koodali

Thursday, May 21, 2020

దైవమే దిక్కు....



ఏదైనా పుణ్యక్షేత్రం వద్ద 10 కిలోమీటర్లు నడవాలంటేనే పెద్దవాళ్ళకు కూడా కాళ్లు లాగేస్తాయి..

అలాంటిది కొందరు వలస కార్మికులు  ఎండలలో వందల కిలోమీటర్లు నడవటం ఏమిటో.... పిల్లలు మేము నడవలేమంటూ ఏడుస్తున్నా కూడా పెద్దవాళ్లు నడిపించటం ఏమిటో.

దేశంలోని  ప్రభుత్వాలు కూలీల కోసం తాము రైళ్ళను ఎక్కువగానే వేశామంటారు.కొందరు కూలీలను రైళ్ళలో వారి స్వస్థలాలకు పంపారు.

మరి, రైళ్ళలో ప్రయాణం కొరకు ఆన్ లైన్  బుకింగ్ తెలియకపోవటం వల్లనో? లేక ట్రైన్ దిగిన తరువాత క్వారైటైన్లో ఉండాలని భయం వల్లనో ? లేక మరేదైనా కారణాలో తెలియటం లేదు..  నడిచే వాళ్లు కొందరు నడుస్తూనే ఉన్నారు.

*************
ఏం చేయాలో తెలియని నిస్సహాయతతో కుటుంబసభ్యులు అందరూ అలా నడుస్తూ ఉండవచ్చు. నిస్సహాయత ఉన్నాకూడా అంతదూరాలు  అలా నడవటం  సరైనపనికాదు.

 పరాయి చోట ఉపాధి లేక చనిపోతామేమోనని భయం వల్ల  నడిస్తే.. నడవలేక కూడా చనిపోవచ్చు .. చనిపోకపోయినా .. తరువాత జబ్బు పడొచ్చు.

**************
లాక్డౌన్ సమయంలో ప్రజల కష్టాలు తీరటానికి ప్రభుత్వాలు, స్వచ్చంద సంస్థలు సహాయక చర్యలు చేసారు.

దేశంలోని ప్రభుత్వాలు పేదలకు కొంత ఆహారాన్ని అందించారు, కొన్ని రైళ్ళను వేసారు. కొందరిని స్వస్థలాలకు పంపించారు.

అయితే, ఆహారధాన్యాలు దండిగా ఉన్నాయంటున్నారు కాబట్టి, మొదటిసారి లాక్ డౌన్ నుండి ఉపాధి లేక ఆహారానికి ఇబ్బందులు పడుతున్న వారికి సరిపడా ఆహారధాన్యాలను ఇవ్వటం.... 


రెండవ లాక్ డౌన్ కు ముందు రెండు రోజులు గాప్ ఇచ్చి  స్వస్థలాలకు వెళ్తామనేవారిని సరైన వాహన ఏర్పాట్లు చేసి పంపించటం వంటివి మరింత సమర్ధవంతంగా చేస్తే ,
 వలసకూలీలు రోడ్లపై నడవటం ఉండేది కాదు.

 ఇళ్ళలో ఉన్న కొందరు పేద కుటుంబాల వాళ్లు ఆకలితో బాధలు పడేవారు కాదు. కరోనా లాక్డౌన్ సమయం లో వలసకూలీల  విషాదగాధల జ్ఞాపకాలు ఉండేవి కావు.

అయితే, సమాజం బాగుండాలంటే .. ప్రభుత్వాలు, అధికారులు, ప్రజలు ఎవరి పని వారు సక్రమంగా చేయాలి.


*********************
ఈ మధ్య ఒక చిన్న పిల్లతో కొందరు పోలీసులు ఒక గది తుడిపించటం చూసి  అందరూ అన్యాయం అన్నారు. చిన్న పిల్లతో పనిచేయించటం అన్యాయమే.

మరి వలసకూలీలు తమ చిన్నపిల్లలను  అలా నడిపించటం కూడా అన్యాయమే. తల్లితండ్రి ..పిల్లలను కని, పెంచుతున్నారు కాబట్టి వాళ్లు వాళ్ల పిల్లల్ని కష్టపెడితే అన్యాయం అనకూడదా ?

తల్లితండ్రి తమ పిల్లలను కష్ట పెట్టకూడదు. అలాగని పిల్లలను అతి గారాబం చేసి పెంచకూడదు.

******
మరికొంత మంది తల్లితండ్రి చదువుల్లో ర్యాంకుల కోసం పిల్లల్ని దండిస్తారు. పిల్లల మంచికోసమే అలా చేస్తున్నామంటారు.

కొన్నిసార్లు పిల్లలు వాళ్ల శక్తికి మించిన చదువులు చదవలేక, తమ బాధలు ఎవరూ పట్టించుకోవటంలేదనే అభిప్రాయంతో ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు.

ఈ రోజుల్లో  చదువు, ఉద్యోగాలకు విపరీతమైన పోటీ ఉంది. ఇష్టమైన చదువులో సీటు లభించాలన్నా విపరీతమైన పోటీ ఉంది.
 పిల్లల శక్తిని, ఇష్టాఇష్టాలను కూడా పెద్దవాళ్లు కొంత పట్టించుకోవాలి.

****************
 ఇక కొందరు పెద్దవాళ్ల విషయాలను గమనించితే,  సమాజానికి మంచి చెప్పవలసిన కొందరు పెద్దవాళ్లే... మద్యపానం  చేయటం , స్త్రీ పురుషులు తమ ఇష్టానికి తిరగటం .. వంటివి తప్పులేదంటున్నారు.

***********
ప్రభుత్వాలు ..ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసుకుంటారు. తల్లితండ్రి..తమ పిల్లలు ఇబ్బందులు పడకుండా చూసుకుంటారు.

అయితే, కారణాలు ఏమైనా..సమాజంలో బలహీనులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు.

 సమాజంలో ...పేదవారు బలహీనులు. కుటుంబంలో...పిల్లలు బలహీనులు.

 సమాజంలో ఏదైనా సమస్య వస్తే,  పేదవారు ఎక్కువ ఇబ్బందులు పడతారు.

 కుటుంబంలో ఏదైనా సమస్య వస్తే,  పిల్లలు ఎక్కువ ఇబ్బందులు పడతారు.

****************
 పిల్లలు తప్పులు చేస్తే పెద్దవాళ్ళు దండిస్తారు. ప్రజలు తప్పులు చేస్తే ప్రభుత్వాలు, చట్టం ద్వారా దండన ఉంటుంది. 

మరి, ఎప్పుడైనా  సమాజంలో పెద్దవాళ్ళు, ప్రభుత్వాలు..ఏమైనా తప్పులు చేస్తే ఎవరు దండిస్తారు ?

ఇప్పుడు చాలామందికి  నైతికవిలువల సంగతి అలా ఉంచి, డబ్బు సంపాదనా, విలాసంగా జీవించటం వంటివి ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఎవరి ఖర్మ వారిది.  

ఇవన్నీ ఇలా ఎందుకు జరుగుతున్నాయో దైవానికే తెలియాలి.  దైవమే దిక్కు.



2 comments:

  1. చాలా విషాదం అండి. మీ పోస్ట్ లో చాలా చక్కని విశ్లేషణ చేశారు.చాలా ఆలోచించదగ్గ విషయాలు.

    ReplyDelete
  2. మీ వ్యాఖ్యకు ధన్యవాదములండి.

    ReplyDelete