koodali

Monday, October 24, 2016

ఈ మధ్యకాలంలో కొందరు షిరిడి సాయిని ...


ఈ మధ్యకాలంలో కొందరు షిరిడి  సాయిని విమర్శించటమే పనిగా పెట్టుకున్నారు.

 సాయిని పూజించేవారు రాముడిని, శివుణ్ణి పూజించకూడదన్నట్లు మాట్లాడుతున్నారు.

 మనిషిగా జీవించిన షిర్డిసాయిని దేవునిగా ఆరాధించటమేమిటనీ అడుగుతున్నారు.

ఇంకా చాలా విధాలుగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ హిందువులలో చిచ్చు కలిగే విధంగా ప్రవర్తిస్తున్నారు.
**************

హిందువులు..ఎందరో దేవతలను, గురువులను, అవతారమూర్తులను.. ఆరాధించుకుంటారు. అలాగే షిర్డిసాయినీ ఆరాధించుకుంటున్నారు.

షిర్డిసాయిని పూజించకూడదనీ చెప్పే హక్కు ఎవరికీ లేదు.

సాయిని పూజించేవారు రాముడినీ, శివుడినీ పూజించకూడదనీ చెప్పే హక్కూ ఎవరికీ లేదు.

రాముడు, శివుడు, ఆదిశంకరులు..వీళ్లు ఏ కొందరి సొత్తూ కాదు.

 హిందువులు.. రాముడినీ, శివుడిని, ఆదిశంకరులనూ, షిర్డిసాయినీ కూడా పూజించుకుంటారు.

 దత్తాత్రేయస్వామి వారు.. గురువులుగా తెలియజేసిన విశేషాలను గమనిస్తే ఎన్నో విషయాలు తెలుస్తాయి.
*************

హిందువులు రాయిలోను, రప్పలోనూ, చెట్టు లోనూ  కూడా దైవాన్ని భావించి ఆరాధిస్తారు. గురువును దైవంగా పూజిస్తారు చాలామంది.

మనిషిగా జీవించిన షిర్డిసాయిని దేవుడిగా పూజించటమేమిటని అడుగుతున్నారు కొందరు ... 

 అయితే, ఆదిశంకరులవారు కూడా మనిషిగా ఈ నేలపై నడయాడిన వారే కదా! మరి, ఆదిశంకరులను దేవునిగా పూజిస్తున్నారు కదా!

మనిషిగా జీవించిన పైడితల్లిని  దేవతగా పూజిస్తున్నారు. మనుషులుగా జీవించిన సమ్మక్క, సారలమ్మలను దేవతలుగా పూజిస్తున్నారు.

ఇప్పుడు షిర్డిసాయిని పూజించకూడదని అంటున్న వాళ్లు  ముందుముందు...పైడితల్లిని, సమ్మక్క, సారలమ్మలను కూడా పూజించకూడదని  అంటారేమో?
*******************
 కొందరు స్వార్ధపరుల వల్లా, కొందరు తెలిసీతెలియని వారి వల్లా హిందుత్వంలో అంటరానితనం వంటి కొన్ని దోషాలు ప్రవేశించాయి.
ఇలాంటి వాటి వల్ల  హిందూ సమాజం ఇప్పటికే ఎంతో నష్టపోయింది. 

చేతనైతే అంటరానితనం ..వంటి  భూతాలను తరిమివేయండి.

అంతే కానీ, హిందువులలో చిచ్చు పెట్టి చీలికలు వచ్చేవిధంగా ప్రవర్తించవద్దు.

అందరిని ప్రశాంతంగా ఉండనిస్తే అందరికీ శ్రేయస్కరం.

 

No comments:

Post a Comment