koodali

Friday, April 11, 2014

దైవం యొక్క చాకచక్యం ఎవరి అంచనాలకూ అందనిది.


 
భగవంతునికి  జీవులంటే  ఎంతో  ప్రేమ.  ఎన్నో  తప్పులను  చేసిన  వారికి   కూడా   మంచిగా  మారటానికి  మళ్ళీమళ్ళీ  అవకాశాలను  కల్పిస్తారు. 


 ఎన్ని  అవకాశాలను  కల్పించినా  పట్టించుకోకుండా  పాపాలను  చేస్తూనే   ఉంటే .... అప్పుడు  లోకహితం  కొరకు,   దైవం    పాపాత్ములను   శిక్షిస్తారు.


  పాపాలు  చేసిన  వారు  కూడా ....  తాము   చేసిన  తప్పులను    తెలుసుకుని  పశ్చాత్తాపపడి  మంచిగా  మారితే   దైవానుగ్రహానికి  పాత్రులే.

................................


ఈ  రోజుల్లో    కొంత మంది  అధర్మపు  సంపాదనతో  పూజలు  చేస్తూ   దైవానుగ్రహాన్ని  పొందాలని  తాపత్రయపడుతున్నారు.  అదే  భక్తి  అని   భ్రమపడుతున్నారు.  



 ఒక  ప్రక్క  పాపాలు  చేస్తూ,  ఇంకో  ప్రక్క   పూజలు  చేసినంత  మాత్రాన   దైవానుగ్రహం  లభిస్తుందని  ఎలా  అనుకుంటున్నారో  ?

...........................................


దైవం  యొక్క  చాకచక్యం    ఎవరి  అంచనాలకూ  అందనిది. 



 పూర్వము  కొందరు  రాక్షసులు  తపస్సు  చేసి  దేవతల  వల్ల   వరాలను  పొందారు.

 తమకు    త్వరగా   మరణం  రాకూడదని   భావించి,   అతితెలివిగా  ?  వరాలను    అడిగారు.  అలా    పొందిన  వరాల  ద్వారా  లభించిన  శక్తితో  లోకాలను  పీడించారు.

అప్పుడు   దైవం,    ఏ  మాత్రం  మొహమాటం  లేకుండా   ఆ  రాక్షసులను    సంహరించారు. 

రాక్షసులు  పొందిన  వరాలకు  భంగం  కలుగకుండానే  చాకచక్యంగా  వారిని  వధించారు.

ఉదా..  .పగలు , రాత్రి  కాకుండా   సంధ్యా  సమయంలో  హిరణ్యకశిపుడి  వధ  జరిగింది .


 ( హిరణ్యకశిపుడు  ..పగలు  కానీ,  రాత్రి  కానీ  తనకు  మరణం  కలుగకూడదని   వరాన్ని  పొందాడు. )


 
............................................


ఈ  రోజుల్లో  కూడా  కొందరు  వ్యక్తులు  హిరణ్యకశిపునిలా   ప్రవర్తిస్తున్నారు. 


 ఎన్నో    పాపాలు  చేసి  సంపాదించిన  సొమ్ముతో  పూజలు  చేస్తూ   వరాలు    పొందాలని  తాపత్రయపడుతున్నారు.

ఎన్ని  పాపాలు  చేసినా  ఫర్లేదు ,   కొన్ని   పుణ్యకార్యాలు  చేస్తే  చాలు ..  చేసిన  పాపాలు  కొట్టుకుపోతాయి  అని    అనుకుంటున్నారు.


 అలాగైతే ,  రావణాసురుడు   కూడా  పూజలు    చేసాడు . కానీ , అతను
చేసిన  పాపాలు  కొట్టుకుపోలేదు . 

  రావణుడు  తాను  చేసిన  తప్పులకు  చివరికి  నాశనం  అయ్యాడు  కదా  !

అతను    పూజలు    చేసాడు ,  క్షమించేద్దాంలే.......  అని  దైవం  అనుకోలేదు.

 అందుకని  ఒక  చేత్తో    పూజలూ  చేస్తూనే,   ఇంకో చేత్తో    పాపాలు  చేయటం ..... అనే  మనుషుల  అతితెలివి  విధానం  మంచిది  కాదు.



అయితే, పాపాలు  చేసిన  వారు  కూడా  తాము   చేసిన  తప్పులను    తెలుసుకుని  పశ్చాత్తాపపడి  మంచిగా  మారి  పూజలు చేయగా చేయగా... ఆ పూజల వల్ల మంచి వారిగా మారి .. దైవకృపను పొందే  అవకాశం కూడా ఉంది.
........................ 

 దైవం  ఎంతో  దయామయుడు.   వ్యక్తులు  కొన్ని   తప్పులు  చేసినా  ఓపికగా  ఉండి,  వ్యక్తులలో  మార్పు  రానప్పుడు,  ఇక  శిక్షను  విధిస్తారు. 


 (  శిక్షను  విధించటం  కూడా  వ్యక్తుల  మంచికోసమే.  వారు  మరిన్ని  పాపాలు  చేయకుండా  ఉండటానికే.  )
...............................


అధర్మంగా   సంపాదించిన   డబ్బు వల్ల   ఎన్నో సౌకర్యాలను  పొందినా కూడా, మనశ్శాంతి   మాత్రం   ఉండదని  గ్రంధాల ద్వారా   తెలుస్తోంది.



మనశ్శాంతి   లేకపోయాక   ఎంత డబ్బు,   ఎన్ని సౌకర్యాలు   ఉంటే   మాత్రం  ఏం లాభం ? ....... అని పాపాలు  చేసేవారు   తెలుసుకుంటే సమాజంలో  మంచి మార్పు  వస్తుంది.

...................................


   తెలిసోతెలియకో   తప్పులు  చేసినా    సరిదిద్దుకుని , ఇక  ముందు  తప్పులు  చేయకుండా  ఉండటానికి  ప్రయత్నించాలి.

  జీవితంలో  సరైన  దారిలో  నడిచే  శక్తిని  ఇవ్వమని   భగవంతుని  ప్రార్ధించాలి.




No comments:

Post a Comment