koodali

Saturday, November 19, 2011

నేను నిన్న, మొన్న పాత పుస్తకాలు సర్దుతుంటే.......

నేను నిన్న, మొన్న పాత పుస్తకాలు సర్దుతుంటే.....

అంటే మా ఇంట్లో దగ్గరదగ్గర 10 సంవత్సరాల క్రిందటివి కొన్ని పత్రికలు, పుస్తకాలు ఉన్నాయి.

వాటిని
సర్దుతూ మధ్యమధ్య అందులో వ్రాసిన వంటలు, ఇంకా ఇతర ఆర్టికల్స్ చదువుతుంటే ఒక వ్యాసం కనిపించింది.

అది
" ఉత్పల " గారు వ్రాసిన " భగవన్నామం " అనే వ్యాసం.

అందులో
ఒక దగ్గర ఇలా ఉందండి............

శ్రీ
రాముని కంటే శ్రీ రామనామం గొప్పదన్నారు గోస్వామి తులసీదాసు. శ్రీ రాముడు తన అవతార సమయంలో ఎందరినో తరింపజేశాడు. నిజమే. ఎన్నో యుగాలు గడచినా శ్రీరామనామం భక్తుల్ని ఇప్పటికీ తరింపజేస్తున్నది కనుక రామనామమే గొప్పది. ..అంటూ వారు వ్రాయటం జరిగింది.

పుస్తకాలలోని పేజీలు గబగబా త్రిప్పుతూ వెళ్ళినా కూడా పుస్తకంలోని పేజీ మిస్సవకుండా కనిపించటం. నాకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది.

మధ్యన బ్లాగుల్లో రాముడు గొప్పా ? రామనామం గొప్పదా ? అనే విషయంపై నేను కూడా అభిప్రాయాన్ని వ్రాయటంజరిగింది.

అందుకే
వ్యాసం నాకు కనిపించటం నాకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. అంతా దైవం దయ.
...............................

ఇంకా కొన్ని ఇతర రచనల గురించి కూడా చెప్పాలి.

" హిమయోగి " అనే రచనలో " ఒక యోగి ఆత్మకధ " లో చెప్పబడిన " బాబాజీ " వారి గురించి కొన్ని వివరాలను వివరించారు రచయిత.

ఇంకా, హిమాలయాల్లో నివసించే కొందరు యోగుల గురించి కూడా ఎన్నో విషయాలను చెప్పారు.

ఇంకా
రచయిత " అగ్నిసూర్య " అనే రచనలో జ్యోతిష శాస్త్రం గురించి కొన్ని విషయాలను చెప్పటం జరిగింది. రచయితపేరు. " సాత్విక్ ."

ఇంకా
ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ గారు అందించిన " గుణాఢ్యుని బృహత్కధ " కూడా చాలా బాగుంది.
...........................

తెలుగులో
ఇంకా ఎన్నో గొప్ప రచనలున్నాయి. గొప్ప రచయితలు, రచయిత్రులు ఉన్నారు.

చాలామంది
ఇలా పుస్తకాలతో లైబ్రరీ ఏర్పాటు చేసుకుంటారు.

నా
దగ్గర ఎక్కువ పుస్తకాలు లేవు కానీ, పత్రికల్లో , పుస్తకాల్లో బాగున్నవి అనిపించిన ఆర్టికల్స్ ను కత్తిరించి దాస్తూఉంటాను.

అయితే
ఇప్పుడు అలా చేయటం బాగా తగ్గించానులెండి.

ఎందరో
ఎన్నో విషయాలను వ్రాస్తున్నారు. ఎంతో విజ్ఞానం ఉంది. . ఎంతకని సేకరించగలం అనిపిస్తోంది ?

అసలు
అతిగా విషయసేకరణ కూడా మనిషికి ఒక లంపటం అవుతుందేమో?

దైవభక్తి
విషయంలో తప్పించి ఇక విషయంలోనైనా అతి పనికిరాదు అని కూడా అనిపిస్తోంది.

విశ్వరహస్యాలను శోధించాలని అతిగా ఆరాటపడి ఆయాసపడి అలసిపోయే కన్నా అన్నింటికీ ఆదియైన  విశ్వాత్మనే (దైవాన్ని ) శరణు వేడితే ఉత్తమం కదా !

అప్పుడు అంతా వారే చూసుకుంటారు కదా !. అని కూడా అనిపిస్తోంది.....


Wednesday, November 16, 2011

నేను గృహిణిని ....

 

గృహిణి అంటే పని అంతగా ఏముంటుంది ? అనుకుంటారు చాలామంది.

నాకయితే పని ఎక్కువగానే ఉంటుంది. అంటే నేను అలా పని కల్పించుకుని బిజీగా ఉంటాను అన్నమాట. .


నాకు తోచినంతలో పూజ చేస్తాను.

వంట చేయటం, ఇల్లు సర్దుకోవటం, ఇవన్నీ ఎలాగూ ఉంటాయి.

ఇంట్లో పని అంటే పాత్రలు శుభ్రం చేయటం, బట్టలు ఉతకటం ఇవన్నీ కూడా నేనే చేస్తాను.

వాషిగ్ మెషీన్ ఉంది కానీ , అప్పుడప్పుడూ వాడుతాము అంతే. .


పనికి సాయంగా ఎవరినీ పెట్టుకోలేదు. గత మూడు సంవత్సరాలనుంచీ నేనే ఇంటిపని చేసుకుంటున్నాను. దానికి కారణాలు ఉన్నాయి లెండి.


వాళ్ళు వస్తారో రారో అని రోజూ ఎదురుచూడటం, వాళ్ళు వచ్చినా ఒక పూటే వస్తున్నారు ఈ రోజుల్లో .


మరి రాత్రి వంట చేసిన పాత్రలు నేనే శుభ్రం చేసుకోవాలి కదా ! .

ఒక పూట పనికోసం వాళ్ళు ఎందుకులే ! అని మానిపించేసాను.

ఇప్పుడయితే నేనే ఇంటి పనంతా చేస్తున్నానని ఇంట్లో వాళ్ళ వద్ద క్రెడిట్ పొందవచ్చు కదా !


ఎవరినైనా పనికి మాట్లాడుకోమని మా పెద్దవాళ్ళు కోప్పడుతుంటారు. . . . . విదేశాల్లో చాలామంది వారిపని వారే చేసుకుంటారట ! అని నేను వాళ్ళతో అంటాను.

అయినా ఎవరి పని వారు చేసుకుంటే తప్పేముందిలెండి.

నేను ఇంటి పని చేసుకోవటానికి ఇంకో కారణమేమిటంటే మా పెద్దవాళ్ళకి డయాబెటిస్ వ్యాధి ఉంది.

ఆ వ్యాధి వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలున్నాయట. ఆ వ్యాధి వస్తే బోలెడు ఎక్సర్ సైజులు చేయాలట.

అలా జాగింగులు గట్రా చెయ్యటం నావల్ల కాదు.

అందుకని వ్యాధి రాకూడ
ని ముందు జాగ్రత్తగా ఇలా పని చేసుకుంటున్నాను . మన ప్రయత్నం మనం చేస్తే ఫలితం దైవాధీనం కదండి.


డయాబెటీస్ ఉన్నవారు రోజూ రెండు రాతిఉసిరికాయలు ( పచ్చివి ) మిక్సీలో రసం తీసుకుని ఉదయాన్నే త్రాగితే చాలా మంచిదట.


మా పెద్దవాళ్ళు ఇలాగే చేస్తుంటారు. ఆ వ్యాధి బాగా కంట్రోల్ అయింది. ( అంటే వ్యాధి ఇంకా పెరగలేదు. )

అసలు ఉసిరి కాయ చాలా వ్యాధులకు మంచిది.

ఇప్పుడు ఉసిరికాయలు బాగా దొరుకుతాయి, ఇప్పుడు ఎండబెట్టి ముక్కలు ,చేసి నిలవపెట్టుకోవచ్చు, పొడి, పచ్చడి చేసుకోవచ్చు.

కొందరు తేనెలో, పంచదారపాకంలో నిలువచేసుకుంటారు. ఉసిరితో చేసే చ్యవనప్రాశ ఎప్పుడూ దొరుకుతుంది.


*******
ఇంకా నాకు వార్తాపత్రికలు పుస్తకాలు చదవటమంటే చాలా ఇష్టం. .

వార్తాపత్రికలు చదవటమంటే చాలామందికి బోర్. కానీ నాకు చాలా ఇష్టం.

ఇలాంటి మంచి అలవాటు కలిగించినందుకు నేను దైవానికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.


పుస్తకపఠనం ఆసక్తి ఉన్నవారికి బోర్ అనే సమస్యే ఉండదు. సమయం చక్కగా గడిచిపోతుంది.

కొంతకాలం క్రిందట దైవం దయ వల్ల M. A ( చరిత్ర ) ప్రైవేటుగా చదివి పూర్తిచేశానండి.

ఇంకా ఈ మధ్యనే ఒక ఆమె వద్ద సంగీతం నేర్చుకోవటానికి వెళ్తున్నాను.

సంగీతం ఒక మహాసముద్రం. ఎంత నేర్చుకున్నా తరగదు.


సంగీతం సరిగ్గా నేర్చుకోవాలంటే చాలా శ్రద్ధగా నేర్చుకోవాలి. నాకు సమయం సరిపోక సరిగ్గా వెళ్ళటం లేదు.


ప్రస్తుతానికి వెళ్తున్నాను. ఎంతకాలం నేర్చుకుంటానో తెలియదు.

ఇక బ్లాగు మొదలుపెట్టాక ఇంకా బిజీ అయిపోయింది. మరి అందరూ ఎలా వ్రాస్తున్నారో తెలియదు.


నేను పని త్వరగానే చేస్తాను. అయినా ఎంత చేసినా సమయం సరిపోవటం లేదండి.

అయినా నేను ఇలా బ్లాగు వ్రాయటం ఏమిటో తలుచుకుంటే అత్యంత ఆశ్చర్యంగా ఉంటుంది నాకు.

ఇది దైవం వేసిన భిక్షగా అనుకుంటున్నాను నేను.

ఒక సంవత్సరం కన్నా వ్రాయగలనా ? అనుకున్నాను. ఇంకా వ్రాస్తున్నాను మరి.

బ్లాగుల్లో అందరూ ఎంతో విషయపరిజ్ఞానం కలిగినవారుంటారు. నేను ఏం వ్రాయగలను ? అని భయపడ్డాను.


ఏదో దైవం దయవల్ల నాకు తెలిసినంతలో వ్రాస్తున్నానండి. ఆదరిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు, .


నేను గృహిణిని అయినా కూడా ఇంటిపనీ, సంగీతం క్లాసులు, బ్లాగులు చూడటం, పత్రికలు చదవటం , టివీలో కొన్ని ప్రోగ్రాములు చూడటం ఇలా చాలా బిజీ అన్నమాట.....

అంతా దైవం దయ.



Monday, November 14, 2011

విపరీతమైన రద్దీ సమయాల్లో దైవ దర్శనం.... ...

క్రితం సోమవారం ప్రసిద్ధ దేవాలయానికి వెళ్ళాము కదండి. అబ్బో విపరీతమైన రద్దీగా ఉంది.

దేవాలయాల్లో ధర్మదర్శనంతో పాటూ , 100 , 200 రూ... ఇలా టికెట్ దర్శనాలు కూడా ఉంటాయి కదా !

ఇలా టికెట్ కొని దైవదర్శనం చేసుకోవటం అనే విషయంలో రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి.

దేవుని దగ్గర అందరూ సమానమే కదా ! ఇలాంటి సిస్టం ఎందుకు ? అని కూడా అనిపిస్తుంది. అయితే , మేము కూడా ఇలా టికెట్ కొని వెళ్ళవలసి వచ్చింది

. ధర్మదర్శనానికి, టికెట్ కొన్న వారికి వేరువేరు క్యూలైన్స్ ఉన్నాయి. మేము వెళ్ళి క్యూలో నిలుచున్నాము.

అప్పటికి ఎంతోసేపట్నించీ దర్శనాలు ఆపేసారట.

కొందరు చెప్పటమేమంటే ఎవరో వీఐపీలు వచ్చారట. అందుకే సామాన్యభక్తులకు దర్శనాలు ఆపేసారని చెప్పుకుంటున్నారు.

ప్రక్క క్యూలైన్లో వాళ్ళు ఉదయం 2 గంటల నుంచీ లైన్లోనే ఉన్నారట చిన్నపిల్లలతో సహా. దాంతో వారు నీరసంతో వచ్చే విసుగుతో ఉండటం సహజమే కదా ! .
ఇంతలో మేము ఉన్న క్యూలైన్లోని వారిని దర్శనానికి వదిలారు.

ఇది చూసి అప్పటికే ఉదయం నుంచీ వేచి ఉన్న ధర్మదర్శనం భక్తులు ఇది అన్యాయం. అని డబ్బు పెట్టి టికెట్ కొన్నవారికే దైవ దర్శనమా ? అని అనటం జరిగింది.

వాళ్ళు అన్నది న్యాయమే కదా ! ఇదంతా చూసి నాకు సిగ్గనిపించింది.

మేము పెద్దగా వెయిట్ చేయకుండానే ముందుకు వెళ్ళటం న్యాయం కాదు అనిపించింది.

నేను నా భర్తతో అన్నాను. మనం ఇప్పుడేకదా వచ్చాము . కొంచెంసేపు అయ్యాక వెళ్ళొచ్చు కదా ! అన్నాను.


కానీ, క్యూలో కొచ్చాక మనం ఏం చేయగలం ? ఈ బుద్ధి ముందే ఉండాలి మాకు అని కూడా నాకు అనిపించింది. . నేను ఇదంతా ఊహించలేదు.

టికెట్ కొని వెళ్ళేవారి క్యూ కూడా బాగా రద్దీగా ఉంది.

ఇది ఇలా జరుగుతుండగానే క్యూ కదలటం జరిగింది. ,

ఈ లోపు మావాళ్ళు ఆ జనంలో ముందుకు వెళ్ళ్తూ నన్ను , మా అమ్మాయిని కూడా త్వరగా వాళ్ళ వెనకే రమ్మంటున్నారు.

ఒక ప్రక్క ధర్మదర్శనం వారి కష్టాలు విన్నాక . ఈ తోపుళ్ళు ఇదంతా చూశాక నాకు కొంచెం సేపు అయ్యాక వెళ్ళొచ్చులే అని అనిపించింది.

నేను మా అమ్మాయి అక్కడ క్యూలో ప్రక్కన నిలుచుండిపోయాము.

.మా వాళ్ళేమో మమ్మల్ని త్వరగా రమ్మని పిలుపులు. తొందరేముందని నేను.......

ఇంతలో దేవుని దయవల్ల మా ప్రక్క వారి క్యూలైన్ కూడా కదిలింది.

రెండు క్యూలైన్లలో వారినీ కూడా దర్శనానికి అనుమతించాలని దేవాలయ సిబ్బంది నిర్ణయించారట.

పాపం ! ఎప్పటినుంచో వేచిఉన్న మా ప్రక్కన క్యూలైన్ వారికి కూడా ఉత్సాహం వచ్చింది.

వారు కూడా ఆనందంగా దర్శనానికి వెళ్ళటం చూసాక నాకు ఆనందం కలిగింది.

మేము కూడా దైవదర్శనం చేసుకున్నాము.

క్యూలైన్లలో ఈ తోపుళ్ళు , ఇదంతా జరిగాక అక్కడ భక్తులకు దైవం సర్వాంతర్యామి కదా ! అన్న విషయం బాగా గుర్తుకు వచ్చింది.

మన ఇంట్లో దేవుని పూజ ప్రశాంతంగా చేసుకున్నా దైవం కరుణిస్తారు కదా ! ......అనీ ...

ఇంత రద్దీలో కాకుండా .మన ఊళ్ళో దేవాలయంలో పూజ చేయించుకున్నా దైవం కరుణించరా ఏమిటి ..... వంటి అభిప్రాయాలు భక్తులు చెప్పటం జరిగింది.

కొందరు ఏమన్నారంటే , వీఐపీలను తెల్లవాఝామున మాత్రమే పూజలకు అనుమతిస్తే బాగుంటుంది. సాధారణ భక్తులకు ఇబ్బందులు ఉండవు అన్నారు .

ఇది నిజమే . నాది కూడా ఇదే అభిప్రాయం.

( అసలు సామాన్య ప్రజల దగ్గర మంచి ఐడియాలు ఉంటాయి. వాళ్ళకు అనుభవజ్ఞానం ఎక్కువకదా ! )

అసలు టికెట్ పద్ధతి లేకుండా అందరికీ ఒకటే దర్శనం అన్నది బాగుంటుంది అనిపిస్తుంది, .

కానీ, కొన్ని సందర్భాలలో , కొందరు వ్యక్తుల విషయంలో టికెట్ అవసరమేమో అనిపిస్తుంది.

ధర్మదర్శనంలో వెళ్ళేవారికీ ....... టికెటి కొని త్వరగా దర్శనం చేసుకునేవారికీ .......వచ్చే పుణ్యంలో ఏమన్నా తేడా ఉంటుందా ఉంటుందా ? అనే ధర్మ సందేహం కూడా వచ్చింది నాకు.

ఈ ధర్మ సందేహం తీరాలంటే పరిస్థితిని ఎన్నో కోణాలనుండీ విశ్లేషిస్తే మాత్రమే సరైన సమాధానం లభిస్తుంది. ప్రతి వ్యక్తి పరిస్థితిని ఆలోచించి విశ్లేషించవలసి వస్తుంది.

సరే, రద్దీ రోజుల్లో దేవాలయాలకు వెళ్ళాలనుకునే వారు గమనించవలసిన విషయం ఏమిటంటే,

మామూలు రోజుల్లోలాగ ప్రశాంతంగా దైవదర్శనం కుదరకపోవచ్చు అన్నది ..

తిరువణ్ణామలైలో కార్తీక దీపం సందర్భంగా విపరీతమైన రద్దీ ఉంటుంది.

ఒకసారి మేము ఏం చేశామంటే విపరీతమైన రద్దీ వల్ల దేవాలయంలో మూలదైవం యొక్క దర్శనం కష్టమని భావించి దర్శించుకోలేదు.

తిరువణ్ణామలై గిరిప్రదక్షిణ మాత్రం చేసి తృప్తి చెందాము.

...........................................................

ప్రజల అభిప్రాయాలు గమనించాక నాకు ఏమనిపిస్తుందంటే,

పండుగ రోజుల్లో , ఉదయం సమయంలో మాత్రమే వీఐపీలు పూజలు చేసుకుంటే వారూ ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. సామాన్య భక్తులకూ ఇబ్బంది లేకుండా ఉంటుంది.

ఇంకా ,

టికెట్ కొనుక్కున్న వారిని ముందు పంపించి ధర్మదర్శనం భక్తులను ఆపివేయటం అన్యాయం. ఇద్దరినీ ఒకేసారి అనుమతించటం బాగుంటుంది.అనీ,

ఇంకా,

ఆపవలసివస్తే కొంచెంసేపు టికెట్ కొనుక్కున్న భక్తులనే ఆపాలి గాని .... ధర్మదర్శనం భక్తులను ఆపకూడదు అనీ అనిపించింది.

అసలు టికెట్ పద్ధతి లేకుండా అందరికీ ఒకటే దర్శనం అన్నది బాగుంటుంది.

ఇంకా,

రద్దీ సమయాల్లో కొన్ని చోట్ల ప్రమాదాలు జరిగి భక్తులు ప్రమాదాలకు గురి అయిన సంఘటనలు కూడా కొన్ని జరిగాయి కదా !

ఇలాంటివి జరగకుండా ఉండాలంటే భక్తులూ, దేవాలయాల సిబ్బందీ కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది.

ఇంకా,

కొన్ని సార్లు కొందరు భక్తులు కూడా , ఎంత రద్దీగా ఉన్నా సరే, ఎలాగోలా ప్రయత్నించి ఒకేరోజు మూడు, నాలుగు సార్లు దర్శనం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు.

అలా ఎక్కువసార్లు దర్శనం చేసుకుంటే గొప్ప అనుకుంటారు.

ఒక్కసారి దర్శనం చేసుకున్నా దైవ కృప లభిస్తుంది. ఇతరులకు అవకాశాన్నీ ఇచ్చినట్లు అవుతుంది.

ఇంకా,

కొందరికి వెళ్ళవలసిన ట్రైన్ సమయం మించిపోతుందనో, అనారోగ్య సమస్యలు వంటి కారణాల వల్ల ఇలా టికెట్ కొని శీఘ్రంగా దర్శించుకౌంటారు.

అయితే ఇలాంటి సమస్యలు పేదవారికి కూడా ఉంటాయి. కానీ వారు అంత డబ్బుపెట్టే తాహతు లేక సర్దుకుపోతుంటారు.

ఏమైనా సాధ్యమైనంత వరకూ ధర్మదర్శనమే మంచిది అనిపిస్తుంది.

ఏమైనా పండుగల వంటి రద్దీ రోజుల్లో ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలకు వెళ్ళాలంటే చాలా విషయాలు ఆలోచించుకోవాలి అనిపిస్తోంది.

జీవితంలో జరిగే కొన్ని సంఘటనల ద్వారా మనకు ఆలోచనలలో మార్పు వస్తుంటుంది... ...

 

Friday, November 11, 2011

క్రితం సోమవారం జరిగిన ఒక సంఘటన....


మేము క్రితం సోమవారం ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రానికి వెళ్ళాము. ఇలాంటి చోట్ల ప్రశాంతంగా దైవదర్శనం జరగాలంటే పండుగల రోజుల్లో కాకుండా మామూలు రోజుల్లోనే వెళితే బాగుంటుంది.

సరే వెళ్ళాము . దైవ దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణమయ్యాము.

కొంత దూరం వెళ్ళాక , ఏ.టి.ఎం వద్దకు వెళ్ళి ఇప్పుడే వస్తానని నా భర్త రోడ్డు పక్కన కారు పార్క్ చేసి వెళ్ళటం జరిగింది.

అక్కడే అరుగు మీద కూర్చున్న ఒక వ్యక్తి కారు టైరులో గాలి తగ్గిందని గమనించి మాకు చెప్పటం జరిగింది.

అప్పటికే సాయంత్రం అవుతోంది. ఇలా జరిగిందేమిటి ? అని విచారిస్తున్నంతలో , నా భర్త తిరిగి వచ్చారు.

పరీక్షిస్తే టైరు పంచర్ కూడా జరిగిందని తెలిసింది.

అక్కడున్న వారిని మెకానిక్ ఎక్కడ ఉంటారని అడగగా కొంచెం దూరంలో ఉంటారని చెప్పారు.

ప్రక్కనే ఉన్న వేరొక కారు డ్రైవర్ సహాయంతో టైరు మార్చటం జరిగింది.

( దైవం దయ వల్ల టైరు ప్రాబ్లం ఊరు దాటక ముందే ఎదురయ్యింది. ఊరు దాటినతరువాత వస్తే ? ఎంతో కష్టమయ్యేది కదా !. అంతా దైవం దయ. అనుకున్నాము. )

టైరు మార్చటం జరుగుతుంటే నేను కారు దిగి బయట నుంచుని చుట్టూ చూస్తుంటే అక్కడున్న వారు కొందరు ఏదో చూస్తున్నారు.

ఏమిటా ? అని నేనూ చూశాను. ఒక చిన్న పాప ఏడుస్తూ నడిచి వెళ్తోంది. పాపం తప్పిపోయింది అనుకుంటున్నారు.

పాప అలా నడిచి వెళ్తూ ఉంది.

నేను ఆ పాప దగ్గరకు వెళ్ళి నీ పేరు ఏమిటి ? అని వివరాలు అడిగితే ఆ పాప ఏడవటం తప్పా ఏమీ చెప్ప లేదు.

నాకు ఏం చేయాలో అర్ధం కాలేదు. అప్పుడు ఆ పాపను ఎత్తుకుని అక్కడకు కొంచెం దూరంలో ఉన్న పోలీసు వారి దగ్గరకు వెళ్ళి ఈ విషయం చెప్పాను.

ఆ పోలీసులు ఏమన్నారంటే, గుడికి ఎదురుగా తప్పిపోయిన వారిని అప్పగించే కేంద్రం ఉంది అక్కడ అప్పగిస్తారా ? అన్నారు.

( ఉదయం నుంచీ జనం రద్దీ వల్ల వాళ్ళూ బాగా అలసటగా కనిపించారు. పాపం వాళ్ళూ ఎంతకని చేయగలరు. )

నేను, ఆ పాపను ఎత్తుకుని వెళ్తుంటే , ఇదంతా చూస్తున్న ఒకతను నా వద్దకు వచ్చి గుడి కొంచెం దూరంగా ఉంది కదా ! నేను అప్పగిస్తాను అన్నాడు.

నాకు ఇవ్వాలనిపించక మా అబ్బాయిని తోడు తీసుకుని గుడి దగ్గరకు వెళ్ళాను.

( అప్పటికి నడిచి కాళ్ళు నెప్పులుగా ఉన్నాయేమో ఎత్తుకున్న తరువాత పాప ఏడవలేదు. )

గుడి వద్దకు చేరుకుని తప్పిపోయినవారిని అప్పగించే ప్రదేశం ఎక్కడ ఉందా ? అని వెతికాము. మాకు కనిపించలేదు.

చుట్టుప్రక్కల వారిని అడిగితే, కొందరు ఇటువెళ్ళండి అన్నారు. కొందరు అటు వెళ్ళండి అన్నారు.

మేము అలా వెతుకుతుండగా ఒక భార్యా భర్తా హడావుడిగా మా వద్దకు వచ్చారు.

గ్రామీణుల్లా ఉన్నారు . వారి వద్ద చంటి వయస్సు గల ఒక బిడ్డ , కొద్దిగా పెద్ద వయస్సు గల ఇంకొక బిడ్డ ఉన్నారు.

వారు నా దగ్గరున్న పాపను వాళ్ళమ్మాయి అని చెప్పి ,పాపకేసి చేయి చాపారు.

పాప కూడా వారిని చూడగానే తల్లి చేయి చాపగానే నవ్వు ముఖంతో తల్లి వద్దకు వెళ్ళింది.

( ఆ పెద్దవాళ్ళు కొద్దిగా ఏడుస్తున్నారు కూడా . )పాపను తీసుకుని కళ్ళనీళ్ళతో నాకు నమస్కరించి కృతజ్ఞతలు చెప్పటం కూడా జరిగింది.

అయినా నాకు కొంచెం అనుమానాలు ఎక్కువ కదా !

వీళ్ళు ఆ పాప తల్లిదండ్రులేనని ఏమిటి నమ్మకం ? అని అనుమానం వచ్చి పాపను అడిగాను. ( ఈ మాత్రం ఆలోచన రావటం దైవం దయే. )

వీళ్ళు ఎవరు ? నీకు తెలుసా ? అని అలా అడిగాను.

కానీ ,ఆ పాప ఏమీ చెప్పలేదు. కానీ, తల్లి ఎత్తుకునే సమయంలో నేను ఆ పాప ఫీలింగ్స్ గమనించాను.

పాప కొత్త లేకుండా గబుక్కున వారి వద్దకు వెళ్ళింది.

ఇదంతా చుట్టూ కూర్చున్న జనం చూస్తూనే ఉన్నారు. వాళ్ళకు విషయం అర్ధమయిందో లేదో తెలియదు. ఇదంతా చాలా త్వరగా జరిగిపోయింది.

ఇక నేనూ, మా అబ్బాయి ఎంతో సంతోషంగా తిరిగి కారు వద్దకు వస్తుంటే ,కొంచెం దూరం వెళ్ళాక నాకు ఏమనిపించిందంటే ,

తప్పిపోయినవారిని అప్పగించే ప్రదేశం వద్దకు వెళ్ళి ... అక్కడ ఈ పాపను వారి తల్లిదండ్రులకు అప్పగిస్తే మరింత బాగుండేది కదా ! అనిపించింది.

వెంటనే తిరిగి వచ్చాము. చూస్తే అక్కడెవరూ లేరు.

అంతకుముందు అక్కడున్న వారికి ఈ కధంతా చెప్పి మేము వెళ్ళిన తరువాత ఆ తల్లిదండ్రుల ప్రవర్తన ఎలాగుంది ? అని అడిగాను.

వారు ఏమన్నారంటే , పాప వారి వద్దకు బాగానే వెళ్ళింది కదండీ . తల్లిదండ్రులే అయ్యుంటారు. అన్నారు.

నేను అన్నాను.... పాప నా దగ్గరకు కూడా వచ్చింది కదా ? అన్నాను.

చుట్టుప్రక్కల వాళ్ళు ఇంకా ఇలా అన్నారు..... వాళ్ళు ఆ పాప తల్లిదండ్రులు లాగానే ఉన్నారులెండి. అన్నారు.

ఇక చేసేదేమీ లేక, తిరిగి కారు వద్దకు వచ్చేసి జరిగింది నా భర్తకు, మా అమ్మాయికి, ఇంకా అక్కడివారికి చెప్పాను.

తరువాత ,ఎందుకయినా మంచిదని మెకానిక్ వద్దకు వెళ్ళి కారు రిపేరు చేయించాము.

మళ్ళీ ఎక్కడన్నా టైరు
పంచర్ సమస్య వస్తుందేమోనని భయపడ్డాము కానీ, ఆ సమస్య రాలేదు. దైవం దయవల్ల క్షేమంగా ఇంటికి తిరిగి చేరుకున్నాము.

ఆ పాప తల్లిదండ్రి వద్దకు చేరిందని సంతోషంగానే ఉన్నా కూడా , తప్పిపోయినవారిని అప్పగించే కేంద్రం వెతికి అక్కడ ఈ అప్పగింతలు జరిగితే మరింత చక్కగా ఉండేది కదా ! అనుమానం లేకుండా . అనిపించింది.

ఏం చెయ్యను. నాకు అప్పుడు అంతకన్నా తోచలేదు మరి . ఇక దైవం దయ అంతే.

జీవితంలో ఒకోసారి మనకు ఇలా అనిపిస్తుంటుంది కదా ! . అరే ! అప్పుడు ఇలా కాకుండా ఇంకోలా చేసి ఉంటే బాగుండేది కదా ! అని.

* అందుకే మన తెలివితేటలు ఎంతో గోప్పవి అని మనం ఎప్పుడూ అనుకోకూడదు.

* మనల్ని సరైన దారిలో నడిపించమని దైవాన్ని ప్రార్ధించటమే తెలివైన వాళ్ళు చేయవలసిన పని.

జీవితంలో మనకు కూడా ఆపదలో సహాయం చేసేవారు ఎందరో ఎదురవుతారు.

ఉదా..కారు సమస్య వచ్చినప్పుడు అపరిచితులైన డ్రైవరు, మెకానిక్ సహాయపడటం వంటివి, ఇలా ఎందరో అపరిచితులు మనకు కూడా సహాయపడుతుంటారు.

ఇతరులకు సాయం చేయటంలో నా స్వార్ధం కూడా ఉందిలెండి. ఇతరులకు సాయం చేస్తే మనకు మంచి జరుగుతుంది అని పెద్దలు చెప్పారు కదా !

అంతా దైవం దయ....



Wednesday, November 9, 2011

ఒకప్పుడు త్రిమూర్తులు సుధాసముద్రంలో గల ఆదిపరాశక్తిని( పరమాత్మను ) దర్శించి స్తుతించారు.

* ఓం.

* ఒకప్పుడు త్రిమూర్తులు సుధాసముద్రంలో గల ఆదిపరాశక్తిని( పరమాత్మను ) దర్శించి స్తుతించారు.

వారు
అక్కడకు వెళ్ళే దారిలో ఎన్నో బ్రహ్మాండాలనూ, అక్కడ కూడా ఎందరో త్రిమూర్తులను దర్శించి ఆశ్చర్యపోతారు.

* బ్రహ్మదేవుడు ఆదిశక్తిని స్తుతించి కొన్ని సందేహాలను కూడా అడగటం జరిగింది. .అందులో కొంత భాగం...

.......ఏకమేవాద్వితీయంబ్రహ్మ అనికదా వేదాలు చెబుతున్నాయి. అది నువ్వా, లేక నీ విభుడైనపరాత్పరమహాపురుషుడా ?....అని,

ఇంకా ఎన్నో విషయాలను అడగటం జరిగింది.

* అప్పుడు
, ఆదిపరాశక్తి ..ఎన్నోవిషయాలను బ్రహ్మదేవునికి చెప్పటం జరిగింది. అందులో కొంతభాగం.......

.....చతుర్ముఖా ! నాకూ నా పురుషుడికీ భేదం లేదు. ఎప్పుడూ ఏకత్వమే. అతడే నేను. నేనే అతడు. భేదం మతివిభ్రమం..అంటూ

ఇంకా
ఇలా చెప్పటం జరిగింది..దేవతలలో కూడా రకరకాల పేర్లతో నేనే ఉంటాను.శక్తి రూపంలో ఉంటాను...అని,

ఇంకా
ఇలా చెప్పటం జరిగింది..నీళ్ళలోని చల్లదనం, అగ్నిలోని వెచ్చదనం, సూర్యుడిలోని జ్యోతిస్సు, చంద్రుడిలోనిమంచు- నేనే. అవసరాన్ని బట్టి ఏది కావాలంటే అది అవుతాను.

నేను లేనిది - ఏదీ స్పందించదు. శంకరుడైనా సరే నేనువదిలేస్తే రాక్షసుల్ని సంహరించలేడు. దుర్బలుడై పోతాడు.

లోకంలో
దుర్బలుడికి పర్యాయపదం ఏమిటి ? శక్తిహీనుడు అనే కదా ! రుద్రహీనుడు, విష్ణుహీనుడు అని ఎవరైనా అంటారా ? శక్తిహీనుడు అని మాత్రమే అంటారు...అని ,

ఇంకా చాలా విషయాలను చెప్పటం జరిగింది.

* ఆదిపరాశక్తి, విష్ణుమూర్తికి ఎన్నో విషయాలను తెలియజేయటం జరిగింది........

అందులో కొద్ది భాగం...

.....నా విహారాన్ని ముగించి విశ్వాన్ని ఉపసంహరించేటప్పుడు మాత్రం మీరు ముగ్గురూ కూడా నాలో లీనమైపోతారు. ...అని ఇంకా చాలా విషయాలను చెప్పటం జరిగింది.

* ఆదిపరాశక్తి శివునికి చాలా విషయాలను చెప్పటం జరిగింది..

తరువాత, శివునితో ఇలా కూడా అనటం జరిగింది....మీమీ కార్యాలు నిర్వహించండి. విషమపరిస్థితి ఏదైనాఎదురైనప్పుడు నన్ను స్మరించండి. స్మరణ మాత్రం చేతనే నేను మీకు దర్శనం అనుగ్రహిస్తాను. అలాగే సనాతనుడైనపరమాత్మను కూడా తలుచుకోండి. మా ఇద్దరినీ తలుచుకుంటే మీకు కార్యసిద్ధి నిస్సంశయంగా కలుగుతుంది. అనిచెప్పటం జరిగింది.

...............................

* ఒకప్పుడు మధుకైటభులు అనే రాక్షసులు బ్రహ్మదేవుని , విష్ణుమూర్తిని ఇబ్బందిపెట్టగా ఆదిశక్తి సహాయంతో విష్ణుమూర్తి రాక్షసులను సంహరించగలిగారన్నది తెలిసిన విషయమే.

* ఇంకొకసారి దుర్గముడనే రాక్షసుని వల్ల ఇబ్బందులు ఎదురైనప్పుడు ఆదిపరాశక్తి రాక్షసుడిని కూడా సంహరించటంజరిగింది. సందర్భంలో శక్తిని శతాక్షి ( శాకంభరి ) , దుర్గ అని దేవతలు కీర్తించారు.

* ఒకప్పుడు మహిషాసురుడు వరగర్వంతో విర్రవీగుతూ లోకాలని పీడిస్తుంటే ఎవరూ మహిషాసురుని సంహరించలేకపోతారు.

అప్పుడు
విష్ణుమూర్తి సలహాతో దేవతలందరూ తమలోని తేజోంశలను స్త్రీ మూర్తులుగా అభ్యర్ధిస్తూ ప్రార్ధిస్తారు. అప్పుడుసకల దేవతాంశలనూ తేజశ్శక్తులను కలబోసుకుని ఒక స్త్రీమూర్తి ఆవిర్భవించటం జరుగుతుంది.

ఆమె మహిషాసురుని సంహరించటం జరిగింది.
ఆమే మహిషాసురమర్దని.
...................................................

* లలితా సహస్రనామాలలోని కొన్ని నామములు..............

శ్రీ మాతా
కామేశ్వర ప్రేమ రత్న మణి ప్రతి పణస్తనీ
చింతామణి గృహాంతస్థా
మహా గణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితా
బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్తుత వైభవా
నిరాకారా
దుర్గా
మహాలక్ష్మీ
పార్వతీ
సృష్టికర్త్రీ
బ్రహ్మరూపా
గోవిందరూపిణీ
రుద్రరూపా
హరిబ్రహ్మేంద్ర సేవితా
రామా
వివిధాకారా
గాయత్రీ
పరాశక్తిః

అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్యవిగ్రహా
ఉమా
గౌరీ
రాజరాజేశ్వరీ
సరస్వతీ
బ్రహ్మజననీ
మూలవిగ్రహరూపిణీ
వైష్ణవీ
విశ్వమాతా
శాశ్వతీ
అనఘ
శివశక్త్యైక్య రూపిణీ
నామాలను గమనిస్తే చాలా విషయాలు తెలుస్తాయి..
....................................
* ఆదిపరాశక్తిపరమాత్మకు అనేక నమస్కారములు.
...................................

* నాకు తెలిసిన విషయాలు చాలా తక్కువ. తోచినట్లు వ్రాస్తున్నాను.
ఇందులో ఏమైనా అచ్చుతప్పులు గానీ, ఇతరత్రా ఏవైనా పొరపాట్లు ఉన్నచో దైవం దయచేసి క్షమించాలని పార్ధిస్తున్నాను. అంతా దైవం దయ......

ఇంకో విషయం..ఈ మధ్య ఒకాయన ( స్వామి.......) అమర్ నాధ్ యాత్ర గురించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారట, ఎవరు ఏమన్నా అమర్ నాధ్ యాత్ర , అక్కడి దైవము ఎంతో గొప్ప....


Friday, November 4, 2011

ఏ కష్టాలైనా ఇలా తాగి పడిపోవటం వల్ల తీరకపోగా ,

 

ఈ మధ్య ఒకరోజు నేను గుడికి వెళ్తుంటే మా ఇంటికి దగ్గరలో రోడ్డు ప్రక్కన ఒక వ్యక్తి పడిపోయి ఉన్నాడు.

జనాలు అందరూ ఆ వ్యక్తి ప్రక్కనుంచే వెళ్తున్నారు కానీ, ఏమీ పట్టించుకోవటం లేదు.

ఆ వ్యక్తి చనిపోయాడో లేక ఆకలివల్ల కళ్ళు తిరిగి అలా పడిపోయాడో అనుకున్నా నేను. ఏం చేయాలో అర్ధం కాలేదు.

అలాగే గుడికి వెళ్ళాను. గుడికి వెళ్ళానన్నమాటే కానీ, మనసంతా గందరగోళంగా ఉంది.

బ్లాగులో నీతులు చెప్పటమే కానీ, ఏమీ సాయం చెయ్యలేకపోయానే, ! అనిపించింది.

గుడినుండి తిరిగి వచ్చేటప్పుడు చూస్తే అలాగే పడి ఉన్నాడు ఆ వ్యక్తి.

అప్పుడు దగ్గరలోనే ఉన్న మా ఇంటికి వెళ్ళి ఇంట్లో మిగిలి ఉన్న కొద్దిగా అన్నం, కూర తీసుకువచ్చాను.

కానీ నాకు బెరుకుగా అనిపించింది. చూసేవాళ్ళు నాది ఓవర్ యాక్షన్ అనుకుంటారేమోనని .

చుట్టుప్రక్కలవారు నేను అన్నం తేవటం చూసి ఆ వ్యక్తిని పిలిచారు . అన్నం తింటావా ? అని గట్టిగా అడిగారు.

ఆ మాటలు విని ఆ వ్యక్తి కళ్ళు తెరిచాడు. కానీ లేవలేక పోతున్నాడు.

ఇలాంటప్పుడు మగవాళ్ళయితే ఏమైనా చెయ్యగలరు.
అప్పుడు చుట్టుప్రక్కల వారిని అడిగాను. అతనికి ఏమయ్యింది అని.

వాళ్ళు ఏమన్నారంటే , తాగి పడిపోయుంటాడు. అన్నం ఏం తింటాడు అన్నారు.

(అతను నిజంగా తాగి పడిపోయాడో లేక ఆహారం లేక పడిపోయాడో భగవంతునికే తెలియాలి. ).

ఆ మాట వినగానే నేను వెనక్కి తగ్గాను. తీసుకువెళ్ళిన ఆహారపదార్ధాలు ఆ వ్యక్తికి కొంచెం దూరంలో పెట్టి తిరిగి వచ్చేసాను.

తరువాత ఆ వ్యక్తి అన్నం తిన్నాడో లేదో నాకు తెలియదు.

( నేను అంతకన్నా ఏం సహాయం చేయలేకపోయాను. )

ఏంటో ! ప్రపంచం. కొందరికి డబ్బు లేక కష్టాలు.

కొందరికి డబ్బు ఎక్కువయ్యి కష్టాలు.

కొందరికి జబ్బుల వల్ల కష్టాలు, కొందరికి కుటుంబసభ్యులతో కష్టాలు.

కొందరికి తమ యొక్క కోపం, అసూయ,అత్యాశ వంటి గుణాల వల్లే కష్టాలు.

కొందరు ఇతరుల ప్రవర్తన భరించలేక తాగుడుకు అలవాటు పడతారు.

కొందరు తాము ఇతరులను కష్టపెట్టి తరువాత వచ్చే కష్టాలు భరించలేక తాగుతారు.


కుటుంబం సభ్యుల ప్రవర్తన భరించలేక తాగేవాళ్ళూ ఉన్నారు.

ఎలా తాగినా కూడా తాగేవాళ్ళకే నష్టం . ఆరోగ్యం పాడయితే పట్టించుకునేవారు కూడా ఉండరు.. .


ఏ కష్టాలైనా.... ఇలా తాగి పడిపోవటం వల్ల తీరకపోగా , కొత్త కష్టాలు మొదలవుతాయి.

ఇవన్నీ తెలిసినా కూడా వాళ్ళంతే.

ఇలాంటి వ్యక్తుల వల్ల వారి కుటుంబసభ్యులు కూడా నరకం అనుభవిస్తారు.

లోకంలోని ఇలాంటి కష్టాలన్నింటినీ మనం పోగొట్టలేకపోయినా , అందరూ చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే చాలావరకూ పరిస్థితులు బాగుపడతాయి.

నేను సినిమాలు చూడటానికి టివీలు చూడటానికి , సరదాగా ఉండటానికి వ్యతిరేకిని కాదండి.

నేను కూడా సినిమాలు, సీరియల్సు చూస్తాను.( కొన్ని ) సినిమా వాళ్ళ గురించి పత్రికల్లో వచ్చే గాసిప్స్ కూడా చదువుతాను.
(
ఇప్పుడు మనుషుల మనస్తత్వాలు ఎలా ఉన్నాయో తెలుస్తుంది కదా !.)

అయితే ప్రతీదానికీ ఒక పద్ధతి ఉంటుంది కదా !

ఉదా...ఒక కుటుంబం అందరూ హాల్లో కూర్చుని టీవీలో సీరియల్ చూస్తుండగా , వెనుక తలుపునుండి దొంగలు చొరబడి ఇల్లంతా దోచుకుపోయారని కొంత కాలం క్రితం ఒక వార్త చదివాను.

ఇల్లును అంత అజాగ్రత్తగా వదిలేసి అంతలా టీవీ చూడటమేమిటి ? అనిపిస్తుంది కదా !

అలాగే దేశాన్ని దొంగలు దోచుకుపోతుంటే ఏమీ పట్టనట్టు సినిమాలూ, సీరియళ్ళు చూసుకుంటూ ఉండటం ఏం బాగుంది ?

దేశం పాడైపోతే మనకూ ప్రమాదమే కదా ! . అని నా అభిప్రాయం.

దేశాన్ని బాగుచేసుకోవాలంటే పెద్దగా ఉద్యమాలు చెయ్యటమే కాదు...

ఎవరి పనిని వారు నీతిగా, నిజాయితీగా ,సక్రమంగా నిర్వర్తించినా చాలు , సమాజంలోని చాలా సమస్యలు పరిష్కారమవుతాయి.

కానీ, సమాజంలో నైతిక విలువలు బాగా లోపించటమే ఇప్పుడు పెద్ద సమస్య.

అయితే ఇప్పటికీ మంచివారూ, దైవభక్తి కలవారు , నీతీ, నిజాయితీ కలవారూ, మేధావులు ఎందరో ఉన్నారు.

అందరూ గట్టిగా ప్రయత్నిస్తే ఈ దేశం ప్రపంచానికే ఆదర్శమవుతుంది.మార్గదర్శి కూడా అవుతుంది.


Wednesday, November 2, 2011

" రాముడు గొప్పా ? రామనామము గొప్పదా ? "

 

మొన్న " హరిసేవ " బ్లాగులో వారు వ్రాసిన
" రాముడు గొప్పా ? రామనామము గొప్పదా ? " అనే టపా చదివానండి. చక్కటి టపా. నాకు బాగా నచ్చింది.

అందులో వారు ఇలా వ్రాశారు.. భగవంతుడూ, ఆయన నామమూ వేరుకావు. అలాగే, రాముని కంటే రామనామమే గొప్పది. నిర్మలమైన మనస్సుతో రామనామాన్ని నిశ్చలంగా జపిస్తూ వున్న హనుమంతునిపై ఆ శ్రీరాముడే బాణం వేసినప్పటికీ అది ఆయనను ఏమీ చేయలేకపోయింది.... అని వ్రాశారు.

ఆ టపా చదివిన తరువాత ,నాకు ఇంకా ఏమనిపించిందంటేనండి,

" రాములవారూ గొప్పవారే....రామనామమూ గొప్పదే "
అంటే ఇంకా బాగుంటుంది కదా ! అనిపించిందండి.

అలా నా అభిప్రాయాలతో కామెంట్ వ్రాసాను.

తరువాత నా కామెంట్ చూసుకుంటే అందులో ఇలా ఉంది.

" రాములవారి నామమూ గొప్పదే. రామనామమూ గొప్పదే. తప్పనిపరిస్థితిలో రాములవారు హనుమంతుల వారిపై బాణం వేసినా ..........రామునికి హనుమంతునియందుగల అపారమైన వాత్సల్యం వల్ల హనుమంతునికి ఏమీ హాని జరగలేదు. అనీ,"

నాకు చాలా ఆశ్చర్యం కలిగింది.

ఇదేమిటి ?నేను
" రాములవారూ గొప్పవారే...రామనామమూ గొప్పదే . " అని కదా వ్రాయాలనుకున్నాను.

మరి " రాములవారి నామమూ గొప్పదే.. రామనామమూ గొప్పదే " అని వ్రాశానేమిటి ?

ఈ పొరపాటు ఎలా జరిగింది ? అని ఆలోచిస్తూ ....

జరిగిన పొరపాటుకు బాధపడుతూ  అలా ఆలోచిస్తూ ఉండగా నాకు కొన్ని ఆలోచనలు కలిగాయి.

ఏమంటే,

" రామునికంటే ..... రామనామమే గొప్పది " అని
పండితులు చెబుతున్న విషయం కూడా కొన్ని కోణాలనుండి చూస్తే సరైనదే అని అనుకోవచ్చు అనిపించింది.

ఎలా అంటే , బాహ్యదృష్టితో చూస్తే రామావతారానికి ముగింపు ఉంది.

కానీ, " రామ " నామానికి ముగింపు ఉండదు.

ఇప్పుడు రాములవారి రూపాన్ని అందరూ చూడలేరు.

అవతారమూర్తులు, కొందరు పుణ్యాత్ములు, ఇంకా రామదాసు వంటి భక్తులు ,తానీషా
ప్రభువు వంటి కొందరు, ఇలా కొందరు మాత్రమే చూడగలరు.

కానీ, రామ నామము అలాకాదు.

సామాన్యులకు, అసామాన్యులకు, వారూవీరూ అని భేదం లేకుండా అందరికీ ,ఎప్పుడయినా, ఎక్కడయినా రామనామాన్ని స్మరించుకుని, తలుచుకుని , పాడుకుని ఆనందించే అవకాశం అందుబాటులో ఉంది కదా !

ఇప్పుడు నాకనిపిస్తూంది.

1..రాముని కంటే రామనామమే గొప్పది..

2..రాములవారూ గొప్పవారే....రామనామమూ గొప్పదే..

ఈ రెండు అభిప్రాయాలూ సరైనవే. అని..

ఇంకా ఏమనిపించిందంటే,మన తెలివితేటలంటూ ఏమీ ఉండవు.
ఒకోసారి మనం అనుకున్నట్లు వ్రాయాలన్నా వ్రాయలేము. అనీ,

పొరపాట్ల వల్ల కూడా కొత్త ఆలోచనలు వస్తాయని తెలిసింది.

* అంతా దైవం దయే ....

***************

దయచేసి కామెంట్లను కూడా చదవండి.