koodali

Friday, March 21, 2014

ఉపాధి కోసం .... స్త్రీలు,పురుషుల మధ్య పోటీ ?

 
ఒక  రోజు  ఇంటికి  వెళ్ళటానికి  బస్సులో  వెళ్తున్నాను.   అప్పటికే  రాత్రి  7 గంటల  సమయం   దాటింది.  ఇంటికి  వెళ్ళే  కాలేజ్  అమ్మాయిలు,  ఆఫీసుల  నుంచి  ఇంటికి  వెళ్ళే  ఉద్యోగినులతో  బస్సు  కిటకిటలాడుతోంది.  

చాలా  మంది  సీట్  లేక  నిల్చుని   కష్టపడుతూ   వెళ్తున్నారు.   అంతా   ఇరుకుగా,   చాలా  చిరాకుగా  ఉంది.


నాకు  ఇంటి  వద్ద  చాలా  పని  ఉంది.  వంట  చేయాలి.  ట్రాఫిక్  జాం  వల్ల    బస్సు  ఆగీఅగీ  వెళ్తోంది.     చాలా  చిరాకుగా  అనిపించి  చుట్టుప్రక్కల  వాళ్ళకు  వినిపించేలా  గట్టిగానే  అన్నాను.


ఏం  బాధలో... ఇప్పుడు  ఇళ్ళకు  వెళ్ళి పని  చేయటానికి   ఏం  ఓపిక  ఉంటుంది  ?  ఇంట్లో  పనులెలా  చేసుకుంటారు  ? ఇప్పడు  ఇంటికి  వెళ్తే  చంటి  పిల్లలు  ఎక్కడ  ఉంటారు  ?  కుటుంబాన్ని  చూసుకోవటమూ   ముఖ్యమే  కదా ! ఇలా....   అన్నాను.  


ఇదంతా  విన్న  ఒక  కాలేజీ  అమ్మాయి  నా  వైపు  కోపంగా  చూసింది. 

(  ఇంకా  బాధ్యతలు  తెలియని  వయస్సు  కదా ! )  

సీట్లలో  కూర్చుని  మాట్లాడుకుంటున్న  ఇద్దరు  మహిళలు   వాళ్ళలో  వాళ్ళు  మాట్లాడుకుంటున్నట్లుగా  నాకు  వినిపించేలా  ఏమన్నారంటే....

ఇంట్లో  హాయిగా  కూర్చోక   ఇలా  ఉద్యోగాలు  చేయటం  మనకు  మాత్రం  ఇష్టమా ...  ఉద్యోగాలు  మానేస్తామంటే  ఇంట్లో  మగవాళ్ళు  ఊరుకుంటారా  ?  వస్తువుల  రేట్లు  ఎంతో  పెరిగిపోయాయి.  స్కూల్స్,  కాలేజీల  ఫీజులు  బాగా  పెరిగాయి.  తప్పనిసరి  పరిస్థితిలో  ఉద్యోగాలు  చేయవలసి  వస్తోంది.....  అంటూ  మాట్లాడుకున్నారు.


ఆ  మహిళలు   అన్నట్లే    చాలామంది  అంటుంటారు.  భర్త   సంపాదించే  ఒక్క  జీతంతో  ఈ  రోజుల్లో  ఎలా  బతకాలి  ?  అంటారు. 


 
వస్తువుల  రేట్లు  పెరిగిపోతుంటే  వాటిని  తగ్గించమని  ప్రభుత్వంపై  వత్తిడి  తేవాలి  ...పెరిగే  వస్తువుల  రేట్లను  అందుకోవటానికి   మహిళలు  ఇంటాబయటా  ఎన్ని  పనులను  చేయగలరు  ? 

................................


(  పూర్వం  ఒక్క  సంపాదనతో  ఎన్నో  కుటుంబాలు  చక్కగా  జీవించారు  కదా ! 
అయితే, పూర్వపు  ప్రజలు  మనకన్నా  అల్పసంతోషులు.  ఇప్పటి  వారిలో  చాలామందికి   ఎన్ని   సౌకర్యాలు  ఉన్నా  ఏదో లేదని    అసంతృప్తి  ఫీలవుతుంటారు. )
........................


 కుటుంబాన్ని  ఆదుకునేందుకు  కొందరు  స్త్రీలు  ఉద్యోగాలు  చేస్తారు.   అయితే  అందరు  స్త్రీలు  ఆర్ధిక  లోటు  వల్లే  ఉద్యోగాలు  చేస్తున్నారని  అనలేం. 

 ఆర్ధిక  పరిస్థితి  బాగానే  ఉన్న  కొందరు  స్త్రీలు   మరింత  ఆర్ధికంగా  ఉన్నత స్థానం  కోసం  ప్రయత్నిస్తుంటారు.

ఎక్కువ  జీతం  వచ్చే   కొందరు  మహిళలు  వేల  రూపాయలు  పోసి  దుస్తులు  కొంటుంటారు.  లేటెస్ట్  డిజైన్లు  అంటూ  నగలను   ఎప్పటికప్పుడు   మార్చేస్తుంటారు. 


 స్త్రీలు,  పురుషులు   వేల  రూపాయలు  పోసి  లేటెస్ట్  సెల్  ఫోన్లను  కొని  పడేస్తున్నారు.
....................................


 ఆర్ధిక  పరిస్థితి  బాగా  ఉన్న  మహిళలు  కూడా   ఉద్యోగాల  కోసం   పోటీపడటం  వల్ల    ఆర్ధిక పరిస్థితి   సరిగ్గా లేని   మరికొందరికి  ఉద్యోగ  అవకాశాలు  తగ్గే  అవకాశం  ఉంది.  


ముఖ్యంగా  ఈ  పోటీ  ప్రపంచంలో  యువకులు  ఉద్యోగాలు   లభించక  నిరాశానిస్పృహలకు  గురవుతున్నారు. 


 ఉపాధి  లభించక   ఈ  మధ్య  కొందరు  యువకులు  ఆత్మహత్యలు  చేసుకున్నట్లు  వార్తలు  వచ్చాయి. 

ఆడపిల్లలు  ఉద్యోగం  చేయకపోతే  ఎవరూ  పెద్దగా  పట్టించుకోరు.  


మగపిల్లలు  ఉద్యోగం  లేక  ఇంటిపట్టున  ఉంటే  ఇంట్లో  వాళ్ళూ,  చుట్టుప్రక్కల  వాళ్ళూ  కూడా    ఈసడిస్తారు. 

ఏరా  !  ఇంకా  ఉద్యోగం  రాలేదా  ?  అని  పరామర్శలతో  హింసిస్తారు.


  ( ఉద్యోగాలు  ఏమైనా  అబ్బాయిల   జేబులో  ఉన్నాయా  ? )

 అసలే  విపరీతమైన   యాంత్రీకరణ  మూలంగా  నానాటికీ  ఉద్యోగాలు  తగ్గిపోతున్నాయి. 


 తక్కువమంది  ఉద్యోగస్తులతో  ఎక్కువ   యంత్రాలతో...  పనులు  చేయించుకోవటానికి  యజమానులు  ఎక్కువగా   ఇష్టపడుతున్నారు. దానికి  తోడు  ఉపాధి  కోసం  పురుషులకు  పోటీగా  మహిళలు  వచ్చారు.

 ...............................

అయితే,  కొందరు  మహిళలు  ఉన్నదానితో  తృప్తి   చెంది  కుటుంబాన్ని  చూసుకుంటూ  తీరిక  వేళలో   సమాజ  సేవ  చేస్తూ  జీవితాన్ని  సార్ధకం  చేసుకుంటున్నారు. 

అటు  కుటుంబానికి  న్యాయం  చేస్తున్నారు.....  ఇటు  సమాజానికి  తమకు  తోచినంతలో  సహాయాన్ని అందిస్తూన్నారు. 
........................................

సంపాదించే  డబ్బు  సరిపోవటం  లేదు  అంటారు  కొందరు. 


( కొందరు  నిజంగానే  తక్కువ   జీతాలతో  ఇబ్బందులు  పడుతుంటారు. )

 అయితే,   కొందరి  విషయంలో  మాత్రం   ఇలా  డబ్బు  సరిపోకపోవటానికి  మార్కెట్లో  వచ్చి  పడుతున్న  వస్తువులను  కొనాలనే  మోజు  కూడా   కారణం.

 ఈ  ఆసక్తి  తగ్గనంత  వరకు  ఇంటిల్లిపాదీ  ఉద్యోగాలు  చేసినా  ఎక్కడి  డబ్బూ  చాలదు. అవసరమైనంత  వరకే  ఆశలు  ఉన్నప్పుడు   డబ్బు  చక్కగా  సరిపోతుంది.

.......................


ఈ  రోజుల్లో ,   కుటుంబ సభ్యుల  మధ్య  
ఆప్యాయతలు,  అనుబంధాలు  తగ్గి ,   అర్ధికబంధాలు,  అధికారబంధాలు...  పెరిగాయనిపిస్తుంది.




5 comments:

  1. ఈ రోజుల్లో చిన్నపిల్లలను ఎల్ కేజీలో జేర్పించాలన్నా కొన్ని ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు 25 వేలు ఫీజు అడుగుతున్నారు.

    పిల్లలను ప్రభుత్వ పాఠశాలలలో జేర్పించాలంటే పెద్దవాళ్ళు అంత ఆసక్తిని చూపించరు.

    ప్రజల ఆలోచనా ధోరణిలో మార్పు రావాలి. బోలెడు ఫీజులు కట్టి ప్రైవేట్ పాఠశాలలలో మాత్రమే చదివించాలని ప్రజలు అనుకోకూడదు.

    అయితే, ప్రైవేట్ పాఠశాలలతో పోటీ పడేవిధంగా ప్రభుత్వపాఠశాలలలో చక్కటి చదువును అందించినప్పుడు తల్లితండ్రులూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో జేర్పిస్తారు.

    ఉదా.. చాలా సెంట్రల్ స్కూల్స్ లో వ్యవస్థ ఇంకా చక్కగానే ఉంది.
    ....................................

    ధరలు తగ్గటానికి ప్రభుత్వమూ గట్టి చర్యలు తీసుకోవాలి.

    వస్తువుల రేట్లు పెరిగాయని ఉద్యోగస్తులు జీతాలు పెంచమంటారు.

    ఉద్యోగస్తులకు జీతాలు పెరిగిన తరువాత వ్యాపారస్తులు వస్తువుల రేట్లను కూడా మళ్ళీ పెంచుతారు....ఇలా అంతులేని కధలా... తయారయింది.

    జీతాలు పెరిగితే ధరలూ పెరుగుతున్నప్పుడు జీతాలు పెరగటం వల్ల ఏం లాభం ?

    పెరిగిన రేట్లతో దినసరి కూలీలు , రోడ్ల ప్రక్కన చెప్పులు కుట్టుకుని జీవించే వారు..ఎన్నో ఇబ్బందులను అనుభవిస్తున్నారు.... సమ్మె చేసే అవకాశాలు తక్కువగా ఉన్న ఇలాంటి వారి పరిస్థితి చెప్పనక్కర లేదు.

    జీతాలు ... వస్తువుల రేట్లు ఒకదానితో ఒకటి పోటీ పడుతుంటే ...ఇలాంటి బడుగు జీవులు ఎలా బ్రతకాలి ?

    ReplyDelete
  2. నాదొక ప్రశ్నండీ. చదువు, జ్ఞానం, ప్రతిభ, నేర్పరితనం లాంటి అర్హతలు అన్నీ ఉన్న వారు పురుషలయినా స్త్రీలయినా ఉద్యోగం (లేదా వ్యాపారం) చేయడం అవసరం కదా? నూటికి యాభై జనాభా టాలెంట్ దేశానికి ఉపయోగపడకపోవడం బాగుందా?

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి,

      చదువు, జ్ఞానం, ప్రతిభ, నేర్పరితనం లాంటి అర్హతలు అన్నీ ఉన్న వారు పురుషలయినా స్త్రీలయినా , నూటికి యాభై జనాభా టాలెంట్ దేశానికి తప్పక ఉపయోగపడాలి.

      ఈ రోజుల్లో చాలామంది డబ్బు సంపాదించటమే లక్ష్యంగా పని చేస్తున్నారు. డబ్బు వల్లే అన్ని సంతోషాలనూ పొందలేము కదా !

      కొందరు వ్యక్తులు దేశం మీద పడి ఇతరుల సొమ్మును కాజెయ్యటం, బలహీనులను హింసించటం..వంటి పనులను చేస్తుంటారు. ఇలాంటి పౌరుల సంఖ్య ఎక్కువవటం వల్లనే ఇప్పుడు దేశం పరిస్థితి అద్వాన్నంగా తయారయింది.

      ఇలా కాకుండా చక్కటి నైతికవిలువలతో కూడిన మంచి పౌరులు ఉంటే దేశంలో సౌభాగ్యం వెల్లివిరుస్తుంది... అయితే చక్కటి నైతికవిలువలతో కూడిన పౌరులు తయారవాలంటే ఎలా ?

      చిన్నతనం నుంచీ పిల్లలను కంటికి రెప్పగా కాపాడుకుంటూ చక్కటి ఆహారాన్ని అందిస్తూ, నైతిక విలువలతో పెరిగేలా తల్లితండ్రి శ్రద్ధ తీసుకోవాలి.

      తల్లితండ్రి పొద్దస్తమానం ఉద్యోగమో, వ్యాపారమో చేయటంలోనే తమ టాలెంటును చూపిస్తే ....పిల్లలను చక్కటి శారీరిక, మానసిక ఆరోగ్యం తో, నైతిక విలువలు కలిగిన పౌరులుగా తయారుచేసే బాధ్యతను ఎవరు స్వీకరిస్తారు ?

      ఇప్పుడు చాలా విద్యాసంస్థలు కూడా డబ్బు సంపాదించటమే లక్ష్యంగా విద్యను ఉపదేశిస్తున్నాయి.

      అందరికన్నా, పిల్లల పెంపకం విషయంలో తల్లితండ్రి బాధ్యత ఎంతో ఉంటుంది.

      తండ్రి ఉద్యోగం లేక వ్యాపార బాధ్యతలలో ఉంటే కనీసం తల్లి అయినా ఇంటి బాధ్యతను తీసుకుంటే బాగుంటుంది.

      తల్లి బిడ్దకు తొలి గురువు అంటారు. ఇప్పుడు చాలామంది తల్లులు బిడ్డలకు పాలివ్వటానికి కూడా సమయం లేదంటూ ఆయాలపై వదిలి ఉద్యోగాలకు పరిగెడుతున్నారు.

      ఇక తొలి గురువైన తల్లి బిడ్డలకు జీవితపాఠాలను ఎప్పుడు నేర్పిస్తుంది.

      తండ్రికి ఉన్న చెడ్డ అలవాట్లు కూడా కుటుంబముపై ఎంతో చెడు ప్రభావాన్ని చూపిస్తాయి.

      డబ్బు సంపాదించటం జీవితంలో ముఖ్యమే కానీ, అది మాత్రమే కుటుంబానికీ, దేశానికి ముఖ్యం కాదు.

      Delete
  3. భావితరాలు శారీరికంగా, మానసికంగా ధృఢమైన వ్యక్తులు తయారవాలంటే, పిల్లలకు టీనేజ్ వయసు వచ్చే వరకూ చక్కటి పుష్టికరమైన ఆహారాన్ని అందించాలి.

    మన పాతతరాల వాళ్ళు సునాయాసంగా కొన్ని మైళ్ళు నడిచి వెళ్ళగలిగేవారు. ఇప్పటి తరం వాళ్ళలో ఎందరికి ఆ శక్తి ఉంది ?

    పిల్లలకు చిన్నతనం నుంచే నీతికధలు వంటివి చెబుతూ ఉండాలి. ఏది మంచో, ఏది చెడో పెద్దవాళ్ళు చెబుతూ ఉండాలి. అలాగని వాళ్ళకు అసలే ఫ్రీ లేకుండా చేయకూడదు.

    ఇప్పుడు చాలామంది పిల్లలు మీడియా ద్వారా ఎలాంటి అశ్లీల దృశ్యాలను చూస్తూ పెరుగుతున్నారో మనకు తెలుసు.


    ReplyDelete

  4. గత కొన్ని ఏళ్ళుగా స్త్రీలు, పురుషులు విపరీతంగా పనిచేస్తున్నారు.

    దేశంలో పేదరికం ఎంతవరకూ తగ్గింది ? నిరుద్యోగం మరింత పెరిగింది. ఇతర సామాజిక సమస్యలూ పెరిగినట్లు అనిపిస్తోంది.

    ఆ మధ్య జరిగిన నిర్భయ వంటి ఘటనలు , చిన్నపిల్లల పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తించిన సంఘటనలు ఎందుకు జరిగాయో అర్ధం కావటం లేదు.

    ఇవన్నీ గమనిస్తే సమాజం దారి తప్పిందని స్పష్టంగా తెలుస్తోంది కదా !

    ఇప్పటి సమాజానికి ఎక్కువగా కావలసింది ఆర్ధికాభివృద్ధి కాదు.......నైతికాభివృద్ధి అనిపిస్తోంది.

    ఈ దేశానికి ఎన్నో సహజవనరులైన సంపదలున్నాయి. అయినా దేశంలో పేదరికం ఉన్నదన్నా, ఎన్నో నేరాలు, జరుగుతున్నాయన్నా... మనుషుల్లో నైతికవిలువలు లోపించటం వల్లే.

    ReplyDelete