koodali

Friday, October 21, 2016

కంప్యూటర్ కీ బొర్డ్ మరి కొన్ని విషయములు...


కంప్యూటర్ వల్ల రేడియేషన్ తో ఎన్నో సమస్యలు వస్తాయంటారు.. ..

కంప్యూటర్ ముందు కూర్చుని కళ్లకు ఎక్కువ శ్రమ కలగటం వల్ల కూడా తలనొప్పి, మెడనొప్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయట. 

 చాలామంది విషయంలో కళ్ళకు శ్రమ కలగటంతో పాటు  .. గంటల తరబడి వేళ్ళతో  పనిచేస్తే  ఒత్తిడి వల్ల శ్రమ కలుగుతుంది .. అనిపిస్తోంది.


ఇంకో విషయం ఏమిటంటే,  కీ బొర్డ్ నొక్కే శ్రమ లేకుండా మాటతో వ్రాసే టెక్నాలజీ రాబోతుందంటున్నారు.


ఈ విధానంలో కీ బోర్డ్ తో పని లేకుండా వ్యక్తి చెప్పే విషయం మానిటర్ పై వచ్చేస్తుందట.

 అయితే, వ్యక్తి చెప్పే విషయాన్నిఅన్ని భాషలలోనూ, అన్ని యాసలలోనూ  గ్రహించి తప్పులు లేకుండా వచ్చే విషయంలో మరింత మెరుగ్గా రావటం కోసం శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారట. ఇది  ఎంతో సంతోషకరమైన విషయం. 
 

ఈ విషయంలో మరిన్ని పరిశోధనలు జరిగి ... త్వరలో ఆ సౌకర్యాలు రావాలని ఆశిద్దాము.

 అయితే ఇంట్లోనైనా, ఆఫీసులోనైనా మనం కంప్యూటర్ వద్ద వ్రాసే విషయం ప్రక్కవారికి తెలియటం అన్నివేళలా ఇష్టపడము.
 
ప్రైవసీ కావాలంటే కీ బోర్డ్ అప్పుడప్పుడు అవసరపడుతుందనిపిస్తుంది.
 
మనం కంప్యుటర్ ముందు మాట్లాడే మాటలు ప్రక్కవారికి వినబడని విధంగా ఏమైనా  టెక్నాలజీ ఏర్పాటు చేస్తారా ? లేక మాటలు ప్రక్క వారికి వినబడతాయో ? ఇవన్నీ తెలియదు.

మాట్లాడలేని మూగవారి విషయంలో కూడా కీ బోర్డ్ అవసరం ఉంటుందనిపిస్తుంది.

అయితే ఈ విషయాలలో కూడా శాస్త్రవేత్తలు ఏమైనా పరిశోధనలు చేస్తున్నారేమో తెలియదు.

మాటతో వ్రాసే విధానం వచ్చినా కూడా.... కీబోర్డ్ సౌకర్యాన్ని  తీసివేయకుండా  ఉంటే సౌలభ్యంగా ఉంటుంది. అవసరాన్ని బట్టి వాటిని ఉపయోగించుకోవచ్చు.

ప్రస్తుతానికి మాత్రం  పెన్ను,పెన్సిల్ వంటి సాధనంతో కీబోర్డ్ వాడటం నా విషయంలో సులువుగా ఉంది.

సన్నటి బాల్ పెన్ను కాకుండా వెడల్పాటి పెన్నుతో అయితే మరింత సులువు అనిపిస్తుంది.
***************

అయితే, ఒక ప్రక్క టెక్నాలజీ తో ఎన్నో సౌకర్యాలు ఉన్నాయని  అనుకుంటుంటే టెక్నాలజీతో ఎన్నో సమస్యలు కూడా  ఎదురవుతున్నాయి.

 కంప్యూటర్  హ్యాక్ చేయటం  ద్వారా ఎన్నో ఇబ్బందులు కలగటం గురించి వింటున్నాము.

ముందుముందు ఏం జరుగుతుందో ఏమిటో.

Monday, October 17, 2016

పెన్ లేక పెన్సిల్ తో కీ బోర్డ్ వాడటం..


 
కంప్యూటర్ వాడుతూ ఏదైనా రాయవలసి వచ్చినప్పుడు .... కీ బోర్డు  పైన ఎక్కువసేపు వేళ్ళతో టకటక నొక్కవలసివస్తుంది.

ఇలాంటప్పుడు చాలామందికి  వేళ్ళు నొప్పి పుట్టే  అవకాశం ఉంది.

అదేపనిగా వేళ్లు పనిచేయటం వల్ల .... నరాల బలహీనత, వీపు, చేతులు నొప్పి,  భుజాల నొప్పి మరియు మెడ నొప్పి వచ్చే  అవకాశం ఉంది.

వేళ్ళు నుంచి   .... మెడ, వీపు వంటి భాగాలకు  నరాలు ఉంటాయి కాబట్టి ... చేతులు , భుజాలు,  మెడ నొప్పి తద్వారా తలనొప్పి వంటివి వస్తుంటాయి.

ఈ మధ్య నాకు  చేయి నొప్పి వచ్చింది.  అప్పుడు  నాకు ఒక ఐడియా వచ్చింది.

వేళ్ళతో ఏదైనా  పెన్ను  వంటిది పట్టుకుని ఆ పెన్ను  వంటి వస్తువుతో   కీ - బోర్డు  పైన అక్షరాలు నొక్కుతున్నాను. దీనివల్ల చేయి  నొప్పి తగ్గింది.

అయితే కీ - బోర్డు   పైన  మరీ గట్టిగా నొక్కకుండా... కాప్  మూసి ఉన్న బాల్ పెన్ను తో  లేక  బాల్ పెన్ను తిరగేసి .... అక్షరాల పైన సున్నితంగా నొక్కాలి.

బాల్ పెన్ను  చివర దూది వంటిది చుడితే మరీ మంచిది. (నేను దూది చుట్టలేదు.)

ఇలా వాడితే పెన్ను తో పుస్తకం పై   వ్రాసినట్లు చేయి కొద్దిగా కదులుతుంది.......  వేళ్ళు అదేపనిగా కదిలించనవసరం లేదు.

  ప్రస్తుతానికి ఈ పద్ధతి  సులువుగానే ఉంది మరి.....అంతా  దైవం దయ. 


Friday, October 14, 2016

సరస్వతి దేవి ఆలయములు..

 
బాసరలో సరస్వతి దేవి ఆలయం చాలామందికి తెలుసు. 

కర్నూల్ వద్ద ఆత్మకూరుకు కొంత దూరంలో కూడా సరస్వతీ దేవి ఆలయం ఉన్నది. ఈ దేవాలయం కొలనుభారతిదేవి (సరస్వతి దేవి) ఆలయం.

 మేము బాసర మరియు కొలనుభారతి దేవాలయాలను దర్శించుకున్నాము. దైవానికి అనేక వందనములు. అంతా దైవం దయ. 

కొలనుభారతి దేవాలయం గురించి ఇంతకుముందు ఒక టపా వ్రాసాను. ఆసక్తి ఉన్న వారు ఈ లింక్ వద్ద చూడగలరు.

కొలనుభారతి శ్రీ సరస్వతీదేవి ఆలయం .



Tuesday, October 11, 2016

దసరా ...

ఓం ..                                           


సాయి సాయి.

శ్రీ రాజరాజేశ్వర స్వామికి  అనేక  నమస్కారములు,
 శ్రీ రాజరాజేశ్వరీ దేవికి  అనేక  నమస్కారములు.

                       శ్రీ  రాజరాజేశ్వర్యష్టకం.

  1.  అంబా శాంభవి చంద్రమౌళి రబలాపర్ణా ఉమాపార్వతీ
      కాళీహైమవతీ  శివా  త్రినయనీ  కాత్యాయనీ  భైరవీ
     సావిత్రీ  నవయౌవనా శుభకరీ  సామ్రాజ్యలక్ష్మీ ప్రదా
     చిద్రూపీ  పరదేవతా  భగవతీ  శ్రీ రాజరాజేశ్వరీ 

2.  అంబా మోహిని దేవతా త్రిభువనీ ఆనందసంధాయినీ
     వాణీ పల్లవపాణి  వేణుమురళీగాన  ప్రియాలోలినీ
    కళ్యాణీ  ఉడురాజబింబవదనా  ధూమ్రాక్ష సంహారిణీ
   చిద్రూపీ  పరదేవతా  భగవతీ  శ్రీ  రాజరాజేశ్వరీ 

3. అంబానూపుర  రత్నకంకణధరీ  కేయూరహారావళీ
  జాజీచంపక  వైజయంతలహరీ  గ్రైవేయ వైరాజితాం
  వీణావేణు  వినోదమండితకరా  వీరాసనా  సంస్థితా
  చిద్రూపీ  పరదేవతా  భగవతీ  శ్రీ  రాజరాజేశ్వరీ 

4. అంబా రౌద్రిణి భద్రకాళి  బగళా జ్వాలాముఖీ  వైష్ణవీ
  బ్రహ్మాణీ  త్రిపురాంతకీ  సురనుతా  దేదీప్యమానోజ్వలా
  చాముండా  శ్రితరక్ష  పోషజననీ  దాక్షాయణీ  పల్లవీ
  చిద్రూపీ  పరదేవతా  భగవతీ  శ్రీరాజరాజేశ్వరీ 

5. అంబా  శూలధనుః  కుశాంకుశధరీ  అర్ధేందు  బింబాధరీ
  వారాహీ  మధుకైటభప్రశమనీ  వాణీరమా సేవితా
  మల్లాద్యాసుర  మూకదైత్యదమనీ  మాహేశ్వరీ  అంబికా
  చిద్రూపీ  పరదేవతా  భగవతీ  శ్రీ రాజరాజేశ్వరీ 

6. అంబా  సృష్టి వినాశ పాలనకరీ  ఆర్యా  విసంశోభితా
    గాయత్రీ  ప్రణవాక్షరామృతరసః  పూర్ణానుసంధీకృతా
   ఓంకారీ  వినుతా  సురార్చితపదా  ఉద్దండ  దైత్యాపహా
   చిద్రూపీ  పరదేవతా  భగవతీ  శ్రీ  రాజరాజేశ్వరీ

7. అంబా శాశ్వత  ఆగమాది  వినుతా ఆర్యామహాదేవతా
  యా  బ్రహ్మాది  పిపీలికాంత జననీ  యావై  జగన్మోహినీ
  యా  పంచప్రణవాది రేఫజననీ  యా  చిత్కళామాలినీ
  చిద్రూపీ  పరదేవతా  భగవతీ  శ్రీ  రాజరాజేశ్వరీ  

8. అంబాపాలిత  భక్తరాజి రనిశం   అంబాష్టకం  యః పఠేత్
   అంబాలోక  కటాక్షవీక్ష  లలితా  ఐశ్వర్యమవ్యాహతా
   అంబాపావన మంత్ర రాజపఠనా ద్యంతేన  మోక్షప్రదా
  చిద్రూపీ  పరదేవతా  భగవతీ  శ్రీరాజరాజేశ్వరీ
 
    ఫలం : ఆధ్యాత్మిక  జ్ఞానప్రాప్తి, సర్వవాంఛా  సిద్ధి.
..........................................

ఏమైనా  అచ్చుతప్పుల  వంటివి  ఉంటే  దయచేసి  క్షమించమని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.



Monday, October 10, 2016

ఆది పరాశక్తి కధలు .. మూడవ భాగం ..


 మహిషాసుర మర్దిని అమ్మవారు ...............

ఒకప్పుడు మహిషాసురుడు రాక్షసులకు చక్రవర్తి అయ్యాడు. అతడు దేవేంద్రుని జయించి స్వర్గాధిపత్యాన్ని స్వాధీనం చేసుకొన్నాడు. దిక్పాలకులు, దేవతలు అందరూ అతని ఆజ్ఞకు వశులయ్యారు.

మహిషాసురుడు చేసే అన్యాయములు భరించలేక , దేవతలందరూ బ్రహ్మదేవునితో కలిసి శివకేశవులను దర్శించుకొని తమ బాధలు చెప్పుకొన్నారు. మహిషాసురుని దుర్మార్గాలు వివరించారు.

ఆ తరువాత వారందరి అంశాలతో ఒక మహాశక్తి ఆవిర్భవించింది. ఆ మహాశక్తి సర్వాలంకారములతో, సమస్త దివ్యాయుధములతో సాక్షాత్కరించింది. ఒక్కసారి మహాభయంకరముగా వికటాట్టహాసం చేసింది. ఆ తల్లిని దివ్యులంతా స్తుతించారు.

రాక్షసులకు ఆ భయంకరారావం గుండెల్ని బ్రద్దలు చేసేదిగా అనిపించింది. రాక్షసులు ఆయుధాలు ధరించి మహిషుని వెంట యుధ్ధానికి బయలుదేరారు. జగన్మాతను చూశాడు మహిషాసురుడు. ఇరుపక్షాలకు పోరు ప్రారంభమయింది.

చిక్షురుడు- తామ్రుడు- బిడాలుడు- అసిలోముడు మొదలైన రాక్షసులు నూతన వ్యూహ రచనలతో యుధ్ధం ప్రారంభించారు. ఎందరో రాక్షస వీరులు హతులయ్యారు.

జగన్మాత సింహవాహనాన్ని అధిరోహించింది. సింహగర్జనలతో, రాక్షసవీరుల అరుపులతో, రణరంగం భయంకరంగా ఉంది. సింహం రక్కసుల రక్తం త్రాగుతూ జూలు విదిలిస్తోంది. రాక్షసులు ప్రాణభీతితో అరుస్తూ ఉంటే, దేవతలు దేవి మీద పూలవాన కురిపిస్తున్నారు.

ఎందరో రాక్షసులు దేవి చేతిలో హతులయ్యారు.

ఈ దృశ్యం చూసి మండిపడ్డాడు మహిషాసురుడు. మహిష (దున్నపోతు ) రూపం ధరించాడు. కాలిగిట్టలతో నేల తట్టాడు. కొమ్ములతో పర్వతాలను బంతుల మాదిరిగా ఎగురగొట్టాడు. వాడి భయంకర రూపానికి ప్రకృతి కంపించింది.

మహిషుణ్ణి పాశంతో బంధించింది శ్రీదేవి. వాడు వెంటనే మహిష రూపం విడిచి రాక్షసాకారం  ధరించాడు. భయంకరారావం గావించాడు. అంతలో దేవి ఒక్కసారిగా మహిషుడిని   క్రింద పడవేసి పాదంతో త్రొక్కి పెట్టి ,శూలంతో గుండెల్లో పొడిచి సంహరించింది.

మహిషాసురుని సంహారాన్ని కళ్ళారా చూసిన మిగిలిన రాక్షస సైన్యం హాహాకారాలు చేస్తూ పాతాళానికి పారిపోయారు. దేవతలు ఆనందించి మహాదేవిని స్తుతించారు.

అంబా! నీ శక్తితో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమతమ విధుల్ని నిర్వహించగలుగుతున్నారు. నువ్వు కీర్తివి, మతివి, స్మృతివి, గతివి, ధృతివి, కరుణవు, భయవు, శ్రధ్ధవు, వసుధవు, నువ్వే. .కమల, విజయ, గిరిజ, రమ, ఉమ, జయ మొదలైన నామాలతో కీర్తికెక్కిన దానివి నువ్వే. నువ్వు తుష్టివి, పుష్టివి, బుధ్ధివి, విద్యా, క్షమా, కాంతి, మేధలు నువ్వే. నీ ధారణా శక్తి వలన నాగకూర్మాలు భూమిని మోస్తున్నాయి. నీ స్వాహా శక్తి వలన యజ్ఞ హవిస్సులు దేవతలకు లభిస్తున్నాయి. 

తల్లీ ! నువ్వు అందరికీ భోగభాగ్యాలు ప్రసాదిస్తావు. వాగ్దేవతవై విద్యను అనుగ్రహిస్తావు. జనుల ఆర్తిని తొలగిస్తావు. నిన్ను నిరంతరం ధ్యానించేవారికి గర్భశోక రహితమైన మోక్షఫలాన్ని అందిస్తావు.

మాతా ! ఈ భువన చక్రాన్ని కారుణ్యవీక్షణంతో నడిపించే నీ నిజతత్వం వేదాలకే అర్ధం కాదు. మరి అన్యులకెలా బోధపడుతుంది .

మాతా ! మహోగ్రుడూ, భువన కంటకుడూ అయిన మహిషాసురుణ్ణి సంహరించి మమ్మల్ని అనుగ్రహించావు. మేము ధన్యులం. సర్వశరణ్యాలైన నీ పదపంకజాల మీద మాకు అచంచలమైన భక్తిని ప్రసాదించు. ఈ శరీరం (వృక్షం ) రెండు పక్షులకు ( జీవాత్మ, పరమాత్మ )ఆశ్రయం. వాటి సఖ్యం అవి భాజ్యం. వాటిమధ్య మూడోదానికి స్థానం లేదు. అటువంటప్పుడు జీవుడు నిన్ను ఎలా విడిచిపెడతాడు ? అలాగే మేము నిన్నెప్పుడూ సేవిస్తూనే ఉంటాము. మమ్మల్ని కరుణించి రక్షించు తల్లీ !

దేవతలు చేసిన స్తుతికి దేవి సంతోషించి మృదుమధుర వాక్కులతో- "దుస్సాధ్యమూ దుర్ఘటమూ అయిన కార్యం ఎప్పుడైనా సంభవించినప్పుడు నన్ను స్మరించండి. మీ ఆపదల్ని వెంటనే హరిస్తాను. " అని అభయమిచ్చి దేవి అంతర్ధానమయ్యింది.
 
 

ఆదిపరాశక్తి కధలు.. రెండవ భాగము..


ఒకప్పుడు మహాశక్తి యొక్క సరస్వతీ శక్తి శుంభనిశుంభాది రాక్షసుల్ని సంహరించింది. 


ఒకానొక సమయంలో శుంభుడు, నిశుంభుడు అనే పేర్లు గల రాక్షసులు ,వరబలగర్వాలతో దేవతల్ని అమరావతి నుండి తరిమివేశారు.



శుంభ,నిశుంభుల వల్ల ఎన్నో బాధలు పడ్డ దేవతలు .... ఏదైనా ఉపాయం చెప్పమని దేవగురువు వద్దకు వెళ్ళి అడిగినప్పుడు, ఆయన చెప్పిన సలహా ప్రకారం , మీకేమయినా ఆపదలు వచ్చినప్పుడు నేను మిమ్మల్ని రక్షిస్తాను అని ... మహిష వధానంతరం దేవి ఇచ్చిన అభయప్రదానమును గుర్తు తెచ్చుకుని , అందరూ కలిసి హిమాలయానికి వెళ్ళి దేవీద్యాన పరాయణులై, మాయాబీజ జపమగ్నులై పరమేశ్వరిని ప్రార్ధించారు.



దేవతల దీనాలాపాల్ని విని .. . . జగన్మాత ' కౌశికి ' అనే పేరుతో ఆవిర్భవించి మహాకాళి అనే నామంతో వారి కష్టాలు తీరుస్తానని పలికింది.



హిమాలయ ప్రాంతములో ఉన్న మహాకాళిని, శుంభనిశుంభుల సేవకులయిన చండముండాసురులు చూశారు. ఆ విషయాన్ని , ఆమె రూపలావణ్యాలను తమ ప్రభువులకు విన్నవించారు. ఆమె సౌందర్యాతిశయాన్ని గురించి విన్న శుంభుడు , సుగ్రీవుడనే రాక్షసుణ్ని దేవి దగ్గరకు రాయబారిగా పంపాడు.



సుగ్రీవుడు జగన్మాతను సమీపించి , శుంభనిశుంభుల గొప్పదనాన్ని ప్రశంసించి వారిలో ఎవరినో ఒకరిని వరించమన్నాడు. 


అతని మాటలు విని ఆ తల్లి చిరునవ్వు నవ్వి , "నీ పలుకులు యధార్ధం. నన్ను జయించిన వాణ్ని గాని, నాతో సరిసమానమయిన పరాక్రమశాలిని గాని నేను వివాహం చేసికొంటాను. ఇది నా నియమం. నీవు పోయి ఈ విషయాన్ని మీ ప్రభువులకు చెప్పు." అన్నది.



ఆ మాటలకు కోపించిన సుగ్రీవుడు, ఆమెతో ఏవేవో ప్రగల్భాలు పలికి, శుంభునకు విషయాన్ని వివరించాడు. శుంభనిశుంభులు రణమునకు బయలుదేరి వచ్చారు. ఉభయపక్షాలు పోరు ఘోరంగా చేస్తున్నాయి. వీరుల పదఘట్టనలతో భూమి దద్దరిల్లుతోంది. దేవతలు ఆసక్తిగా చూస్తున్నారు. సృష్టికి ప్రళయం సంభవిస్తుందేమోనన్న అనుమానం బయల్దేరింది  కొంతమంది విద్యాధరులకు.



జగన్మాత; సదాశివుని, శుంభనిశుంభుల దగ్గరకు రాయబారం పంపింది. రాయబారం విఫలమైంది. యుధ్ధం ప్రారంభమైంది. రాక్షససంహారం ముమ్మరంగా సాగుతోంది. పిశాచాలు రణరంగంలో ఆనందనాట్యం చేస్తున్నాయి. భూత- ప్రేత- పిశాచ- బ్రహ్మరాక్షస- శాకినీ- డాకినీ- హాకినీ గణాలు స్వైరవిహారం చేస్తున్నాయి. తెగిన తలలు, భుజాలు, అవయవాలు, ఎముకలగుట్టలతో   రణరంగం మహా భయంకరంగా ఉంది.



ఇంతలో వచ్చాడు రక్తబీజాసురుడు. వాడి శరీరంలో నుండి నేలమీద రాలే ఒక్కొక్క రక్తపు బొట్టుకి ఒక్కొక్క రక్తబీజుడు ఉధ్భవిస్తాడు. ఆ ఇంద్రాణీ శక్తి తన వజ్రాయుధంతో రక్తబీజుడ్ని కొట్టింది. వాడు గాయపడ్డాడు. రక్తం చిందింది. అనేకులు రక్తబీజులు పుట్టుకొచ్చారు. ఇది వాడు సాధించిన అపూర్వశక్తి. వాణ్ణి జయించటం కష్టం.



ఆ దృశ్యం చూసింది సరస్వతీదేవి. మహాకాళితో ఈ విధంగా అన్నది.


కాళీ! వీడి శరీరంలో రక్తం ఉన్నంతవరకు చావడు. కనుక, వీని శరీరం నుండి నేల మీద పడే రక్తాన్ని నేలమీదపడకుండానే త్రాగెయ్యి. నీకు చండిక సహకారంగా ఉంటుంది." మహాదేవి మళ్ళీ రక్తబీజుడ్ని గాయపరిచింది. రక్తం నేలమీద పడకుండానే మహాకాళి పీల్చివేసింది. రక్తరహితుడయ్యాడు ఆ రాక్షసుడు. వెంటనే వాని శిరస్సు ఖండించి అతని కపాలాన్ని తన కపాలమాలలో చేర్చుకొన్నది కాళిక .


రక్తబీజ సంహారం గాంచిన శుంభనిశుంభులు కాలాగ్నిరుద్రులై వచ్చారు. మళ్ళీ భయంకర యుధ్ధం. సరస్వతీదేవి సింహంలా గర్జించింది. నారిసారించి ధనుష్టంకారం చేసింది. ఆ ధ్వనికి బ్రహ్మదేవుని చెవులు గింగురుమన్నాయి. మృత్యుదేవత నృత్యం చేస్తూ దైత్యగణాల్ని అత్యుత్సాహంతో ఆరగిస్తున్నది.



నిశుంభాసురుడు జగదాంబను గుర్తించాడు. అసురీ మాయతో వేరొక ఆకారాన్ని పొందాడు. ఆ విధంగా కొంతసేపు పోరాడినాడు. జగదంబ భయంకరాకారాన్ని ధరించి నిశుంభుని మీదికురికింది. సింహనాదం చేస్తూ నిశుంభుని శిరసు ఖండించింది. దేవతలు ఆనందించారు. దుష్టరాక్షస గణాలు దుఃఖించాయి.


నిశుంభుడు చనిపోయాడు. శుంభుడు , దుర్గాదేవికి , నన్ను శరణు వేడుకో ! అని సలహా ఇచ్చాడు.


 అపుడు అంబ , నీవు పూర్వజన్మలో చేసికొన్న పుణ్యలేశం వల్ల నన్ను గాంచగలిగావు. నాతో సంభాషించగలిగావు. నేనెవరినో, నా రూపమేమిటో, నా  నామమేమిటో తెలియక వేదాలు ఘోషిస్తున్నాయి." అని అన్నది.



శుంభునికి జగన్మాత దర్శనమైనది. ఆమె తత్వం అవగతమయ్యింది. ఆమె చేతిలో చనిపోయి జన్మ ధన్యం గావించుకోవాలనుకొన్నాడు. ఆయుధాలు ధరించాడు. రధమారోహించాడు. పోరు ప్రారంభించాడు. వీరి పోరాటాన్ని గగనతలాన నిలిచి యక్ష కిన్నర కింపురుష గరుడోరగ సిధ్ధసాధ్య విద్యాధరాధి దేవతాగణాలు , మహర్షులు చూశారు. ఆ యుధ్ధంలో దేవి వాడిని సంహరించింది.



దేవతలు, దిక్పాలకులు, మహర్షులు మహాశక్తిని స్తుతించారు.


రాక్షస సంహారం జరిగింది. అంటే అజ్ఞానం తొలగిపోయింది. విజ్ఞాన కాంతులు దశదిశల వ్యాపించాయి.


 విజ్ఞానం సరస్వతి. కనుకనే మానవ హృదయాలలో గూడుకట్టుకొన్న దురభిమానం, అహంకారం, మమకారం, ఆత్మీయత, స్వార్ధం, ద్రోహం మొదలయిన దుష్ట రాక్షసశక్తులు నశించిపోవాలని, శాశ్వతమైనది, పారలౌకికమైనది, నిరంతరానందసంధాయకమైనది పరమేశ్వరీ కృపాకటాక్షమని గ్రహించడం కోసం సరస్వతీ పూజ చేస్తారని పెద్దలు చెబుతున్నారు.




Friday, October 7, 2016

ఆదిపరాశక్తి కధలు.


ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు పాలసముద్రం మీద ఆదిశేషునిపై పవళించి యోగనిద్రలో ఉన్నారు. 


 అప్పుడు విష్ణుమూర్తి చెవులలోని గులివి నుండి మధువు, కైటభుడు అనే ఇద్దరు రాక్షసులు జన్మించారు. వారిద్దరూ మహా బలవంతులు.

వారు శక్తిస్వరూపిణి అయిన పరాశక్తిని గురించి తపస్సు చేసి స్వేచ్చామరణమును వరముగా కోరుకొన్నారు.

 ఆ వరగర్వముతో రాక్షసులిద్దరూ బ్రహ్మ మీద దాడి చేశారు. బ్రహ్మదేవుడు విష్ణువు శరణుజొచ్చారు.

మధుకైటభులు విష్ణుదేవుని తమతో యుధ్ధము చేసి గెలవమన్నారు. వారు ఒకరితర్వాత ఒకరు అలసట తీర్చుకుంటూ విష్ణుమూర్తితో యుధ్ధము చేశారు.

విష్ణుమూర్తి విశ్రాంతి తీసుకోవడానికి సమయం లేకపోయింది.

అప్పుడు మధుకైటభులు , "నీవు పరాక్రమశాలివే, అలసిపోయినట్లున్నావు. దాసోహమన్నచో నిన్ను విడిచిపెడతాం. కాదంటే నిన్ను సంహరించి తర్వాత ఈ బ్రహ్మదేవుని పని పడతాం " అన్నారు.

 అప్పుడు విష్ణువు, నేను అలసిపోయాను. కొంత విశ్రాంతి తీసికొన్న పిమ్మట మళ్ళీ మీతో యుధ్ధం చేస్తాను " అన్నారు.

మళ్ళీ యుధ్ధం ప్రారంభమయ్యింది. విష్ణువు యోగమాయను నుతించాడు. యోగమాయ విష్ణువును అనుగ్రహించటం జరిగింది.

యుధ్ధసమయములో యోగమాయ గగనతలంలో రాక్షసులకు దర్శనమిచ్చి వారివైపు తన మాయా దృష్టిని ప్రసరించటం జరిగింది.

ఆ చూపులకు మధుకైటభులు   తమనుతాము   మరచిపోయారు.

ఆ సమయములో విష్ణువు , "గతములో నేను ఎంతోమంది రాక్షసులను వధించాను. నాతో ఇంతకాలం యుధ్ధం చేసినవారు మీరు తప్ప మరొకరు లేరు. కనుక ఏదైనా వరము కోరుకొనుడు ఇస్తాను " అన్నారు.

పరవశులై, మదోన్మత్తులై యున్న ఆ దానవులు, "మేము యాచకులము కాదు. నీవే కోరుకో వరం, ఇస్తాము." అన్నారు.

అపుడు  శ్రీ మహావిష్ణువు, మీరిద్దరూ నా చేతిలో మరణించాలి: అన్నారు.

 వారు ఆశ్చర్యపోయారు. తెలివిగా మోసగింపబడ్డామని గ్రహించారు. లోకమంతా జలమయంగా ఉండడం చూసి , మమ్మల్ని నిర్జలప్రదేశంలో సంహరించు అన్నారు.

విష్ణువు రాక్షసుల్ని తన తొడలమీద నొక్కిపెట్టి సుదర్శన చక్రంతో వారి తలలు నరికారు. ఆ తలలనుండి మేధస్సు {మెదడు} బయటకు వచ్చి నీటి మీద తేలింది. మధుకైటభులిద్దరూ మరణించారు.

మేధస్సు ఆవరించిన జలభాగం మేదిని {భూమి } అయింది. అందుచేతనే మట్టి తినకూడదంటారు.