koodali

Monday, March 28, 2016

రాష్ట్ర విభజన .... తరువాత..

 రాష్ట్ర విభజన సమయంలో పార్టీలు అనేక హామీలిచ్చిన సంగతి అందరికీ తెలుసు.

తమకు జరిగిన అన్యాయం గురించి ఆంధ్ర ప్రజలు అరచి గోల చేయకపోవచ్చు. అయితే, తమకు అన్యాయం చేసే వారి విషయంలో తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటారు. 

ఉదా.. అప్పుడు కేంద్రంలో ఉన్న పార్టీ ఆ తరువాత భారీగా నష్టపోవటం  గురించి అందరికీ  తెలుసు. 

 ఇప్పుడు కేంద్రం  కూడా  సరిగ్గా ఆంధ్రప్రదేశ్  ను  ఆదుకోవటం లేదనిపిస్తోంది. 

హామీల  అమలు ఆశించినంతగా లేదనిపిస్తోంది. 

రాజధాని మరియు ఇతర విషయాల కోసం భారీగా నిధులు ఇవ్వవలసి ఉంది.

 వెనుకబడ్డ ఉత్తరాంధ్ర, రాయలసీమలకు పన్నుల రాయితీల వంటివి కూడా ఇప్పటివరకూ అమలు చేయలేదు.

  బడ్జెట్లో కూడా ఆంధ్రప్రదేశ్కు  సరైన న్యాయం జరగలేదు. ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. 

మిగతా రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్ ను పోల్చటానికి లేదు.

 రాష్ట్ర విభజన ఆంధ్ర ప్రజల అభిమతానికి విరుద్ధంగా జరిగింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ కు  గణనీయంగా నిధులు ఇవ్వవలసి ఉంది.


 ఇవన్నీ ఎవరూ ఇచ్చే భిక్ష కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు.

 రాష్ట్ర విభజనలో ఇప్పుడు  కేంద్రప్రభుత్వంలో ఉన్న పార్టీ  ప్రమేయం కూడా ఉంది.

 విభజన జరిగిన కొత్తలో బిజేపీ పార్టీ రాష్ట్రాన్ని అన్నివిధాలుగా ఆదుకుంటామని హామీలిచ్చింది.

 అయితే ఇప్పుడు... ఇతరుల  చెప్పుడు మాటలు వినో లేక మరేదైనా కారణాల వల్లో గానీ ఆ పార్టీ తీరు కొంచెం మారిందేమో ? అనిపిస్తోంది. 

 విభజన జరిగి చాలాకాలమయ్యింది. అరకొరగా ఇచ్చే నిధులతో  రాష్ట్రం ఎప్పటికి కోలుకుంటుంది ? 

 సరిపడినంత నిధులు ఇవ్వలేమని భావించినట్లయితే  అందరూ కలిసి రాష్ట్రాన్ని విభజించకుండా ఉండవలసింది.

ఆంధ్రకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుతామని అప్పట్లో బీజేపీ వాళ్లు ప్రకటించారు. వారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని ఆశిద్దాము.

.......................

మరో విషయం ఏమిటంటే, 10 సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ఉండగా ఇప్పుడే అమరావతికి తొందరేమొచ్చిందని కొందరు అంటున్నారు. 

10 సంవత్సరాలూ హైదరాబాద్లోనే ఉండి  10 సంవత్సరాల తర్వాత తీరిగ్గా కళ్ళు తెరిస్తే రాజధాని అప్పటికప్పుడు ఆకాశం నుంచి ఊడి పడదు కదా ! 

ఇప్పటి నుంచీ కష్టపడితేనే 10 సంవత్సరాలకు రాష్ట్రం  అంతా  అభివృద్ధి చెందుతుంది. 

ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులలో చాలామంది రాష్ట్రానికి వచ్చి రాష్ట్ర అభివృద్ధి కొరకు కృషిచేయటానికి  సిద్ధపడుతుండగా ...కొద్దిమంది  మాత్రం రాజధాని ఏర్పడి అన్ని సౌకర్యాలూ ఏర్పడితేనే వస్తామనటం బాధాకరం.

 తెలంగాణాకు చెందిన ఉద్యోగులు (ఆంధ్రలో ఉన్నవాళ్ళు ) తమను తమ రాష్ట్రానికి పంపివేస్తే తమ రాష్ట్ర అభివృద్ధిలో కృషిచేసుకుంటాము  అంటున్నారట ...

ఆంధ్ర  వాళ్ళు  కూడా తమ రాష్ట్రానికి వచ్చి.. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అవుతారని ఆశిద్దాము.






2 comments:

  1. కేంద్రం ఇచ్చిన హామీలు ఏమిటన్న విషయంలో స్పష్టత లోపించడానికి ముఖ్యకారణం రాజకీయ పార్టీలే. ఉ. 7 వెనుకబడిన జిల్లాలకు చెరో 100 కోట్లు ఇస్తామని మాత్రమె కేంద్రం హామీ ఇచ్చింది, సదరు రొక్కం చెల్లించారు కూడా. అయితే ఈ ఖాతాలో ఎన్నో వేల కోట్లు వస్తాయని, తమను గెలిపిస్తే తప్ప అవి రావని టీడీపీ బీజేపీలు ప్రజలను నమ్మబలికాయి.

    నూతన రాజధాని నిర్మాణానికి కేంద్రం నిధి సహాయం చేస్తుంది చేయాలి కూడా. అయితే ఇది కొన్ని ముఖ్య భవంతులకు మాత్రమె పరిమితం. సింగాపూర్ తరహా రాజధాని కట్టాలంటే కేంద్రం ఇవ్వలేదు, ఇవ్వదు కూడా.

    అలాగే బడ్జెట్ లోటు విషయంలో కొంతమేరకు సాయం చేస్తామన్న హామీని మొత్తం 17 వేల కోట్ల లోటును కేంద్రం భర్తీ చేస్తుందని మసి పూసి మారేడు కాయ చేసారు.

    ఇకపోతే కొన్ని అంశాలు తప్ప కేంద్రం హామీలు నెరవేర్చింది. కొన్ని విషయాలలో నిధులు ఇవ్వకపోవడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వమే. ఉ. ఫలానా పని కొరకు మొదటి విడత నిధులు ఇచ్చాక సదరు పనులు పూర్తి చేసి ధృవీకరణ సర్టిఫికేటు పంపిస్తేనే రెండో విడత మంజూర్ అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన నిధులను వేరే ఖాతాల్లోకి వాడడం వలన సర్టిఫికేటు ఇవ్వలేదు కనుక కేంద్రం మాలి విడత ధనం ఆపేసింది.

    బీజేపీ వారు ఈ విషయాలన్నీ చెబుతూనే ఉన్నారు కానీ ప్రజలకు వాస్తవాలు చేరడం లేదు.

    చివరిగా ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పుడు మనమయితే పొదుపు చేస్తాము కానీ ప్రభుత్వం దుబారా ఖర్చులు పెంచింది. రుణ మాఫీ భారం మోయడం దాదాపు అసాధ్యం అని జగన్ అంటే ఎవరూ వినలేదు. అలాగే ఉద్యోగులకు 43% ఇంక్రిమెంటు అవసరమా? రాష్ట్ర క్షేమం కోసం కొంత త్యాగం వారూ చేయాలి కదండీ.

    ReplyDelete
  2. మీరు వ్రాసిన వ్యాఖ్యకు నిన్ననే సమాధానం రాద్దామనుకున్నాను కానీ కొన్ని కారణాల వల్ల వీలు కుదరలేదు. ఈ రోజు రాస్తున్నాను.
    ఈ విషయం గురించి ఒక టపాను వ్రాసాను.

    ఈ రోజుల్లో దేశంలో ఎందరు పేదలున్నా కూడా దేశవ్యాప్తంగా ఉద్యోగుల జీతాలు పెరుగుతూనే ఉన్నాయి. వ్యాపారస్తులు కూడా ధరలు పెంచుతూనే ఉన్నారు. ఎవరి స్వార్ధం వారిదయింది.

    దేశంలో పేదరికం ఉంది కదా ! మన జీతాలు పెంచుకోవటం ఎందుకని ఉద్యోగస్తులూ అనుకోవటం లేదు. ధరలు పెంచకూడదని వ్యాపారస్తులూ అనుకోవటం లేదు.

    తెలంగాణాలో కూడా ఉద్యోగస్తుల జీతాలు పెరిగాయి కదా !


    ReplyDelete