koodali

Wednesday, October 29, 2014

రాజధాని........


ఉమ్మడిరాష్ట్రంలో  ఉన్నప్పుడు  హైదరాబాద్లో  మాత్రమే  ఎక్కువగా   ఉపాధి  అవకాశాలు  ఉండేలా  జరిగింది  కాబట్టి ,  మా  హైదరాబాద్  ..మా   రాజధాని  హైదరాబాద్...అంటూ   ఎక్కువమంది  యువత  ఉపాధి  కోసం   హైదరాబాద్ కే  వెళ్ళేవారు. 
.................................. 

ఇక  ఇప్పటి  ఆంధ్రప్రదేశ్ కు  రాజధానిని  అభివృద్ధి  చేసుకునే  విషయంలో   ఇంతకుముందు  జరిగిన  పొరపాటును  మళ్ళీ  జరగకుండా  జాగ్రత్త  తీసుకోవాలి.


అభివృద్ధి  రాష్ట్రమంతటా  జరగాలి.  ఉపాధి  కోసం  రాజధానిపై  ఎక్కువగా  ఆధారపడే  అవసరం  లేకుండా  ఎక్కడికక్కడ  ఉపాధి  అవకాశాలు  ఉండేలా  అభివృద్ధి  జరగాలి.


ఆంధ్రప్రదేశ్లో  కోస్తా,  ఉత్తరాంధ్రా,  రాయలసీమ  అంటూ  తేడాలు  ఉన్నాయి. 


 ఇలాంటి  తేడాలున్నప్పుడు ,  వేలకోట్లు  ఖర్చుపెట్టి  రాజధానిని  అద్భుతంగా  అభివృద్ధి  చేసుకోవటం  కన్నా....  తక్కువ  ఖర్చుతో  రాజధానిని  అభివృద్ధి  చేసుకుని ... మిగతా  డబ్బులతో  రాష్ట్రంలోని  అన్ని  ప్రాంతాలను  బాగా  అభివృద్ధి  చేసుకుంటే  బాగుంటుంది.


రాయలసీమ,  ఉత్తరాంధ్ర,  కోస్తా ..మూడు  ప్రాంతాలలోనూ  అభివృద్ధి  చక్కగా  జరగాలి .


   రాజధాని  అభివృద్ధి  కన్నా ,  మొత్తం  రాష్ట్రాభివృద్ధి  జరిగితే  ప్రాంతాల  మధ్య  వైషమ్యాలు  ఉండవు.

.......................... 

రాష్ట్రంలో  అభివృద్ధికి  అపారమైన  అవకాశాలున్నాయి.. .
ఇంతకుముందు  ఇవన్నీ   నిరాదరణకు  గురయ్యాయి.  అభివృద్ధి  చేయబడలేదు.

 వేసవిలో  చల్లదనం  కోసం  ఊటీ  వెళ్తారు  కొందరు. అయితే  ఆంధ్రప్రదేశ్లో  కూడా  అరకు,  తలకోన  వంటి  చక్కటి  ప్రదేశాలున్నాయి.  వీటిని  అభివృద్ధి  చేసుకోవాలి .


ఆంధ్రప్రదేశ్లో  ఎంతో  తీరప్రాంతం  ఉంది.  నదీ  తీరాలున్నాయి.  కాలువలూ  ఉన్నాయి....రాష్ట్రంలో  ఎన్నో  బీచ్ లు  ఉన్నాయి.  పర్యాటక  రంగానికి  అద్భుతమైన  అవకాశాలున్నాయి.


కోస్తా  ప్రాంతంలో  ఎన్నో  కాలువలున్నాయి. ఆ  కాలువలకు  చక్కటి   గట్లు,  మెట్లు  కట్టి , ఒడ్దున  కొబ్బరిచెట్లను  పెంచి  బోటింగ్  ఏర్పాటు  చేస్తే ఎంతో  బాగుంటుంది.(కేరళలోలా..) 


  కాలుష్యాన్ని  కలిగించే  పరిశ్రమలను  ఎక్కువగా  నిర్మించి  ఉపాధి  అవకాశాలు  కల్పించటం  కన్నా  సేవారంగం,  పర్యాటకం  వంటివి  అభివృద్ధి  చేస్తే  ఎన్నో  ఉద్యోగ  అవకాశాలు  కల్పించవచ్చు.


ఉపాధి  కోసం  పరిశ్రమలూ   అవసరమే  కానీ,   కాలుష్యం  తక్కువగా   ఉండేలా  జాగ్రత్తలు  తీసుకోవాలి . వ్యవసాధారిత   పరిశ్రమలనూ   ఏర్పాటు  చేయవచ్చు. 


రాష్ట్రమంతటా  అపారమైన  సహజవనరులున్నాయి.  వీటిని  విచ్చలవిడిగా   వాడెయ్యకుండా  తగుమాత్రం  వాడుకుంటూ  చక్కటి  అభివృద్ధిని  సాధించవచ్చు.
...............................  

 రాజధాని  బాగా  పెరిగినా  ప్రమాదమే.  హైదరాబాదును  చూస్తున్నాము  కదా ! అభివృద్ధి  పెరిగే  కొద్దీ  అసాంఘిక  శక్తులూ  పెరుగుతున్నాయి.  కాలుష్యమూ  పెరుగుతోంది. ఇవన్నీ  తలుచుకుంటే  బాబోయ్ ! ఎందుకొచ్చిన  అభివృద్ధి .. అనిపిస్తుంది.


రాజధాని  అంటే  భూముల  రేట్లు  పెరిగి  తమ  ఆస్తి  విలువ  పెరిగిపోతుందని  కొందరు  చంకలు  గుద్దుకుంటున్నారు  కానీ,  భూముల  రేట్లతో  పాటు  ఇళ్ళ  అద్దెలూ  పెరుగుతాయి.  సరుకుల  రేట్లూ  పెరుగుతాయి.


 రాజధానిలో  బాగా డబ్బున్న  వాళ్ళకు  తప్ప..  పేద,  మధ్యతరగతి  ప్రజలకు  జీవనం  కష్టంగా  ఉంటుంది.  దీనిని  అభివృద్ధి  అని ఎలా  అనగలము ? ఇలాంటి  అభివృద్ధి  అవసరమా ? అనిపిస్తుంది.


హైదరాబాద్లో  ఎంతో  కాలుష్యం  పెరిగింది.  వేడీ  పెరిగింది, రేవ్  పార్టీలూ,  డ్రగ్స్  వాడకం   గురించీ  వింటున్నాము.  ఇవన్నీ  గమనిస్తే ,  ఆంధ్ర  కొత్త రాజధాని  ప్రస్తుతానికి  మధ్యరకంగా  ఉంటేనే  మంచిదనిపిస్తుంది. 


ఆడంబరమైన  రాజధాని  కన్నా ఆహ్లాదకరమైన  రాజధానే  ముద్దు. రాజధాని  అభివృద్ధి  మాత్రమే  వద్దు..రాష్ట్రమంతటి  అభివృద్ధే  ముద్దు.


.......................... 

ప్రస్తుత  ఆంధ్రప్రదేశ్   ప్రభుత్వం ...  రాష్ట్రంలో  మొక్కలు  విస్తారంగా  పెంచటానికి  శ్రద్ధ  కనబరచటం  ఎంతో  సంతోషకరమైన విషయం. ఈ మధ్య  వచ్చిన  విశాఖ గాలివాన సమయంలో  ప్రభుత్వం  చక్కటి చర్యలు  తీసుకుంది. 


No comments:

Post a Comment