koodali

Friday, March 28, 2014

స్త్రీలూ ముఖ్యమే పురుషులూ ముఖ్యమే.


స్త్రీలు  గొప్పవారే  పురుషులూ  గొప్పవారే.    స్త్రీలూ  ముఖ్యమే  పురుషులూ  ముఖ్యమే. సమాజానికి   అందరూ  అవసరమే.

అయితే,   మగవారికి ఉపాధి లభించటం ఎంతో అవసరం. మగవారికి ఉపాధి లభించకపోతే ఆ నిరాశానిస్పృహతో వ్యసనాలకు అలవాటు పడే అవకాశం ఉంది.

స్త్రీలకు ఉద్యోగం లభించకపోయినా తట్టుకోగలరు. సమాజం కూడా వారిని ఏమీ అనదు.

స్త్రీలకు ఇంటిని చక్కబెట్టుకోవటం అనే పని ఎలాగూ ఉంటుంది. వారికి దానితోనే కాలం గడిచిపోతుంది. తీరిక సమయం ఉన్న మహిళలు బోలెడు సమాజసేవ చేయవచ్చు.

ఉదా..ఆర్ధికంగా ఉన్నతంగా ఉన్న కొందరు మహిళలు కలిసి పేద, మధ్య తరగతి మహిళలకు సాయాన్ని అందించవచ్చు. వారితో కుటీరపరిశ్రమలను పెట్టించవచ్చు.

డ్వాక్రా సంఘాల మహిళలకు మరింత తోడ్పాటును అందించవచ్చు.

చదువుకున్న మహిళలు...చదువురాని మహిళలకు చదువును నేర్పించవచ్చు. మాతాశిశు సంరక్షణ గురించి నేర్పించవచ్చు.

తక్కువ ఖర్చుతో పుష్టికరమైన ఆహారాన్ని ఎలా తయారుచేయాలో పేద మహిళలకు నేర్పించవచ్చు.



కొందరు మహిళలు కలిసి గ్రూపుగా ఏర్పడి తమ కాలనీలోని సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవచ్చు...ఇలా మహిళలు తలుచుకుంటే ఎంతో సమాజ సేవ చేయవచ్చు.

మహిళలు వంటింట్లో కుందేలులా ? పడి ఉండనవసరం లేదు. ఇంటి పని అయిన తరువాత పగలు కొంత సమయాన్ని సమాజసేవకూ కేటాయించవచ్చు.

...........................................

అరుణారాయ్ అనే మహిళ అయ్యేయస్ పదవిని వదులుకుని సమాజసేవ చేస్తున్నారట. ఇంఫోసిస్ సుధామూర్తి గారు కుటుంబాన్ని చూసుకోవటం కోసం చక్కటి ఉద్యోగాన్ని వదులుకుని ఇటు కుటుంబాన్ని చూసుకుంటూనే ....సమాజసేవనూ చేస్తున్నారు.



మరెంతో మంది మహిళలు కూడా ఉన్నదానితో సరిపెట్టుకుని ఒక ప్రక్క కుటుంబాన్ని చూసుకుంటూనే ... మరో ప్రక్క తీరిక సమయంలో తమకు చేతనైనంతలో సమాజానికి తోడ్పాటును అందిస్తున్నారు.

....................................................

    మహిళలకు శారీరికంగా ఎన్నో సమస్యలు ఉంటాయి. ఉదా..గర్భిణీ సమయం, నెలసరి మొదలైనవి ఉన్నప్పుడు కొంత విశ్రాంతి అవసరం. ఉద్యోగం అంటూ బస్సులలో, షేర్ ఆటోలలో తిరిగితే   ఆ  కుదుపులకు   గర్భానికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది.

    ( అందరికీ కారులో వెళ్ళే ఆర్ధిక స్తోమత ఉండదు కదా !)

    ఇల్లాలికి ఇంట్లో చిన్న పిల్లలను చూసుకోవలసిన బాధ్యతా ఉంది .

    ఇంత కష్టపడుతూ కూడా ఇప్పుడు ఎందరో స్త్రీలు బయటకెళ్ళి పనులు చేస్తున్నారు. అయినా ఇంట్లో వాళ్ళ మెప్పును పొందగలుగుతున్నారా ?

 భార్య సంపాదన లాక్కుని తమ ఇష్టానికి ఖర్చుపెట్టేసే భర్తలు ఎందరో ఉన్నారు.

    అలాగని స్త్రీలు  పురుషులను  అందరిని   ద్వేషించటం సబబు కాదు. స్త్రీలలోనూ చెడ్డవారు, మంచివారూ ఉంటారు. పురుషులలోనూ చెడ్డవారు, మంచివారూ ఉంటారు.


......................................


    జంబలకిడిపంబ సినిమాలో  కొన్ని  దృశ్యాలలా సమాజం తయారవాలని భారతీయ స్త్రీ కోరుకోదు.

    ఇంటిని చక్కదిద్దుకోవటంలో మహిళలే నేర్పరులు. అంత ఓపిక సహనం మగవారిలో తక్కువ. అందుకని ఇంటి బాధ్యతను స్త్రీలే చక్కగా నిర్వహించగలరు.

    ................................................

   
కొందరు ఏమంటారంటే భార్యాభర్త చెరిసగం పనిని షేర్ చేసుకోవాలి అంటారు. ఇది ఆచరణలో సరిగ్గా పనిచేయదు. ఏ పనీ సరిగ్గా జరగదు....ఎవరికీ సరిగ్గా విశ్రాంతి లభించదు.

    పూర్వం మగవాళ్ళు సంపాదన కోసం బైటకెళ్ళి కష్టపడి ,.......ఏ మధ్యాహ్నమో భోజనానికి ఇంటికి వచ్చినప్పుడు ... లేక ... ఏ సాయంకాలానికో ఇంటికి వచ్చినపుడు, కాసేపు విశ్రాంతి తీసుకోవటానికి అవకాశముండేది.

    (అప్పుడు మగవాళ్ళని ఇంటి పనులు చెయ్యమని ఎవరూ అడిగేవారు కాదు. అలాగే ఆడవాళ్ళని సంపాదించుకు రమ్మని అడిగే వారు కాదు. .)

    ఆడవాళ్ళు అయితే , మగవాళ్ళు బయటకు వెళ్ళాక నిదానంగా ఇంటి పనులు చక్కబెట్టుకొని పగలు కాసేపు విశ్రాంతి తీసుకోవటానికి అవకాశముండేది.

    కానీ ఈ రోజుల్లో భార్యాభర్తా ఇద్దరూ సంపాదన కోసం బైటకు వెళ్ళి రాత్రికి ఇంటికి వస్తారు.

    ఇక అప్పుడు అలసిపోయి ఇంట్లో పనులు చెయ్యాలంటే ఇద్దరికీ విసుగే. అప్పుడు నీరసంగా ఏదో ఇంత వండుకొని తింటారు.

    ఈ విధానంలో ఎవరికీ విశ్రాంతి తీసుకోవటానికి అవకాశం లేదు. ( రాత్రికి నిద్రలో విశ్రాంతి తప్ప. )

    నేనూ మీలాగే బైట సంపాదిస్తున్నాను కాబట్టి, భర్త కూడా ఇంటి పని చెయ్యాలంటుంది భార్య.

    ఇక ఇంటి పనులు తప్పించుకోవటానికి భర్త ఇంటికి ఆలస్యంగా రావటం మొదలవుతుంది. ఇక గొడవలు మొదలు.

    ఆ కోపమంతా ....... అప్పటికే అలసిపోయి బడి నుంచీ వచ్చిన పిల్లల పట్ల చూపిస్తారు.

    భార్యను భర్త తిడితే ........... పురుషాహంకారం నశించాలి ........ అని నినాదాలు చేస్తారు .

    మరి పిల్లలను తల్లిదండ్రులు తిడితే ......? తల్లిదండ్రుల అహంకారం నశించాలి ..... అని పిల్లలు కూడా నినాదాలు చెయ్యాలేమో ఇక !

    ఆఫీసుల్లో పని విభజన ఉంటుంది. ఎవరి పనిని వారు చేస్తారు. అలాగే ఇంట్లో కూడా స్త్రీలకు, పురుషులకు పని విభజన ఉండి ఎవరి పని వారు చేస్తే సులువుగా ఉంటుంది.


 ................................................

అలాగని స్త్రీల పని పురుషులు ....పురుషుల పని స్త్రీలు అసలే చెయ్యకూడదని కాదు. పాత కాలంలో కూడా భర్తలు తమ భార్యలకు సహాయాన్ని అందించేవారు.

ఉదా... భార్య వంట చేస్తుంటే అప్పుడప్పుడు భర్త కూరలు తరిగి ఇవ్వటం వంటివి.... భార్య కారప్పూస వండుతుంటే భర్త కారప్పూస వత్తటంలో సాయాన్ని అందించటం వంటివి....

పాతకాలంలో స్త్రీలు కూడా భర్తకు పనిలో సాయాన్ని అందించేవారు.

భార్యాభర్త కలిసిమెలసి పనిచేసుకునేవారు. 

భర్త వ్యవసాయం చేసేవారైతే ఇంటికి తెచ్చిన ధాన్యాన్ని భార్య జాగ్రత్త చేసేది. భర్త కుండలు చేసే వృత్తి అయితే భార్య భర్తకు పనిలో సాయాన్ని అందించేది.

 భర్త వ్యాపారస్తుడైతే భార్య సరుకులను శుభ్రం చేయటంలో సాయాన్ని అందించేది. అప్పట్లో కిరాణా కొట్లు వెనకే ఇల్లు ఉండేది.

ఇలా  కలిసి గడపటం వల్ల భార్యాభర్త మధ్య అన్యోన్యత పెరిగేది. ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడుంది ?

 
ఇప్పుడు ఉపాధి కోసం భార్యా భర్తా ఉదయం అనగా ఎవరిదారిన వాళ్ళు వెళ్తున్నారు. ఇక వాళ్ళకు మాట్లాడుకోవటానికి కూడా సమయం దొరకటం లేదు.

పరాయి స్త్రీలు పురుషులు కలిసి పనిచేయవలసిన ప్రస్తుత పరిస్థితి కొన్ని కుటుంబాలలో గొడవలకు కారణం అవుతోంది.

........................................

ఇక స్త్రీలకు బయటకు వెళ్తే రక్షణ సమస్య ఎలాగూ ఉంది.


 ఏమైనా ఇప్పుడు చాలా మంది స్త్రీల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లు అయ్యింది అనిపిస్తోంది.

స్త్రీలు  గొప్పవారా  లేక  పురుషులు  గొప్పవారా ? అన్నది  ఇప్పుడు  సమస్య  కాదు....ఇప్పుడు కుటుంబ వ్యవస్థను రక్షించుకోవటం   ఎంతో ముఖ్యం. 




2 comments:

  1. మహిళలు వంటింట్లో కుందేలు అని ప్రచారం చేసేది వీర ఫెమినిస్ట్ రచయిత్రులు. వీళ్లు గుంటూరు,విజయవాడకు చెందిన సామాజిక వర్గానికి చెందిన వారై ఉంటారు. వీళ్లు రాసే స్రీ వాదం కథలు ఇతర ప్రాంతాల వారిని కంఫ్యుస్ కు గురిచేస్తుంది. ఎందుకంటే ఈ వర్గానికి చెందిన ఫెమినిస్ట్ రచయిత్రులు ఎగువ మధ్యతరగతి కి చెందినవారు, ఆర్ధికం గా ఏ లోటు లేనివారు. వారి బంధువర్గంలో, తెలిసిన వారిలో ఇంట్ల్లో జరిగే సంఘటనలను చూసి ఒక డైరేక్షన్ లోనే చూస్తూ కథలు రాస్తూంటరు. ఈ ముష్టి కథలకు వారు సాహిత్యం అనిపేరు పెట్టుకొని చర్చిస్తూంటారు. మధ్య,దిగువ తరగతి ప్రజలు ఆ సాహిత్యాన్ని చదివి మగవారు మోసగాళ్లు అని భావిస్తూంటారు.

    ReplyDelete

  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    మహిళలు వంటింట్లో కుందేలు అనటం అంటే, ఇంట్లో ఉండే మహిళలను అవమానపరచటమే.

    ఈ దేశంలో ఇంకా పేదరికం ఉంది కాబట్టి, ఇంటి పని, వంటపని తక్కువ జీతంతో చేయటానికి మనుషులు లభిస్తున్నారు.

    ఒక్క రోజు పనిచేసేఆమె రాకపోతే చాలామంది ఆడవాళ్ళు తమ ఇంట్లో పనిని తాము చేసుకోలేరు.

    ఎవరింట్లో పని వారు చేసుకుంటే వంటింట్లో కుందేలు అని బాధపడిపోతున్నారు.

    మరి సర్వెంట్ మెయిడ్ వంటింట్లో కుందేలు కాదా ? ఇదెక్కడి న్యాయం ?

    ఈ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల వారు ఫంక్షన్ల పేరుతో విపరీతంగా డబ్బును ఖర్చుపెడుతుంటారు. నగలను వంటినిండా దిగేసుకుంటారు.

    విచ్చలవిడిగా ఆహారపదార్ధాలను పడేస్తుంటారు. ఈ ఆడంబరాలు తగ్గించటానికి వీళ్ళు ప్రయత్నిస్తే బాగుంటుంది.

    ReplyDelete