకు వెళ్తే రక్షణ సమస్య ఎలాగూ ఉంది. ఏమైనా ఇప్పుడు చాలా మంది స్త్రీల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లు అయ్యింది అనిపిస్తోంది.

    ఇప్పుడు కుటుంబ వ్యవస్థను రక్షించుకోవటం ఎంతో ముఖ్యం.

    ReplyDelete