koodali

Monday, December 28, 2015

శాకాహారం..మాంసాహారం..మరికొన్ని విషయాలు..

  
శాకాహార జంతువులను ...మాంసాహార జంతువులను గమనిస్తే ఎక్కువ శాకాహార జంతువులు సాత్వికంగా ఉంటాయి. ఉదా..ఆవు, మేక వంటివి. 

మాంసాహారజంతువులు ఎక్కువగా కోపగుణాన్ని కలిగిఉంటాయి. ఉదా..పులి, సింహం వంటివి.
...................................

మనుషులకు  శాకాహారం వలన అనేక లాభాలున్నాయని, మాంసాహారం వల్ల అనారోగ్యాలు కలిగే అవకాశాలు ఎక్కువని ఇంతకుముందు ఒక టపాలో చెప్పటం జరిగింది. 

శాకాహారం వల్ల సాత్విక గుణం ఎక్కువయ్యే సుగుణం కూడా ఉంది.

 అయితే,  పూర్వీకులలో కూడా కొందరు మాంసాహారం తీసుకోవటం జరిగింది. ఉదా..రాజులు.. సైనికులు..మొదలైన వారు మాంసాహారాన్ని తీసుకుంటారు. 

ఇక్కడ మనం కొన్ని విషయాలను గమనించాలి. సత్వ , రజో , తమో గుణాలు  అని మూడురకాల గుణాలున్నాయి. ఎవరికైనా సాత్విక గుణం ఎంతో అవసరం.

 అయితే, కొన్ని సందర్భాలలో రజో  గుణం కూడా అవసరమే. 

ఉదా..రాజ్యంపైకి దండెత్తి వచ్చిన శత్రువులను ఎదుర్కోవాలంటే..రాజు  సాత్వికంగా ఉండి , నేను యుద్ధం చేయను.. అని చేతులు ముడుచుకుని కూర్చుంటే సరిపోదు. శత్రువులతో యుద్ధం చేసి రాజ్యాన్ని కాపాడుకోవటం ఎంతో ముఖ్యం.

 యుద్ధంలో ఇతరులను చంపటం ఉంటుంది. ఎవరినైనా చంపాలంటే గుండె కొంచెం కఠినంగా తయారుకావాలి.

పూర్వకాలంలో రాజులు వేటకు వెళ్ళి జంతువులను సంహరించటం, వాటి మాంసాలను భుజించటం జరిగేది. 

ఇంకొక విషయం ఏమిటంటే, దేశంపైకి దండెత్తి వచ్చిన శత్రువులను తరిమికొట్టే సందర్భాలలో రాజు మరియు సైనికులు ...శత్రువులను తరుముతూ దూరప్రాంతాలకు వెళ్ళే సందర్భాలూ ఉండేవి. 

ఇలాంటప్పుడు రాజు మరియు  సైనికుల ఆహారం కోసం... శాకాహారం మాత్రమే కాకుండా ఆ ప్రాంతాలలో దొరికే జంతువులను కూడా వధించి ఆహారంగా తీసుకోవటమూ కొన్నిసార్లు  తప్పనిసరి అయ్యే అవకాశాలున్నాయి. 

ఇలాంటి ఎన్నో కారణాల వల్ల మాంసాహారం కూడా తీసుకోవటం జరిగిఉండవచ్చు.
.......................

కొందరు విదేశీయులను గమనిస్తే వారు తీసుకునే ఆహారంలో ఉప్పు,కారం, మసాళాలు లేని  మాంసాహారం కొంచెం ఉంటే...  ఎక్కువ భాగం శాకాహారం ( సగం ఉడికిన లేక పచ్చి శాకాహారం) ఉండటాన్ని గమనించవచ్చు.


 మరికొన్ని విదేశాల వాళ్ళు మాంసాహారాన్ని ఉప్పు,కారం, మసాళాలు దట్టించి వండుతారు.

మాంసాహారంలో ఉప్పు,కారం, మసాలాలు దట్టించి తినటం వల్ల రజో , తమో గుణాలు మరింత పెరిగే అవకాశం ఉంది. 

అయితే , ఆహారంలో ఎక్కువ కారం, ఉప్పు, నిలువ ఉంచిన పచ్చళ్ళ వంటి ఆహారాల వల్ల కూడా  రజో , తమో గుణాలు ఎక్కువవుతాయంటారు. 

సాత్విక ప్రవృత్తి కావాలనుకునే వాళ్ళు ఎక్కువగా ఉప్పు, కారాలను, నిలువ ఉన్న పదార్ధాలను తీసుకోవటాన్ని తగ్గించుకోవాలి లేక వాటిని తీసుకోవటం మానివేయాలి.

 ఇక , మద్యం వంటివాటివల్ల కూడా తామస గుణం బాగా వృద్ధి చెందుతుందంటారు. 
....................

అన్ని జీవులకు వాటి ప్రాణం వాటికి తీపి. మనల్ని ఎవరైనా చిన్న దెబ్బ కొడితేనే నొప్పికి ఓర్చుకోలేక గిలగిలలాడతాము. అలాంటిది ఒక జీవి యొక్క ప్రాణం తీసి ఆహారంగా తీసుకోవటం బాధాకరమే కదా!


ఏమైనా జీవహింస పాపమే. మానవశరీరం మాంసాహారానికి తగినట్లుగా లేదని వైద్యులే స్పష్టంగా తెలియజేస్తుంటే మేము మాంసాహారమే తింటాం..అంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు ? ఎవరి ఆరోగ్యం వారి చేతుల్లోనే ఉంది. ఎవరి కర్మకు వారే కర్తలు.



ఈ లింక్ చదవగలరు.

what are the harmful effects of non veg(food) in nowadays



13 comments:

  1. మాంసాహారం గురించిన మీ పాత పోస్ట్ కూడా ఇప్పుడే చూసాను. మాంసాహారం అనారోగ్యం అని వివిధ స్టడీస్ చూపించారు. నిజానికి ఈ స్టడీస్ అన్నీ రెడ్ మీట్ (బీఫ్, పోర్క్ మొ.) గురించి, భారతీయులు తినే పౌల్ట్రీ ఫుడ్స్ గురించి కాదు. పౌల్ట్రీ ఫుడ్‍ని అసలు మాంసం కింద లెక్క వేయరు విదేశాల్లో, వాళ్ళ స్టడీస్‍లోను. విదేశాల్లో ఈ రెడ్ మీట్‍ని రోజువారీ తింటారు, భారతీయ మాంసాహారులు వైట్ మీట్ అదీ వారానికి ఒకసారో రెండుసార్లో తింటారు. దీంట్లో ఏ అనారోగ్యమూ లేదు, మంచి ప్రొటీన్, పైగా చేపలులాంటివి గుండె జబ్బులున్నవారికి మంచి ఆహారం.

    ఇకపోతే గుణాల గురించి. మీరే చెప్పినట్టు ఆ కాలపు రాజులకే కాదు, ఈ కాలంలోనూ, ఆ మాటకొస్తే ఏ కాలంలోనైనా దైనందిన జీవిత కార్యాలకి, భౌతిక విజయాలు సాధించటానికి రజోగుణం తప్పనిసరి. భౌతికమైన/లౌకికమైన వాటి పట్ల రోసి పారలౌకిక లక్ష్యాలు కలిగినవారు మాత్రమే పూర్తి సాత్విక లక్షణాలతో బండి లాగగలరు. వీరు ప్రపంచంలో అతికొద్దిమంది. లౌకికమైన లక్ష్యాలుగల మిగతావారికి ఎంతోకొంత రజోగుణ లక్షణాలు తప్పనిసరి. స్వామీ వివేకానంద కూడ అదే అన్నారు. పారమార్థిక చింతనలో పైకి వెళ్ళేకొద్ది సాత్వికం కానిదేదైనా దాన్ని మనమే విడిచిపెట్టేస్తాం. అలా కాకుండా మనసులో రజగుణ సంబంధ ఆలోచనలు, లక్ష్యాలు కలిగి, పైకి సాత్విక ఆహారాలు తింటం వల్ల ఉపయోగమేముంది అన్నారు.

    ఇకపోతే చివరగా ఒక అనుమానం, మీకు తెలిస్తే వివరించగలరు. మాంసాహారం సాత్వికమైన లక్షణాలను దూరంచేసిది ఐతే, ఈ లక్షణాలు అథ్యాత్మిక మార్గానికి అవరోధాలైతే, మన వేద ఋషులు ఏకంగా రెడ్ మీట్ రెగ్యులర్‍గా తిన్న రోజుల్లో అంతటి జ్ఞానాన్ని, ఆథ్యాత్మిక ఔన్నత్యాన్ని ఎలా సాధించారు? వారికి అడ్డుకానిది మనకి ఎలా అడ్డు అవుతుంది?

    ReplyDelete
  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    నిజమే భారతీయ మాంసాహారులు వైట్ మీట్ అదీ వారానికి ఒకసారో రెండుసార్లో తింటారు.( అయితే, ఆధునిక కాలంలో ఎక్కువగా తింటున్నారు.)

    ఈ మాంసం వల్ల అనారోగ్యం రాదని మీరంటున్నారు.అయితే ఈ రోజుల్లో పౌల్ట్రీలలో పెంచే వాటికి హార్మోన్ల వంటివి ఇస్తున్నారని, అలాంటి వాటిని ఆహారంగా తీసుకోవటం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందనీ పరిశోధకులు అంటున్నారు కదా!
    ..............

    ప్రాచీన కాలంలో ఆహారం గురించి రకరకాల అభిప్రాయాలున్నాయి. ప్రాచీన రుషులకు మాంసాహారం నిషిద్ధమని కొందరంటారు. అప్పుడప్పుడు తీసుకునేవారని కొందరంటారు. ఏది నిజమో మనకు సరిగ్గా తెలియదు.ఈ విషయాల గురించి నెట్లో ఎన్నో వాదోపవాదాలున్నాయి.

    అయితే ప్రాచీనకాలం వాళ్ళలో కూడా కొందరు..ఎంతో జ్ఞానాన్ని, ఆథ్యాత్మిక ఔన్నత్యాన్ని సాధించి కూడా ...రజో, తమో గుణాలను పూర్తిగా కట్టడి చేయటం విషయంలో ఎన్నో ఇబ్బందులు అనుభవించారు. ఎన్నో కష్టాలనూ అనుభవించారు. పురాణేతిహాసాలలో ఇందుకు ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. మనస్సును కట్టడి చేయటం ఎంతో కష్టం కదా!
    .......

    దేశం విదేశీపాలనతో కష్టాలు పడుతున్నప్పుడో, యుద్ధసమయాల్లోనో కొందరు సామాన్య ప్రజలు కూడా పోరాటం చేయవలసి వచ్చినప్పుడు రజోగుణం పెరగటం అవసరం అనుకోవటాన్ని కొంతవరకూ సమర్ధించవచ్చు. ఇలాంటప్పుడు మాంసాహారం వల్ల వచ్చే అనారోగ్యం కంటే , దేశాన్ని ఆక్రమించుకున్న వారి వల్ల పడుతున్న కష్టాలు ఎక్కువ కాబట్టి పోరాటం చేయటానికి రజోగుణం పెరగటం కోసం మాంసాహారం తీసుకోవటాన్ని సమర్ధించుకోవచ్చు.

    అయితే అవసరం లేకపోయినా ప్రతివిషయానికి రజోగుణం పెంపొందాలి అనుకోవటం అవకాశవాదం అనిపించుకుంటుంది.
    ............

    ప్రాచీన అయినా, ఆధునిక కాలం అయినా అన్ని జీవులకు వాటి ప్రాణం వాటికి తీపి. మనల్ని ఎవరైనా చిన్న దెబ్బ కొడితేనే నొప్పికి ఓర్చుకోలేక గిలగిలలాడతాము. అలాంటిది ఒక జీవి యొక్క ప్రాణం తీసి ఆహారంగా తీసుకోవటం బాధాకరమే కదా!

    మానవశరీరం మాంసాహారానికి తగినట్లుగా లేదు, ఈ రోజుల్లో పెంచుతున్న పశువులకు ఇస్తున్న హార్న్మోన్లు, కొన్ని మందులు వంటివాటివల్ల కూడా ఆ మాంసాహారాన్ని తిన్న వాళ్ళకు ఎన్నో రోగాలు వచ్చే అవకాశముందని పరిశోధకులు స్పష్టంగా తెలియజేస్తుంటే మేము మాంసాహారమే తింటాం..అంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు ?

    ఆరోగ్యంగా ఉంటేనే కదా ఏ పనైనా చేయగలిగేది. ఎవరి ఆరోగ్యం వారి చేతుల్లోనే ఉంది. ఎవరి కర్మకు వారే కర్తలు.

    ఈ లింక్ చదవగలరు.

    WHAT ARE THE HARMFUL EFFECTS OF NON VEG(FOOD) IN NOWADAYS

    ReplyDelete
    Replies
    1. పౌల్ట్రీలో కల్తీ గురించి చెప్పారు. నిజమే, కానీ ఈ రోజుల్లో కూరగాయలు, పళ్ళతో సహా అన్నీ కల్తీనే. ప్రశ్న కల్తీ గురించి కాదు, కల్తీలేనిదైతే పర్లేదా అన్నది. అసలు మాంసాహారమే మానవశరీరానికి పడదని మీ వాదన. దానికి మాత్రమే నా వాఖ్య. పరిశోధనలు హెచ్చరిస్తోంది కూడా చాలా వరకు కల్తీ గురించే కానీ మీరు చెప్తున్నట్టు కాదు. భూతదయ ఉండాలి అనే విషయం ఒక్కటే మాంసాహారం మానటానికి సరైన కారణమనిపిస్తుంది తప్ప, ఈ ఆనారోగ్యాలు, మానవశరీర నిర్మాణం, పళ్ళ నిర్మాణం మాంసాహారానికి తగినది కావన్నది సైంటిఫిగ్గా సరైన ఋజువుల్లేని విషయాలు. ఈ వాదనల్ని సమర్థించే పరిశోధనలు ఎన్నున్నాయో, వాటిని పూర్వపక్షం చేసినవి ఇంకా ఎక్కువే ఉన్నాయి.

      ప్రాచీన కాలంలో ఋషుల ఆహారం పట్ల భిన్నాభిప్రాయాలున్నాయి అన్నారు. ఋషులు మాంసాహారం తిన్లేదని, ఎవరో ఒకరు దబాయిస్తూనే ఉంటారు నెట్లో. ఏవైపు నిజమో తెల్సుకోలేకపోవటానికి అదేం మనకి అంతుపట్టని పరిశోధన కాదుగదండి. వేదాలు, పురాణాలు, స్మృతుల్లో విషయాలు, శ్లోకాలు మారిపోవు కదా. చదివి చూస్తే స్పష్టంగానే కనిపిస్తున్నాయి. వాటి పై సాధికారత కలిగిన పండితులు వేదకాలంలో అది నిజమే అని ఒప్పుకుంటూనే ఉన్నారు. ఋషులు శాఖాహారులని వాదించే వారు సాక్ష్యాలు చూపుతున్నట్టులేదు, ఒట్టి వాదన తప్ప. మీకు తారసపడితే షేర్ చేయగలరు.

      ఎంతో జ్ఞానాన్ని అథ్యాత్మిక ఔన్నత్యాన్ని పొంది కూడా రజో తమో గుణాల్ని అదుపు చేయలేకపోయిన వారి గురించి చెప్పారు. అసలు రజో తమో గుణాల్ని అదుపులో లేనివారికి అంత జ్ఞానము, ఆథ్యాత్మిక ఔన్నత్యము ఎలా కలిగాయనేదే నా ప్రశ్న. ఎలాంటి వారు ఆపరేట్ చేసిన మిషన్ నడిచినట్టు, ఎలాంటి వారు ప్రయోగం చేసిన ఒకే ఫలితం ఇచ్చే సైంటిఫిక్ ప్రయోగంలా, ఈ ఆథ్యాత్మిక మార్గం కూడా తిండికి సంబంధం లేనిదేమో అని అనుమానం.

      రజోగుణం యుద్దాలు చేయటానికి మాత్రమే కాదు, మామూలుగా పాలించటానికి, జీవితంలో పైకి ఎదగాలనే తాపత్రయానికి, పోటీ తత్వంలో ఉండటానికి, లౌకికమైన ప్రతి విజయానికి అవసరమే. ఈ రోజుల్లో వీటి కోసమే అందరి తాపత్రయము. ఎవరో కొందరికి ఇహం మీదకన్నా పరం మీద ధ్యాస ఎక్కువని అందరూ వారిలాగే ఉండాలని వాదించలేం కదా. ఎవరు ఏం సాధించాలనుకుంటారో దానికి తగ్గ లక్షణాలు పెంపొందించుకుంటారు, దానికి తగ్గ తిండి తింటారు. ఇందులో మీరు నిందించినట్టు అవకాశవాదమేం లేదు.

      Delete
    2. టపాలో ఇచ్చిన లింక్లో మీరు అడిగిన అనేక విషయాల గురించి ఎన్నో వివరాలున్నాయి. ఆ విషయాలను క్రింద ఇస్తున్నాను.

      మాంసాహారం తినటం వల్ల అనేక జబ్బులు వచ్చే అవకాశం ఉందని వారు వ్రాశాను.

      WHAT ARE THE HARMFUL EFFECTS OF NON VEG(FOOD) IN NOWADAYS

      ( ఈ లింక్ చూడదలచిన వారు పైన టపాలో ఇచ్చిన లింక్ ద్వారా చూడవచ్చు. లేక ఇక్కడి అడ్రస్ కాపీ చేసుకుని.. పేస్ట్ చేసి.. క్లిక్ చేసినా ఆ లింక్ చూడవచ్చు.)
      .............

      ఈ రోజుల్లో అన్నీ కల్తీనే అయినా, మాంసాహారం వల్ల కల్తీతో పాటూ బర్డ్ ఫ్లూ, మాడ్ కౌ వంటి వ్యాధులు కూడా వచ్చే ప్రమాదముందని పరిశోధకులు తెలియజేస్తున్నారు.

      ఇంకా, శాకాహారులకన్నా మాంసాహారులకు కాన్సర్, కిడ్నీ జబ్బులు, లివర్ జబ్బులు..ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయంటున్నారు.
      .............

      ఈ ఆనారోగ్యాలు, మానవశరీర నిర్మాణం, పళ్ళ నిర్మాణం మాంసాహారానికి తగినది కావన్నది నేను చెప్పిన విషయాలు కావండి. పరిశోధకులు తెలియజేసినవే.

      WHAT ARE THE HARMFUL EFFECTS OF NON VEG(FOOD) IN NOWADAYS ..

      Delete
    3. ప్రాచీన కాలంలో ఋషుల ఆహారం విషయంలో నా అభిప్రాయం ఇంతకుముందే వ్యాఖ్యలో వ్రాసానండి. ఆ కాలంలో వాళ్ళు ఏం తిన్నారో మనకు అంతగా తెలియదు.

      అయితే, ఎంతో జ్ఞానాన్ని అథ్యాత్మిక ఔన్నత్యాన్ని పొంది కూడా రజో, తమో గుణాల్ని అదుపు చేయలేకపోవటంలో ఆశ్చర్యం ఏమీ లేదు.మనస్సును అదుపులో పెట్టుకోవటం అత్యంత కష్టతరం అని అందరికీ తెలుసు. మనస్సును పూర్తిగా అదుపులో ఉంచుకోవటం కొరకు యుగయుగాల నుంచీ ఎందరో ప్రయత్నిస్తున్నారు.

      మనస్సును అదుపులో ఉంచుకోవటానికి యోగా, సాత్విక ఆహారం.. వంటి ఎన్నో విధానాలను పెద్దలు తెలియజేసారు. ఈ క్రమంలో తమ మనస్సును కొంతవరకూ నిగ్రహించుకోగలిగిన వారు కూడా ఎంతో జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని పొందగలరు.

      అయినా పూర్తిగా మనస్సును కంట్రోల్ చేయగలిగే స్థాయిని పొందేవరకూ రజో, తమో గుణాలను అదుపులో ఉంచుకోవటంలో కొన్నిసార్లు విఫలమయ్యే అవకాశాలున్నాయి. అయితే నిరంతర పట్టుదలతో ఎప్పటికైనా విజయాన్ని సాధించటం అవసరం.

      ఆహారానికి ప్రవర్తనకు సంబంధం ఉంటుందని పూర్వీకులు తెలియజేసారు. ఇక ప్రాచీనులు మాంసాహారాన్ని తీసుకున్నారా ? లేదా ? అనే విషయంలో ఎన్నో వాదోపవాదాలు ఉన్నాయి.

      ప్రాచీన గ్రంధాలలోని కొన్ని విషయాలలో కాలక్రమేణా కొన్ని మార్పులుచేర్పులు జరిగిఉండవచ్చని కొందరు అంటారు. కొన్ని ప్రక్షిప్తాలు జేరాయని కూడా అంటారు. ఈ విషయాలలో ఏది ప్రక్షిప్తమో ? ఏది కాదో ?

      నా అభిప్రాయం ఏమిటంటే, కొందరు కొన్నిసార్లు మాంసాహారం తీసుకుని ఉండవచ్చు. కొందరు పండితులు మాంసాహారాన్ని తీసుకున్నారు కాబట్టి, సనాతనధర్మం మాంసాహారాన్ని సమర్ధించిందని అనుకోలేము.

      సనాతనధర్మం తెలియజేసిన విషయాలను సరిగ్గా పట్టించుకోకుండా తమ ఇష్టానికి అనుగుణంగా అర్ధాలు చెప్పిన పండితులు ఎందరో ఉన్నారు.

      ఉదా.. శివకేశవులకు భేదం లేదని, అలా భేదం చూపటం తప్పు..అని సనాతనధర్మం తెలియజేస్తే, ఆ విషయాన్ని పట్టించుకోకుండా శివకేశవ భేదాలతో సమాజాన్ని అల్లకల్లోలం చేసిన పండితులు ఎందరో ఉన్నారు.

      అలాగే.. కొందరు పండితులు మాంసాహారాన్ని భుజించినంతమాత్రాన సనాతనధర్మం మాంసాహారాన్ని సమర్ధించిందని అనుకోనవసరం లేదు.

      సనాతనధర్మం మాంసాహారాన్ని సమర్ధించలేదు ..అనే సాక్ష్యాలు ఉన్నాయి. ఆసక్తి ఉంటే క్రింద లింకుల వద్ద చూడగలరు. మీరు అడిగారు కాబట్టి.. ఈ విషయాలను క్రింద ఇస్తున్నాను.

      There is no Beef in Vedas

      Why does Hindu Dharma prohibit consumption of non-vegetarian food?
      .................

      There is no Beef in Vedas

      అనే లింక్ ద్వారా చూస్తే.. పొస్ట్ లో క్రిందభాగాన .. శ్లోకాలు ఉన్నాయి.

      Delete
    4. మాంసాహారం వల్ల రజోగుణం పెరుగుతుందనేది నిజమే అయినా, రాజులు, సైనికులు వంటివారు రజోగుణం పెరగటానికి మాంసాహారం తింటారని చెప్పాలన్నది నా అభిప్రాయం కాదు.

      ఎక్కువగా ఉప్పు, కారాలు, నిలువపదార్ధాలు, మద్యం వంటివి తీసుకున్నా రజోగుణం పెరుగుతుంది.

      అయితే, ప్రాచీన కాలపు రాజులు, సైనికులు .. అడవులలో వేటాడం మరియు మాంసాహారాన్ని తీసుకోవటానికి గల కారణాలలో ...

      శత్రువులను చంపటానికి అవసరమయ్యే కఠినమైన మనస్సు కొరకు, యుద్ధసమయంలో ఆహారం సరిగ్గా దొరకని సందర్భాలలో అడవులలో దొరికే జంతువులను చంపి తినటం తప్పనిసరి అవుతుంది కాబట్టి.. వారు అలా మాంసాహారాన్ని అలవాటుచేసుకుని ఉండవచ్చన్నది నా అభిప్రాయం.

      Delete

    5. వరిధాన్యం, గోధుమ, సోయాబీన్స్, క్వినిన్, వేరుశనగ, ఇంకా డ్రైఫ్రూట్స్..వంటి వాటిలో అన్ని రకాల పోషకవిలువలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు.

      ఎన్నో రకాల జబ్బులు వచ్చే మాంసాహారం కన్నా శాకాహారం తీసుకోవటం మంచిది.

      ఈ రోజుల్లో మాంసాహారం ఏంతో ఖరీదు ఉంటోంది. దానికన్నా బాదంపప్పు, సోయాగింజలు, పప్పుధాన్యాలు వంటివి ఎక్కువ రోజులు తినవచ్చు.

      మాంసాహారాన్ని పూర్తిగా వదలలేనివారు తినటాన్ని తగ్గించుకోవచ్చు.

      ఫాస్ట్ ఫుడ్ సంస్కృతి బాగా పెరిగిన ఈ రోజుల్లో శాకాహారులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫాస్ట్ ఫుడ్లో అజనిమోటో..వంటివి వాడుతున్నారు. ఈ పదార్ధాలను కొంత మోతాదు మించి తీసుకుంటే ఎన్నో జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు.


      Delete
    6. నేను ఒకపక్క లౌకిక విషయాలకి, విజయాలకి కూడా రజోగుణం అవసరమేనంటుంటే, మీరు రాజులు, సైనికులు, యుద్దాల్ని వదిలిపెట్టడం లేదు.

      ప్రపంచవ్యాప్తంగా అందరి పూర్వికులూ వేల ఏళ్ళుగా మాంసాహారం తిని లక్షణంగా ఆరోగ్యంగా బలంగా బ్రతికారు. ఇప్పటి మారిపోయిన లైఫ్ స్టైల్ సమస్యలు, కల్తీ సమస్యలు చూపించి, మనకి అసలు వర్తించని విదేశాల సర్వేలు ప్రతిసారి కోట్ చేస్తూ మనిషి శరీరానికి మాంసాహారం పడదంటున్నారు. సోయా ప్రొటీన్ ఎక్కువ తీస్కుంటే మగవాళ్ళ సంతానొత్పత్తి సామర్థ్యం తగ్గుతుందని చెప్పిన పరిశోధనలు ఉన్నాయి. ఈరోజు లైఫ్ స్టైల్‍కి ఏం తిన్నా ఏదో ఒక సమస్యే. మన పూర్వీకులు ఇవే తిని బానే బ్రతికారు మరి. సమస్య తిండిది కాదు, అది మన శరీరానికి పడకపోవటమూ కాదు, ఆధునిక జీవనవిధానానిది.

      మనం గోవుల్ని ఎప్పట్నించో పూజించేస్తున్నామని నమ్మించే ప్రయత్నాలు చాలామంది చేసారు, నేను చదివాను. గో అంటే ఒకచోట గోవులని, ఒకచోట బ్రాహ్మణులని, మరోచోట సూర్యకిరణాలని సెలెక్టివ్‍గా కోట్ చేస్తూ రకరకాల ఫీట్లు చేస్తున్నారు. ఆపాటి సంస్కృత పాండిత్యం వివేకానందుడికి, త్రిమతాచార్యులకి లేదని అనుకోవాలేమో మరి. వాళ్ళు నిర్మొహమాటంగా ఒప్పుకున్నారు. ఆ పోస్టుల్లో కోట్ చేసిన గ్రంథాలలోనే స్పష్టంగా మాంసాహార భక్షణకి సంబంధించిన శ్లోకాలు కోట్ చేయటం మొదలుపెట్టినా, ఊరికే వాదన పొడిగించుకోటం తప్ప కొత్త విషయాలు తెల్సుకుంటామనుకోను.

      ఏదేమైనా చేసిన వాఖ్యలకి చాలా ఓపికగా సమాధానాలిచ్చారు, నెనెర్లు.

      Delete
    7. మాంసాహారులు ఎప్పటినుంచో ఆరోగ్యంగా జీవిస్తున్నారని మీరు అంటున్నారు. భారతదేశంలో శాకాహారులు కూడా ఎప్పటినుంచో ఆరోగ్యంగానే జీవిస్తున్నారు కదండి. శాకాహారులకు తెలివితేటలు బాగుంటాయని నా అభిప్రాయం.

      మాంసాహారం తినటం విషయంలో విదేశీ సర్వే..స్వదేశీ సర్వే అనే తేడా ఏముంటుంది. స్వదేశీ వైద్యులు కూడా మాంసాహారం అనారోగ్యకరమనే చెబుతున్నారు.

      రజోగుణం పెరగాలంటే మాంసాహారమే అక్కరలేదు. ఎక్కువ ఉప్పుకారాలు, నిలువ ఉన్న పదార్ధాలు ..తింటే చాలని నేనూ రాసాను .మీరు ఈ విషయాన్ని పట్టించుకోవటం లేదు.

      సోయా అధికంగా తీసుకోకూడన్నది నిజమే.( సోయా కొద్దిగా తింటే చాలు ఎక్కువ పోషకాలు శరీరానికి అందుతాయి.)

      ప్రాచీనకాలంలో మాంసాహారం లేదని నేను అనలేదు. కొందరు తిని ఉండవచ్చనే రాసాను.( అలా తిన్నవాళ్ళకు ఎటువంటి జబ్బులు రాలేదని ఎందుకు అనుకోవాలి?)

      కొంతమంది తిన్నంతమాత్రాన ..ఇతర ప్రాణులను చంపి తినే మాంసాహారం ధర్మబద్ధం అయిపోతుందని నాకు అనిపించటం లేదు.

      మాంసాహారం లేకపోయినా మనుషులు చక్కగా జీవించగలరు. ఇతర ప్రాణులను చంపి తినటం ధర్మమయితే ..జీవహింస తప్పు అని చెప్పుకోవటం ఎందుకు ?

      సహజంగా చనిపోయిన ప్రాణులను తినటం ఫరవాలేదు కానీ, బ్రతికి ఉన్న ప్రాణులను చంపి తినటం ఏ విధంగా ధర్మమో నాకు తెలియటం లేదు.

      శాకాహారులకైనా మాంసాహారులకైనా జబ్బులు రావటానికి అనేక కారణాలుంటాయి. అయితే శాకాహారులకన్నా మాంసాహారులకు జబ్బులు రావటం ఎక్కువని పరిశోధకులు చెబుతున్నారు.ఇక ఎవరిష్టం వాళ్ళది.
      ...........

      మీకు కూడా నెనెర్లు.

      Delete
    8. ఇవన్నీ ఆలోచిస్తుంటే మనం దోమలను, చీమలను కూడా చంపుతాము కదా ! అనిపించింది.
      అయితే, దోమల వల్ల మనకు అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది కాబట్టి చంపుతాము. చీమలు మన ఆహారపదార్ధాలను పాడుచేస్తాయి కాబట్టి వాటిని చంపటానికి ప్రయత్నిస్తాము.

      ఈ రోజుల్లో రసాయనాలతో చేసిన మందులతో దోమలను చంపుతున్నాము.

      రసాయనాలతో చంపటం కాకుండా .....సహజపద్ధతులతో వాటిని తరిమికొట్టే పద్ధతులు ఏమైనా ప్రాచీనకాలంలో ఉన్నాయా ..అనిపించి నెట్లో చూస్తే ..

      కీటకాలను చంపకుండా పారద్రోలటానికి ఎన్నో మొక్కలు సహాయపడతాయని వివరాలు ఉన్నాయి.
      ఉదా..తులసి , బంతి, వంటి మొక్కలు ఎక్కువగా పెంచితే కీటకాలు దూరంగా ఉంటాయట.

      బంతి( Marigold) మొక్కల వల్ల కొన్ని కీటకాలు దూరంగా ఉంటాయట.

      Citronella మొక్కలు పెంచుకుంటే దోమలు, చీమలు వంటివి దూరంగా ఉంటాయట.

      వైల్డ్ గార్లిక్ మొక్క వల్ల పాములు దూరంగా ఉంటాయట.

      కాట్నిప్ (catnip) అనే మొక్క వల్ల చెదలు దూరంగా ఉంటాయట.

      ఈ రోజుల్లో విచ్చలవిడిగా వాడుతున్న పురుగుమందులు మరియు వాతావరణకాలుష్యం వల్ల మొక్కలు తమ సహజశక్తిని కోల్పోకుండా ఉండాలంటే పురుగుమందుల వాడకాన్ని మాని సేంద్రియవ్యవసాయ పద్ధతిని పాటించాలి.
      ..............

      దోమలను, చీమలను చంపటానికి వాడే రసాయనాల వల్ల మనుషులకు కూడా ప్రమాదమే.

      మానవులు సాధ్యమైనంతవరకూ సాటిజీవుల ప్రాణాలను తీయటం మానుకోవాలి.

      ఇతరజీవులను చంపటం కాకుండా సహజపద్ధతిలో వాటిని దూరంగా ఉంచటానికి ప్రయత్నించాలి.

      Delete
  3. కూడలి తాత్కాలికంగానైనా మూతబడటం చాలా బాధను కలిగిస్తోంది. నేను బ్లాగ్ వ్రాయటం మొదలుపెట్టినప్పటి కొత్తలో కూడలి ద్వారానే అందరికీ మొదట పరిచయమయింది.

    నా బ్లాగ్ వల్ల అగ్రిగేటర్లకు ఏమైనా ఇబ్బందులు వస్తున్నాయేమోనని కొంతకాలం క్రిందట నాకు సందేహం కలిగింది.

    అంటే.. బ్లాగ్లో కొత్త టపా పోస్ట్ చేసిన తరువాత నాకు కొత్త ఆలోచనలు రావటం, అందువల్ల టపాలో మార్పులు, చేర్పులు చేయటం నాకు అలవాటు.

    ఇందువల్ల నేను వేసే టపాను పదేపదే పోస్ట్ చేయటం అనే ఇబ్బంది వల్ల అగ్రిగేటర్లకు ఏమైనా ఇబ్బంది ఉంటుందేమో? అనే సందేహం వచ్చి టపాలలో మార్పులు,చేర్పులను చేయటం కొంతవరకూ తగ్గించాను.

    అయితే,నాకు కంప్యూటర్స్ వాడకం గురించి తెలిసింది చాలా తక్కువ. ఇలాంటి విషయాల్లో ఏం చేయాలో నాకు తెలియదు.

    అగ్రిగేటర్లు ఎన్నో ఇబ్బందుల మధ్య కూడా తెలుగు బ్లాగులను ముందుకు తీసుకువెళ్తున్నారని కష్టేఫలే వారి బ్లాగులో చదివాను.

    తెలుగు బ్లాగులను ప్రోత్సహిస్తున్న అగ్రిగేటర్లు అందరికి నా కృతజ్ఞతలు.

    నా బ్లాగులోని రాతల వల్లగానీ లేక నా బ్లాగ్ వల్లగానీ అగ్రిగేటర్లకు ఏమైనా ఇబ్బంది ఉంటే నా బ్లాగును అగ్రిగేటర్ నుంచి తొలగించవలసిందిగా కోరుకుంటున్నాను.

    కూడలి తిరిగి ప్రారంభమవ్వాలని మనసారా కోరుకుంటున్నాను.

    ఇంతకుముందు మూసివేసిన అగ్రిగేటర్లు మరియు బ్లాగులు కూడా తిరిగి ప్రారంభమవ్వాలని కూడా మనసారా కోరుకుంటున్నాను.

    ReplyDelete
  4. edhi emaina mee idhari discussion valla naku chala vishaylu telisayi.. Thanks to Chaitanya and Author

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      Delete